డబ్బు సంపాదించాలంటే ‘తప్పు’ చేయక తప్పదనుకునే యువత కోసమే ఈ పుస్తకం …..

ముందిది చదివి….

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా - నీ బుగ్గ మీద గులాబి రంగు ఎలావచ్చెనో చెప్పగలవా?” అని డబ్బులేని హీరో పాడేపాటలూ, “దులపర బుల్లోడో…. ఈ డబ్బున్న కుర్రోళ్ళ భరతం పట్టి….” అని బీద హీరోయిన్ పాడే పాటలూ ఇటీవలి కాలంలో సినిమాల్లో కనపడటం లేదు.

విప్లవం పాటలు వదిలేస్తే, డబ్బు సంపాదించవద్దని గానీ, డబ్బు వుండటం తప్పనిగానీ, ఇటీవలి కాలంలో ముఖ్యంగా హీరో హీరోయిన్లుపాడటం లేదు. మారుతున్న గ్లోబలైజేషన్ ప్రభావానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

సరి అయిన చోట, సరి అయిన సమయంలో, సరీగ్గా చూడగలిగితే ఈ ప్రపంచంలో ప్రస్తుతం కావల్సినంత డబ్బు వుంది. నైతిక విలువలు కోల్పోకుండా, లంచాలు పట్టకుండా, హత్యలు చెయ్యకుండా కూడా డబ్బు సంపాదించవచ్చని మారుతున్న ఈ వ్యవస్థ చెపుతోంది.

అయినా కూడా మరోవైపు కొందరు యువతీ యువకులు ఆర్థికపరమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఏం చెయ్యాలో తోచక నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. డబ్బు సంపాదించాలంటే తప్పుచేయక తప్పదన్న తప్పు అభిప్రాయంతో మగ్గుతున్నారు.

వారికోసమే ఈ పుస్తకం.

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

* * *

తొలిగా ఇంగ్లీషులో వ్రాయబడిన ఈ పుస్తకం ఇప్పటికి 14 భాషల్లోకి అనువాదం కావింపబడింది. పబ్లిష్ అయిన అయిదు నెలల్లో రెండో ముద్రణ కొచ్చింది. రెండు యూనివర్సిటీల్లో నాన్-డిటెయిల్డ్ పుస్తకంగా వుంది. దీన్ని కన్నడ భాషలో ప్రచురించిన నా కన్నడ పబ్లిషర్ దీన్ని తెలుగులో వ్రాయమని నాకు సూచించారు. ఆ తరువాత విఠల్ వెంకటేశ్ కామత్ నాతో ఫోన్‌లో మాట్లాడుతూ, ఈ పని తెలుగులో నేను చేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేసారు. వారిద్దరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రచనలో నాకు సహకరించిన కుమారి జ్యోతి శైలజకు కూడా నా అభినందనలు.

నీ మంచితనమే నీ విజయానికి తొలిమెట్టుఅన్న పాజిటివ్ థింకింగ్ ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది. నేను సాధారణంగా నా నవలల్లో వ్రాసే పాత్రల తెలివి తేటలు, హీరో లక్షణాలు, వ్యాపార గిమ్మిక్కులుఅన్నీ ఈ నిజజీవితంలో కూడా కనపడతాయి. ఇతరుల రచనలు ఇంతవరకూ అనువాదం చేపట్టని నేను, దీన్ని వ్రాయటానికి కూడా అదే కారణం.

నలభై సంవత్సరాల రచనా ప్రస్థానంలో ఇది నా తొలి అనువాద రచన. గతంలో ప్రార్థన, ‘దుప్పట్లో మిన్నాగుమొదలైనవి కేవలం ఆంగ్ల రచనల ప్రేరణలే తప్ప, నేనెవరివీ అనువాదం చెయ్యలేదు.

నా శైలీ, శిల్పం గురించి తెలిసిన వారికి ఈ రచనలో కూడా ఆ స్వేచ్ఛానువాదం కనపడుతుంది. ఒరిజినల్ పుస్తకంలో మొదట కొన్ని అధ్యాయాలు సాఫీగా సాగుతాయి. అందుకని కొన్ని కొటేషన్లు చేర్చి, కథలో వేగం పెంచటానికి ప్రయత్నం చేసాను. మిగతాదంతా యథాతథమే!

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

ఈ కథలో హీరో పెద్ద వ్యవహారకర్త కాదు. పెద్దగా లౌక్యం తెలిసినట్టు కనపడదు. పట్టుదల, కొత్తగా ఆలోచించాలన్న తపన, కృషిఇవి అతడిలో మెండుగా కనపడతాయి. ‘కెరటం నా స్ఫూర్తి…. లేచిపడినందుకు కాదు. పడి లేచినందుకుఅన్న సూక్తి అతడి పట్ల నిజమనిపిస్తుంది. ఈ కథలో మనకి గాంధీ, నెల్సన్ మండేలా ఆత్మకథల్లోలాగా దేశం కోసం పోరాటాలూ, జైలుశిక్షలూ కనపడవు. మనలాటి మామూలు వ్యక్తి, తన జీవితంలో పైకి రావటం కోసం చేసే ప్రయత్నంలో సాధకబాధకాలు కనపడతాయి. గాంధీ నెహ్రూల కథలు స్ఫూర్తినివ్వొచ్చు. ఈ కథలు యువతకి మార్గనిర్దేశనమవుతాయి.

అతి సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగిన ఈ యువకుడి కథలో ఎత్తులూ, పల్లాలూ స్పష్టంగా కనిపిస్తాయి. “మాకు లౌక్యం తెలీదు. పదిమందిలో మాట్లాడటం తెలీదు. సరీగ్గా చదువులేదు. మా దగ్గిర పెట్టుబడికి డబ్బు లేదు. ముక్కుకి సూటిగా మాట్లాడే మనస్తత్వంతో బ్రతకటం కష్టం. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అలా నెగ్గుకు రావటం అసాధ్యంఅన్న అభిప్రాయంలో వున్న యువతీ యువకులకు ఈ పుస్తకం ఒక కనువిప్పు.

ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలు పెట్టాలో, ఎలా బ్రేక్ త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తిపొందితే, ఈ రచన ఆశయం నెరవేరినట్టే.

- యండమూరి వీరేంద్రనాథ్

1-2-08

తప్పక చదవాల్సిన ఈ పుస్తకం కోసం ఇప్పుడే కినిగెను దర్శించండి, ఇక్కడ నొక్కి ….

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

Related Posts: