స్వర్ణఖడ్గం

On the day of Madhubaabu birthday Kinige presents you one of his finest creations – Swarna Khadgam.

———————
“ఏమయింది స్వామీ? మా చిరంజీవి జన్మించిన వేళ సరయినది కాదా?” ఆశ్చర్యం, ఆందోళన కలగలిసిన కంఠంతో వెంటనే అడిగాడు చక్రవర్తి.

“నీ చిరంజీవి జన్మించిన వేళ సరయినదే…. అతులిత శక్తి సంపన్నుడై. సర్వంసహా చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటాడు. నిండు నూరేళ్లు నిరభ్యంతరంగా జీవిస్తాడు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాని, పదిరెండు సంవత్సరాల ప్రాయం వచ్చేవరకూ దారుణమైన కష్టనష్టాలను అనుభవిస్తాడు…. జన్మకాలంలోని కొన్ని గ్రహాల కలయిక, ఇతని తల్లిదండ్రులకు చెప్పరాని కీడును కలిగించబోతోంది. చిరంజీవి స్థానభ్రష్టుడై పరాయివారి పెంపకంలో అవమానాలను, అపనిందలను అనుభవిస్తాడు….. ఈ కష్టదశ పదిరెండు సంవత్సరాలు మాత్రమే. తర్వాత అన్నీ శుభాలే….” అరమూసిన కనులతో చెప్పాడు ముచికుందుడు.

చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. తమ తలల మీద పిడుగులు పడినట్టు అదిరిపడ్డారు అక్కడివారు.

ముంచుకువస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నంమీద అదుముకుంటూ, “స్వామీ! మంత్ర తంత్ర శాస్త్రాల్లో తమరిని మించినవారు ఎవరూ లేరు…. తమరు మా చిరంజీవికి రానున్న కష్టనష్టాలను సరిచేయలేరా?” గద్గద కంఠంతో అర్థించింది మహారాణి వాసంతికాదేవి.

“మంత్రాలు, తంత్రాలు మన నుదుటిరాతను మార్చలేవు తల్లీ…. అయినాసరే ప్రయత్నం చేస్తాను….” అంటూ ధ్యానంలో నిమగ్నమైనాడు ముచికుందుడు…. ఉన్నట్టుండి కనులు తెరిచి, చేతుల్ని ముందుకు జాచాడు.

To read the eBook or to purchase print book click http://kinige.com/kbook.php?id=979

Related Posts:

రుద్రాణి

సుప్రసిధ్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలు వారిన అద్భుత సోషియో-ఫాంటసీ నవల రుద్రాణి.

షాడో కొడుకు మాస్టర్ షాడో గంగారాంని చూడాలనుకోవడం, ఢిల్లీ నుంచి అస్సాం రావడంతో కథ మొదలవుతుంది. పిల్లాడితో కలసి దేవీ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్ళిన బిందూ, గంగారాం సమక్షంలోనే షాడో కొడుకుని ఎవరో అపహరిస్తారు. గంగారాం ఎంత ప్రయత్నించినా బాబు ఆచూకీ తెలియదు. మొత్తం సి.ఐ.బి ఉద్యోగులందరూ అస్సాం, చుట్టుపక్కల ప్రాంతాలలో వెతుకులాటకి సిద్ధమవుతుంటారు. టోక్యో నుంచి ఇండియాకి చేరిన షాడో కులకర్ణిగారితో కలసి బిడ్డ తప్పిపోయిన ప్రాంతాలలో వెతకడం మొదలుపెడతాడు. చివరికి ఓ కొండ గుహలో తన కొడుకుని బంధించడం గమనించి, అక్కడి దుండగులని ఎదిరించి బిడ్డని సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు. బిడ్డకి రంగు రాయి ఒకటి ఆకర్షణగా చూపి తనతో తీసుకువెళ్ళిన ఆ మనిషి కనబడడు, ఆ రాయి కనబడదు.

ఇంతలో ఇంటర్ పోల్ నుంచి షాడోకి అత్యవసరమైన సందేశం ఒకటి అందుతుంది. కొన్ని దేశాలలో పాత కాలం వజ్రాలు, విలువైన జాతి రత్నాలు దొంగిలించబడుతున్నాయట నార్వేదేశంలో అత్యంత ప్రాచీనమైన రెండు వజ్రాలున్న కంటైనర్ ఒకటి ఆఫ్రికా ఎడారులలో మిస్సయిందట. దాన్ని ట్రేస్ చేసి అప్పగించాలి. ఇంటర్‌పోల్ డైరక్టర్ గ్రిఫోర్డ్ విన్నపంతో ఆ ఎస్సైన్‌మెంట్ ఒప్పుకుంటాడు షాడో. ఇప్పటివరకు గుండాలు, రౌడీలు, దొంగలు వంటి మాములు సాంఘిక నవలలా సాగిన కథ క్రమంగా జానపద సరళిలోకి మారుతుంది. షాడోని, అతని వెంట వచ్చిన వ్యక్తిని కొందరు ఆటవిక జాతుల వాళ్ళు పట్టుకుని మరో నాగరిక నేరస్తుల గుంపుకి అప్పగిస్తారు. వీళ్ళతో జరిగే పోరాటాలు, యుద్ధాల నేపధ్యంలో కథ జానపదం వైపు మళ్ళడానికి బీజం పడుతుంది. రకరకాల వజ్ర్రాలను సేకరించి మిట్టమధ్యాహ్నం సూర్యకిరణాలు వాటి మీద పడే సమయంలో పసిపిల్లల రక్తంతో వజ్రాలను తడిపితే ఓ అద్బుతమైన, సుసంపన్నమైన లోకంలోకి ప్రవేశించగలుగుతారనే నమ్మకంతో ఈ దురాగతాలకి ఒడిగడుతోందో ముఠా.

అనుకున్నట్లుగానే ఆ విలువైన రంగురాళ్ళ మీద సూర్యకాంతి పడగానే ఓ ప్రకాశవంతమైన మెరుపుతో కూడిన ఆవరణ కనబడుతుంది. మాయమైన వజ్రాల కంటైనర్ కంటబడడంతో, దాన్ని మీదకి దూకే క్రమంలో షాడో ఆ కాంతి వలయంలో పడి కొత్త లోకంలోకి అడుగుపెడతాడు. ఇక ఇక్కడి నుంచి కథంతా జానపద రీతిలో సాగుతుంది. నగరంలోని సంపన్నులు బీదల్ని ఊరికి దూరంగా ఉంచడం, హేళన చేయడం గమనిస్తాడు షాడో. తనకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబనికి మేలు చేసి, ఓ వర్తకుడి పటాలంలో చేరి వలీదా నగరంలో అడుగుపెడతాడు. వర్తకుడిని, వర్తకుడి కూతురిని ఆ నగరపు ఖైదు చేయించడంతో, రాజు ముందుకు వెళ్లక తప్పదు షాడోకి.

షాడో లాంటి వీరుల కోసమే తానింత కాలం ఎదురుచూస్తున్నట్లు చెబుతాడా రాజు. షాడోని ఓ సాయం చేయమని అడుగుతాడు. అది ఎంత ప్రమాదకరమో, ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరిస్తాడు షాడో. బదులుగా, వర్తకుడిని అతని కూతురిని విడుదల చేయమంటాడు. రాజు షాడోని ఓ గదిలోకి తీసుకువెడతాడు. రాజుగారి కొడుకు అక్కడ అపస్మారక స్థితిలో ఉంటాడు. ఏదో విషజంతువు గాయపరచడం వల్ల అతను ప్రమాదంలో చిక్కుకున్నాడు. విషం ప్రాణాలు తీయకుండా చేయగలిగిన వైద్యులు అతనికి స్పృహ తెప్పించడంలో మాత్రం విఫలమయ్యారు. “ఇక్కడికి పదిరోజుల ప్రయాణంలో సులోమీ పర్వతాలున్నాయి. ఆ పర్వతాల్లో వున్న పిశాచాలకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకోకుండా అవతలి ప్రక్కకు చేరుకోగలిగితే సువిశాలమైన సులోమీ మైదానప్రాంతం అగుపిస్తుందిట…. రకరకాల రాజ్యాలు, వివిధ రకాల నగరాలు కలిగివుండే ఆ మైదాన ప్రదేశంలో ఎక్కడో దట్టమయిన అటవీప్రాంతం ఒకటి వున్నదిట….. ఆ అడవిలో రుద్రాణి అనే పువ్వు దొరుకుతుందిట_ ఆ రుద్రాణి పుష్పంతో తయారుచేయబడిన లేపనాన్ని ఉపయోగిస్తే నా కుమారుడు ఆరోగ్యవంతుడవుతాడని వైద్యులు చేపుతున్నారు. నువ్వు ఆ పుష్పాన్ని తెచ్చిపెట్టాలి” అన్నాడు రాజు.

కథ క్రమంగా అంతిమ ఘట్టానికి చేరుకుంటోంది. రుద్రాణి పుష్పం కోసం ఆ పర్వతాలలో అడుగుపెడటాడు షాడో. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటాడు. ఓ ముసలామె షాడోకి ఆతిథ్యం ఇచ్చినట్లే ఇచ్చి, అతని గుర్రాన్ని చంపి ఆ మాంసంతో విందు చేసుకోవాలనుకుంటుంది. తోటి ముసలాళ్లందరిని పిలుస్తుంది. వారు షాడో మీద పడగా, వారితో పోరాటం పూర్తయ్యేసరిక్ తెల్లారిపోతుంది. కాలినడకన ఇంకో పర్వతం వద్దకు చేరుతాడు. అక్కడో రెండు ఆటవిక జాతులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోగా, ఒక ఆటవికలు గుంపు మరో గుంపుని పూర్తిగా తుడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న షాడో వారందరిక్ సామూహిక దహన సంస్కారాలు చేస్తాడు. వాళ్ల పిల్లలతో కలసి, శత్రుస్థావరం వైపు వెడతాడు. ఉపాయంతో వారిని అణచివేసి, పిల్లల తల్లిదండ్రులను విడిపిస్తాడు.

అక్కడి నుంచి బయల్దేరి మూడో పర్వతం వద్దకి చేరగానే పురాణాలలోని గండభేరుండ పక్షి లాంటి అతి పెద్ద రాక్షస పక్షి షాడో మీద పడుతుంది. అది తన పిల్లలకి ఆహారంగా షాడోని ఎత్తుకెళ్ళి ఓ చీకటి గుహలో పడేస్తుంది. అక్కడ్నించి తప్పించుకోవాలంటే అది ఇంకో ఆహారాన్ని తెచ్చినప్పుడు దాని కాళ్ళు పట్టుకుని దాంతో పాటు గాల్లోకి ఎగరడం తప్ప మరో మార్గం కనపడదు. ఆ ప్రయత్నంలో పక్షి గాయపడి తప్పించుకోడంతో లోయలోకి దిగి నడక సాగిస్తాడు షాడో. ఓ వాగు వద్ద కొంతమంది మనుషులు ఎదురయితే వారితో పాటు అడవిలో కట్టెలు కొట్టి వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడి గ్రామపెద్దను రుద్రాణి పువ్వు గురించి అడుగుతాడు.

ఇంతలో గండభేరుండ పక్షుల గురించి దండోరా వినబడుతుంది. ఆ ప్రాంతపు రాణి ఆ దండోరా వేయిస్తోంది. గండభేరుండ పక్షుల గ్రామలపై దాడి చేస్తున్నయాని, సురక్షితంగా ఉండండి అంటూ రాణి చేసిన ప్రకటన అది. అక్కడ జరిగిన ఓ సంఘటన వలన షాడోని రాణి గారి ముందు ప్రవేశబెడతారు. ఇక్కడ నుంచి నవలలోని చివరి అంకానికి తెరలేస్తుంది. రాణి గారి శత్రువుని నిర్మూలించే క్రమంలో షాడో దట్టమైన ఓ లోయలోకి జారిపోతాడు. ఎందరెందరో చేరాలని ప్రయత్నించిన ఆ అద్భుతమైన, సుసంపన్నమైన లోకమే అది. ఎక్కడ చూసినా, బంగారం… వజ్రాలు… జాతి రత్నాలు ఉన్నాయక్కడ. అంతే కాదు వజ్రాల కంటైనర్‌ని దొంగిలించిన అగంతకుడు కూడా కనపడ్డాడు. పోరాటాలూ, సాహసాలు ముగిసాక, షాడో ఆ వజ్రాల కంటైనర్‌ని చేజిక్కించుకుంటాడు. వలీదా రాజుకి రుద్రాణి పుష్పం అందిస్తాడు. తను వచ్చిన పని ముగిసింది కాబట్టి తిరిగి మామూలు ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుకుంటూ వజ్రాలపై సూర్యకాంతి పడేలా చేసుకుని విజయం సాధిస్తాడు. ఆ క్రమంలో వెలువడిన పొగ ఉక్కిరిబిక్కిరి చేయడంతో స్పృహ కోల్పోతాడు. తెలివి వచ్చేసరికి ఇంటర్ పోల్ ఏజంట్లు, తన మిత్రుడు సమీర్ కనబడతారు. ఎప్పటిలాగే ఎస్సైన్‌మెంట్‌ని విజయవంతంగా ముగించినందుకు ఇంటర్‌పోల్ షాడోని అభినందిస్తుంది.

వీధి గుండాల పోరాటాలతో సాంఘిక గాధగా మొదలై, ఆటవికుల, జంతువులు మధ్యగా సాగి రాజులు, రాణులు, సైనికులు, కుట్రలు కుతంత్రాలతో జానపద కథగా మారి మళ్లీ డిటెక్టివ్‌లు, సీక్రెట్ ఏజెంట్ల రాకతో థ్రిల్లర్‌గా మారిన ఈ నవల చివరిదాక ఆసక్తికరంగా సాగి పాఠకులకి అమితాసక్తిని కలిగిస్తుంది.

రుద్రాణి నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

రుద్రాణి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

వెన్నెల మడుగు

సుప్రసిద్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన అద్భుత జానపద నవల “వెన్నెల మడుగు“.

రాజులు, రాణులు, మాంత్రికులు, యక్షిణులు, పిశాచాలు, అడవులు, ఆటవికులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, పక్షులు, చెట్లుచేమలు…. ఒక అద్భుత జానపద ప్రపంచంలోకి పాఠకులని తీసుకువెడతారు మధుబాబు.

ప్రవాళ దేశాన్ని కీర్తిసేనుడు జనరంజకంగా పాలిస్తూంటాడు. ప్రజలని కన్నతండ్రిలా చూసుకునేవాడు. జనమంతా హాయిగా ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా కీర్తిసేనుడికి ఒకే లోటు.. సంతానం లేకపోవడమే.

ప్రవాళ దేశాన్ని ఆక్రమించాలని ఎందరో శత్రురాజులు కాచుకుని ఉన్నారు. సైనికబలంతో, కీర్తిసేనుడిని జయించలేక పాంచాల రాజు వీరవర్మ కుట్ర చేస్తాడు. ఫలితంగా కీర్తిసేనుడు ఓ వరం సాధించడానికి దుర్గమమైన అడవిలో అడుగుపెడతాడు. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుని, అమ్మవారి వరం పొంది రాజధానికి తిరిగివస్తుండగా, అనుకోకుండా ఓ యక్షిణి శాపానికి గురవుతాడు. మార్గమధ్యంలో ఓ ముని ఆశ్రమంలో విశ్రాంతికై ఆగినప్పుడు రాజు మనసులోని బాధని గమనించి, ఆ శాపానికి విరుగుడు సూచిస్తాడు ముని.

కీర్తిసేనుడికి ఓ కొడుకు పుడతాడు. ఆ శిశువుని యక్షిణి ఎత్తుకుపోతుండగా ఓ మాంత్రికుడు కాపాడి ఓ మహిళ సంరక్షణలో ఉంచుతాడు. ఆమె శిశువుకి విజయుడు అని పేరు పెట్టి పెంచుతుంది. విజయుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఓ మణి సహాయంతో అతనికి చెట్లు చేమలతో సంభాషించగలిగే శక్తి వస్తుంది. ఓ చెట్టు అతనికి జన్మ రహాస్యాన్ని తెలియజేస్తుంది. ఎన్నో ఆటంకాలను తట్టుకుని, ప్రమాదాలను ఎదుర్కుని, అమితమైన సాహసాలు చేసి విజయుడు తన తల్లిదండ్రులను కలుసుకుంటాడు. పెళ్ళి చేసుకుని పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తాడు.

తుదకంటా ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి

వెన్నెల మడుగు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

చతుర్నేత్రుడు – మధుబాబు – జానపద నవల

చతుర్నేత్రుడు

ప్రతిష్టానపురంలో అది ముఖ్యమైన గురుకులం. సాంప్రదాయక అంశాలను గురించి బోధించే అయ్యవారు యాజ్ఞవల్క్యులు తదేక దీక్షగా విద్యార్థులకు పాఠ్యబోధన కావిస్తున్న సమయం.

అమంత్రమక్షరం నాస్తి

నాస్తి మూలమనౌషధం

అయోగ్య పురుషో నాస్తి

యోజక సత్య దుర్లభః

మంత్రము కాని అక్షరము లేదు. ఔషధము కాని చెట్టు వేరు లేదు. అలాగే యోగ్యుడు కాని పురుషుడు లేడు.

కాని మహాకార్యములను సాధింపగల ప్రయోజకుడు సామాన్యముగా దొరకడు. కంచుగంట వంటి కంఠంతో తను ముందు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని వివరిస్తూ అందరివంకా సూక్ష్మంగా చూశాడు ఆయన.

విద్యావ్యాసంగం తప్ప వేరే వ్యాపకాలు ఏవీ లేనివాళ్ళు ముందువరసలో కూర్చుని వున్నారు… శ్రద్ధగా వింటున్నారు వారిలో కొందరు… వెంట తెచ్చుకున్న తాటియాకు పుస్తకాల మీద చకచకా లిఖించుకుంటున్నారు మరికొందరు.
చతుర్నేత్రుడు On Kinige

అందరికంటె వెనుక వరుసలో వున్నాడు మాధవుడు. తన సహాధ్యాయి సాంబశివుడితో ఏదో అంశాన్ని గురించి చాలా గట్టిగా చర్చిస్తున్నాడు.

యాజ్ఞవల్క్యుల వారికి సాధారణంగా కోపం రాదు. కాని ఇప్పుడు వచ్చేసింది. రెండో ఆలోచనలేకుండా పక్కనే వున్న చింతబరికెను అందుకున్నాడాయన. వేగంగా వేదిక మీదినించి దిగి, వెనుక వరుస దగ్గిరికి పోయాడు.

‘తా చెడ్డ కోతి వనాన్నంతా చెరిచిందిట… నువ్వు చెడటమే కాకుండా, సాంబశివుడిని కూడా చెడగొడుతున్నావ్‌… మూర్ఖుడివి నువ్వు’ ఖంగు ఖంగుమంటున్న కంఠంతో తీవ్రాతి తీవ్రంగా నిందిస్తూ ఛటేల్మని కొట్టాడు మాధవుడి వీపు మీద.

అదే దెబ్బ ముందు వరుసలో వున్న విద్యార్థి ఎవరికైనా తగిలితే గురుకులం అంతా ప్రతిధ్వనించేటట్లు గావుకేక పెట్టి వుండేవాళ్ళు. అంతటితో ఆగకుండా కిందపడి గిలగిలా కొట్టుకోవడం కూడా జరిగి వుండేది.

కనురెప్ప కూడా కదిలించలేదు మాధవుడు. అయ్యవారు ఆప్యాయంగా వెన్ను నిమిరినట్టు ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు.

“వీపు వాచిపోయేటట్టు కొట్టాను. నీకు నొప్పి అనిపించటం లేదా?” తాను ఎందుకు కొట్టాడో ఆ విషయాన్ని మరిచిపోయి ఆశ్చర్యంగా అడిగాడు అయ్యవారు.

“ఎందుకు అనిపిస్తుంది అయ్యవారు? నొప్పి, బాధ అనేవి వాడికి ఏనాడూ లేవు.. అవే గనుక వుండివుంటే తను తన తల్లి కడుపులో వుండగా దేశాలు పట్టుకుపోయిన తన తండ్రిని గురించి తప్పకుండా బాధపడి వుండేవాడు. వట్టి మొండి బండవాడు…” వెంటనే అన్నాడు మధ్య వరుసలో వున్న నందనుడు.

“అయ్యవారు కొట్టింది నన్ను. నొప్పిని గురించి అడిగింది కూడా నన్నే… నీ జోక్యం అనవసరం. నోరు మూసుకో! చటుక్కున పళ్ళు బిగిస్తూ అతన్ని హెచ్చరించాడు మాధవుడు.

“నోరు మూసుకోవాలా? మూసుకోకపోతే ఏం చేస్తావ్‌?” మొండిగా అడిగాడు నందనుడు.

తనెక్కడున్నాడో మర్చిపోయినట్టు ఎగిరి ముందుకు దూకాడు మాధవుడు. కుడిచేతిని తలమీదినించి గిర్రున తిప్పి అతని భుజాల మీద బలంగా చరిచాడు.

“చచ్చిపోయాను బాబోయ్‌…. నేను చచ్చిపోయాను” గావుకేక పెట్టాడు నందనుడు.

దెబ్బపడింది భుజాలమీదే అయినా, తాడిచెట్టు మీది నించి కింద పడినట్టు కంపించిపోయింది అతని శరీరం…

చెవుల వెంటా, నాశికా రంధ్రాల వెంటా వెల్లువలా వెలువడింది ఎర్రటి రక్తం.

విపరీతమైన భయంతో వణికిపోతూ కూర్చున్నచోటి నించి లేచి దూరంగా జరిగారు ఆ వరుసలో వున్న విద్యార్థులు అందరూ…..

పాఠ్యబోధనలో అత్యంత సమర్థుడే యాజ్ఞవల్క్యుల వారు… నియమ నిష్టలున్న మహానుభావుడు. అయినా సరే రక్తాన్ని చూస్తే ఆయన కాళ్ళు చేతులు వణికిపోతయ్‌.

“పిలవండి ప్రధాన ఆచార్యులవారిని వెంటనే పిలవండి… వెంట వైద్యుడిని కూడా తీసుకురమ్మని చెప్పండి” చింతబరికెను వదిలేసి, రెండు చేతులతోను కళ్ళను గట్టిగా మూసుకుంటూ బిగ్గిరిగా అరిచాడు.

బాధను భరించడం అసాధ్యమై అచేతనంగా పడిపోయిన నందనుడి మెడను పట్టుకుని మరో దెబ్బ కొట్టటానికి సిద్ధం అవుతున్న మాధవుడి చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆపేశాడు అతని జతగాడు సాంబశివుడు. “ఆగిపో మాధవా… ఆగకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావ్‌….. ఆగిపో?” అంటూ వెనక్కిలాగి కదలకుండా నిలబెట్టాడు.

ఆఘమేఘాల మీద ఒక వైద్యుడిని వెంట బెట్టుకుని ఆ ప్రదేశంలోకి వచ్చాడు గురుకులపు ప్రధాన ఆచార్యుడు.

“నవ్వులాటకి ఏదో ఒక చిన్న తేలిక మాటను ఉచ్ఛరించాను.. ఆ కాస్తదానికే చావుదెబ్బ కొట్టాడు. కాస్తుంటే ప్రాణాలు కూడా పోయి వుండేవి…” వైద్యుడు ఏదో ఆకుపసరును నాశికముందు పెట్టి వాసన చూపించడంతో బాధనించి తేరుకుంటూ చెప్పాడు నందనుడు.

యాజ్ఞవల్క్యులు కిందికి వదిలేసిన చింతబరికెను తను తీసుకున్నాడు ప్రధాన ఆచార్యుడు.

“గురుకులంలో చేరినప్పటినుంచీ దురుసుగానే ప్రవర్తిస్తున్నావ్‌. పేరు ప్రతిష్టలున్న కుటుంబంలోనించి వచ్చావని ఇంతవరకూ ఉపేక్షిస్తూ వచ్చాను.. ఇక ఊరుకోవడం అసంభవం…” అంటూ పూనకం పట్టినవాడిలా మాధవుడి వీపు మీద ఎడాపెడా కొట్టడం మొదలు పెట్టాడు.

చర్మంతో తయారుచేయబడిన కొరడా మాదిరి ఛటేల్‌ ఛటేల్మని మ్రోతలు చేస్తున్న ఆ చింతబరికె వేగాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నారు అందరూ….

జేగురు రంగు రాతితో చెక్కబడిన శిల్పంలా తల వంచుకుని నిలబడ్డాడు మాధవుడు. దెబ్బ పడిన కొద్దీ సలసలమని మరగడం మొదలుపెడుతోంది అతని రక్తం…. కోపం… దారుణమైన కోపం.. ఎదుట వున్న వారందర్నీ వట్టి చేతులతోనే విరిచిపారేయాలన్నంత ఉద్రేకం…

“వద్దు…. మాధవా.. తొందరపడవద్దు.. తల ఎత్తి చూశావంటే విషయం చాలా దూరం పోతుంది.

మీ తాతగారికి తెలిసిందంటే పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది… తలవంచుకో” అందరి మాదిరిగా కళ్ళు మూసుకుని తలను పక్కకు తిప్పుకోకుండా నిలబడివున్న సాంబశివుడు చిన్న కంఠంతో హెచ్చరించాడు అతన్ని.

తాతగారి ప్రసక్తి వచ్చేసరికి చల్లబడిపోయింది ఉడికిపోతున్న మాధవుడి రక్తం… తలను మరింతగా వంచుకుని అలాగే కదలకుండా నిలబడ్డాడు.

కొట్టి కొట్టి ఆయాసం వచ్చేసింది ప్రధానాచార్యుల వారికి. చెమటతో మొఖం తడితడి అయిపోయింది.

బండకేసి బాదినట్టు నుజ్జు నుజ్జు అయిపోయిన చింతబరికెను అవతలికి విసిరేస్తూ…”వెళ్ళిపో.. నా గురుకులంలో నుంచి బయటికి వెళ్ళిపో.

ఇంకెప్పుడూ నీ మొఖం నాకు చూపించకు” అని ఆజ్ఞను వినిపించి వడివడిగా వెళ్ళిపోయాడు అక్కడినించి.

జరిగింది ఏమిటో జరగబోయేది ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ అలాగే నిలబడిపోయిన మాధవుడిని చూసి జీరపడిన కంఠంతో గట్టిగా హెచ్చరించాడు యాజ్ఞవల్క్యులవారు.

“వెళ్ళిపో… వెంటనే అవతలికి పోకపోతే బలవంతంగా బయటికి పంపించాల్సి వుంటుంది”

“పదరా మాధవా…. బయటికి పద..” చిన్న కంఠంతో చెపుతూ మాధవుడి చేయి పట్టుకుని అవతలికి తీసుకుపోయాడు సాంబశివుడు.

ఆకాశాన్నంటుకునేటంత ఎత్తుగా పెరిగివున్న మహావృక్షాల కింద నడపబడుతున్నయ్‌ రకరకాల తరగతులు.

ఐదారు సంవత్సరాల వయస్సున్నవారి దగ్గర్నించి పాతిక సంవత్సరాల యువతీ యువకుల వరకూ అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు….

తలవంచుకుని పోతున్న పదునెనిమిది సంవత్సరాల మాధవుడి వంక వింతగా విడ్డూరంగా చూడ్డం మొదలు పెట్టారు వారందరూ.

పదునైన చురకత్తితో చీరినట్లు చిరిగి పీలికలైపోయింది చింతబరికె దెబ్బలు తిన్న అతని వంటిమీది వస్త్రం.

ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వ వంటికి అంటించినట్లు ప్రత్యక్షం అయివున్నయ్‌ వాతలు…

“ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా పడిపోకుండా ఎలా నడవ గలుగుతున్నాడు?” ఆశ్చర్యంగా అన్నాడు పై తరగతి చదువుతున్న విద్యార్థి ఒకతను.

“ఎలాగా? ఎలాగో నీకు తెలియదా? నువ్వు పుట్టింది ప్రతిష్ఠానపురంలో కాదా?” ఆశ్చర్యంగా అడిగాడు మరో విద్యార్థి.

“కాదు.. మాది అనంతనగరం… పోయిన సంవత్సరమే ఇక్కడికి వచ్చాం” నిజాయితీగా సమాధానం ఇచ్చాడు అతను.

“అలాగా.. అయితే నీకు కార్తికేయులవారిని గురించి తెలియదన్న మాట!” అన్నాడు రెండో విద్యార్థి.

“కార్తికేయులవారా? ఆయన ఎవరు?” మరింత ఆశ్చర్యంగా అడిగాడు మొదటి విద్యార్థి.

“మాధవుడికి కన్నతండ్రి. మహా మహా బలవంతుడు. మగధ పాలకులకు, మాళవ రాజులకు సింహస్వప్నం. కళింగ రాజ్యపు యుద్ధ గజాలయితే కార్తికేయులవారి సింహనాదం వినిపిస్తే ఝంకారాలు చేస్తే దూరంగా పారిపోయేవట….

“అలాగా… ఆయన పోలికలే ఇతనికి వచ్చాయన్నమాట… మరి అంతటి వీరుడి కుమారుడికి ఇటువంటి అవమానం?” ఇంకో సందేహాన్ని బయల్పరిచాడు మొదటి విద్యార్థి.

“మీరిద్దరూ నోళ్ళు మూసుకుంటారా?” ఉన్నట్లుండి తమ ఆచార్యులు కటువుగా హెచ్చరించటంతో మాటల్ని ఆపి మౌనంగా వుండిపోయారు వీళ్ళిద్దరూ….

* * * * * * * * *

“…సద్భ్రాహ్మణ వంశంలో పుట్టినవారని మీకు మేము చాలా మర్యాద ఇస్తున్నాం. కాని మీరు మాత్రం ఆ మర్యాదని నిలపుకోవటం లేదు”

బంగారు పూత పూయబడిన సింహాసనం వంటి ఆసనం మీద కూర్చుని గంభీరంగా చెప్పుతున్న రాజప్రతినిధి కేసి చాలా ఆశ్చర్యంగా చూశారు మాధవుడి తాతగారు కేశవశర్మ.

“మీ ఆగ్రహానికి పాత్రులు కావటానికి మేము చేసిన అపరాధం ఏమిటో!” సూటిగా అడిగారాయన.

“గురుకులంలో మీ మనవడి ప్రవర్తన చాలా అసహ్యంగానూ అసభ్యంగానూ వున్నదని మాకు తెలిసింది” ఇలా అయితే మేము సహించలేము..

ఏదో ఒక శిక్షను విధించాల్సి ఉంటుంది కటువుగా అన్నాడు రాజప్రతినిధి.

మాటకు మాట సమాధానం చెప్పటానికి సిద్ధంగా వున్న కేశవశర్మ తల ఆయనకు తెలియకుండానే కిందకి వాలిపోయింది.

“మీ కులపువాడే అయిన వినుతశర్మ కుమారుడు నందనుడనే కుర్రవాడిని మీ మనవడు తీవ్రంగా గాయపరిచినట్టు ఆరోపణ.. ఇదే మీకు ఆఖరి మాట..

అతన్ని మీరు సరైన మార్గంలో నడిపించుకోండి… ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే మేము ఊరుకోలేము…. ఇక మీరు వెళ్ళిరండి.

మరింత కిందికి వాలిపోయింది కేశవశర్మ శిరస్సు. ఆయనకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కళ్ళు. ఎంతో ప్రయత్నం మీద తనకు తానే నిగ్రహించుకున్నాడాయన. రాజప్రతినిధికి నమస్కారం చేసి గిర్రున వెనక్కి తిరిగాడు.

* * * * * * * * *

“అయ్యయ్యో… ఆ అయ్యోరి చేతులు విరిగిపోనూ… గొడ్డును బాదినట్టు బాదేశాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడినించి వచ్చింది?” వెన్నముద్దలో ఏదో ఆకు పసరు కలిపి మాధవుడి వంటి మీది వాతలకు అంటిస్తూ వాపోయింది చిలకమ్మ.

ప్రతిష్టాన నగరపు పొలిమేరల్లో గుడిసెలు వేసుకుని జీవించే దొమ్మరి కుటుంబానికి చెందిన నడివయసు స్త్రీ ఆమె. మాధవుడి జతగాడు సాంబశివుడికి తల్లి.

“అంతా మాధవుడిదే తప్పు… తను కొట్టే దెబ్బను అవతలివాడు భరించగలడో భరించలేడో చూసుకోడు.. అంతా వట్టి మొండి మాలోకం” కట్టెలపొయ్యి మీద కాల్చిన చిలకడదుంపల్ని తీసుకువచ్చి మాధవుడి ముందుపెడుతూ అన్నాడు సాంబశివుడు.

“వాడు ఆ నందనుడు వట్టి వదరుబోతు… అవకాశం దొరికితే చాలు మా తండ్రిగారిని గురించి వెక్కిరింపుగా మాట్లాడతాడు. అందుకే నాకు కోపం వచ్చింది” చేతిని చాచి ఒక దుంపను తీసుకుంటూ అన్నాడు మాధవుడు.

“అయ్యయ్యో… ఆగు మాధవయ్యా…. ఆగు. ఆందోళనగా అన్నది చిలకమ్మ”

ఆగిపోయి ఆశ్చర్యంగా చూశాడు మాధవుడు.

“దొమ్మరోళ్ళం మేము… నువ్వు బామ్మడివి. మా ఇళ్ళకు రావటమే తప్పు.

మీ తాతగారికి తెలిస్తే ఆ అయ్యోరు కొట్టిన దెబ్బలకి రెండు రెట్లు ఎక్కువే పడతాయ్‌ నీకు” వివరంగా చెప్పింది చిలకమ్మ.

“నాకు అటువంటి నమ్మకాలు లేవు. సాంబశివుడు నా జతగాడు. వాడు ఇచ్చింది ఏదైనా సరే నేను తీసుకుంటా” అన్నాడు మాధవుడు.

“నువ్వు తీసుకోవచ్చు… కాని మేము ఇవ్వకూడదు.. ఎక్కువగా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో” ఖచ్చితమైన కంఠంతో చెప్పింది చిలకమ్మ.

“నాకు ఆకలేస్తోంది” అన్నాడు మాధవుడు.

“ఇంటికాడ మీ అమ్మ ఎదురుచూస్తూ వుంటుంది. వెళ్ళి ఇంటిదగ్గర అన్నం తిను” అంటూ చనువుగా చెయ్యి పట్టుకుని పైకి లేపింది ఆమె.

“ఇంటిదాకా తోడు వెళ్ళిరా…” అని కొడుక్కి చెప్పింది.

నెమ్మదిగా అడుగులు వేయడం మొదలు పెట్టిన మాధవుడిని అనుసరించాడు సాంబశివుడు.

* * * * * * * * *

“వట్టి హెచ్చరికలతో వదిలిపెడతారని అనుకోలేదు… తల తిరిగి పోయేటట్టు శిక్షవేస్తారని అనుకున్నాను….” నిష్టూరంగా రాజప్రతినిధితో అన్నాడు వినుతశర్మ.

మాధవుడి తాతగారు అవతలికి పోయిన అర్ధఘడియకు అక్కడికి వచ్చాడు అతను.

జరిగినదంతా తెలుసుకుని తన అసంతృప్తిని నిర్మొహమాటంగా బయటపెట్టాడు.

“కేశవశర్మకి శిక్ష విధించాలంటే రాజధానిలో వున్న మన చక్రవర్తి అనుమతి కావాలి.. కేశవశర్మ కుమారుడు కార్తికేయుడు చక్రవర్తికి ప్రాణ స్నేహితుడు. ఆ సంగతి మరిచిపోయావా?” సూటిగా అడిగాడు రాజప్రతినిధి.

“ఎక్కడో వున్న చక్రవర్తికి ఈ మారుమూల జరిగింది ఏమిటో ఎలా తెలుస్తుంది? మీరు అన్యాయంగా శక్ష వేయటం లేదు. ఆ పెద్దమనిషి మనవడు నా బిడ్డడిని చావగొట్టి వదిలాడు” అక్కసుగా అన్నాడు వినుతశర్మ.

“ఇప్పుడు నీకు కావాల్సింది ఏమిటి?” మరోసారి సూటిగా ప్రశ్న వేశాడు రాజప్రతినిధి.

“నా బిడ్డడి జోలికి వచ్చినందుకు వాళ్ళకి ఏదో ఒకటి గట్టిగా దెబ్బపడాలి.. అంతే” చెప్పాడు వినుతశర్మ.

“ఎవరికీ తెలీకుండా పని జరిపిస్తే సరిపోతుందా?”

“అంటే?”

“కార్తికేయుడు మహా బలవంతుడు. అతని పోలికలే అతని బిడ్డడికి కూడా వచ్చినయ్యని అందరూ అనుకుంటూ వుంటారు. అటువంటి వాడిని ఊరికే వదిలేస్తే ఎప్పటికయినా నాకు ప్రమాదమే. ఇంకా కొంచెం వయస్సు వచ్చిన తర్వాత చక్రవర్తి అతన్నే ఈ నగరానికి రాజప్రతినిధిగా నియమించవచ్చు. అందుకే ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేద్దాం… సరేనా?”

“ఎట్లా?”

“నగర ద్వారాల దగ్గిర వున్న జామతోట దగ్గరికి పోయి చూస్తే నీకే తెలుస్తుంది. ధైర్యం వుంటే వెళ్ళి చూడు…” నవ్వుతూ అన్నాడు రాజప్రతినిధి.

ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు వినుతశర్మ. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నగర ద్వారాల దగ్గిరికి బయలుదేరాడు.

“ఆకలి అదిరిపోతోంది. ఆగడం నా వల్ల కాదు” నగర ద్వారాల దగ్గరికి రాగానే సాంబశివుడితో అన్నాడు మాధవుడు.

“ఆ మాట నాకు ముందే చెప్పి వుండాల్సింది. అమ్మకి కనిపించకుండా నాలుగు దుంపల్ని దాచిపెట్టి తీసుకువచ్చేవాడిని…” అంటూ పక్కకి చూశాడు సాంబశివుడు.

మసక చీకట్లు అప్పుడప్పుడే అడుగుపెడుతున్నాయి. నగర ద్వారాల దగ్గిర వుండాల్సిన రాజభటులు ఎవరూ కనిపించడం లేదు.

“రాజప్రతినిధి అంటే ఆఖరికి వాళ్ళకి కూడా భయం లేకుండాపోయింది.

కాపలా పని వదిలేసి కులాసాగా తిరిగి రావటానికి పోయారు…” అంటూ ఒక పక్కకి అడుగులు వేశాడు అతను.

“ఎక్కడికి?” అశ్చర్యంగా అడిగాడు మాధవుడు.

“జామ తోట దగ్గరికి. నాలుగు కాయలు కోసుకువస్తా… నువ్వు ఇక్కడే వుండు” అన్నాడు సాంబశివుడు.

“దొంగతనం చేస్తావా?” మరింత ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు.

“నీతిగా వున్నా నియమంగా నడుచుకున్నా ఈ నగరంలోని వాళ్ళందరూ మమ్మల్ని తక్కువగానే చూస్తారు. మీ కుటుంబం ఒక్కటే మమ్మల్ని మనుష్యులుగా మన్నిస్తుంది. మీ కోసం మేము దొంగతనమే కాదు ఏమయినా చేసేస్తాం. నువ్వు చూస్తూ వుండు” అంటూ మరింత వేగంగా అడుగులు వేశాడు సాంబశివుడు.

వద్దని ఇంకా కాస్త గట్టిగా చెప్పినా అతను వినిపించుకోడని అర్థం అయింది మాధవుడికి. అతన్ని వారించే ఆలోచనని ఆపుకుని రహదారి పక్కనే వున్న బండరాయి మీద కూర్చున్నాడు.

క్షణక్షణానికి దట్టం అవుతున్న చీకట్లలో కలిసిపోయి జామతోటలోకి అడుగు పెట్టాడు సాంబశివుడు. ఏపుగా ఎదిగివున్న ఒక చెట్టు దగ్గిర నిలబడి ఒక కొమ్మని కిందకి వంచాడు. వంచుతూ వుండగానే అతనికి కనిపించారు నల్లటి దుస్తులు ధరించి వున్న పదిమంది దృఢకాయులు. వంద ధనువుల దూరంలో వున్న ఒక దిగుడు బావి దగ్గిర నిలబడి రహదారి కేసి చూస్తున్నారు వాళ్లు.

జామతోటకి కాపలాదారులు కాదు వాళ్ళు. కాపలా దారులకి అటువంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. చేతుల్లో బరిశెలు, బలమైన కర్రలు ఉండాల్సిన పనిలేదు.

తను వచ్చిన పనిని మరిచిపోయి “హేయ్‌… ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని అరిచాడు సాంబశివుడు. అదిరిపడినట్లు వాళ్ళందరూ ఒకేసారి అతనికేసి చూశారు.

“వీడెవరో మనల్ని చూశాడు…. నగరంలోకి పోయి అందరికీ చెప్పేస్తాడు. ముందు వీడిని వేసేయండి” ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు వారిలో ఒకతను.

చేతుల్లో వున్న కర్రల్ని, బరిశెల్ని గాలిలో ఊపుతూ వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చేశారు అందరూ.

పిరికివాడు కాదు సాంబశివుడు. ఎటువంటి బరువులనైనా ఎత్తి అవతలికి విసిరివేయగల కులంలో పుట్టాడు. ఎంతటి దెబ్బతగిలినా ఓర్చుకోగలశక్తి అతనికి వుంది.

దగ్గిరికి వచ్చి తన మీదికి కర్రను విసిరిన ఒక ఆగంతకుడిని ఎగిరి గుండెల మీద తన్నాడు అతను. బరిశెతో పొడవబోయిన ఇంకో మనిషి గుండెల మీద బలంగా కొట్టాడు. గావురుమని అరిచి వెనక్కి పడిపోయిన ఆ ఇద్దర్ని చూసేసరికి తారాపధానికి చేరుకుంది మిగిలిన వారి కోపం.

“పొడి చేయండి. తల పగలకొట్టి చంపేయండి” అని ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకేసారి అతన్ని కమ్ముకోబోయారు.

దట్టమైపోయిన చీకట్లు సాంబశివుడికి సాయం చేసినయ్‌. అడ్డం వచ్చిన ఇంకో మనిషి ముఖం పగిలిపోయేటట్టు కొట్టి, వింటి నించి వెలువడిన బాణంలా రహదారివైపు పరుగు తీశాడు.

“ఆపండి. వాడిని ఆపండి. వాడు వెళ్ళి ఆ కుర్రాడిని హెచ్చరిస్తాడు…” అని అరుచుకుంటూ అతన్ని అనుసరించారు ఆ దృఢకాయులు.

“మాధవా… మాధవా… పారిపో…” అని కేకలు పెట్టాడు సాంబశివుడు. తనను వెంబడిస్తున్న వాళ్ళు మాధవుడిని కూడా దెబ్బకొడతారని అతని భయం.

బండరాయి మీద నించి లేచి మాధవుడు నగరంలోకి పరిగెత్తుతాడని, తను పక్కకు తిరిగి తమ గుడిశెల దగ్గిరికి పారిపోవచ్చని అతని ఉద్దేశ్యం. నగరంలోకి పరిగెత్తాల్సిన మాధవుడు అటువంటి పనిచేయలేదు సరికదా, బండ మీదినించి లేచి బలంగా నేలను తన్నాడు.

యాభై ధనువుల దూరంలోకి వచ్చిన సాంబశివుడికి భూకంపం వచ్చిందని అనిపించింది.

నేలను తన్నటంతో ఆగలేదు మాధవుడు. తనకు తెలీకుండానే తలను పైకెత్తాడు. కుడిచేతిని నోటి దగ్గిరకు చేర్చి దారుణమైన పొలికేక పెట్టాడు.

చెవుల్ని గట్టిగా మూసుకోవాలి అనిపించింది సాంబశివుడికి. కర్ణరంధ్రాలకు చిల్లులుపడి రక్తస్రావమయ్యే స్థాయిలో వుంది ఆ కేక.

సాంబశివుడిని తరుముకొస్తున్న ఆగంతకులకు గుండెలవిసిపోయాయి కాబోలు….. ఎక్కడివాళ్ళక్కడ ఆగిపోయి, ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

“పారిపో మాధవా.. నగరంలోకి పారిపో” తడబాటునించి తేరుకుంటూ ఇంకోసారి అతన్ని హెచ్చరించాడు సాంబశివుడు.

మాధవుడు పారిపోలేదు. నిలబడిన చోటినించి పిసరంత కూడా అవతలికి జరగలేదు.

ఆగిపోయిన ఆగంతకులకు అమితమైన ధైర్యం వచ్చేసినట్టుంది. ఇంకోసారి కలిసికట్టుగా కదిలారు వాళ్ళు.

యాజ్ఞవల్క్యులవారు చింతబరికెతో బాదుతున్నప్పుడు ఎలాంటి అనుభూతులు కలిగాయో, అంతకు రెట్టింపు కలగడం మొదలుపెట్టాయి మాధవుడికి ఇప్పుడు.

పిడికిళ్ళు బిగించి అడుగు ముందుకు వేశాడు. వెంటనే అతన్ని అడ్డుకున్నాడు సాంబశివుడు.

“ఆకాశం అదిరిపోయేటట్టు నువ్వు సింహనాదం చేశావ్‌…. నగరంలో నివశిస్తున్నవారందరికీ తప్పకుండా వినిపించి వుంటుంది. ఈ నగర ద్వారాల్ని సరరక్షించాల్సిన భటులకు కూడా తెలిసే వుంటుంది. అయినా సరే వాళ్ళు రావడం లేదు.

సంగతేమిటో తెలుసుకోవాలని అనుకోవడంలేదు. అసలేం జరుగుతోంది.

“ఏదో తేడా కనిపిస్తోంది మాధవా… ఈ పరిస్థితి ఏమిటో చాలా అనుమానస్పదంగా వుంది. పారిపోవడం చాలా మంచిది” తను గమనించిన అంశాన్ని ఆలస్యం చేయకుండా బయటపెట్టేశాడు.

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=194

Related Posts:

మచ్చల గుర్రం – మధుబాబు – free preview!

మచ్చల గుర్రం

విపరీతమైన దాహం వేసింది వారుణికి. అదేపనిగా తడబడటం మొదలు పెట్టాయి అడుగులు. గిర్రుగిర్రున తిరగసాగాయి కళ్లు. ‘ఇక నడవడం నావల్లకాదు. నా పని అయిపోయింది’ అస్పష్టంగా అంటూ చతికిలబడింది ఒక చెట్టు మొదట్లో.

బరిశె మాదిరిగా పొడుగ్గా ఉన్న ఒక చెట్టు కొమ్మని బిగించి పట్టుకుని, ఒక్కొక్క అడుగే ముందుకువేస్తున్న చంద్రుడి ఒళ్ళు ఝల్లుమంది ఒక్కసారిగా.

తన వెనుకవస్తున్న మానవుల గురించి పట్టించుకోలేదు అప్పటివరకూ ఆ మహావ్యాఘ్రం. అసలు వారు తనను అనుసరిస్తున్నట్లుగా కూడా దానికి తెలియదు.

ఉన్నట్లుండి వినవచ్చిన మాటల శబ్దాన్ని ఆలకించగానే గుండెలు జలదరించేటట్లు గాండ్రిస్తూ గిర్రున తిరిగింది వెనక్కి.

“వెళ్ళిపో వారుణీ. వెనక్కి వెళ్ళిపో… అసలు ఈ ప్రదేశంలోనించి దూరంగా పారిపో” అని వారుణిని హెచ్చరిస్తూ, చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతో ఆ భీకరమృగాన్ని ఎదిరించటానికి సిద్దపడ్డాడు చంద్రుడు.

అప్పటికి మూడు మాసాలనించీ ఆ అడవిలో విశృంఖలంగా విహరిస్తోంది ఆ క్రూరమృగం. ఎక్కడినించి వచ్చిందో తెలియదుగాని, వచ్చీ రావటంతోనే అడవి అంచున ఉన్న ఉత్పలమహర్షి ఆశ్రమం మీద పడింది దాని కన్ను.

పగలు-రాత్రి తేడాలేకుండా అవకాశం అంటూ లభించిన వెంటనే దాడిచేయటం మొదలుపెట్టింది ఆశ్రమంలో హాయిగా జీవించే సాధుజంతువుల మీద.

నాలుగు గోవులు, ఎనిమిది జింకలు, పది పండ్రెండు కుందేళ్ళు, రెండు నెమళ్ళు కనిపించకుండా పోయేసరికి చిరాకుపడ్డాడు ఉత్పలమహర్షి.

“ఆ వ్యాఘ్రాన్ని హతమార్చితీరాలి… ఆ పని చేసిన వారికి ఆరు రోజులు హరిహరపురంలో జరిగే వసంతోత్సవాలను చూసి ఆనందించే అవకాశం కల్పిస్తాను” తనకు ఎంతో ప్రీతిపాత్రమైన రెండో నెమలి మాయమైపోయిన రోజున అందరూ వింటూ ఉండగా ప్రకటించాడు.
మచ్చల గుర్రం On Kinige

అరువదిమందికి పైగానే చదువుకుంటున్నారు ఆ ఆశ్రమంలో. కళింగ కామరూప మగధ పాంచాలరాజులకు చెందిన రాజకుమారులున్నారు వారిలో.

విదర్భ, విరూప, వైరోచన దేశాలకు చెందిన రాకుమార్తెలున్నారు. రాజ్యాలు లేకపోయినా తత్సమానమైన వైభోగాలను అనుభవించే వణిక్‌ సార్వభౌముల బిడ్డలున్నారు. దండనాయకుల బిడ్డలు, దళపతుల సంతానాలు చాలామంది భక్తిశ్రద్ధలతో విద్యాభ్యాసం చేస్తున్నారు.

ఉత్పలమహర్షి ప్రకటనను వినగానే ఉప్పొంగాయి వారి శరీరాలు. పోటీలుపడి తమ ఆశ్రమంమీద అఘాయిత్యానికి పాల్పడుతున్న ఆ క్రూరమృగాన్ని వెదకటం ప్రారంభించారు. అందరూ అనుసరించిన మార్గాన్ని వదిలి అడుగు తీసి అడుగువేయటం అతికష్టమని అనిపించే ఉత్తర దిశలోకి వచ్చారు వారుణి, చంద్రుడు.

చురకత్తులవంటి ముళ్ళు కలిగివున్న పొదలు, దట్టమైన చెట్లు, ఎగుడుదిగుళ్ళతో నిండి వున్న నేల – సూర్యుడు నడిమింటికి చేరుకునే సమయానికల్లా పూర్తిగా అలసిపోయింది వారుణి. తాము ఎక్కడ ఉన్నారో, ఎందుకు వచ్చారో, మర్చిపోయి నోరు విప్పింది.

తను మాట్లాడిన రెండే రెండు మాటలు ఎటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయో చూసేసరికి ఒక్కసారిగా నిలువు నీరయిపోయింది ఆమె.

“నువ్వు కూడా వచ్చేయ్‌ చంద్రా… నువ్వు ఒక్కడివే దాన్ని ఎదిరించలేవు. వచ్చేయ్‌” అని చంద్రుడిని హెచ్చరిస్తూ, తాను ఏ చెట్టుకింద కూలబడిందో ఆ చెట్టును పట్టుకుని పైకి ఎగబాకటానికి సిద్ధం అయింది.

తన వెనుకే అతను వచ్చేస్తాడని అనుకున్న ఆమె ఆలోచనకు మొదట్లోనే విఘాతం కలిగింది. వెనక్కి వచ్చేయటం కాదుకదా… అసలు ఆమె మాటలు తనకు వినబడనట్లే ఆ భీకరమృగాన్ని ఎదిరించాడు చంద్రుడు.

అతని చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతగిలి రెండుచోట్ల గాయపడింది ఆ పులి శరీరం… ఎర్రటి నెత్తురు వెల్లువలా బయటికి వస్తోంది… భరించరాని బాధతో దానికి పిచ్చిపట్టినట్లు అవుతోంది. చెవులు చిల్లులు పడిపోయేటట్లు దారుణంగా గాండ్రిస్తూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది.

విచ్చుకత్తుల మాదిరి కనిపిస్తున్నాయి దాని పంజాలకున్న గోళ్ళు. అవి తగలటం అంటూ జరిగితే చంద్రుడి పని అక్కడికక్కడే పూర్తి అయిపోతుందని అర్ధమైపోయింది వారుణికి. వెనుకా ముందు చూడకుండా, ఎగబాకుతున్న చెట్టును వదిలి, ఎగిరి నేలమీదికి దుమికింది. కింద ఉన్న ఒక పెద్ద బండరాయిని రెండు చేతులతోను పట్టుకుని బలంగా విసిరింది. చంద్రుడి తలమీదికి లంఘించబోతున్న ఆ వ్యాఘ్రపు శిరస్సుకు తగిలింది ఆ బండరాయి. కళ్ళు బైర్లుకమ్మాయి కాబోలు – గుండెలవిసిపోయేలా అరుస్తూ ఒక పక్కకు పడిపోయిందా మృగం.

“కొట్టేయ్‌ చంద్రా. ఆలస్యం చేశావంటే అది మన ఇద్దర్నీ కరకరా నమిలేస్తుంది. లేచి నిలబడకముందే నాశనం అయిపోవాలి” అని చంద్రుడిని హెచ్చరిస్తూ, కిందనించి ఇంకో బండరాయిని అందుకున్నది వారుణి.

ఆమె హెచ్చరికను అక్షరాలా అమల్లోపెట్టాడు చంద్రుడు. చెట్టుకొమ్మని గాలిలో గిర్రున తిప్పుతూ దెబ్బమీద దెబ్బగా నాలుగుదెబ్బలు వేసేశాడు నెత్తిమీద.

ఐదో దెబ్బ వేయకముందే గింగిరాలు తిరుగుతూ వచ్చి తగిలింది వారుణి విసిరిన బండరాయి.

మూడుమూరల ఎత్తు, తొమ్మిదిమూరల పొడవు ఉన్న ఆ భీకర ప్రాణికి తట్టుకోవటం అసాధ్యమైపోయింది. ఎదిరించే ఆలోచనని విరమించుకుని అక్కడి నించి పారిపోయే ప్రయత్నం చేసింది. మూడు అడుగులు కూడా వేయకముందే గురిచూసి మెడమీద వేశాడు చంద్రుడు బలమైన వేటు. పచ్చి చిరిచింతకొమ్మ విరిగిపోయినట్టు ఛట్‌మని శబ్దం చేస్తూ విరిగిపోయింది దాని మెడ ఎముక. ఆఖరిసారిగా బావురుమని ఒక వికృతశబ్దం చేసి ముందుకు పడిపోయింది అది.

లావుగావున్న మరో బండరాయిని పట్టుకుని దాని దగ్గిరికి దుముకబోతున్న వారుణి చెయ్యి పట్టుకుని ఆపేశాడు చంద్రుడు. “దాని పని అయిపోయింది వారుణీ…. చచ్చి స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయింది. నువ్వు స్థిమితంగా నిలబడు…. ముందు ఆ బండని అవతల పారేయ్‌” మృదుస్వరంతో ఆమెకు చెప్పాడు.

అప్పుడు, ఆ మువ్వన్నెల మెఖం ఇక లేచి తిరుగాడ లేదని నిశ్చయంగా తెలిసిన తరువాత తగ్గిపోయింది వారుణిని ఆవరించుకుని ఉన్న ఆవేశం. వెంటనే గుర్తుకు వచ్చాయి ఆమెకు తన శారీరక బాధలు.

“దాహం వేస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయ్‌” అంటూ మళ్ళీ నేలమీద చతికిలబడిపోయింది.

చేతుల్లోనే ఉన్న చెట్టుకొమ్మని అవతలికి విసురుతూ చిరునవ్వు నవ్వాడు చంద్రుడు. నవ్వినప్పుడు అతని బుగ్గలు సొట్టలు పడతాయ్‌… అతనికి తెలియకుండానే కళ్ళు అరమూతలుగా మూసుకుంటాయి.

అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మాత్రం అలా అనిపించలేదు వారుణికి.

“చచ్చిపోతున్నానురో దేవుడో అని నేను దేబిరిస్తుంటే ధ్వజస్తంభం మాదిరి నిలబడి చిలకనవ్వులు నవ్వుతున్నావ్‌.. నీకు అసలు మతిలేదు….” చివాట్లు మొదలుపెట్టింది.

నవ్వుతూనే పొదల్లోకి పోయాడు చంద్రుడు. పది నిమిషాల తరువాత కనిపించింది ఒక నీటిగుంట.

ఆగి ఆగి వీస్తున్న చిరుగాలుల తాకిడికి అలలు రేగుతున్నాయి అందులో. అరచేయి వెడల్పున విచ్చుకుని అందంగా కనిపిస్తున్న తామరపూలు, వాటికి సంబంధించిన ఆకులు అన్నీ ఉయ్యాలలు ఊగుతున్నాయి ఆ అలల మీద. బయటికి చెప్పకపోయినా చంద్రుడి గొంతు కూడా ఎండుకుపోయినట్టుగానే ఉంది.ఎదుట కనిపించిన జలాశయాన్ని చూడగానే పరుగు పరుగున పోయి ఆ నీటిలో దూకాలన్న కోరిక కలిగింది అతనికి.

అయినా సరే తొందరపడలేదతను….

నెమ్మదిగా నీటి అంచును సమీపించి, దక్షిణహస్తాన్ని నెమ్మదిగా అతి నెమ్మదిగా జాచాడు.

ఛట్‌మంటూ నీటిని చీల్చుకుని ఆ చేతిని పట్టుకోబోయింది వికృతరూపంలో ఉన్న ఒక మకరి.

అటువంటి ప్రమాదం ఏదో ఒకటి ఉండి వుండవచ్చని ముందుగానే ఊహించి ఉండటం వల్ల వేగంగా చేతిని వెనక్కి లాగేసుకున్నాడు చంద్రుడు.

దొరక్క దొరక్క ఒక మానవుడి చేయి దొరకనే దొరికిందన్న సంతోషంతో పైకి లేచిన మకరికి నిరా శే మిగిలింది. తిరిగి నీళ్ళల్లో పడిన తర్వాత అలవాటు ప్రకారం అడుగు భాగంలోకి వెళ్ళిపోలేదు అది. పటకా కత్తుల వంటి కోరలన్నీ బయటికి కనిపించేటట్టు ఇంత లావున నోటిని తెరిచి బహుక్రూరంగా చూసింది అతనివంక.

ఇప్పటికే ఒక ప్రాణాన్ని బలితీసుకుని వున్నాను. వెంటవెంటనే నిన్నుకూడా చంపి జీవహింస చేయటం నావల్లకాదు… నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకుండా వుంటే చాలా సంతోషిస్తాను” అంటూ గబగబా ఇంకో పక్కకి బయలుదేరాడు చంద్రుడు.

మూడు బారల దూరం అతన్ని అనుసరించింది ఆ మకరం. అతను నీటిలో అడుగుపెట్టటం జరగదని నిశ్చయం అయ్యేసరికి నిరాశగా వెను తిరిగింది.

అటువంటి పరిణామం కోసమే ఎదురు చూస్తున్నాడు చంద్రుడు. అది వెనక్కి మరలిన మరుక్షణం, దగ్గిర్లో వున్న తామరాకులు రెండింటిని పుట్టుక్కున తెంపాడు. మిఠాయి పొట్లం మాదిరిగా చుట్టి నీటిని నింపుకున్నాడు.

తను మోసపోయినట్టు గ్రహించి పొడవాటి తోకతో నీటిని దబ్బున బాదుతూ మళ్ళీ అతనికేసి వచ్చింది ఆ మకరం. మాటలు రాకపోయినా దాని కళ్ళల్లో కనిపిస్తున్న క్రోధభావాల్ని గమనించి తనలో తను నవ్వుకుంటూ వెంటనే వెనక్కి బయలుదేరాడు చంద్రుడు.

“ముష్టి మూడు దోసిళ్ళ నీళ్ళు తీసుకురావటానికి ఇంతసేపా? నీకు అసలు ఎదుటివాళ్ళ బాధల్ని గురించి పట్టించుకోవటం చేతకాదా?” తామరాకుల దొన్నెలో వున్న నీరు ఒలికిపోకుండా జాగ్రత్తగా వస్తున్న అతన్ని చూసి అమ్మోరుతల్లిలా అరిచింది వారుణి.

“ఎక్కువగా అరిస్తే గొంతు చినిగి, శబ్దపేటిక పాడయిపోతుంది. శాశ్వతంగా మూగతనం వచ్చేస్తుంది. నోరు మూసుకుని తాగు. కాసిని నాకు కూడా మిగుల్చు” తామరాకుల దొన్నెను అందిస్తూ చెప్పాడు చంద్రుడు.

“నోరు మూసుకుని నీళ్ళు ఎలా తాగుతారోయ్‌? నీకు అసలు బుద్ధిలేదు” అంటూ గుటకలేసింది వారుణి.

“చాలా రుచిగా వున్నాయ్‌. నువ్వు అక్కడే తాగి రావాల్సింది. ఎందుకు తాగలేదు?” అంటూ ఆఖర్లో నాలుగు గుటకల నీటిని మిగిల్చి అతనికందిస్తూ అడిగింది.

ఏమరుపాటుగా వుంటే ఎగిరి చెయ్యిపట్టుకోవటానికి సర్వసిద్ధంగా వున్న మకరిని గురించి ఆమెకు చెప్పలేదు చంద్రుడు. “ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గురువుగారు మనకోసం ఆందోళనపడుతూ వుంటారు… వెంటనే బయలుదేరకపోతే చీకటి పడిపోతుంది. చీకట్లో దారితప్పామంటే ఎటు పోతామో తెలుసుకోవటం కష్టం” అంటూ ప్రాణాలు వదిలేసిన మహా వ్యాఘ్రాన్ని అమాంతం పైకెత్తి భుజంమీద వేసుకున్నాడు.

“దీన్ని హతమార్చటమే ముఖ్యం. మనవెంట తీసుకుపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు” వచ్చిన దారినే వెనక్కి వేగంగా నడుస్తూ అన్నది వారుణి.

“గురువుగారు గాని, గురుపత్నిగాని ఏమీ అనుకోరు. మనం చెప్పింది విని సంతోషిస్తారు. మన సహాధ్యాయులు కొందరికి అనుమానపు రోగం వుంది. ఓ పట్టాన నమ్మరు” ఆమె వెనకే అడుగులు వేస్తూ చెప్పాడు చంద్రుడు.

“వాళ్ళు నమ్మితే మనకేమిటి, నమ్మకపోతే ఏమిటి? మనం చేయవలసిన పనిచేసేశాం. అది చాలదా?” సూటిగా అతనివైపు చూస్తూ అడిగింది వారుణి.

“చాలదు. హరిహరపురంలో జరిగే వసంతోత్సవాలకు మనం వెళ్ళాలంటే ఈ క్రూరమృగం మరణించినట్లు అనుమానం లేకుండా అందరికీ తెలియాలి. అలా తెలియాలంటే సాక్ష్యం వుండాలి” చెప్పాడు చంద్రుడు.

వసంతోత్సవాల ప్రసక్తి వచ్చేసరికి ఆనందంతో అరమూతలు పడ్డాయి వారుణి కనులు. “ఎనిమిది సంవత్సరాల నించీ ఈ అడవిలో వుంటూ నాగరికతకు దూరంగా బతుకుతున్నాం. విద్యాభ్యాసం పేరుతో ఎన్నెన్నో అనుభూతులను, అనుభవాలను కోల్పోతున్నాం…. వసంతోత్సవాలలో పాలుపంచుకోవటం అంటే నా మనస్సు ఉప్పొంగిపోతున్నది” తన్మయత్వంగా చెప్పింది అతనికి.

ఆ మాటలు గురుదేవులుగాని, గురుపత్నిగాని వినటం జరిగితే ఎలా స్పందిస్తారో ఊహించటానికి ప్రయత్నిస్తూ సాధ్యమైనంత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు చంద్రుడు.

* * *

బండి చక్రాల వంటి పెద్ద పెద్ద కళ్ళతో, కత్తుల మాదిరి కనిపించే కోరలతో, పరమ భయంకరంగా కన్పించే వికృత స్వరూపం ముందు నిలబడి గుప్పిళ్ళతో వెదజల్లాడు వార్షికుడు పసుపు, కుంకుమల్ని.

“పలుకు తల్లీ…. నీ బంగారు నోటిని తెరిచి మా మహారాజు బతుకును గురించి మంచి పలుకులు పలుకు” అంటూ అర్ధించాడు.

“రక్తపు వాసన చూపించకుండా పలకమంటే ఎలా పలుకుతారురా? ఆకలి అధికంగా వుంది. ఆహారం లేనిదే మాట బయటికి రాదు” ఉన్నట్లుండి వినవచ్చాయి ఆ మాటలు ఆ ఆకారం నోటినించి.

“తీసుకురండిరా… బలి జంతువుల్ని పడేసి ఈడ్చుకు రండి” ఖంగుమంటున్న కంఠంతో తన అనుచరులకు చెప్పాడు వార్షికుడు.

నల్లగా నిగనిగ మెరిసే శరీరాలతో పెద్ద మట్టిగుట్టల్లా కనిపించే అడవిదున్నలు ఆరింటిని అతి ప్రయత్నం మీద అక్కడికి లాక్కు వచ్చారు అతని అనుచరులు.

మూడు మూరల పొడవున్న బలిఖడ్గాన్ని పట్టుకుని చెలరేగిపోయాడు వార్షికుడు. ఛటాఛటామని తెగి వికృత స్వరూపపు పాదాల దగ్గర పడిపోయాయి ఆ జీవాల తలలు. ఎర్రటి రక్తం ఒక్కసారిగా చివ్వున పైకి ఎగసి ఆ ఆకారపు పాదాల చుట్టూ పడింది.

“ఇచ్చాను తల్లీ. బలి ఇచ్చాను… పెదవులు తడుపుకుని మాకు మంచిమాటలు చెప్పు….” ఖడ్గాన్ని కిందపెట్టి చేతులు జోడిస్తూ అడిగాడు వార్షికుడు.

“నాకు మంచి కనిపించటం లేదురా… మృత్యువు కనిపిస్తోంది… సింహాసనం మీద కూర్చున్న మీ చక్రవర్తి జుట్టు పట్టుకుని కిందికి లాగటం గోచరిస్తోంది” ఉన్నట్లుండి మాట్లాడింది ఆ వికృతరూపం. మనస్సు ఉప్పొంగిపోయే తీపి మాటలు వినవస్తాయని ఎదురుచూస్తున్న వార్షికుడి ఒళ్ళు చలిగాలి వీచినట్టు జలదరించింది.

“ఎవరు? సర్వం సహా చక్రవర్తి, అసమాన శౌర్యసాహసాలు కలిగినవాడు, ఈ వార్షికుడిని అమితంగా అభిమానించేవాడు అయినటువంటి భుజంగ భూపతిని సింహాసనం మీది నించి కిందికి లాగగల మొనగాడు ఎవడు?” ఖంగుమంటున్న కంఠంతో అడిగాడు.

“భుజంగ భూపతేకాదు – కాలం కలిసిరాకపోతే భూమిని మోసే ఆదిశేషుడు కూడా అవమానాలపాలు కావాల్సిందే… విధి లిఖితానికి తలవంచాల్సిందే” చెప్పిందా ఆకారం.

“వీలుకాదు…. ఈ వార్షికుడు బతికివుండగా అలా జరగటానికి అసలు వీలు లేనేలేదు… సమస్తమైన పూజలు చేస్తాను…. సర్వశక్తుల్ని ఆవాహన చేస్తాను. ఆరు నూరైనా సరే నా చక్రవర్తిని రక్షించుకుంటాను” ఆవేశంగా అన్నాడు వార్షికుడు.

“జరగబోయేది చెప్పమని అడిగావు. చెప్పాను. నమ్మటం, నమ్మకపోవడం నీ ఇష్టం… నాతో పని అయిపోయిందా?” అడిగిందా కంఠం.

“ఆరు జీవాల ఉసురును దిగమింగి అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? ఎవరివల్ల ఆ ప్రమాదం వస్తుంది? ఎలా వస్తుంది? వివరాలు చెప్పు” అడిగాడు వార్షికుడు.

“చామంతిచాయ మేను…. నవ్వితే సొట్టలుపడే బుగ్గలు. ఎదిరిస్తే అధఃపాతాళానికి సాగనంపే బలిష్టమయిన హస్తాలు… వెనకాల సన్నజాజి తీగవంటి నారీమణి…. వివరాలు కనిపించటంలేదురా… ఇప్పటికి ఇవే ఆఖరి మాటలు….” తీవ్రంగా ఆలోచించి మాట్లాడుతున్నట్టు ఆగిఆగి చెప్పుకొచ్చిందా ఆకారం….

“అసంభవం…. అతి బలసంపన్నుడయిన నా చక్రవర్తిని సాధారణమైన వీరుడు ఎదిరించటం అసంభవం…. వాడివెనుక ఒక ఆడది వుంటే – నా చక్రవర్తి వెనుక యంత్ర తంత్ర మంత్ర విద్యల్లో మొనగాడినయిన నేను వుంటాను….” చెప్పాడు వార్షికుడు.

“నువ్వు కాదు, నేను వెనుక నిలబడినా జరుగబోయేది ఏదో జరిగే తీరుతుంది. అక్రమ కృత్యాలతో, మదమాత్సర్యాలతో క్షణక్షణం రోజురోజు నిముష నిముషం మహా పాపకృత్యాలు కావిస్తూ చెడుకు ప్రతిరూపంగా తయారవుతున్న మీ భుజంగ భూపతికి చాలా దగ్గిర్లోనే వున్నది పతనం…” అంటూ మాటల్ని ఆపింది ఆ రూపం.

ఇంకా ఏదో చెపుతుందని ఊపిరి బిగపట్టి ఎదురు చూశాడు వార్షికుడు. ఎంతసేపటికీ మాట్లాడకపోయేసరికి, విపరీతమయిన ఆలోచనలతో ఒక్కసారిగా ముడుతలు పడింది అతని నుదురు.

“ఇంకా కొన్ని మహిషాల్ని బలి ఇచ్చి ఇంకోసారి ఆవాహన చేయండి దొరా” నెమ్మదిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అతని అనుచరుల్లో ఒకడు.

“అది వీలుపడని పనిరా… అమావాస్య అష్టమగడిలో వున్నప్పుడే మనకి అందుబాటులోకి వచ్చే శక్తి ఇది. మామూలు సమయాల్లో మహిషాలనే కాదు, మన తలల్ని నరికి బలిగా ఇచ్చినా పన్నెత్తి పలుకదు…” గట్టిగా నిట్టూరుస్తూ వివరించి చెప్పాడు వార్షికుడు.

“మరి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? వినిపించిన మాటల్ని తీసుకుపోయి చక్రవర్తి చెవులకు చేరవేయటమేనా?” వెంటనే అడిగాడు ఆ వ్యక్తి.

తనను సింహాసనం మీదినించి కిందికి లాగే మొనగాడు ఒకడు భూమి మీద వున్నాడని తెలిసిన మరుక్షణం చక్రవర్తి మొఖంలో ఎలాంటి మార్పు వస్తుందో ఊహించుకునేసరికి పచ్చని వేపాకులు కొన్ని నమిలినట్టు పరమ చేదుగా తయారయింది వార్షికుడి నోరు.

సభా భవనం దద్దరిల్లిపోయేటట్లు పొలికేకలు పెడుతూ సింహాసనం మీది నించి లేస్తాడు, తన చేతికి ఎల్లప్పుడు అందుబాటులో వుండే ఖడ్గాన్ని తీసుకుని “వద్దు…. ఈ మాటల్ని మనం ఆయనకి చెప్పవద్దు” తనకు తెలియకుండా బిగ్గరిగా అరిచాడు వార్షికుడు.

“రాబోయే వసంతోత్సవాలకు హరిహరపురం వెళ్ళాలని చక్రవర్తి ఆకాంక్ష. రాజధాని వదిలి ఎక్కడికయినా బయలుదేరేముందు మంచి చెడులు చూడమని మనకి వర్తమానం పంపించే అలవాటు ఆయనది. మరి ఇప్పుడు ఏమని చెప్పాలి?” అడిగాడు ఆ అనుచరుడు.

“అంతా మంచే జరుగుతుందని చెప్పేస్తే సరిపోతుంది… సింహాసనం మీదినించి పడిపోవడం ఇప్పటికిప్పుడు జరగబోవడంలేదు కదా… ఆ సమయం వచ్చే లోపల ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవచ్చును” ఉన్నట్లుండి పెదవులు విప్పి తను అనుకుంటున్నది బయటపెట్టాడు ఇంకో అనుచరుడు.

“ఆ ఆటలు చక్రవర్తి ముందు సాగవురా… జరగబోయే చెడును చెప్పటంతోపాటు ఆ పరిస్థితిని తప్పించుకునే మార్గం చెప్పేస్తే సంతోషిస్తాడు…” రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న వార్షికుడు వెంటనే అన్నాడు.

“అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమని మీ ఆజ్ఞ?” అడిగాడు మొదటి అనుచరుడు.

“మన కాలపిశాచి విగ్రహం పాదాల దగ్గిర కాలకూట విషానికంటె భయంకరమైన మంత్రాలు లిఖించబడిన మంత్రం గ్రంథం వుంది. దాన్ని తీసుకురండి….”

వెంటనే కదలబోయిన అనుచరుల్ని మళ్ళీ తానే చేతులు తట్టి వెనక్కి పిలిచాడు. “బలి కావాలని అంటుంది కాలపిశాచి. గ్రంథపఠనం చేసిన తర్వాత ఇస్తామని వాగ్ధానం చెయ్యండి” అని చెప్పాడు. తలలు ఊపి ఆ మందిరంలోనించి బయటికి పరిగెత్తారు వాళ్ళు.

* * *

“మూడు మూరల ఎత్తు, తొమ్మిది మూరల పొడుగు…. అబ్బో…. దీన్ని మానవమాత్రుడు ఎవరూ వధించలేరు. అది కూడా సరైన ఆయుధం లేకుండా వట్టి చెట్టుకొమ్మతో పడగొట్టడం – నాకు నమ్మకం లేదు.”

ఆశ్రమం వెలుపలవుండే ఒక బండరాయిమీద చంద్రుడు పడవేసిన మహావ్యాఘ్రపు శరీరాన్ని అదేపనిగా చూస్తూ నాలుక చప్పరించాడు ఉన్మత్తుడు.

అతని అసలు పేరు అదికాదు. అయినా అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. అతను మాట్లాడితే మౌనంగా నిలబడి వింటారు. ఎందుకంటే అతను సామాన్యుడు కాదు, పాంచాలరాజ్యానికి కాబోయే మహారాజు.

“నువ్వు చెప్పింది నిజమే మిత్రమా… అసలు జరిగింది ఏమిటంటే ఈ దుష్టమృగం మన చంద్రుడి మీదికి లంఘించే సమయంలో అక్కడికి కొందరు వనదేవతలు వచ్చారు. పాంచాల రాజ్యానికి కాబోయే మహారాజు ఉన్మత్తుల వారితో కలిసి చదువుకుంటున్నామని వారికి నేను చెప్పాను. వెంటనే వారి చేతుల్లోనించి మెరుపులు బయటకువచ్చి దీన్ని అంతం చేసేశాయి” ఎవరికీ తెలియని మహారహస్యాన్ని బయటపెడుతున్నట్టుగా మొఖంపెట్టి చెప్పింది వారుణి.

“మిత్రమా…. వారుణి నిన్ను వెక్కిరిస్తోంది” అందరూ ఫక్కున నవ్వడంతో ఉన్మత్తుడి చెవిలో అదే విషయాన్ని ఊదాడు అతని స్నేహితుడు ఒకతను.

ఎర్రబడిపోయాయి ఉన్మత్తుడి కళ్ళు.

గట్టిగా బిగుసుకున్నాయి పిడికిళ్ళు.

పటపటమని శబ్దం చేశాయి దంతాలు.

“ఏం జరుగుతోంది ఇక్కడ?” గంభీరంగా వినవచ్చింది ఉత్పల మహర్షి కంఠం.

మంత్రం వేసినట్టుగా మాయమైంది ఉన్మత్తుడి ఆవేశం. అసలు కోపం అంటే ఎలా ఉంటుందో తెలియనట్లు అమాయకంగా చూస్తూ నిలబడిపోయాడతను.

అతన్ని మరింతగా ఆటలు పట్టించటానికి సంసిద్ధురాలై ఉన్న వారుణి కూడా నిలుచుండిపోయింది ఏమీ ఎరుగనిదానిలా.

పరమ శాంతమూర్తి మాదిరిగా కనిపించే ఉత్పలమహర్షిలో అణిగిమణిగి ఉంటుంది దారుణమైన కోపం. ఆశ్రమ నియమాలకు విరుద్ధంగా నడుచుకున్నా, అనవసరమైన గొడవలకు కారణమైనా, ఆ పని చేసినవారి మీద అగ్నిహోత్రం మాదిరి విరుచుకుపడతాడాయన. శిక్ష కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి ఆశ్రమ బహిష్కారం విధింపబడవచ్చు.

ఉత్పల మహర్షి ఆశ్రమంలో నుంచి బహిష్కృతుడైన విద్యార్ధికి విద్యను నేర్పే సాహసం ఎవరూ చేయరు. నిరక్షర కుక్షి మాదిరి బ్రతుకవలసిందే. తన ఆగమనాన్ని గమనించి శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయిన విద్యార్థులందరి వంకా చాలా నిశితంగా చూశాడాయన ఇప్పుడు.

“అసలు ఇక్కడ జరుగుతున్నదేమిటి?” అడిగాడు.

“అదీ… అసలు విషయం ఏమిటంటే…. మన చంద్రుడు” తడబడకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తూ మాటలు మొదలుపెట్టాడు ఒక విద్యార్థి. అంతలోనే గురువుగారి చూపు మహా వ్యాఘ్రపు శరీరం మీదికి మరలాయి.

“అరెరే…. ఇది సుభోది పర్వతాల మధ్య సంచరించే దుష్ట దుర్మార్గపు జీవి. చర్మం చాలా మందంగా ఉంటుంది. మామూలు ఆయుధాలతో దీన్ని నిర్జించటం కష్టం… మెడ ఎముక విరిగితే తప్ప దీని ప్రాణాలుపోవు” ఆశ్చర్యంగా మాట్లాడుతూ మరికొంచెందగ్గరికి పోయి మరింత నిశితంగా చూశాడు ఉత్పల మహర్షి.

“అదే జరిగింది గురుదేవా! మన చంద్రుడు ఒక సామాన్యమైన చెట్టుకొమ్మతో దీని మెడని విరిచేశాడు” ఎంత బిగపట్టుకున్నా అణిగివుండని ఉత్సాహంతో చెప్పింది వారుణి.

వారుణి చెప్పినదానికి సంతోషంగా తల ఊపవలసిన గురుదేవుడు చటుక్కున తలతిప్పి సూటిగా చూశాడు ఆమె మొఖంలోకి.

“ఎక్కడో అడవిలో చంద్రుడు చేసిన ఘనకార్యాన్ని గురించి నీకెలా తెలిసింది?” కనులు చిట్లిస్తూ అడిగాడు.

End of Preview.

Rest of the book can be rented / bought @ http://kinige.com/kbook.php?id=192


Related Posts:

కాళికాలయం జానపద నవల (మధుబాబు రచన) ఇప్పుడు కినిగెపై

రాజులు రాణులు మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన కాళికాలయం నవల ఇది!
తమ రాజ్యపు కన్యపిల్లలను హరించుతున్న ఆ పొగ శక్తి ఏమిటి?
తమ తండ్రిగారిని మైకంలోకి నెట్టిన ఆ మంత్రబలం నుండి విముక్తి మార్గం ఏమిటి ?
గురుకులం నుండి అత్యవసరంగా పిలిపించబడి, కార్యసాధనకోసం బయలుదేరిన యువరాజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు?
యువరాజుకు తోడుగా బయల్దేరిన బలదేవుడి బలాబలాలు ఏమిటి?
తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం!

Part 1 = http://kinige.com/kbook.php?id=174

Part 2 = http://kinige.com/kbook.php?id=173

Part 3 = http://kinige.com/kbook.php?id=157

 

ఆముఖుని మంత్రతంత్రాలు ఎంత శక్తివంతమైనవి?
ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కోసం బలదేవుడు, వసంతుడు చేసిన సాహసయాత్రలు ఎట్టివి?
తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం!

 

మధుబాబు కలం నుండి జాలువారిన అద్భుత జానపద నవల కాళికాలయం – ఈ కళ్యాణ తిలకం ఆ నవల యెక్క మూడో భాగం.
వసంతుడు, బలదేవుడు పూటకూళ్లమ్మ ఇంట్లో ఉండి, ఆ రాజ్యపు అంతఃపుర రహస్యం ఎలా ఛేదించారు ?
కొండలపై నిద్రపోతున్న యక్షిణి రహస్యాన్ని ఎలా చేదించారు ?
దుష్టమాత్రికుడు ఆముఖుడి ఆట ఎలా ముగిసింది ?
ఆహ్లాదకరమైన పరిసరాలలో, అందమైన మనుషుల మధ్య జరుగుతూ అడుగడుగునా ఊహించని మలుపులు తిరుగుతూ సాగే కాళికాలయం చివరి భాగం, మేటి జానపద గాథ, చదివించేది, తప్పనిసరిగా చదవాల్సింది.

కాళికాలయం On Kinige

కంకాళలోయ On Kinige

కళ్యాణ తిలకం On Kinige

Related Posts: