‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఎర్రభిక్కు ‘త్రిపుర’

చేతిలో మోస్తున్న రాయి ‘జర్కన్’

దాదాపు పదహారుసంవత్సరాల క్రితమే ‘భారతి’లో వచ్చిన ‘త్రిపుర’ కథలు చదువుతుంటే ఒక విచిత్రమైన అనుభవం కలిగేది. ఆ త్రిపురనే ఇంగ్లీషు బోధిస్తున్న ఆర్. వి. టి. కె. రావుగా విశాఖ నుంచి వెళ్ళి అంత దూరం త్రిపుర రాజధాని అగర్తలాలో నివశిస్తున్నాడని తెలిసి మరీ ఆసక్తి కలిగించింది నాకు ఆ రోజుల్లో. 1987లో ఆయన ‘చీకటి గదులు’ ఆ తరువాత తళుక్కున మెరిసి గుండెపై నుంచి గీసుకుపోయిన ఆయన కథానిక ‘జర్కన్’ నన్ను మరింత త్రిపుర కథలకు దగ్గర చేసింది.

అరుదైన మనోతత్వ వేత్తగా – నిరాసక్తుడుగా త్రిపుర ఈనాటికీ తనను తాను వెతుక్కుంటూనే వున్నాడు. ప్రతి కథలో ఆయన ఫస్ట్ పర్సన్ సింగులర్‌గా జీవించాడు, ఆయన అన్వేషణ మెట్లు మెట్లుగా ఒక్కొక్క కథలో ప్రగాఢమైన, మరింత లోతుగా ఆలోచించమని చెబుతూనే ఒక విషాదంలోకి నెట్టివేసి నెమ్మదిగా అభినిష్క్రమణ సాగిస్తుంది.
బౌద్ధ – జైన అనాసక్తతత్వం లోంచి పుట్టి, ఈ ప్రపంచంలో ‘అహింస’తో సాధ్యం కానప్పుడు ‘హింస’తోనైనా విప్లవాభిముఖంగా కొనసాగాలని త్రిపుర ధ్వనిప్రాయంగా తమను వ్యక్తీకరించుకున్నాడు. అందుకే ఆయనను నేను ‘రెడ్ భిక్కు’ అని పిలిచే వాణ్ణి! క్రమంగా ఆ ఎరుపు ‘సఫర్’గా సాగుతూ ‘కనిపించని ద్వారం’ వెనకాల వుండి పోయింది – అది వేరే సంగతి!!

ఈ కథలో ‘భాస్కర్’ రూపంలో కథకుడు ఒకచోట ఇలా అంటాడు- “విలువల ప్రమేయం లేదు నాకు. స్థిరంగా నిలబడి, నలుగురి మధ్యా వుండి, మనుష్యులతో వస్తువులతో సంబంధాలు – మమతలు పెంచుకొంటున్న వాళ్ళకు విలువలు” కాని ఈ దేశంలో జీవిస్తున్న రచయిత ఈ మట్టి మనుషుల నికృష్ట జీవితాలు చూసి ‘వీరాస్వామి’ పాత్రలో ఒక నూతన విలువ అంటే ఒక మహత్తరమైన ఆశయం కోసం త్యాగం తప్పదనే నిజాన్ని అంగీకరించక తప్పదు. అందుకే త్రిపుర మరో చోట అంటారు-

“తనను తాను తెలుసుకోవాలి. తనకేది కావాలో తెలుసుకోవాలి. తెలుసుకోవచ్చని తెలుసుకోవాలి. తనలోంచి తాను వేరుబడి తనను వేరే చూసుకోవడం నేర్చుకోవాలి. ఆ క్షణంలో అతను ఏమిటి చేయాలో అతని గమ్యం ఏమిటో అతనికి తెలుస్తుంది.”

విలువైన వజ్రపు రాళ్ళ మధ్య ‘జర్కన్’ అనేది విలువైన రాయి. సాన పెట్టబడక ముందు మామూలు రాయి. కాని, ‘అనుభవం’ ఆచరణతో మరొక్కసారి కోసం, ప్రయోజనం కోసం జీవిస్తున్నామనే స్పృహ, స్వార్థపూరితుడైన మనిషిని సానబెడుతుంది. ఒక్క ‘జర్కన్’ రాయిగా మారుస్తుంది.

త్రిపురగారు ‘ఇంపల్స్’ (Impulse)తో రాస్తారు. బౌద్ధ భిక్కులా దేశమంతా తిరిగి, అనుభవాల్ని కథల్లో అమర్చి తిరిగి దూరమై పోతారు. కథా కథన శైలిలో ‘చలం’కు చాలా దగ్గర వాడిలా కనబడతారు. ఇంగ్లీషు నుడికారం తెలుగుగా మారి చివరగా ఆయన అనుభవమనే రక్తంలోంచి చురుకైన భాష పుట్టుకొచ్చింది. ‘ఆలోచన’ నుంచి ‘తెలుసుకోడానికి’ గెంతగలిగితేనే చేరగలమని త్రిపుర అంటున్నారు ఈ కథలో- కాని ఆ అఖాతాన్ని దాటడానికి సరియైన పంథా అనుభవమనే వంతెన వేసుకోక తప్పదనే వాస్తవాన్ని త్రిపుర నిరాకరించరనే అనుకుంటాను.”

నిఖిలేశ్వర్

త్రిపుర కథలు On Kinige

Related Posts: