సాహిత్య చంద్రికలు (“రేపటి వర్తమానం” కవితా సంపుటి పరిచయం)

మనకు ఆధునిక కవులు చాలామంది ఉన్నారు. వందల సంఖ్యలో కవితలు ప్రచురితమవుతున్నాయి. వస్తు, శైలి, శిల్ప వైవిధ్యాలతో రచనలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని బాగా ఆకట్టుకోగలుగుతున్నాయి. అందుకు కారణం వాటిలోని విశిష్టతే.
ఆకలి కవితలు, ఆక్రందన కవితలు, ఆహ్లాద కవితలుగానూ, నానీలు రెక్కలుగాను కవితలు విడిపోతున్నాయి. అలా జరుగుతున్నా మంచి కవితలే మనం చదవగలుగుతున్నాం.
కవిత్వాభినివేశం ఉన్నప్పుడు, భాషమీద పట్టు ఉన్నప్పుడు ఒక పరిణితి చెందిన ఛాయాచిత్రకారుదు తీసిన అరుదైన చిత్రాల వంటి గాఢమైన, హత్తుకోగల కవితలు రచించడం సాధ్యపడుతుంది.
కవిత్వానికి స్పందన, ప్రేరణలు మాత్రమే సరిపోవు. అనుభూతి, సానుభూతితో పాటు వాటిని యథాతథంగా అక్షరాలలోకి దించగల నైపుణ్యమూ ఉండాలి.
ప్రపంచమనే విశాల కాన్వాసు మీద, నిత్యమూ వాటికవే ఎన్నో వైవిధ్యాలతో సంఘటనల చిత్రాలు రూపుదిద్దుకుంటూ చెరిగిపోతూ ఉంటాయి. వాటిని చెరిగిపోకుండా పట్టుకోగలగాలి. పదిలంగా మనో మందిరంలో నిక్షిప్తం చేసుకోవాలి. అటుపైన ప్రసవ వేదనలాంటిది మొదలవుతుంది.
రచన కాగితం మీద ప్రసవించే వరకూ ఆ బాధ ఆగదు. అటు తర్వాత, అపురూపంగా అక్షరాలను తడిమి చూసుకుంటూ, చేర్పులూ మార్పులతో అక్షర శిల్పాన్ని అందంగా అద్భుతంగా కవి తీర్చిదిద్దుతాడు. సంగీత సరస్వతులు నడుస్తూ కూడా రాగారధనలు చేస్తుంటారు. సాహిత్య సరస్వతులు కూడా నడుస్తునే భావసంపదలని ఎంతో మురిపెంగా మోసుకు వెళ్తుంటారు. అక్షరారాధనలు చేస్తుంటారు. వారి అంతరంగమే ఒక భువన విజయ మందిరం.
ఒక కవికి ఇంతటి నేపధ్యం ఉంటుంది.
చంద్రుడు కేవలం ఒక గోళమయితే ఎలాంటి ఆకర్షణ ఉండదు. చంద్రుడు అక్కడే ఉండి, వెన్నెలని జగమంతా కురిపిస్తున్నప్పుడు, ప్రపంచం కృతజ్ఞతతో ఆ గోళాన్ని ఒక దేవతగా చూస్తుంది.
చంద్రుడు దిగిరాడు, చంద్రికల్ని తన దూతలుగా పంపుతాడు. కవి కూడా అంతే. అతని కవితా చంద్రికలే మనల్ని స్పృశిస్తాయి.
ఇంత ఉపోద్ఘాతం ఇస్తేగానీ అడిగోపుల సారస్వత స్వరూపం మనకి అవగతం కాదు. కొన్ని దశాబ్దాలుగా నాకు ఆయన మిత్రుడు. అయన తెల్లని కోకిల, కమ్మగా పాడే కోకిలకి దేవుడు నల్లరంగు ఇచ్చినా, సరస్వతీదేవి అడిగోపుల వ్యక్తిత్వానికి స్వచ్ఛతనిచ్చింది. అందుకే ఆయన తెల్లని కోకిల.
గొప్ప సాహిత్యకారులు గొప్ప వ్యక్తులు కూడా అయినప్పుడు వారు ఆదర్శమూర్తులవుతారు. అడిగోపుల నిండుకుండ. తొణకడు, బెణకడు. జీవితమంతా మానవత్వ వేదనలకే అంకితం చేసాడు. గొప్ప కథలు రాసినా, ఇంకా రాయగలిగినా, కవిత్వల్నే తన సాహిత్య సైంధవాలుగా ఎంచుకున్నాడు.
అందుకే మెట్టు మెట్టు ఎక్కుతు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుత పుస్తకం పదిహేడవది.
ఇందుకో ఆయన ఏం చెప్పాడోనని చూస్తే, అసలేమీ చెప్పలేదా అనిపిస్తుంది. అడిగోపుల అరుదైన పదచిత్రాల కూర్పులో తనకి తానే సాటి.
‘అక్షరాలు దర్జీ ముందు గుడ్డముక్కలు
కలిపితే అందమైన వస్త్రమవుతుంది ‘- ఇది అడిగోపులకి వర్తించే వ్యక్తీకరణ
వీరి కవితల్లో ముక్తాయింపులు ముత్యాల్లా మెరుస్తుంటాయి.
‘ఫిడేలు గానం మనసు నింపుతుంది
కడుపునింపడం లేదు’ అనేది శ్లేషలో చెప్పబడింది.

‘రోజూవారీ కూలీల డొక్కలు శబ్దాలు చేస్తుంటాయి
పాలకై పసిబిడ్డల ఏడ్పులు చందమామని చుట్టుకుంటాయి – ‘

నీతిని మరచిన మనుషులు
అవినీతికి సహచరులు
మనిషిని కొలవడానికి
ఆస్తిని తూకం వేస్తున్నారు
ఆర్జితం నీతా అవినీతా
ప్రశ్నించడం మరుస్తున్నారు!

ముదిమిన సంప్రాప్తించిన చెక్కిలి ముడతలు
బతుకు పుస్తక పాఠాలు – లోహితాస్యులు పాములు కరచి చనిపోతారు
చంద్రమతులు బలిపీఠాలు ఎక్కుతారు
ప్రజాస్వామ్యం తుప్పుపట్టిందని
సప్తాశ్వుడికి కబురుపెట్టండి
ఇది సరికొత్త వేకువ
నిద్రించే వాళ్ళని నిద్రపోనీకండి –

ఇలాంటి మెరుపులు ప్రతీ కవితలోనూ కనిపిస్తాయి.
కొందరికి సాహిత్యం ఒక అభిరుచి, కొందరికి కాలక్షేపం. మరికొందరికి జీవిక. కానీ అడిగోపులకి సాహిత్యం ఒక తపస్సు.
అక్షరాల ఆణిముత్యాలతో ఆయన నిత్యమూ విరామ రహితంగా, మానవత్వ కేతనం పక్కన నింపాదిగా కూచుని రేపటి తరం కోసం వర్తమానాన్ని లిఖిస్తునే ఉంటాడు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సుకవి.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
(చినుకు మాస పత్రిక మే 2012 సంచిక నుంచి)

* * *

రేపటి వర్తమానం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

రేపటి వర్తమానం On Kinige

Related Posts: