మనమెరగని ఘంటసాల జీవితం

ఇంతవరకూ మనకు తెలిసింది ‘ఘంటసాల పాట’ మాత్రమే. ఆ ‘పాట’ వెనక ఉన్న జీవితం మనకు అంతగా పరిచయం లేదు. ఆ జీవితాన్ని, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఘంటసాల కుమార్తె శ్యామల తీసుకువచ్చిన పుస్తకం ఇది. ‘నేనెరిగిన నాన్నగారు‘ అనే పేరు చూడగానే కేవలం తండ్రితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే చెబుతున్నారేమో అనుకుంటాం. కానీ, ఘంటసాల పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఘంటసాల బాల్యం, యవ్వనం, అంచెలంచెలుగా ఆయన ఎదిగిన క్రమాన్ని పాఠకుడి కళ్లు చెమర్చేలా ఎంతో ఆ్రర్దతతో, ఆర్తితో అవలోకించే ప్రయత్నం చేశారామె. కృష్ణాజిల్లాలో పుట్టి, విజయనగరం సంగీత కళాశాలలో చదివి, సినిమాల్లో పాటలు పాడ్డానికి వెళ్లడమే మనందరికీ తెలిసిన ఘంటసాల చరిత్ర. కానీ .. పౌరోహిత్యం జరుపుకునే కుటుంబంలో పుట్టి ఘంటసాల అనుభవించిన కటిక పేదరికం, తోటి పండితుడి చేత అవమానం పాలై సంగీతం అభ్యసించాలన్న పట్టుదలతో ఎవరీకీ చెప్పకుండా మహారాజా సంగీత కళాశాలను వెతుక్కుంటూ విజయనగరం వెళ్లడం, అక్కడ పట్రాయని సీతారామ శాస్త్రి చూపిన ఆదరణ, ద్వారం వెంకటస్వామినాయుడుగారి మెప్పుతో సంగీత కళాశాలలో సీటు సంపాదించడం, పిల్లజమిందారైన సహపాఠి ముద్దు పాపారావు అపూర్వ చెలిమి, ఆకలికి తాళలేక జోలె పట్టి అన్నం అడుక్కున్న తీరు, ఆనాటి దేవదాసి కళావరురింగు సరిదెల లక్ష్మీనరసమ్మ ఇచ్చిన ఆతిథ్యం, నూనూగు యవ్వనంలో స్వాతంత్య్రోదమంలో పాల్గొని జైలు పాలవడం, మేనమామ కూతురు సావిత్రిని పెళ్లాడడం, సముద్రాల రాఘవాచార్య సహకారంతో మద్రాసుకు మకాం మార్చడం … హెచ్.ఎం.వి.రికార్డులకు పాడుతూ కాణీ, అణా సంపాదించడం, తోటి గాయని వక్కలంక సరళ (కాదు సుమా కల కాదు సుమా – కీలుగుర్రం ఫేం)తో పెళ్లికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగడం, తమిళ గాయకుడు సౌందరరాజన్ ‘అన్నా నీవు తమిళంలో పాడితే మాకు బతుకు తెరువు లేదన్నా’ అని మొరపెట్టుకోగానే తమిళంలో పాటలు పాడటం మానేయడం, లేమిలో తనకు సహాయం చేసిన విజయనగరం మిత్రులకు కలిమిలో సహాయం చేసి రుణం తీర్చుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో నాగయ్యకు (లవకుశ) గాత్రదానం చేయడం వెనకున్న కథా కమామిషూ, ఉత్తరాది సంగీత ప్రముఖులు బడేగులాం అలీఖాన్, మహమ్మద్ రఫీలతో అనుబంధం … ఇలా ఎన్నెన్నో సంఘటనలను సేకరించి గుది గుచ్చి అందించారు శ్యామల. ఘంటసాల చనిపోయినప్పుడు పద్నాలుగేళ్ల ప్రాయంలో ఉన్న శ్యామలకు తెలిసింది కొంతే అయినా, తండ్రిపైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో ఎందరెందర్నో కలిసి, తనకు తెలియని తండ్రి వ్యక్తిత్వాన్ని ఆరాతీసి అక్షర రూపం ఇచ్చారామె. పుస్తకం సాంతం చేతిరాతతో ఉన్నా చదవడానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా కదిలించే శైలితో కథనం నడిపిన శ్యామల అభినందనీయురాలు. ఘంటసాల అభిమానులకు ఇదొక అపురూప కానుక.

గొరుసు
ఆదివారం ఆంధ్రజ్యోతి, 7 ఏప్రిల్ 2013

* * *

“నేనెరిగిన నాన్నగారు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
నేనెరిగిన నాన్నగారు On Kinige

Related Posts:

నిర్జన వారధి

నిర్జన వారధి

సమాజంలో మౌలిక మార్పులు కోరే సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమం అనే మూడు ఉద్యమాల వారధి కొండపల్లి కోటేశ్వరమ్మగారు. ఈ మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. “నిర్జన వారధి” కోటేశ్వరమ్మగారి ఆత్మకథ. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది.

* * *

“నిర్జన వారధి” చదవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
నిర్జన వారధి On Kinige

నిర్జీవంగా ఉన్న సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం…. ధారపోశాక చూడ్డానికి వాళ్ళ పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను… సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?

కొండపల్లి కోటేశ్వరమ్మ

నిర్జన వారధి పుస్తకం ముందుమాట నుండి

ఇవీ…నేను అనుకున్నవి
నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ ‘నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం’ అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. ‘సామాన్యుని సాహసమెట్టిదో…’ చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్‌ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు.
జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు.
నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) ‘నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద’ని మరీ మరీ చెప్పారు.
అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను.
నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు.
అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్‌ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది.
స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు.
ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారు. ‘సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని’ కొన్ని సూచనలిచ్చారు బుక్‌ ట్రస్ట్‌ గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు.
ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను.

కొండపల్లి కోటేశ్వరమ్మ

* * *

ఈ పుస్తకం పై కొంతమంది పాఠకుల అభిప్రాయాలు

చదవదగ్గ పుస్తకం, చాలా రోజుల తర్వాత, కన్నీళ్ళు ఆపుకోలేకపోయా….

కృష్ణ ప్రవీణ్

నేనూ చదువుతూ ఉన్నా. ముప్పావు వంతు అయ్యింది. అద్భుతమైన పుస్తకం. ప్రవీణ్ గారికి మల్లే నాకూ కొన్ని చోట్ల కళ్ళలో నీరు, వెంటనే కోటేశ్వరమ్మ గారు తన జీవితాన్ని ఎదుర్కున్న తీరు చూసి బోలెడంత స్పూర్తీ కలిగాయి.

వి. బి. సౌమ్య

పుస్తకం చదివాను. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే కోటేశ్వరమ్మగారి స్వయం ప్రకాశత్వాన్ని అర్థం చేసుకోనట్లు అవుతుంది అయినా ఒక వాక్యం, చదువుతున్నంతసేపూ కన్నీరు వరదలై కారింది, ఆ కన్నీటి ప్రవాహాన్ని కూడా ఆపుకోవాలనిపించలేదు.


చావా కిరణ్

* * *

“నిర్జన వారధి” చదవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
నిర్జన వారధి On Kinige

Related Posts: