మా కామత్ కుటుంబీకుల్ని అందరూ “ఇడ్లి-వడ-సాంబర్” అని సరదాగా ఆట పట్టుస్తుంటారు.

ఉపోద్ఘాతం

సరస్సులో బాతులు ఈదటం చూస్తోంటే ఎంతో అందంగా వుంటుంది. అయితే - యీ ఈదటం కోసం, అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా, ఎంతో బలంగా కాళ్ళు కదుపుతునే వుండాలి. అందమైన జీవితం కోసం కూడా అంతే.

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

మనిషి జీవితం ఒక ప్రయాణం! అందులో ఎత్తులూ ఉంటాయి. లోయలూ ఉంటాయి. అటువంటి ప్రయాణంలో ఒకసారి నాకు ఒక పర్వతం ఎదురైంది. దాన్ని ఎక్కలేక పోయాను. ప్రయాణం ఆపుచేసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఆ సమయంలో నావాళ్లనుకునే వాళ్ళూ, వాళ్ళిచ్చిన ధైర్యం, అందించిన స్నేహహస్తం…. నా ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగేలా చేసింది. ఆ పర్వతం ఎక్కిన తరువాత క్రిందకి తొంగిచూస్తే ఆ బలహీన క్షణాల్లో నా నిర్ణయం ఎంత తప్పో, కారణరహితమో అర్థమయింది.

ఇలాంటి బలహీనమైన క్షణాలు ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి. ఉండక తప్పదు కూడా…! అటువంటప్పుడు సర్వశక్తులు సమకూర్చుకొని, చేసిన పొరపాట్లు గమనించి, మనసు నిబ్బరపరచుకొని ఒక అడుగు ముందుకేస్తే ఆ తరువాత ప్రయాణం మరీ సులువవుతుంది.

“….దట్టమైన చీకట్లో నీవు ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక చోట దీపం ఆరిపోవచ్చు. అంతా చీకటే…! క్రిందేముందో నీకు తెలియదు! అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా అడుగు ముందుకువెయ్యి. రెండు విధాలైన పరిణామాలు సంభవించవచ్చు. ఒకటి: క్రింద మెట్లు తగలవచ్చు. రెండు: గాలిలో ఎగరటం ఎలాగో నీకు తెలిసిరావచ్చు!

ఎంత అద్భుతమైన సూక్తి ఇది! ప్రయాణం ఆపు చేసి చీకట్లో బిక్కు బిక్కు మంటూ కూర్చోవటం కంటే అడుగు ముందుకు వేయటమే మంచి కదా!

నా జీవితంలో అటువంటి దురదృష్టకరమైన నిర్ణయానికి కారణం నా చిన్నతమ్ముడికి నాకు మధ్య జరిగిన గొడవ…! నా శత్రువులతో నా తమ్ముడు కలిసి, నాకు వ్యతిరేకంగా చేసిన గూడుపుఠాణీలో సర్వనాశనం అయ్యాను. నా చేతిలో చిల్లిగవ్వ లేకుండా, ఏ విధమైన సహకారమూ ఎవరినుంచి లభించకుండా, నా వాళ్ళందరూ నన్నొదిలేసిన స్థితిలో నా స్నేహితులు కొంతమంది నన్ను ఆదుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా నేను నమ్మిన భగవంతుడు !!

మీలో ఎంతమందికి ఇంత పెద్ద కష్టం వచ్చి ఉంటుంది? ప్రతివాళ్ళకీ తనకు వచ్చిన కష్టం కన్నా పెద్ద కష్టం ఇంకొకటి లేదుఅనే ఫీలింగ్ ఉంటుంది. నేనొప్పుకుంటాను. కానీ ఆత్మహత్య చేసుకోవాలిఅన్నంత పెద్ద సమస్య జీవితంలో ఎప్పుడో గానీ రాదు. కొందరికి అసలు రాదు.

అన్నీ అనుభవిస్తూ, భార్యాపిల్లలతో సుఖంగా ఉంటూ జీవితం ఇంత సంతోషకరంగా ఉండగలదాఅన్నస్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారుమేఘాలు కమ్మి, ఊహించని రీతిలో తుఫాను వస్తే ఆ పరిస్థితి తట్టుకోవటం కష్టం! నా జీవితంలో అలాగే జరిగింది….! కొన్ని రోజులపాటు నిరాశా నిస్పృహలతో మనసు కొట్టుమిట్టులాడింది. అయితే నాలోని ఆశావాదం నన్ను రక్షించింది. దాని గురించి మీ అందరికీ చెప్పాలన్న తపనే ఈ పుస్తకం.

ఆర్థికంగా పైకి లేవటం, పడిపోవటం మనుష్యుల్లోనే వుంటుంది. జంతువుల్లో స్థాయీ భేదాలుండవు. అంతా కోల్పోయినా సరే, జీరోబేస్డ్ స్థాయి నుంచి జీవితాన్ని పునఃప్రారంభించే శక్తి, భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. కావలసిందల్లా కాస్త పట్టుదల, దీక్ష, శ్రమ మాత్రమే….!

* * *

నా తల్లి వంట అద్భుతంగా చేస్తుంది. ఇంత వృద్ధాప్యంలో కూడా ఆమె చాలా రుచికరమైన ఇడ్లీలు ఓపిగ్గా చేసి పెట్టడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉత్సాహం ఉన్నచోట వయసుపైబడినా శక్తి దానంతట అదే పుట్టుకొస్తుందిఅని చెప్పటానికి మా అమ్మే ఉదాహరణ. మా ఇంట్లో, మా లొకాలిటిలో, మా బంధువుల ఇళ్ళలో, ఆమె వండిన ఇడ్లీలకోసం ఈ రోజుకి మేమందరం పడిచస్తామంటే అతిశయోక్తి లేదు. తన దగ్గర నుంచే నేను రుచికరమైన ఇడ్లీలు తయారు చేయటం నేర్చుకున్నాను.

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

స్కూటర్ రిపేర్ చెయ్యదల్చుకున్న కుర్రవాడు మెకానిక్ దగ్గర చేరి ఆ విద్య నేర్చుకుంటాడు. బిజినెస్ మాగ్నట్ అవ్వదల్చుకున్న యువకుడు వ్యాపారంలో ట్రైనింగ్ పొందుతాడు. నీ విద్యలో నీవు ఎంత గొప్పవాడవవుతావుఅనేది నీకు నేర్పేవాళ్ళ మీద, నేర్చుకోవాలనే నీ తపన మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నేను సగర్వంగా ఒక మాట చెప్పగలను. ఇడ్లీ తయారుచేయటంలో నేను తల్లి దగ్గర చాలా గొప్ప అప్రెంటిస్‌గా పనిచేసి ఆ విద్య నేర్చుకున్నాను. మొత్తం యూరోపియన్ దేశాల్లో ఈ రోజు ఇడ్లీ ఇంత పాపులర్ అయ్యిందంటే దానికి కారణం నా తల్లి దగ్గర నేను నేర్చుకున్న విద్య అని కూడా సవినయంతో కూడిన గర్వంతో చెప్పగలను. దానికి నేను ఇండియన్ రైస్ పుడ్డింగ్అని పేరుపెట్టాను.

దానిలో కొబ్బరి వాడే చట్ని కోకోనట్ సాస్అన్నాను. తూర్పు దేశాల్లో మనలాగా రెండు ఇడ్లీలతో సరిపెట్టరు. దాదాపు అరడజను ఇడ్లీలు తింటారు. ఇది నాకు సంతోషంతో కూడిన ఉద్వేగాన్ని కలిగించే విషయం. మన ఆహారాన్ని వాళ్ళకు అలవాటు చెయ్యగలిగాము అన్న సంతృప్తి.

మా కామత్ కుటుంబీకుల్ని అందరూ ఇడ్లి-వడ-సాంబర్అని సరదాగా ఆట పట్టుస్తుంటారు. కానీ ఆ చిన్న ఇడ్లీయే ఈ రోజు నన్ను ఆసియా దేశపు మొట్టమొదటి అత్యంత అధునాతన వాతావరణ స్నేహపూర్వకమైన (ENVINONMENTAL FRIENDLY) హోటల్‌కి యజమానిని చేసింది అన్న విషయాన్ని నేనెలా మరువగలను? అందుకే నా జీవిత చరిత్ర తెలియజేసే ఈ పుస్తకానికి పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ఇడ్లీని కూడా అందులో చేర్చాను. మనుష్యులకు కృతజ్ఞతలు చెప్పటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నాకు సాయపడిన ఇడ్లీ, వడలాటి వస్తువులకు కృతజ్ఞత చెప్పే మార్గం ఏముంటుంది? ఒక మనిషి ఏ అట్టడుగు స్థాయి నుంచైనా ఆకాశపుటంచులకు చేరుకోగలడు అని చెప్పే విజయగాథలు చరిత్రలో చాలా వున్నాయి. అలాటి వాస్తవ కథల్లో ఇది కూడా ఒకటిగా చేరుతుందని విశ్వసిస్తున్నాను. ఆరువందల కోట్ల విలువచేసే ఆ ఆర్కిడ్ హోటల్కి పునాది ఇడ్లీ. అందుకే ఈ కథకి ఇడ్లి - వడ - ఆకాశంఅని అర్థం వచ్చేలా పేరు పెట్టాను.

నేను రచయితను కాను. ఈ పుస్తకం వ్రాయటంలో ఎడిట్ చేయటంలో చాలామంది స్నేహితులు నాకు సహాయపడ్డారు. నేను కేవలం హోటల్ వాలాని మాత్రమే. ఇదంతా ఒక వరుసక్రమంలో వుండదు. ఉన్నట్టుండి, ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. అది వ్రాసేయటం జరుగుతుంది. పుస్తకమంతా ఆ విధంగానే కొనసాగుతుంది.

ఈ పుస్తకం పూర్తయిన తరువాత నాకు తెలిసిందేమిటంటే హోటల్ మేనేజ్‌మెంట్ ఎలాగో, పుస్తకం వ్రాయటానికి కూడా అంత భగీరథ ప్రయత్నం కావాలని! మీరీ పుస్తకం చదివిన తరువాత మీ అభిప్రాయాన్ని వ్రాస్తే సంతోషిస్తాను.

- విఠల్ వెంకటేష్ కామత్

E-mail : vithalkamat@orchidhotel.com

To read this book visit Kinige.com now.

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

Related Posts: