‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం గారి అభిప్రాయం చదవండి.

* * *

జీవితంలో కనిపించని అర్థమే ‘కనిపించని ద్వారం’ కథ. నారాయణ జీవితాన్ని గూర్చి వేసిన ప్రశ్న “ఎందుకు?” దానికి సమాధానం ‘కెరటాల హోరులో అపస్వరాల అలజడిలో, లోన, లోలోన నిశ్శబ్దం’ అది ఒక రకం సమాధానమే కాని, నారాయణలాంటి వాళ్ళు కోరే ‘అర్ధవంత’మైన సమాధానం కాదు. అందుకే రెండవసారి ప్రశ్నిస్తాడు: “ఎందుకు!” – అప్పుడే విరిగి బద్దలయిన కెరటం, రాయి చుట్టూ. సుడి తిరిగింది రాయి చుట్టూ, ఆహ్వానిస్తూ, తెల్లటి కుచ్చిళ్ళు రాయి చుట్టూ పరిచి, తల్లి మారాము చేసే పిల్లవాణ్ణి ఒడిలోకి ఆహ్వానించినట్లు. కాని నారాయణ గడుగ్గాయి. మళ్ళీ మూడోసారి “ఎందుకూ?” అని అరిచాడు.- ‘శబ్దం గొంతుకలోంచి, యూస్టేషియన్ నాళాల్లోంచి, చెవుల్లోకి, మూయబడిన చెవుల్లోకి వెళ్ళి ప్రతిధ్వనులు వెతుక్కుంది’. కోపంగా ‘తంతాను… పో అని ఎడమకాలు ఎత్తి, విసురుగా ముందుకు విసిరి…. గెంతేడు నవ్వే కెరటపు హోరులోకి’ అది నారాయణ అంతం.

గోపీచంద్ వ్రాసిన ‘అసమర్దుని జీవయాత్ర’లో సీతారామారావు అంతం యిటువంటిదే! ‘ఎందుకు?’ అనే ప్రశ్న నేర్పినందుకు నాన్న గారికి అంకితం యీ నవల అన్నాడు గోపీచంద్. ఈ కథలో నారాయణ మీద తండ్రి ప్రభావం చాలా వుంది. తండ్రి మీద ద్వేషమా? అని ప్రశ్నించుకుంటాడు తండ్రి మరణం తర్వాత వారసుడుగా యింటికి తిరిగి వచ్చిన యేకాకి నారాయణ. ద్వేషం కాదు, తండ్రి వ్యక్తిత్వానికి – ఆయన తీపి మాటలు, పాప్యులారిటీ, హ్యూమర్, వైటాలిటీకి – తన వ్యక్తిత్వం, అడుగడుగునా ‘ద్రోహం’గా నడిచిన తన జీవితం, ఒక ‘రియాక్షన్’ కాబోలు అనుకుంటాడు! ఆ సమాధానం రుచించదు. సిగార్ పెట్టెలో సెల్లోఫెన్ కవర్ ఉన్న సిగార్ తన జాగాలో తాను ఉన్నది. సెల్లోఫేన్ కవర్ లేని సిగార్ అడ్డంగా ఉన్నది, మొదటి సిగార్ తన తండ్రి వ్యక్తిత్వం, జీవితం, రెండోది తనది! సమాజంలో యిమిడిన జీవితం ఆయనది, యిముడని జీవితం తనదీ! హృదయగతంగా తండ్రికి తనకూ గల ఈ తాదాత్మ్యం తెలిసిరాగానే వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడే అతనిలో ‘యేదో’ తెగింది, దాక్షిణ్యం లేకుండా తెగింది. ఏమిటీ తెగింది? జీవితం తోటి బంధం. తండ్రి మరణం నారాయణ జీవితాన్ని అర్థశూన్యం చేసి, నిస్పృహలోకి తోసివేసింది. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుంటాడు. అద్దంలో చూచుకుంటే తన కళ్ళలో నిస్పృహ. ‘మంచం లేని ఖాళీ జాగా’ అంటే తండ్రి మృతి ఏర్పరచిన ఖాళీ జాగా, నారాయణ అన్వేషణలో కీలకమైనదిగా గుర్తించాలి. గత జీవితాన్ని ఎంత తిరగవేసినా, ఆ ఖాళీ జాగా పూరించే స్థితి లేకపోవడమే నారాయణ ఆత్మ హత్యకు, కథ ముగింపుకి కారణమవుతున్నది.

గోపీచంద్ ఒక నవలలో విడమర్చిన యితివృత్తాన్ని త్రిపుర ఒక కథలో కుదించారు. నారాయణ అసమర్థుడు కాడు. జీవితంలో సమర్థుడే. కాని తండ్రి తోటి అనుబంధమే అతని జీవితాన్ని నడిపించడం వల్ల, తండ్రి మృతి కలిగించిన అస్తిత్వసంక్షోభం (Existential crisis) అధిగమించరానిదై ఆత్మహత్యకు దారితీసింది. నారాయణకు జీవితంలో మరో వ్యక్తితో ( ప్రేయసి, స్నేహితుడు) ప్రేమానుబంధం ఏర్పడి నట్లయితే ఈ సంక్షోభాన్ని అధిగమించే ‘ద్వారం’ లభించివుండేది. కాని అటువంటి అనుబంధం యేర్పడని విధానంలో,(ద్రోహం చెయ్యడంలో తెలివినీ ఆధిక్యతనూ నిరూపించుకోవడమే లక్ష్యంగా) అతని జీవితం నడవడం వల్ల ఈ సంక్షోభం వచ్చినప్పుడు అతణ్ణి రక్షించే సాధనం లేక పోయింది. అతనికి ‘ద్వారం’ కనిపించలేదు. ఆ ద్వారం ప్రేమ. జీవితానికి అర్థాన్ని హేతువాదం కాదు, ప్రేమే యివ్వగలదు!

ఆర్. ఎస్. సుదర్శనం

త్రిపుర కథలు On Kinige

Related Posts: