నిజానికివి వేట కథలు (పర్యావరణ కథలు – సమీక్ష)

ప్రఖ్యాత కన్నడ రచయిత కువెంపుగారి కుమారులైన పూర్ణచంద్ర తేజస్వి అనతికాలంలోనే తన రచనల ద్వారా తండ్రిని మించిన తనయుడిగా పేరుపొందారు. పూర్ణచంద్ర తండ్రి ప్రభావం తనమీద పడకూడదన్నట్లుగా రామమనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణగార్ల సమాజవాద సిద్ధాంతాల ఆకర్షణకు లోబడి కులాంతర వివాహం చేసుకుని రైతుపోరాటాల్లో ముఖ్యపాత్ర నిర్వహిస్తూ, ఘోరారణ్యం చెంతన పొలం కొని కాఫీ ఎస్టేట్‌గా దాన్ని మలచి ఎక్కువ శాతం తన హాబీలైన ఫోటోగ్రఫీ, పరిసర అధ్యయనం, భూమిపుత్రుల జీవితాలు, సంగీతం, చిత్రలేఖనం, మొదలైన వాటిలో మునిగి వీలు కుదిరినప్పుడు రచనల్ని చేస్తుండేవారు. కాఫీ ఎస్టేట్ వేసేందుకు వచ్చిన రచయిత తుపాకీ భుజం మీద వేసుకుని రోజంతా టామీ అనే కుక్కతో అడవిలో శికారు చేయడం దినచర్యగా మారింది. అలా అక్కడ ఉంటూ అడవితో పొందిన అనుభవాల్ని ఇలా కథల రూపంలో అందించారు.
మలైనాడులోని అడవి, వన్యప్రాణులు, వేట గురించిన ఆసక్తికరమైన విషయాలను ఈ కథల్లో రికార్డు చేశారు. ఇందులో రచయిత అతని వద్ద పనిచేసే ప్యారడు, మారడు, టామీ అనే పెంపుడు కుక్క ప్రధాన పాత్రలుగా ఈ కథనాలు కొనసాగుతాయి.

ఒక రాత్రి అడవిలో మొరుగుతున్న టామీ అరుపులు విని వెళ్ళిన రచయితకు, అది ‘ఉడుం’తో చేస్తున్న పోరాటం కనిపిస్తుంది. ఆ ఉడుంను పట్టుకుని తాడుతో చెట్టుకి కట్టివేస్తే, అది పాక్కుంటూ చిటారు కొమ్మను చేరుకుంటుంది. తాడుతో దాన్ని ముగ్గురు గుంజినా కిందపడదు. దాంతో ఉడుం పట్టు అంతే ఏమిటో తెలిసివస్తుంది. ఈ కథలో ఉడుం జీవన విధానం గురించి, దానికి సంబంధించిన ఎన్నో విశేషాల గురించి సందర్భోచితంగా వివరిస్తారు. “టామీతో ఒకరోజు” కథలో ఇంగ్లీష్ రీడరిఅన మిత్రుడొకరు శ్రీరామ్‌తో కలసి అడవికి వేటకెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించారు. అడవి జంతువులు విపత్కర పరిస్థితులలో అసాధారణంగా మసలుకుంటాయనీ వాటి గురించి, వాటి “దెయ్యం కోడి” లో చూడవచ్చు. ప్రతీ వేసవిలో రచయిత ఇంటివద్ద ఎదురయ్యే పాముల నుంచి ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. ఒక వేసవిలో నాగుపాము సృష్టించిన భయోత్పాతాన్ని, దాన్ని చివరకు ఎలా పట్టుకున్నారో ఆసక్తికరంగా వివరించే కథ “కాళప్పగారి కోబ్రా”. అయిదు గ్రామాలను పీడించే కోతుల సమస్య గురించి చర్చించిన కథ “గాడ్లి”. రామలక్షమ్మగారి తోట మేనేజర్‌గా పనిచేస్తున్న గాడ్లి కోతులను పారద్రోలడానికి పడిన పాట్లను, ఆయన భంగపాటును ఈ కథ వివరిస్తుంది. ఒక్కొక్క వన్యప్రాణికి ఒక్కొక్క రకమైన విచిత్ర రక్షణ తంత్రం ఉంటుంది. కప్పలు, తాబేలు, అడవిపంది అవలంబించిన రక్షణ విధానాలు “చెరువు ఒడ్డున” గమనిస్తున్న రచయిత దృష్టి నుండి తప్పించుకోలేకపోతాయి. దెయ్యాలు ఉన్నాయో లేవో తేల్చడానికి స్మశానికి వెళ్ళివస్తుండగా, చిన్న గజ్జి కుక్కపిల్ల వెంటబడుతుంది. దెయ్యమే ఆ రూపంలో వస్తుందని, దాన్ని వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది వెంటబడడాన్ని “మాయామృగం”గా వర్ణిస్తారు. అనేక సందర్భాలలో ప్రాణులు మరియు వృక్షాలకు సంబంధించిన ఎన్నో కథలు నిదానంగా జనం మనస్సుల నుంచి తొలగిపోయినా, అప్పుడప్పుడు వాటి మీద కలిగే ఇష్టాయిష్టాల నుంచి అవి జనం మనసులో అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఏదో కథలోని దృష్టాంతం నిరూపణగా లేకపోయినా, కొన్ని జంతువుల నడవడిక మీద ఏర్పడే దురభిప్రాయాలు అలాగే ఉండిపోతాయని అనేక ఉదాహరణలో వివరించిన కథ “సైతాన్ నుంచి ప్యారడికైన నష్టం”, “సుస్మిత మరియూ చిన్న పక్షిపిల్ల” కథలు పక్షుల ఫోటోలు తీయడం ఎంత కష్టమో, వాటిని సాకడం కూడా అంతే కష్టమని రచయిత తన అనుభవాలతో వివరిస్తారు. “ఔషద తీగ”, ఇదొక విచిత్రమైన మూలికాతీగ కథ. అడవిలోని దట్టమైన పొదలలో కనిపించే ఈ తీగ అవసరమైన వారికి ఓ పట్టాన కనిపించదు. ఈ తీగ గురించి ఉండే అబద్ధాలు, నిజాలు, కల్పనలోని కథలు…. వీటన్నింటి గురించి రచయిత చేసిన సత్యాన్వేషణే ఈ కథగా రూపొందింది.

ఈ కథలన్నీ అడవి – అటవీ సంపద, వన్యమృగాలపై ఆధారపడిన ప్రజల అవసరాలు, అనుభవాలను తెలియజేస్తాయి. రచయిత వీటిని పర్యావరణ కథలన్నారు. కానీ నిజానికివి వేట కథలు. వేటగాడిగా రచయిత అడవిలోని పరిస్థితులు, వన్యప్రాణుల ప్రవర్తనను విశ్లేషిస్తారు. ఆయన చేసిన పరిశీలనలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పనివాళ్ళల్లో, గ్రామాల్లో వున్న మూఢవిశ్వాసాను హేతువాద దృష్టితో నిగ్గుతేల్చి అసలైన సత్యాన్ని తెలుసుకుంటాడు. సంచార జాతుల వాళ్ళయిన “మాస్తి మరియు బైరడు” వేట నైపుణ్యాలను పరికించినప్పుడు, అల్లం శేషగిరిరావు, డిబింగాడు తప్పకుండా జ్ఞాపకం వస్తారు. కన్నడంలో ఈ పుస్తకం 16సార్లు పునర్ముద్రణకు నోచుకుందట. ఈ పర్యావరణ కథలు కర్నాటకలో ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకూ ఆయా తరగతుల భాషానైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలుగా పెట్టారు. ప్రముఖ అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నిద్రాణమైన ఈ కథలను సంపాదించి, అనువదించి తెలుగువారికి అందిస్తున్నారు. అనువాదం చాలా బాగుంది.

కె.పి. అశోక్ కుమార్
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. అంతేకాదు, ఈ కథల సంకలనం ప్రింట్ బుక్‌ని ఇప్పుడు కినిగె ద్వారా తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పర్యావరణ కథలు On Kinige

Related Posts:

పూర్ణచంద్రతేజస్వి “పరిసర కతెగళు” (పర్యావరణ కథలు) : ఓ పరిచయం

మీ చెప్పులను ఎప్పుడైనా కుక్కలు ఎత్తుకెళ్ళాయా? పల్లెటూళ్ళతో మీకు సంబంధం ఉంటే తప్పనిసరిగా ఈ అనుభవం ఎదురయ్యే వుంటుంది. అయితే వాటి బారిన పడకుండా మీ చెప్పులను రక్షించుకోవాలంటే ఏంచెయ్యాలి? ఎడమ చెప్పు కుడివైపునా , కుడిచెప్పు ఎడమవైపునా ఉంచండి. కుక్కలు వాటివైపు వెళ్ళవు. ఎందుకంటారా? అవి దెయ్యం కాలిజోళ్ళని భయపడతాయి. నమ్మబుద్ధవటంలేదా? పూర్ణచంద్ర తేజస్వి అనే ప్రఖ్యాత కన్నడ రచయిత రాసిన ‘పరిసర కతెగళు’ అన్న కన్నడ కథాసంపుటాన్ని తెలుగుచేసి శాఖమూరి రాంగోపాల్ గారు అందించిన ‘పర్యావరణ కథలు‘ చదవండి. అందులో మరడు ఈ సత్యాన్ని శాస్త్రీయదృష్టిగల తేజస్విగారి ముక్కు పట్టుకుని మరీ చెపుతాడు. ఆయన మన చెవి పట్టుకుని ఆ వైనాన్ని ఓ కథచేసి వినిపిస్తాడు.
ఉడుంపట్టు అనటం వినీ ఉంటారు, అనీ ఉంటారు. ఆ పట్టు ఎలాంటిదో ఎంతటిదో మీరు చూసి ఉండరు. అది కళ్ళకు కట్టినట్టు, మనసుకు ‘ఉడుంపట్టు’ పట్టేటట్టూ చెపుతారు తేజస్వి.
కోతులు వచ్చి ఇళ్లమీదా, దొడ్లమీదా పడి నానాయాగీ చేస్తే మీరేం చేస్తారు? వాటిని చంపెయ్యాలనుకుంటారు. అయితే అవి దైవస్వరూపాలు గదా ఎలా చంపుతాం అంటాడు గాడ్లీ. పాపం ఆ మానవుడు అందుకోసం నానాపాట్లూ పడి ఓ బోను తయారుచేస్తాడు. దానితో వాటిని పట్టుకుని తీసుకువెళ్ళి అడవిలో వదిలెయ్యాలని అతగాడి పథకం. పట్టుకుంటాడు. దైవస్వరూపాలు గదా. అందుకోసం వాటికి తిండి ఏర్పాట్లు చేస్తాడు. తీరా తీసుకువెళ్ళి బోను తెరిస్తే, తిండి మరిగిన ఓ కోతి బయటకు వెళ్ళదు. దానిని బయటకు తరమటానికి తను బోనులోకి వెళ్ళేసరికి పొరపాటున అందులో చిక్కుకుపోతాడు. ఆ గాడ్లీ కథ వింటారా అయితే తేజస్విగారి స్వానుభవాలతో నిండి ఈ ‘పర్యావరణ కథలు’ చదవండి.
పర్యావరణం అన్న పదం తెలుగులో ప్రస్తుతం చెలామణీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పదం ఒకటి రెండు దశాబ్దాలుగా వినపడుతోంది. ఈ పదం వ్యక్తంచేసే అంశంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వన్యజీవుల అంతర్ధానం, వన్య జీవిత విధ్వంసం అందులో ఒకటి. మన అనుభవజ్ఞులైన ప్రాణుల అంతర్ధానానికి కారణం మానవులమైన మన అత్యాశ. మానవీయ దృష్టితో చూచినా, మన బాగుకోసమే అని గ్రహించినా అవి అంతరించిపోకుండా మనం జాగ్రత్త పడాలి. పౌరులు తమ ప్రభుత్వాలనూ, దేశాలు ధనిక దేశాలనూ ఒత్తిడి చేసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నద దీని సారాంశం. వనాలు కొట్టివేసి వానలను తగ్గించి, తద్వారా ఉష్ణోగ్రతలలో మార్పులకు కారణమవుతున్నాం. హానికర రసాయనాల వినియోగంతో మరింత వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాం. పర్యావరణం అనగానే ఈ అంశాలు, వాదనలూ, వివరణలూ మనలో కదులుతాయి. ఈ పుస్తకం శీర్షిక వాటిని ఎంతోకొంత గుర్తుచేస్తుంది. దీనివల్ల పుస్తకానికి అదనపు అమ్మకపు విలువ చేరుతుందా లేక ఆ దృష్ట్యా చదవాలనుకునే వారికి అసంతృప్తి కలిగిస్తుందా అనేది ప్రశ్నార్థకం.
పోతే- కన్నడిగుల రాష్ట్రకవిగా గౌరవింపబడే కువెంపుగారి కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి. 1938లో పుట్టిన వీరు 2007లో కీర్తిశేషులయారు. కవిత్వం, కథ, నవల, నాటకం, యాత్రాసాహిత్యం, అనువాదాలు, విమర్శ, శాస్త్ర -కల్పన (scientific fiction) వంటి అనేక ప్రక్రియలలో సాహిత్య కృషిచేశారు. “అబచూరిన పోస్టాఫీసు” అన్న వీరి కథా సంపుటాన్ని కన్నడ ప్రగతిశీల (progressive) సాహిత్యానికి ఆరంభంగా భావిస్తారు. ఈ పేరుతోనూ, “తబరినకతె” అన్న పేరుతోనూ విడుదలైన సినిమాలు అనేక పురస్కారాలు అందుకున్నాయి. ఈయన చదువు ముగించుకుని లోహియా ప్రభావంతో వ్యవసాయం చేయటానికి పశ్చిమ కనుమలలో తేయాకు తోట కొని వ్యవసాయం చేశారు. అక్కడి అనుభవాలతో తను పరిసరాల ప్రేమికునిగా మారానని, ఆ మారిన విధానాన్ని ఈ కథలలో అర్థంచేసుకోవచ్చని తేజస్వి తన పుస్తకంలోని మొదటి రచనలో ఇలా చెపుతారు. “నేను చెప్పే చిన్నా, చితకా నా స్వంత అనుభవాలలోని సంఘటనలకు, పర్యావరణంకు ఏదో సంబంధాన్ని నేరుగా చూపించలేనండి! అయితే నా బతుకు బాటలో ఇది (ఈ రాతలు) నేను నడచివచ్చిన దారి అని మాత్రం చెప్పగలనండి”. వానలమయమైన పశ్చిమ కనుమలలోని ఓ కుర్రవాని దృష్టినుండి చెప్పిన తొలి కథతోనే రాజ్యోత్సవ పురస్కారం అందుకుని తండ్రి ఛాయనుంచి బయటపడిన తేజస్వి ఈ కథా సంపుటం పదహారు ముద్రణలకు పైగా అమ్ముడుపోయింది “కర్వలు” అనే వారి నవల 26 ఏళ్ళు గడిచినా ప్రతివారం అమ్ముడుపోయే తొలి పది పుస్తకాలలో ఒకటి అంటారు.
ఈ సంపుటంలోని కథలలో పాత్రలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మనలని పాత్రలకు, కథా వాతావరణానికీ అలవాటు చేస్తుంది. తెలియని విషయాలపట్ల, వ్యక్తుల పట్ల, జీవిత వివరాల పట్ల మనలో ఓ పీపింగ్ టామ్ ఉంటాడు. తేజస్వి దీనిని చక్కగా వాడుకుంటారు. సాహసాలు, అడవులు, వేట వంటి వస్తువులతో తెలుగులో కథలు రాకపోలేదు. ఈ వాతావరణంతోనే మనకు సి.రామచంద్రరావు ఇంతకన్న నేర్పరితనంతో కథలు చెప్పారు. వేట ఇతివృత్తంగా పూసపాటి కృష్ణంరాజు, పతంజలి, అల్లం శేషగిరిరావు వంటి వారు రాసారు. ఏమైనా ఈ పుస్తకంలా అవి పదహారు ముద్రణలు పొందలేదని మనం ఒప్పుకోవాలి. పుస్తకాలు కొని చదవటంలోనూ, మంచి రచయితలకు తమ సృజనతో కడుపు నింపుకునే అవకాశం ఇవ్వటంలోనూ, కన్నడిగులు మనకన్న చాలా ముందున్నారన్నది మనం తలొంచుకుని ఒప్పుకోవలసిన విషయం. కనీసం ఈ పుస్తకం విషయంలోనైనా మనమీదున్న ఈ చెడుపేరు తప్పించుకోటానికి దీనిని కొని చదువుదాం. తెలుగులో మనం చదవాలన్న ఆశతో దీనిపై కాలాన్నే కాక ధనాన్ని వెచ్చించిన శాఖమూరి రాంగోపాల్ గారికి కొని, కృతజ్ఞతలు చెపుదాం.
ఈ పుస్తకం అనువాదం గురించి కూడా ఓమాట అనుకోక తప్పదు. కథా వాతావరణానికి భాష అమిరినా, చదువుకోటానికి కాస్త అడ్డుపడుతుంటూనే ఉంటుంది. కొన్ని కన్నడ పదాలు ప్రతిభటన (ప్రతిఘటన) వంటివి వాడకుండా ఉంటే బాగుండేది.
అలాగే దాదాపు అన్ని కథల వెనుకా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీనుండి నిద్రాణమైన కథలు అనటం సరిగా లేదు 16 ముద్రణలు పొందిన కథాపుస్తకాన్ని వెతికి తీసాననటం అనువాదకుని కృషిగా చెప్పవచ్చుగాని, పుస్తకానికి శోభనివ్వదు.

వివిన మూర్తి
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

” పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పర్యావరణ కథలు On Kinige

Related Posts:

కృష్ణారెడ్డిగారి ఏనుగు

ఈ కథా సంకలనం కన్నడంలో వివిధ రచయితలు రాసిన కథలకు అనువాదం.

కన్నడ సాహిత్యరంగంలో సుప్రసిద్ధులైన పూర్ణచంద్ర తేజస్వి, శాంతరస, నాగమంగల కృష్ణమూర్తి, కూదవళ్ళి అశ్వత్థ నారాయణరావ్, కుం. వీరభద్రప్ప, ఆర్.టి. శరణ్, ఎస్. తమ్మాజిరావ్, కె. సత్యనారాయణ, హెచ్. రమేష్ కెదిలాయ, ఎ. ఆర్. కృష్ణశాస్త్రి, గోరూర్ రామస్వామి అయ్యంగార్, కు.వెం.పు వంటి సుప్రసిద్ధ కథకులు రచించిన ఈ కథలను తెలుగులోకి హృద్యంగా అనువదించారు శాఖమూరు రామగోపాల్ గారు.

ఈ సంకలనంలోని కథలు కాలాలీతమైనవని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కథలలోని పాత్రలు, పాత్రల జీవితాలు, వారి వ్యక్తిత్వాల వర్ణన గ్రామీణ ప్రాంతాలలోని సొగసులతో మమేకమై సహజత్వాన్ని సంతరించుకున్నాయని ఆయన అన్నారు.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

కృష్ణారెడ్డి గారి ఏనుగు: ఇది పెద్ద కథ. మూడిగెరె పట్టణంలో రకరకాల వ్యాపారలు చేసి అన్నిరకాలుగా నష్టపోయిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి మఠం వారి నుంచి ఓ ఏనుగుని కొంటాడు. జనాలందరూ నవ్వుకుంటారు. ఇప్పటికే దెబ్బతిని ఉన్నాడు, దీంతో పూర్తిగా నాశనం అయిపోతాడని అనుకుంటారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతుంది. అడవిలోని పచ్చిక, జొన్నపిండి, బెల్లం ముద్దలు, చెరకు గడలు, అరటి గెలలు, చిలకడదుంపలు…వంటి వాటితో ఏనుగుకి మంచి ఆహరం అందిస్తాడు కృష్ణారెడ్డి. ఏనుగు చెట్లను లాగి తెచ్చిన డబ్బుతో కృష్ణారెడ్డి కాస్త ఆర్ధికంగా కోలుకుంటాడు. అయితే ఈ ఏనుగువల్ల ఆ ఊర్లో చాలా మంది రకరకాల సమస్యలని ఎదుర్కుంటారు. కరెంటోళ్ళు, టెలిఫోన్ వాళ్ళు, ఫారెస్టు వాళ్ళూ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్ల వాళ్ళు ఆ ఏనుగు మీద ఎన్నో అభియోగాలు మోపుతారు. దాన్ని ఎలాగైనా పంపించేయాలని అనుకుంటారు. చివరికి ఏమవుతుందనేది ఆసక్తిదాయకం.

ఒకరూపాయి: ఎప్పుడూ గంభీరంగా ఉంటూ, మఠంలో ఉండి చదువుకునే ఓ వ్యక్తి కథ ఇది. మిగతా విద్యార్థుల కంటే బసవణ్ణకి సాహిత్య జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం అధికం కావడం వలన అతనికి ఆ ఊర్లో ఎంతో గొప్ప పేరొస్తుంది. ఎన్నో సమావేశాలలో పాల్గొని ప్రసంగాలిస్తూంటాడు బసవణ్ణ. ఓ రోజు తనది కాని సొత్తుకి ఆశపడి సొంతం చేసుకుంటాడు బసవణ్ణ. కానీ అతని మనసు అతన్ని ఊరుకోనీయదు. చివరికి ఆ డబ్బు తీసింది తానేనని నిజం ఒప్పుకున్నా ఎవరూ నమ్మరు. తల తీసేసినట్లయిపోతుందతనికి.

వ్యభిచారం: ఓ సేట్‌జీ జనాలనీ దోచీ, సరుకులని అధిక ధరలకి అమ్మిన డబ్బునంతా పెద్ద నోట్ల రూపంలో దాచుకుంటాడు. ఇంతలో ప్రభుత్వం వారు నల్లధనాన్ని అరికట్టే నిమిత్తం పెద్ద నోట్ల డినామినేషన్‌ని రద్దు చేస్తుంది. వాటిని చిన్న నోట్లుగా మార్చుకునేందుకు కొంత గడువిస్తుంది. ఓ లాయర్ సాయంతో తన డబ్బుని చిన్న చిన్న మొత్తాలుగా మార్చుకోవాలనుకుంటాడు. లాయర్ ఓ వ్యభిచారి చేతికి నోట్ల కట్టలిచ్చి, ఆమెని బ్యాంకుకి పంపిస్తాడు. ఒళ్ళమ్ముకుంటే అంత డబ్బు వస్తుందా అని అక్కడి అధికారులు ఆశ్చర్యపోయినా, చిన్న నోట్లు ఇస్తారు. తీరా ఆమె ఆ డబ్బుని సేట్‌కి ఇవ్వకుండా పారిపోయి తన సొంతూరికి ప్రయాణమైపోతుంది. ఆ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నామెని అడిగితే, “మీ వల్లే ఆమె తప్పించుకుపోయింద”ని అంటూ, “వ్యాపారంలో వ్యభిచారం చేసి సంపాదించింది నిజమైన వ్యభిచారికే చేరింది…” అని అంటుంది.

వరాహపురాణం: ఈ కథ పందుల పెంపకం చేపట్టే ఎరుకల వారి గురించి రాసినది. మూలకథని 1982లో రాసినా, అటువంటి పరిస్థితులు నేటికీ మన గ్రామ సీమలలో కనపడుతునే ఉంటాయి.

కాంచన రథం: భీమాపూర్‌లో రావ్ సాహెబ్ ఓ జమీందారు లాంటి వాడు. విఠలుడికి భక్తుడు. అతని ఇంట్లో ఓ బంగారు రథం ఉండేది. పర్వదినాలలో దాన్ని ఊరంతా తిప్పి ఊరేగించేవారు. అయితే ఆ కుటుంబం కాలక్రమంలో చితికిపోతుంది, పెద్ద కొడుకు దేశం గాని దేశంలో ఖైదు చేయబడతాడు, రెండో కొడుకు పుట్టుకతోనే పోలియోసోకి వికలాంగుడవుతాడు మూడో కొడుకు పుట్టుగుడ్డి. కాలక్రమంలో ఆస్తులు హరించుకుపోయి, రావ్ సాహెబ్ పేదరికంలోకి జారుకుంటాడు. తన దురవస్థకి కారణం చెబుతాడు.

ఫలితం: రాజకీయ చదరంగంలో నెగ్గేందుకు పోటీదార్లు వేసే ఎత్తులని వర్ణిస్తుందీ కథ.

పేగుబంధం: ఒకరంటే ఒకరికి అవాజ్యమైన ప్రేమానుబంధం ఉన్న తండ్రీకొడుకుల కథ ఇది. మహమ్మద్ పేదవాడు, రోజూవారీ సంపాదన సరిపోక కొడుకు ఉస్మాన్‌ని కలకత్తా నాటక సమాజంలో నాటకాలు వేయడానికి పంపుతాడు. మొదట్లో బాగా కష్టపడి మంచిపేరు తెచ్చుకుంటాడు ఉస్మాన్. కానీ తన తండ్రిని మర్చిపోతాడు. కొన్నాళ్ళకి మహమ్మద్ కొడుకుని చూడాలనుకుని నానా కష్టాలు పడి, కలకత్తా చేరితే, అదే రోజు ఉస్మాన్ ఢిల్లీ వెళ్లిపోతాడు. రోజులు గడిచే కొద్దీ, ప్రియురాలి మోజులో పడి నాటకాలని పాడు చేసుకుని, మద్యానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఉస్మాన్. చివరికి తండ్రిని చూడాలని బయల్దేరుతాడు. మహమ్మద్ కూడా అవసానదశలో ఉండి కొడుకు కోసం ఎదురుచూస్తుంటాడు. చదవురల గుండెల్ని కలచివేస్తుందీ కథ.

యాతన: రాగ్యా అనే కుర్రాణ్ణి చూస్తే జనాలు చచ్చిపోతారనే ఓ మూఢ నమ్మకం ప్రబలుతుంది ఓ ఊరిలో. దురదృష్ట జాతకుడని అందరూ అతడిని ఆడిపోసుకుంటూంటారు. సొంతూరు వదిలి మరో ఊరు వెళ్ళినా, తన ఊరి వాళ్ళు అక్కడ ఎదురై రాగ్యా గురించి అక్కడి వాళ్ళకి వివరించి, అక్కడ్నించి కూడా పంపేసేవారు. చివరికి పాపమ్మ అనే యువతి సాయంతో తన కష్టాలకు దూరంగా పోతాడు రాగ్యా.

వదులుకోటం: ఆచార వ్యవహారాలు నశిస్తున్న ఈ రోజులలో ధార్మిక జీవనం గడిపే ఉపాధ్యారు గారికి ఎదురైన సంకట స్థితి గురించి, ఆయన దేన్ని వదులుకున్నాడో చెబుతుందీ కథ. కాలక్రమంగా ధార్మిక జీవనంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతుందీ కథ.

ఆముదం త్రాగిన తాసీల్దారు: పనిదొంగైన ఓ తాసీల్దారుని ఓ బ్రిటీషు అధికారి ఏ విధంగా దారికి తెచ్చాడో ఈ కథ చెబుతుంది. హాస్యంగా సాగుతుందీ కథ.

15 కథలున్న ఈ పుస్తకంలోని కథలు చివరిదాక చదివిస్తాయి. ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 90/- రూపాయలు. నెలకి రూ. 30/- అద్దెతో ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

కృష్ణారెడ్డి గారి ఏనుగు On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts: