అక్షర పరిమళం (“ద్రోహవృక్షం” పుస్తక సమీక్ష)

మనసులో బాధ బరువు మోస్తున్నప్పుడు తేలికైన పుస్తకం ఒకటి చదివితే హృదయంలో అక్షరాల చిరుజల్లుల పరిమళం వెల్లివిరుస్తుంది. అపుడు ఆలోచనల వేడి, సాంద్రత తగ్గుముఖం పడుతుంది. అటువంటి పుస్తకాలు తెలుగులో చాలా తక్కువే అయినా డాక్టర్ వి. చంద్రశేఖరరావు రాసిన ‘ద్రోహవృక్షం’ ఈ కోవకి చెందినదే. ఈ పుస్తకం చదువుతుంటే మనం ఎక్కదో విహరిస్తున్నామనే భావన, అక్షరాలు మనల్ని వెంబడిస్తున్నాయనే అపోహ, పాత్రలన్నీ సుపరిచితాలే అనే భావన మనలో చోటుచేసుకునే ముఖ్య అనుభూతులు. బహుశా రచయితకు అడవులు, పూలు, పర్యటనలు, ప్రకృతి అంటే అమితమైన అనురాగం అనుకుంటా. అందుకే పాఠకుడి చిటికెనవేలు పట్టుకుని తెలియని ప్రపంచం వైపు తీసుకు వెళుతుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనే జిజ్ఞాస కూడా పాఠకుడిలో లేకుండా చేస్తారు. ఒకసారి కాదు, పేరాను రెండుసార్లు చదివినా మనకు తెలియని అనుభూతి మనల్ని వెంటాడినట్టే అనిపిస్తుంది. ఇందులో ఇరవై కథలు ఉన్నట్టు చెప్పారు. కానీ ఒక నవలలో 20 అధ్యాయాలు అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక కథకు, మరో కథకు ఎక్కడో ఏదో కనిపించీ, కనిపించకుండా సన్నని దారం ఉన్న భావన కలుగుతుంది. సుందరం, పూర్ణలు రచయితకి అత్యంత ప్రియమైన పాత్రలే. సుందరమైన ప్రకృతిలోనే పరి’పూర్ణ’మైన జీవితం అనుకోవలా? ఇందులో ఏ కథ బావుంది? అని ప్రశ్నిస్తే, ఏ కథ బావుండలేదు? అని ఎదురుప్రశ్న వేయాలనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇదో వచన కావ్యంలా అనిపించింది.
‘కాలం ఎగిరిపోవటాన్ని నేను గమనించాను. సుందరం ఒక్కడే, ఈ ప్రపంచంలో అనిపించడం మొదలుపెట్టింది. సుందరం అనే ఆలోచన లేకపోతే నేను శక్తిహీనంగా మారిపోవటం గమనించాను’ (55 పేజి) అని ది లైఫ్ అండ్ టైమ్స ఆఫ్ సత్యప్రకాశంలో ఒక చోట ఉన్న పేరా. ఇది అచ్చం భావకవితలా ఉంది కదూ. అతను అతనిలాంటి మరొకడు అనే శీర్షికగల కథలో ఇలా ఉంది. “ఆ చెట్లపై నివాసమున్న వందలాది పక్షుల శవాలు, పొదల చాటున, రోడ్ల పక్కన. అదో భయానకమైన దృశ్యం. హాస్టల్‌కు చేరే నీళ్ళ పంపుల్లో సీవేజ్ వాటర్ కలిసి, హాస్టళ్ళంతటా డయేరియాలు, విషజ్వరాలు వ్యాపించేది కూడా ఆ నెలలోనే…” (89 పేజి) సుందరం కలలది ఏ రంగు అనే కథలో ‘ కమల వెంటనే తేరుకొని, కళ్ళలోని అందోళనని తుడిచేసి (కొడుకు చేసే బెదిరింపులు కాసేపు మరిచిపోయి) తనదైన మనోహరాన్ని ముఖంపైకి తెచుకొని ఎట్లా ఉన్నావయ్యా… ఎన్నేళ్ళయ్యింది నిన్ను చూసి, పిరికిగా, భయంగా ఉండేవాడివి, గట్టిగా పట్టుకుంటే కందిపోయే పూవులా ఉండేవాడిని’ అని (పేజి 131) ఇందులో పాత్రలతో సంబంధం లేదు. ఏ పేరా చదివినా ఎక్కడి నుంచి ఎక్కడికి చదివినా ఆసక్తికరంగానే ఉంటుంది. అదే రచయిత ప్రత్యేకత.
ఇక పోతే, హెచ్. నరసింహం ఆత్మహత్య శీర్షికన హైదరాబాద్ లోని ప్రదేశాలను పరిచయం చేస్తూ, ఎర్లీ టీన్స్‌లో గోల్కొండ నా ఎడ్వెంచర్ స్పాట్, ఫలక్‌నుమా నా రహస్య డేటింగ్ ప్లేస్, ఆ రోజుల్లో ప్రేమికులకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. ఇందిరాపార్కు, టాంక్‌బండ్, బిర్లామందిర్ (ముఖ్యంగా మెట్ల పైన), గండిపేట చెరువు, యూనివర్సిటీ లోపలి రోడ్డు… (పేజి 217) అంటూ చదువుతూ ఉంటే యవ్వనం దాటిన వారికి మధుర స్మృతులు గుర్తొస్తుంటాయి. ‘హైదరాబాద్ రోడ్లపైనే నా బాల్యమంతా గడచిపోయింది. గుర్తు పట్టలేనంతగ ఆ రోడ్ల రూపం మారినా, అపార్ట్‌మెంట్లు, రంగు దీపాలు, పెద్ద పెద్ద మాల్స్, అయినా ఆ రోడ్లపై పాదం పెట్టగానే ఒక గాఢమైన పరిమళం, నన్ను ఇప్పటికీ చుట్టుముట్టుతుంది. సజీవమైన భాష, ఆత్మీయమైన పలకరింపు, ఎరుపురంగు మెహందీలు, గాలి పటాలు, పురాతనమైన ఆత్మలకు సరికొత్త అలంకరణలు, రోడ్లను చూడగానే, జ్ఞాపకాల ప్రదర్శన నన్ను వివశురాల్ని చేస్తుంది.’
ఏ పేజి తిరగేసినా, ఏదో కొత్తదనం, మాధుర్యం మనల్ని పలకరిస్తునే ఉంటుంది. మనల్నిమనం వెనక్కి తిరిగి ఇలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి బాల్యం ద్రోహవృక్షంలోనూ దర్శనమిస్తుంది. పుస్తకం చదువుతుంటే కొత్త విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడో ఎక్కడో ఇలాంటి సంఘటనలు మనకు తారసిల్లిన భావం కలుగుతుంది.

టి. వేదాంతసూరి
(వార్త, ఆదివారం అనుబంధం, 17 జూన్ 2012)

* * *

ద్రోహవృక్షం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

ద్రోహవృక్షం On Kinige

Related Posts:

‘కథ 2010’పై సాక్షి దినపత్రిక సమీక్ష

ఇరవయ్ ఒకటో ‘కథ’ అనే శీర్షికతో ది. 20 ఫిబ్రవరి 2012 నాటి సాక్షి దినపత్రికలో ‘కథ 2010’ సంకలనం పై సమీక్ష వెలువడింది.
‘కథ’ వార్షిక సంకలనాల వరుసలో ‘కథ 2010’ ఇరవయ్ ఒకటవది. ఇందులో పద మూడు కథలు ఉన్నాయి.

‘కథ’ సంకలనాలలో కనిపించే కథలూ, వాటి కథకులనూ పరిశీలిస్తే సంకలనకర్తల ప్రాధాన్యం అర్థమవుతుందని సమీక్షకులు వి. ఆర్. పేర్కొన్నారు. కొత్తదనం, ప్రయోగం సంపాదకుల దృష్టిలో అత్యవసరమని భావించారు.
ఎనభయ్యవ దశకం వరకు తెలుగు కథలు చదవగానే అవి బాగున్నాయో, లేదో రచయితలకే కాదు, సాధారణ పాఠకులకీ వెంటనే తెలిసేదని. ఇప్పటి కథలను చదివి జీర్ణించుకోవడానికి సాధారణ పాఠ కులతో పాటు రచయితలూ, విమర్శకులకు కూడా కొంత శోధన, ఓపిక అవసరమవుతోందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ‘కథ’ సంకలనాలలో రకరకాల ప్రయోగాలు, ధోరణులు , అందుకు ప్రయత్నాలు కనిపిస్తాయని వి. ఆర్. అన్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించడం అవసరమేనంటూ, అటువంటి ప్రయోగాలు ఎంతవరకు ఫలప్రదమైనాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూడడమూ కూడా అవసరమే సమీక్షకులు భావించారు.

పూర్తి సమీక్షని ఈ లింక్‌లో చదవచ్చు.

కథ 2010 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకై ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కథ 2010 On Kinige

అలాగే, ‘కథ’ పాత సంకలనాలు కూడా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

కొల్లూరి సోమ శంకర్

Related Posts: