కథకు నేపధ్యం ప్రకృతి సమాజమే – జంట పక్షుల్ని విడదీసిన వాల్మీకి పశ్చాత్తాపంతో రామాయణ ఇతిహాస కథను సృష్టిస్తే , భారత భాగవతాల పేరిట వేలాది గొలుసుకట్టు కథలు సమకూర్చాడు వ్యాసుడు .ప్రాచీన భారతీయ కథా సంస్కృతి ఒక చెంప ,పారిశ్రామిక విప్లవ కాలం ను౦డి నేటి ప్రపంచ అర్థిక విధానాల దుష్పరిణామాల వరకు ఐరోపా ను౦డి సంక్రమి౦చిన ఆధునిక కథా ప్రక్రియ మరోచెంప భారతీయ కథా సంస్కృతిని అనాదిగా పరిపుష్టం చేస్తూ వస్తున్నాయని కోవెల ప్రసన్నాచార్య , జగన్నాధ శర్మ వంటి ఎంతోమంది చెప్పగా వింటున్నాం.
గురజాడ ‘దిద్దుబాటు’ మొదలు పాలగుమ్మి ‘గాలివాన’ వరకు …. సామాజిక , వర్గ ప్రయోజనాల కోసం రాస్తున్న నవ చైతన్య కధల వరకూ తెలుగు కథ ఖండాంతరాలకు విస్తరించింది . కథకు ఆలోచన రూఫుదిద్దుకోవడానికి వెనుకున్న ప్రేరణ ఏమిటి ? సమాజ౦పై చెరగని ముద్ర వేస్తున్న కథలు ఎలా పుడుతున్నాయి . ఆ కథల్లో నిజమెంత ? కల్పన ఎంత ? వైవిధ్యమున్న గొప్ప కథలు ఎలా ఫుట్టాయి ? అనే విషయాల్ని కధకుల స్వీయ విశ్లేషణలతో అక్షరీకరించాలనే తానా ప్రచురణల సంకల్పానికి అక్షరరూపమే 900 పేజీల ‘కథ నేపధ్యం’ ఒకటీ , రెండూ భాగాలు.
గత యేడాది జనవరిలో 25 మ౦ది కథలు నేపధ్యాలతో ‘కథ నేపధ్యం -1’ వెలువడగా,ఇప్పుడు తాజాగా ‘కథ నేపథ్యం -2’ విడుదలైంది .35 మ౦ది రచయితల కథలు ,నిజజీవిత౦లో ఉన్న ఆ కథలోని పాత్రలు, రచయితలు ఎలా ప్రేరణ పొందారు . దాని సామాజిక ప్రయోజన౦ ఏమిటి ? అనే అంశాలిందులో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రచయిత అట్టాడ అప్పల్నాయుడు నాగావళి కధ ‘భధ్రయ్య ‘ , కరీ౦నగర్ జిల్లా రచయిత అల్లం రాజయ్య కథ ‘మనిషిలోని విధ్వంసం’ కథల్లో బాధితులు భధ్రయ్య , రాజారాంలకు రచయితలు చూపిన దిశానిర్దేశం పోరాటమే ! భధ్రయ్య పిడికిలి బిగించి ఊరేగింపులో కలిసిపోతే , కొడుకు ఆత్మహత్యను చూసి భరించలేక రైతుబిడ్డ రాజారాం నడిచెళ్ళి చౌరాస్తాలో కూలబడిపోతాడు.( అందులో ఒకటి రామగిరి అడవికి పోయేదారి ).
లైంగికహింస భరించలేక పెళ్ళయిన రెండు నెలలకే పరాయిదేశంలో భర్తను హతమార్చిన భార్య దీపిక కథ ‘పరివర్తన’ వాస్తవఘటన ఆధారంగా అరె సీతారామయ్య రాసిన కథ . ఎక్కడైనా స్త్రీ సమస్య ఒక్కటే అంటారాయన – అంతర్గత సంఘర్షణ అనంతరం నమాధానపడి మానవపరమార్ధాన్ని గ్రహించి వాస్తవ ప్రపంచ౦లోకి వచ్చిన నళిని కథ ‘గుర్తు’ అంతర్గత నేపధ్యాన్ని వివరించే అర్.వసుంధరాదేవి కథ ఇది. ఎందరో స్త్రీల జీవితాల్లో జరిగిన యథాతథ ఘటనలకు కథారూపం ఆర్.ఎమ్.ఉమామహేశ్వరరావు ‘ఒంటేపమాను’ఓ సమూహానికి ప్రతినిధిగా బతికిన చెంచేలమ్మ కథ ఇది. సామరస్యానికీ , సౌందర్యానికీ ప్రాధాన్యమిచ్చే స్త్రీకి, విధ్వంసాన్ని, ఘర్షణను ఆశ్రయించే పురుషుడికి మధ్య సంబంధాలను చెప్పే కుప్పిలిపద్మ కథ ‘వనమాల’. ఇలా ఇందులో కథలు పఠితలో మానసిక చైతన్యాన్ని సమకూర్చే౦దుకు దోహదం చేస్తాయి.
-లలితా త్రిపురసుందరి , నవ్య వీక్లీ , 17 సెప్టెంబర్ 2014 .
“కథ నేపథ్యం -2” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.