‘కేసరివలెకీడు’ కథపై భరాగో అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘కేసరివలెకీడు’ కథపై భరాగో గారి అభిప్రాయం చదవండి.

* * *

“1964-
అప్పుడు నేను జ్యోతి, భారతి-ఆ రెండే చూసే వాణ్ణి.
‘భగవంతం కోసం’ అనే కధ పడింది, ‘చూశారా?’ అని అడిగే వాణ్ణి.
‘ఎవర్రాసేరు?’అనే వారు. ‘త్రిపుర’ అనేవాణ్ణి ఆయనతో ఎన్నాళ్ళ నుంచో పరిచయం వున్నవాళ్ళా. ‘పోనిద్దురూ’ అనేవారు.
ఎవరు? అక్షరాల దగ్గర్నుంచీ ఆంధ్ర… వరకూ చదివే ‘యావ’ రేజి పాఠకులు కాబోలు-
1966-
జగన్నాధరావుగారు పరిచయమై సాహిత్య చర్చమీద మేం గడిపిన ఓ రాత్రి – రెండో మూడో ఐంది టైం…. ‘నేనీ మధ్య వో గ్రేట్ రైటర్ని డిస్కవర్ చేసేను’ అన్నారు. ‘త్రిపుర’ అంటారేమోనని ఆశపడ్డాను.
ఫలించిన ఆశల్లో అదొకటి.
1967 చివర్లో-
నేను ఒక పత్రిక కోసం ‘త్రిపుర’ గారికి ఉత్తరం రాసి తెప్పించిన ‘కనిపించని ద్వారం’ అనే కథని నా చేత్తో నేనే బలాత్కారంగా తిప్పి పంపవలసి రావడం (బాస్ నాటక కథ) నా జర్నలిస్టిక్ కెరీర్లో నా కెదురైన అనేక కీడులలో కేసరి వంటిది.
1970 లో –
త్రిపుర గారే పరిచయమయ్యారు. ఈ పదేళ్ళలో ఐదారు సార్లు కలిశాను. భయం భయంగా మాట్లాడేను. ఆయన కొంపదీసి ఆయన పాత్రల్లో దేన్లాగో మాట్లాడుతారో, మర్డర్ చేస్తారో అన్నట్లు. ఆయన కథల్లో అది వాస్తవిక చిత్రాల్లా బొమ్మకట్టి మాట్లాడ్డం రాదాయనకి. ఆయన కథల్లో వున్న సినిసిజంలో చాలా శాతం మాత్రం కనబడేది.
కేసరివలె కీడు గురించి రాయమన్నారు అత్తలూరి నరసింహారావు గారు. ఫ్రంట్‌లో డ్యూటీలో వున్న మిలిట్రి వాళ్ళ వీకెండ్ జీవితశకలం. దాంట్లో ఏదైనా కథుందేమోనని నేనెన్నడూ వెతకలేదు. ఆయన రచనలన్నిట్లాగే (అన్నీ ఎన్ని కనుక?- అలాంటి వాళ్లు ఎక్కువ రాయరు కద!)- ఇదీ ఒక సర్రియలిస్ట్ పెయింటింగే. రెడ్డి మనోనేత్రంతో రికార్డు చేసుకున్న శ్నాప్‌షాట్స్ ఎక్కువ గజిబిజి లేకుండా అంటించిన ఆల్బం ఈ కథ.
అయితే ఇందులో మందుగుండు పొడిగా ఉండి, శతఘ్నలు సిద్ధంగా పేర్చివుండి, తెల్లటి దీపాల్ని నల్లటి కాగితాలు వికృతంగా కప్పేస్తూ వుండి సీసం వర్షించబోతు వుండినా-
చిన్నారి అలాగే నిలబడి వుంటుంది.
అది నాకిష్టం.”

భరాగో

త్రిపుర కథలు On Kinige

Related Posts: