ఒక పరభాష కవితకు వంద అనువాదాలు రావడం అరుదైన విషయం . అలల మాదిరిగా తేలియాడే శైలి , సొగసైన పదాల అల్లిక , వడివడిగా సాగే నడక ఉంటే తప్ప అన్ని అనువాదాలు రావు .అలాంటి కవితల్లో –
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన “కొరొ జాగోరితో” (వేర్ ద మైండ్ ఈజ్ విత్అవుట్ ఫీయర్ …) ఒకటి .
దీనిని తెలుగులో 95 మంది కవులు 100 సార్లు అనువాదం చేశారు . 1913 లో ఈ కవితను ‘గీతాంజలి’ పేరిట ఆదిపూడి సోమనాధరావు తొలిసారి అనువాదం చేశారు . ఆ తరువాత చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, కె.వి.రమణారెడ్డి , తిరుమల రామచంద్ర , అచంట జానకీరామ్ , చర్ల గణపతి శాస్త్రి , ధాశరధీ , కొంగర జగ్గయ్య – ఇలా లబ్ద ప్రతిష్టులైన రచయితలు తమదైన శైలిలో దీనిని తెలుగు లోకి తీసుకువచ్చారు . ఈ గేయం హైస్కూలు పాఠ్యాంశంగా అందరికీ సుపరిచితమైనదే . అయిన దానిలోని సొబగును , స్ఫూర్తిని – ఈ కవులు తమదైన శైలిలో పాఠకులకు అందించడానికి ప్రయత్నించారు . ఈ కవితలన్నింటినీ సంస్కృతి సంస్థ – నివేదన పేరిట ఒక సంకలనంగా తీసుకువచ్చింది . భావం ఒకటే అయినా తమవైన పదాల ద్వారా కొత్త అందాన్ని అద్దటంలో ఈ కవుల ప్రజ్ఞ పాఠకులను అలరిస్తుంది . రవీంద్రుడి కవిత్వంపైనా , తెలుగు సాహిత్యం పైనా ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది .
-సివిఎల్ఎన్ ,ఆదివారం ఆంధ్రజ్యోతి .
“నివేదన” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
నివేదన on kinige