కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖుల అభిప్రాయాలు

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సుప్రసిద్ధ బ్లాగరు, రచయిత కొత్తపాళీ అభిప్రాయం
“నాకో చిన్న థియరీ ఉంది. ఇప్పటికి తెలుగులో అనేక అస్తిత్వవాద సాహిత్యాలు వచ్చాయి. ఇవన్నీ చూశాక అస్తిత్వవాద సాహిత్యం అంటే ఏవిటి అంటే .. ఒక వర్గానికి చెందిన మనుషులు తమ కథల్ని తామే చెప్పుకోవడం అని నాకనిపించింది. మరి ఇప్పుడు కథలూ నవల్లూ రాస్తున్న వారందరూ నలభైలు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు. యువత గొంతెక్కడ? యువతకీ సాహిత్యంలో అస్తిత్వం నిలబడాలి అంటే వాళ్ళ కథల్ని వాళ్ళే చెప్పుకోవాలి. లేకపోతే వంకర చిత్రీకరణలే కనబడతాయి – ఇప్పటికే ఆ ధోరణులు మన కథల్లో కనిపిస్తున్నై.
తెలుగు కథల్లో యువత అస్తిత్వానికి స్వాగతం పలుకుతున్నారు కినిగె వాళ్ళు ఈ కథల పోటీతో.
ఇంతకంటే మంచి అవకాశం మరోటి ఉండబోదు.
రండి యువతరానికి ప్రతినిధులారా, మీ మీ కథలు చెప్పండి.”

కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సాహిత్య విమర్శకుడు శ్రీ జంపాల చౌదరి అభిప్రాయం
“గొప్పగా వ్రాయడానికి ఎక్కువ మాటలు అవసరం లేదు.
ఏసుక్రీస్తు మొదట చూపించిన మహిమ – నీటిని ద్రాక్షాసవంగా మార్చటం – గురించి ఒకాయన The conscious water saw its God and blushed అని ఒక్క వాక్యంలో చెప్పాడట.
నేను శాస్త్రీయ పత్రాలు వ్రాయటం మొదలుబెట్టిన రోజుల్లో మా ప్రొఫెసర్‌గారు ఒక సూత్రం చెప్పారు. నువ్వు వ్రాయదలచుకున్నదంతా వ్రాసేశాక, దాన్ని అంతకు సగం మాటలతో తిరగవ్రాయి. దాంట్లో సగం మాటలతో మళ్ళీ తిరగవ్రాయి. నువ్వు చెప్పదలచుకున్నది క్లుప్తంగా, స్పష్టంగా అప్పుడు చెప్పగలుగుతావు అని.
కల్పనా సాహిత్యంలోనూ ఈ సూత్రం బాగా పని చేస్తుంది. గొప్ప తాత్విక విషయాలను కొద్ది మాటలలో హైకూలలో, తేటగీతుల్లో, ఆటవెలదులలో చెప్పటం మనకు తెలుసు. యువ కథకులను తక్కువ మాటల్లో కథలు వ్రాయటానికి కినిగె సంస్థ ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ ద్వారా ప్రోత్సహించటం ముదావహం, అభినందనీయం.”

కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013) వివరాలకు ఇక్కడ చూడండి:
http://teblog.kinige.com/?p=2773

Related Posts:

ఎన్నెమ్మ కథలు

ఎన్నెమ్మ కథలు అనేవి నిడదవోలు మాలతి గారు తన బ్లాగులో ’ఊసుపోక’ అనే శీర్షికతో రాసుకున్న టపాల సంకలనం. పత్రికలలో ప్రచురించాలి అంటే అది కథో, వ్యాసమో, కవితో, ఫీచరో అయి ఉండాలి. ఇలాంటి వర్గీకరణ చట్రాలలో ఇమడవు ఈ ఎన్నెమ్మ కథలు.

ఈ ఎన్నెమ్మ కథలకి పునాది లోతైన పరిశీలనని, ఆవరణ విశాలమైన జీవితానుభవం అని ముందుమాట రాసిన ఎస్. నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.

ఇక్ష్వాకుల కాలం నాటి గడియారం” అనే టపాలో తన పాతకాలం నాటి గడియారం మంచులో కూరుకుపోవడం, మూడు నెలల తర్వాత బయటపడడం, అయినా చక్కగా పనిచేస్తుండడం గురించి చెప్పారు.

మిరపకాయ బజ్జీలు” అనే టపాలో బజ్జీలు చేయడం కోసం శ్రేష్టమైన మిరపకాయలను ఎంచుకోడానికి ప్రయత్నించడం గురించి రాసారు. అమెరికాలో లభించే వివిధ రకాల మిరపకాయల పేర్లు, వాటిలో కారం తీవ్రతని (హీట్ ఇండెక్స్) చెప్పడం ఆసక్తిగా ఉంటుంది.

నసాంకేతికం” అనే వ్యాసంలో తాను తొలినాళ్ళలో కంప్యూటర్ నేర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించి చెబుతారు మాలతి గారు.

వినదగు నెవ్వరు చెప్పిన” అనే వ్యాసంలో సేల్స్‌మన్ల వాక్చాతుర్యం గురించి, వ్యాపర ప్రకటనల ప్రలోభాల గురించి సరదాగా చెప్పారు. చివర్లో ’వినదగు నెవ్వరు చెప్పిన…..’ అనే మాటని వినకూడదని అంటారు.

ఏ పేరెట్టి పిల్చినా” అనే వ్యాసంలో తన పేరు పలకడంలో అమెరికన్లు ఎదుర్కునే ఇబ్బందులు, వాటిని సరిచేయడానికి తను పడిన బాధలను హాస్యంగా వివరిస్తారు. ’మాలతి’ పేరుతో ఉన్న ఇతర ప్రసిద్ధ మహిళలను “తనే’ అనుకుని ఎందరో పొగడడం గురించి చెబుతారు.

దీపాలార్పు దినం” అనే వ్యాసంలో విద్యుత్ వాడకం గురించి, అమెరికాలో రీ-సైకిలింగ్ వ్యాపారం గురించి ప్రస్తావిస్తారు. విద్యుత్‌‍ని వృధా చేసుకోకూదని సూచిస్తారు.

అప్పులు ఆస్తులు” అనే వ్యాసంలో జనాలు ఋణవలయంలో ఎలా చిక్కుకుపోతారో తెలిపారు. వ్యాసం సరదాగా సాగినా, అందులో అంతర్లీనంగా హెచ్చరికలూ ఉన్నాయి.

అచ్చంగా నేనే అచ్చేసుకున్న చిన్ని నా పొత్తం” అనే వ్యాసంలో పుస్తకాలను ప్రచురించుకోడంలో తనకెదురైన ఇబ్బందులను ప్రస్తావించారు. అవి అందరు రచయిత్రులు, రచయితలకి ఎదురయ్యేవే.

పుస్తకం కొనడవా? ఎక్కడా విన్లేదు, చోద్యం” అనే వ్యాసం వ్యంగ్యంగా రాసినా, అందులో అంతర్లీనంగా తెలుగు పుస్తక ప్రియుల, రచయితల బాధ ఉంది.

చెత్త భ్రమణం” అనే వ్యాసంలో రీ-సైకిలింగ్ గురించి హాస్యంగా రాసారు.

తుమ్మెదా ఒకసారి…” అనే వ్యాసం చదివాక, నవ్వలేక కడుపు పట్టుకోడం ఖాయం.

గల్పిక ముదిరి కథ అయిందట!” అనే టపాలో కథలెలా రాయాలో చెప్పారు. ’ఏది కథానిక, ఏది గల్పిక, ఏది స్కెచ్?’ అనే వివరాలు తెలిపారు.

బామ్మ అంటే బాపు బొమ్మ అని అర్థంట!” అనే వ్యాసంలో మాటలకి అర్థాలే కాదు, ఆకారాలు ఉంటాయని చెప్పారు.

సంతంటే సంతోసమయ్య మాకు!” అనే వ్యాసంలో షాపింగ్ అంటే తమకి సోషల్ ఈవెంటని చెబుతారు.

ఇంకా ఎన్నో చెణుకులు, చురకలు, చమక్కులు ఉన్న వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ ఎన్నెమ్మ కథలు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నేడే మీ కాపీని సొంతం చేసుకోండి.

ఎన్నెమ్మ కథలు On Kinige

సోమ శంకర్ కొల్లూరి.

Related Posts: