పునరాగమనం

ఇది శ్రీపాద స్వాతి రాసిన మొదటి నవల.
ఈ నవలలో ప్రధాన పాత్ర వసంతలక్ష్మి. ఆమె భర్త పేరు డాక్టర్ శ్రీ. కూతురు సుమ ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదివి లండన్‌‍లో ఉద్యోగం చేస్తోంది. కొడుకు సుమంత్ ముంబైలో సినిమా నటుడిగా స్థిరపడ్డాడు.
భర్త పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళింట్లో ఓ పార్టీ జరుగుతుంది. ఫంక్షన్ ముగిసాక, అలసిపోయానంటూ శ్రీ కాసేపు పడుకుంటాడు. అయితే అతను నిద్రలోనే కన్నుమూస్తాడు. ఈ హఠాత్పరిణామం వసంతలక్ష్మి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ఈ షాక్‌నుంచి తేరుకోలేకపోతుంది.
ఆమెకి దూరంగా ఉండే కొడుకు, కూతురు ఆమె మనోవేదనను పట్టించుకోరు, తేలికగా తీసుకుంటారు. వసంత స్నేహితులు ఆమెని ఓదార్చి ఇదివరకటిలా ఉత్సాహంగా జీవించేలా చెయ్యాలనుకొంటారు. కానీ వసంత తన స్నేహితులని కలుసుకోడానికి ఇష్టపడదు. కొన్నాళ్ళ తర్వాత, “ఎంతటి విపత్తునైనా చిరునవ్వుతో అనుభవించాలి” అనే తన భర్త మాటలని గుర్తు చేసుకుంటుంది. భర్త భౌతికంగా లేకపోయినా, అనుక్షణం తనలోనే ఉన్నాడని, తను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుని, ఏదన్నా ఉద్యోగం చేద్దామనుకుంటుంది. ఒక పత్రికాఫీసులో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది.
ఆ పత్రికలో చేరాక తనలో ఓ సృజనాత్మక రచయిత్రి ఉన్నదని ఆమె గ్రహిస్తుంది. తనలోని సృజనాత్మకతను వెలికితెచ్చి నవలలు రాయడం మొదలుపెట్టి, మంచి పేరు తెచ్చుకుంటుంది. సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెకు దగ్గరవ్వాలని కొందరు మగవాళ్ళు ప్రయత్నిస్తారు, లొంగదని గ్రహించాక, ఆమె మీద పుకార్లు పుట్టిస్తారు. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆమె తన రచనావ్యాసాంగాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు చాలా అవార్డులొస్తాయి. మీడియా వాళ్ళు ఆమె వెంటపడతారు. ఇంటర్వ్యూలలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ప్రశ్నిస్తారు.
“నవలల్లో రాసినదంతా మీ వ్యక్తిగత జీవితమే అంటారు. నిజమేనా?”అని ఆమెని అడుగుతారు. ఆమె పిల్లల గురించి చెప్పమంటారు. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతారు. ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ వసంత తాను డాక్టర్ చైతన్యని పెళ్ళి చేసుకున్నానని, ఆ విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నిర్భయంగా సమాధానం చెబుతుంది.
ఈ రకంగా ఆమె, ముగిసిపోయిందనుకొన్న తన జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది. ఇదే ఆమె పునరాగమనం.
చదివించే గుణం కలిగిన శైలి, సన్నివేశాల కల్పన, సంభాషణల ద్వారా పాత్రలని పాఠకుల ముందుంచడం వలన నవలని ఆసక్తిగా నడిపారు రచయిత్ర్రి.
కౌముది వెబ్ పత్రికలో సీరియల్గా ప్రచురితమైన ఈ నవల ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

పునరాగమనం On Kinige

Related Posts: