కదలు, నవలల్లో పాత్రలు ప్రారంభంలో వున్నట్లు ముగింపు వరకు వుండక పోవచ్చు. చాలా పాత్రలు పరివర్తన చెందచ్చు. మంచి దిశగా పరివర్తన చెందిన పాత్రలతో అనేకానేక రచనలకు మంచి ముగింపు సాధ్యమై వుండొచ్చు. మరి అటువంటి రచనలు, పాత్రలు సృష్టించిన రచయితే పరివర్తన చెందితే, అనంతరం వచ్చే రచనలు ఎలా వుంటాయి, అటువంటి రచయిత ఏ విధమైన రచనలు చేయడానికి ఇష్టపడతాడు అని ప్రశ్నించుకుంటే, అసలు రచయిత ప్రవర్తన, లేదా పరివర్తన, కాదూ, ఈ రెండింటి ప్రభావం అసలు రచనలపై ఎందుకుండాలి అన్న ప్రశ్న కూడా ఉదయించవచ్చు.
ఇదంతా ఎందుకు…? అంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి అనే ఫక్తు కమర్షియల్ రచయితగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, పూర్తి ఆధ్యాత్మికత వైపు మనసా, వాచా, కర్మణా మళ్ళినపుడు, రచనలకు కథాంశాల ఎంపికలో ప్రాధాన్యతలు మారినట్లు కనిపించడమే కారణం. ఇటీవల ఆయన కలం నుంచి వెలువడిన ‘ది ఎండ్‘ నవల చదివితే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో రాసిన నవల ఇది. నిజానికి ఇదే సబ్జెక్ట్ ను, ఆయన కావాలనుకుంటే కాస్త సెక్సీ థ్రిల్లర్గా మార్చవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా, పూర్తిగా ఇన్ఫర్మేటివ్గా, సగటు భారతీయ ఉద్యోగులు లేదా ఆర్జనపరులు ఎలా వుండాలి… ఎలా వుండకూడదు అన్న విషయాన్ని సూటిగా చెప్పేసారు. మారనిది ఏమిటంటే, ఆయన శైలి. ఎప్పటిలాగే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని లోతులకు వెళ్ళే పద్దతి మారలేదు. నవలలో అవినీతి గణాంకాలు కానీ, చాక్లెట్ కొటేషన్లు, రకాలు కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అలాగే కథనాన్ని నెమ్మదిగా కొనసాగిస్తూ, ఏ చిన్న విషయాన్ని కూడా విడిచి పెట్టకుండా, కథ చెప్పినట్టు కాకుండా అందించే ఆయన శైలి కూడా అలాగే వుంది. శైలి సంగతి అలా పెడితే జనం మంచిగా వుండాలి. ధర్మంగా వుండాలి, సక్రమ ప్రవర్తన కలిగివుండాలి. అలా వుండకపోతే ఎన్ని బాధలు సంప్రాప్తమవుతాయి… అసలు ఆ బాధలు తెలియచెబితే తప్పులు చేయకుండా వుంటారేమో, అన్న ఆలోచనతో రచయిత రచన సాగించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా చదువరులను థ్రిల్కో, ఉత్కంఠకో గురిచేయాలన్న తాపత్రయం మచ్చుకైనా కనిపించదు. పైగా వారిని మంచి మార్గంలోకి మళ్ళించాలన్న తపన అంతర్లీనంగా కనిపిస్తుంది. నవల కథాగమనం ఎంతమాత్రం అనుమానం రాకుండా, పాఠకులు ఊహించిన దారినే సాగుతుంది.
తను పరివర్తన చెందానని రచనా వ్యాసంగం ఆపేయడమో, లేదా వృత్తి, ప్రవృత్తి వేరని ఆత్మవంచన చేసుకుని, యధాప్రకారం పాత పద్ధతిలోనే రచనలు చేయడమో చేయకుండా, నొప్పివ్వక, తానొవ్వక అన్న రీతిలో, తన నమ్మిన ధర్మం మేరకే రచనావ్యాసంగం కొనసాగించుకుంటూ, సంతృప్తి చెందుతున్న మల్లాదిని అభినందించొచ్చు.
– వి.ఎస్.ఎన్, ఆదివారం ఆంధ్రభూమి 13 జూన్ 2010
* * *
“ది ఎండ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
ది ఎండ్ On Kinige