ఆధ్యాత్మిక అక్షరమాల!

అఆఇఈ… అహం నించి ఆత్మ దాకా, ఇహం నించి ఈశ్వరుడి దాకా… అన్న శీర్షికకు సంక్షిప్త రూపం. ఆధ్యాత్మిక సాహిత్యం చేదు గుళిక లాంటిది. దాన్ని తేనెలో ముంచి తియ్యతియ్యగా మన చేతిలో పెట్టారు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఓ పట్టాన కొరుకుడు పడని విషయాల్ని ఆహ్లాదంగా చెప్పడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి వైవిధ్యంగా ఉంది. ప్రతి వ్యాసాన్నీ హాస్యంతో ప్రారంభించారు. ఆ తర్వాత చక్కని శ్లోకాన్ని తాత్పర్యసహితంగా వివరించారు. విషయం సుబోధకం కావడానికి చిన్నచిన్న కథలూ, ఆసక్తికరమైన సంఘటనలూ జోడించారు. పాపపుణ్యాలు, దాన గుణం, ఇంద్రియ నిగ్రహం, మరణం, వాగ్దోషాలు… దాదాపు డెబ్భై వ్యాసాలూ ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి ఉపకరించేవే. ఈ పుస్తకాన్ని కొని చదవడమే కాదు, ఆత్మీయులకు కానుకగా ఇవ్వమని రచయిత సిఫార్సు చేస్తున్నారు. మంచి సూచన.

(ఈనాడు ఫిబ్రవరి 2011 రివ్యూ)

* * *

“అ ఆ ఇ ఈ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
అ ఆ ఇ ఈ On Kinige

Related Posts:

అ ఆ ఇ ఈ (అహం నుంచి ఆత్మదాకా ఇహం నుంచి ఈశ్వరుడిదాకా)

శరవేగంతో దూసుకుపోతున్న నాగరికతా ప్రపంచంలో ఆధ్యాత్మక చింతనగాని, ఈ ప్రపంచంలో తన ఉనికికి అర్థం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస గానీ రోజు రోజుకీ కొరవడుతున్న ఈ రోజులలో మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి ‘అ ఆ ఇ ఈ‘ సంకలనం ద్వారా చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. సుగర్ కోటెడ్ పిల్స్ లాగా హాస్యం, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల జీవితాలలోని ఘట్టాలని, హిందూ ధార్మిక వ్యవస్థలోని శ్లోకాలకు వివరణ ఇస్తూ ధార్మిక బోధన చాలా బాగుంది. పుస్తకం ఆసాంతం చదవక పోయినా (అంత తీరిక లేని వారికి) అక్కడక్కడ పేజీలు తిరగవేసినా రవంత సేపు మనిషిని ఆలోచింపజేసేవిగా వున్నది. మంచి ప్రయత్నం!

స్వప్న మాస పత్రిక సమీక్ష

* * *

‘అ ఆ ఇ ఈ’ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
అ ఆ ఇ ఈ On Kinige

Related Posts:

ది ఎండ్

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ది ఎండ్. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యంపై రాసిన నవల ఇది.

ప్రభుత్వ విభాగమైన ‘జలమండలి’లో పని చేసే దేవముని అనే అవినీతి అధికారి కథ ఇది. చిన్నతనంలో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, అటువంటి కష్టాలు తన సంతానానికి లేకుండా చేయాలనే లక్ష్యంతో పై సంపాదనకి అలవాటు పడి, ఉద్యోగం ఊడగొట్టుకోడమే కాకుండా చివరికి జైలు శిక్ష కూడ అనుభవిస్తాడు దేవముని. చివరికి పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో జీవితం గడపడానికే నిశ్చయించుకుంటాడు.

లంచగొండితనం మనిషంత పాతది అని స్పష్టం చేస్తూ, లంచం అంటే ఏమిటో నిర్వచించారు రచయిత. లంచంలోని రకాలను వివరిస్తారు. లంచగొండితనాన్ని నిరోధించడానికి రూపొందించిన వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. లంచగొండితనాన్ని కొలిచే బరోమీటరు గురించి, ఏయే దేశాలు ఆ స్కేలులో ముందు వెనుక వరుసలలో ఉన్నాయో చెబుతారు. లంచగొండితనానికి మూలం “నీడ్ అండ్ గ్రీడ్” అని అంటారు మల్లాది. లంచగొండితనం అనే దుష్ట సంస్కృతి మన దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జీవనదిలా అవిశ్రామంగా సాగిపోవడానికి గల కారణాలను వివరిస్తారు రచయిత ఈ నవలలో.

ప్రజలలో అధిక శాతం మంది పేదలవడం – లంచగొండితనం మరింత పెచ్చుమీరడానికి ఎలా దోహదం చేస్తుందో తేటతెల్లం చేసారు రచయిత. లంచగొండితనం ఉన్న దేశాలలో ఆర్ధికాభివృద్ధి రేటు ఎందుకు తక్కువగా ఉంటుందో, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురారో తెలిపారు. చాలా మంది తమ కులాన్ని అడ్డం పెట్టుకుని పోరాడడానికి కారణం కూడా లంచగొండితనమేనని అంటారు రచయిత. కార్పోరేట్ ఆసుపత్రులలో జరిగే దోపిడి గురించి ఈ నవలలో వివరించారు మల్లాది. అదీ కూడా ఓ రకంగా లంచగొండితనమే!

అవినీతి నిరోధక శాఖాధికారులు లంచగొండులను ప్రత్యక్షంగా పట్టుకునే రెడ్ హ్యాండెడ్ పద్దతి గురించి చక్కగా వివరించారు రచయిత. అవినీతి కేసుల్లో విచారణ ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది.

“బోనులో ఎలకపడే చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. కానీ, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే బోను ఖాళీగా కనబడుతుంది”.

జైలుకి తరలించబడిన ఖైదీల గురించి, ఖైదీలలోని రకాల గురించి రచయిత ఇచ్చిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నమన్న భావన కలుగుతుంది.
అన్ని రకాలుగా నష్టపోయినా, కొత్త జీవితం గడిపేందుకు దేవముని కుటుంబం చేసిన ప్రయత్నాలు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. కేరళలోని గురువాయూర్‌లోని కృష్ణుడి గుడి గురించి, అక్కడికి దగ్గర్లోని పున్నత్తూరు కోట గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే దేశంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విడివిడిగా ఆలయాలున్నది కేరళలోనే అని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే చాకెట్ల గురించిన వివరాలు, చాక్లెట్ల గురించి ఎంతో ఆసక్తికరమైన కొటేషన్లను అందించారు రచయిత ఈ పుస్తకంలో.

పాఠకులకి ఉల్లాసాన్ని కలిస్తుందీ నవల.

ది ఎండ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

ది ఎండ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

దైవం వైపు

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన వ్యాసాల సంకలనం ఇది. వివిధ ఆధ్యాత్మిక పత్రికలలో మల్లాది వ్రాసిన వ్యాసాలని ఇందులో పొందుపరిచారు.

భగవంతుడిని చేరడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన మార్గాలున్నాయని, అయితే భక్తి మార్గం తప్ప మిగతావి సామాన్య సాధకులకి కష్టతరమని మల్లాది అంటారు. భక్తి వల్ల మనకంటే అధికుడు, గొప్పవాడు ఇంకొకడున్నాడని అంగీకరిస్తామని, అందువల్ల మన అహం తగ్గుతుందని రచయిత అంటారు. భక్తి మార్గం ప్రాశస్త్యాన్ని వివరించే పద్మపురాణంలోని ఓ శ్లోకాన్ని ఉటంకించారు.

భయానికి, భక్తి ఉన్న తేడాని హెన్రీ ఎమర్సన్ మాటల్లో వివరించారు మల్లాది.

ప్రార్థన చక్కటి ఔషధమని పాశ్చాత్య దేశాలలో పరిశోధనాత్మకంగా నిరూపితమవుతున్న వైనాన్ని వివరించారు రచయిత. ప్రార్థన ఏ విధంగా పని చేస్తుందో తెలిపారు రచయిత. ప్రార్థన మనసులో పేరుకున్న కల్మషాన్ని కడిగేసి, తద్వార జీవనవిధానాన్ని క్రమశిక్షణలో ఉంచి, హృదయంలోని దైవంతో అనుసంధానం చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రార్థన ఎందుకో చేయాలో మరో వ్యాసంలో వివరించారు.

దేవుడనేవాడున్నాడా అని వెతికేవారికి, దేవుడిని ఎలా, ఎక్కడ అన్వేషించాలొ చెబుతారు మల్లాది.

మౌనం ప్రాధాన్యతని వివరిస్తూ, ఏకాగ్రతకి నిశ్చలతకి ఉపకరిస్తుందని అంటారు. ఏ ఆలోచనలు లేని మౌనమే నిజమైన మౌనమని; ఆధ్యాత్మిక సాధకులు మౌనాన్ని ఎంతగా అభ్యసిస్తే, అంత అభివృద్ధిని పొందగలరని మల్లాది అంటారు. మౌనంలోని రకాలను వివరించారు.

అపరిగ్రహం గురించి చెబుతూ, ఇతరుల చేత ఉచితంగా సేవలు పొందకూడదని, అపరిగ్రహం ఋణానుబంధాన్ని రూపుమాపుతుందని చెబుతారు.

పశ్చాత్తాపం పరమ పావనం అంటూ, పశ్చాత్తాపానికి అవసరమైన మూడు నియమాలని వివరించారు. పశ్చాత్తాపం పదానికి ఆంగ్లంలో రిపెంటెన్స్, కన్ఫెషన్ అనే రెండు పదాలున్నాయని చెబుతూ, ఆ రెండిటికీ ఉన్న తేడాని చెప్పారు మల్లాది.

ఆధ్యాత్మిక సమయపాలన ప్రాముఖ్యతని వివరిస్తూ, సాధన కోసం సమయం ఎలా ఏర్పరుచుకోవాలో, సాధారణమైన వ్యవహారిక పనులను ఎలా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలో, తద్వారా ఆధ్యాత్మిక పనులకు సమయం చిక్కుతుందని చెబుతారు.

చేతి అయిదు వేళ్ళు చేసే ప్రార్థన గురించి అద్భుతంగా చెప్పారు రచయిత.

నిజమైన ప్రేమంటే పరమాత్ముడిపై కలిగే ప్రేమ మాత్రమేనని, అది కూడా పరమాత్మ కృప ఉంటేనే సాధ్యమవుతుందని అంటారు మల్లాది.

ఆధ్యాత్మిక సాధకుల ప్రగతికి సూచికలుగా 12 అంశాలను పేర్కొన్నారు రచయిత.

తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయా క్షేత్రాలలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలనే అంశాలను ఆసక్తికరంగా వివరించారు మల్లాది.

ఓ వ్యాసంలో ఆధ్యాత్మిక కేన్సర్ లక్షణాలను వివరించారు. సాధకులు ఆ రోగం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతీ మనిషికి ఇతరులకి సహాయం చేయడంలో ఓ సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దుని ఎంతగా విస్తరించుకుంటే, అంతగా ఆధ్యాత్మిక పురోగతి సాధించగలుగుతారని అంటారు రచయిత.

పుణ్యం ఎందుకు భయంకరమో సోదాహరణంగా వివరించారు రచయిత ఓ వ్యాసంలో.

మనల్ని లౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతులని చేసే 12 సుసంస్కారాల గురించి చెప్పారు రచయిత.

విగ్రహారాధన గురించి చెబుతూ, తెల్లకాగితానికి విలువ ఉండదని, అదే ప్రభుత్వ కరెన్సీ ప్రెస్‌లో ముద్రించబడి బయటకి వస్తే, దానికి విలువ ఉంటుందని అంటారు. సాధారణ రాయికి ఏ విలువ ఉండదు, అదే రాతిని శిల్పంగా చెక్కినా లేదా గుళ్ళో ఉంచినా దైవంగా భావించి మొక్కుతాం, పూజిస్తామని అంటారు. ఏ విగ్రహాలైనా, అన్ని విగ్రహాల వెనుక ఉండేది ఏకాత్మ అయిన ఆ పరమాత్మేనని అంటారు. ఈ వ్యాసంలో రచయిత చెప్పిన ఉదాహరణలు ఆకట్టుకుంటాయి.

దేవుడి ఆదేశం అనే వ్యాసం చాలా ఆసక్తిగా ఉంటుంది. దాంట్లో ఉదాహరణగా చెప్పిన కథ ఎంతో బాగుంటుంది. దేవుడు మనతో మాట్లాడే మాటలు మనకి వినబడకుండా ఏవి అడ్డుకుంటాయో చెబుతారు రచయిత.

దానం కూడా తపస్సు లాంటిదేనని చెబుతూ, ధ్యానం చేసుకునే సమయం లేని వారు దానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చని రచయిత అంటారు. దానం విషయంలో వివేకవంతంగా వ్యవహరించాలని చెబుతూ – మన దగ్గర ఎంత ఉంటే అంతే దానం చేయాలని, మన దగ్గర లేనిది ఇవ్వాలని భగవంతుడు కూడా అనుకోడని రచయిత అంటారు.

నిష్కామకర్మ ద్వారా ఆధ్యాత్మిక జీవితం గడిపేవారి కార్యక్రమాలకు దైవసహాయం ఎలా లభిస్తుందో ఉదాహరణల ద్వారా చెప్పారు మల్లాది.

ఆహార నియమాల గురించి రాసిన వ్యాసంలో తగిన శ్లోకాలతో, వివరణలతో, సాధకులు ఏ తినాలో, ఎలా తినాలో వివరించారు.

అన్నదానం ప్రాముఖ్యతని “పట్టెడన్నం పెట్టండి” అనే వ్యాసంలో సోదాహరణంగా చెప్పారు రచయిత.

ఆధ్యాత్మిక సాధనకి అసలు ఆటంకం “అహమే”నని చెబుతూ, ప్రతీ పనిని తానే సంకల్పించి తానే చేస్తున్నానని అనుకోడమే ’అహం’ అని అంటారు రచయిత. అహాన్ని తగ్గించే కొన్ని చిట్కాలను చెబుతారు మల్లాది ఈ వ్యాసంలో.

ఇతరులపై జోక్స్ వేయడమంటే అది సాత్వికమైన కసి అని చెబుతూ, ఆధ్యాత్మిక సాధకులు తమపై తాము జోకులు వేసుకోవాలని సూచిస్తారు. ఇందుకోసం భగవాన్ రమణ మహర్షి జీవితంలోని ఘట్టాలను వివరిస్తారు.

“సెల్‌ఫోన్ వర్సెస్ భగవద్గీత” అనే ఓ చిన్న వ్యాసం అద్భుతంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక గురువులని ఎంచుకునేడప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు మల్లాది ఓ వ్యాసంలో.

ఆధ్యాత్మిక సాధకులనే కాకుండా సామాన్య పాఠకులని సైతం ఆకట్టుకుంటాయి ఈ వ్యాసాలు. మల్లాది చెప్పిన ఉదాహరణలు, పిట్టకథలు ఈ వ్యాసాలకి నిండుదనం తెచ్చాయి.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నేడే మీ కాపీని సొంతం చేసుకోండి.

దైవం వైపు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

పరంజ్యోతి

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఆధ్యాత్మిక నవల ఇది.

నెమలికొండ రాజకుటుంబంలో కడపటి సంతానంగా పుట్టిన విజయరామరాజు అతి గారాబంగా పెరుగుతాడు. పెద్దన్నయ్యకి కష్టపడే తత్వం, చిన్నన్నయ్యకి తెలివితేటలు ఉన్నాయి, కానీ రామరాజుకి మాత్రం ఈ రెండు గుణాలు అబ్బలేదు. విద్య నేర్చుకోడు, ఎంత సేపు ఆటలు, అల్లరి చేష్టలతో బాల్యం గడచి పోతుంది. యవ్వనంలోకి ప్రవేశించాక స్త్రీలోలత్వానికి గురై శారీరకంగా, నైతికంగా పతనమవుతాడు.

వివాహం చేస్తే బాధ్యత తెలిసొస్తుందేమోనని పెద్దలు భావిస్తారు. శ్రీకాకుళం ప్రాంతంలోని ఓ సంస్థానాధీశుడి కుమార్తెతో రామరాజు వివాహం జరుగుతుంది. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు కుదురుగానే ఉంటాడు రామరాజు. కానీ కొత్త పెళ్ళాం పాతబడిపోయాక, పాత వాసనలు తలెత్తుతాయి. ఇంట్లోని ఒక్కో విలువైన వస్తువును వేశ్యల పరం చేస్తూ, సుఖరోగం పాలవుతాడు రామరాజు. అతని ప్రవర్తనని అందరూ అసహ్యించుకోడం మొదలు పెడతారు. ఈ లోగా అతనికి ఓ కొడుకు జన్మిస్తాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా, మళ్ళీ అతని ఆగడాలు మితిమీరిపోతాయి. అతని అఘాయిత్యాలు భరించలేక అతని బావమరిది రామరాజుపై విషప్రయోగం చేస్తాడు. రామరాజు మరణిస్తాడు.

శవాన్ని దహనం చేస్తుండగా కుంభవృష్ఠి కురిసి, గోదావరికి వరదొస్తుంది. సగం కాలిన శవం వరదలో కొట్టుకుపోతుంది. నదిలో కొట్టుకొచ్చిన శవాన్ని సహజానంద అనే ఋషి వెలికి తీయించి, కాయకల్ప చికిత్స చేసి ఆ కాయానికి ప్రాణం పోస్తాడు. కొత్తగా ప్రాణం పోసుకున్న ఆ కాయానికి ‘పరంజ్యోతి’ అనే పేరు పెడతారు. పరంజ్యోతి శరీరం యువకునిలా ఉన్నా, శిశువులా, బాలుడిలా ప్రవర్తించి, కౌమారాన్ని అనుభవించి యవ్వనానికి చేరుకుంటాడు. ఉన్నట్లుండి అతనికి తన తల్లిదండ్రులెవరో, బంధువర్గం ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని చెప్పి అతనికి ధ్యానం చేసుకోమని చెబుతారు సహజానంద. కొన్నాళ్ళయ్యాక ఆధ్యాత్మికంగా కాస్త పురోగతి సాధిస్తాడు. ఉన్నట్టుండి ఒకరోజు అతనికి తన గతం గుర్తొస్తుంది. తనని చంపిన బావమరిదిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ప్రస్తుతం ఉన్న సాధు రూపం అతన్నికట్టిపడేస్తుంది. తనలో చెలరేగుతున్న ద్వైధీభావాన్ని అణచుకునేందుకు గురువుగారిని శరణుకోరుతాడు పరంజ్యోతి. మరింత సాధన చేయమని సెలవిస్తారు సహజానంద. ఆధ్యాత్మికంగా క్రమంగా పురోగతి సాధిస్తాడు పరంజ్యోతి. అతనిలోని దుష్ట సంస్కారాలు మెల్లిగా క్షీణించసాగాయి. ఇంతలో నెమలికొండ సంస్థానానికి చెందిన కొందరు ప్రజలు పరంజ్యోతిని చూసి, రామరాజుగా గుర్తిస్తారు. ఇక ఇక్కడి నుంచి రెండు సంస్థానాలలోను, ఆంగ్ల పాలకులలోను అలజడి కలుగుతుంది. గూఢచారులు పరంజ్యోతిని అనుక్షణం గమనిస్తుంటారు. రామరాజు అక్క, అమ్మమ్మ మాత్రం అతన్ని నీడలా వెంటాడి వచ్చి సంస్థానం బాధ్యతలు స్వీకరించమని వేధిస్తుంటారు. అతన్ని ఎలాయినా పాత రామరాజుని చేయాలని పాత పరిచయాలున్న స్త్రీలను నియోగిస్తారు, అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరికి విషయం న్యాయస్థానానికి చేరుతుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పాడు? తాను రామరాజునని పరంజ్యోతి అంగీకరించాడా? అసలు చనిపోయిన మనిషిని అదే శరీరంతో తిరిగి బ్రతికించగలరా? పరంజ్యోతి తన పగ తీర్చుకున్నాడా? ఇవన్నీ ఆసక్తిదాయకంగా ఉంటాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. నవల ప్రొలోగ్‌లో దశమహా విద్యల అధిదేవతల గురించి చెప్పారు రచయిత. చిన్న మస్తాదేవి గురించి చెబుతూ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆ దేవి ఆలయం గురించి చక్కగా వివరించారు. స్థలపురాణంలోని కథని చెప్పి అందులోని అంతరార్థాన్ని వివరించారు.

ఓ సందర్భంలో మజ్జిగలోని రకాల గురించి, వాటిని సంస్కృతంలో ఏమంటారో, ఆధ్యాత్మిక సాథకులు ఎటువంటి మజ్జిగ తీసుకోవాలో తెలియజేసారు.

‘ ఇల్లు ఇరకటం’ , ‘ఆలి మరకటం’ అనే సామెత జనాలో నోళ్ళలో అపభ్రంశమైందని, అసలు సామెత ‘ ఇల్లు ఇరు కవాటం…… ఆలి మరు కవాటం’ అని స్పష్టం చేస్తారు.

ఈశవాస్యోపనిషత్‌లోని “ఓం పూర్ణమద, పూర్ణమిదం పూర్ణాతీ పూర్ణముదుచ్యతే” అనే శాంతిమంత్రానికి రచయిత వివరించిన అర్థం ఎంతో హృద్యంగా ఉంది.

నర్మదా నదీ పరిక్రమ గురించి చెబుతూ, ప్రదక్షిణలో ఒక రోజు ఒక జన్మకి ప్రతీక అని, నదీపరిక్రమని ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించాలని; అలాగే మనం అనేక జన్మలెత్తాక, ఎక్కడ నుంచి అయితే ప్రారంభించామో అక్కడికే తిరిగి చేరుకుంటామని, అదే ఆత్మసాక్షాత్కారమని చెబుతారు.

పంచపాండవులు పాత్రలను సాధకుడికి ఉండాల్సిన లక్షణాలకి ప్రతీకగా మలిచారని, పాండవుల పేర్ల వెనుక ఉన్న నిగూఢార్థాన్ని విడమరచి చెప్పారు మల్లాది.
మనిషిని కట్టిపడేసే బంధం గురించి రచయిత ఆసక్తికరమైన ఉదాహరణలతో వివరించారు.

దురలవాట్లకు మనుషులు ఎలా బానిసలవుతారో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల ఆథ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/-. నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

పరంజ్యోతి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

అందమైన జీవితం

జీవితం సుఖదుఃఖాల మేళవింపు.  దుఃఖాన్ని తట్టుకుంటూ ఆనందాలను ఆస్వాదించడం ఒక కళ. అదే జీవన కళ.

జీవితం సంతోషంగా గడపాలని అందరం కోరుకుంటాం, సంతోషకరమైన సంఘటనలు, సందర్భాల కోసం ఎదురు చూస్తాం.  మన చేతులలోనే ఉన్న, మన చేతల ద్వారా పొందగలిగే చిన్న చిన్న ఆనందాలను తరచూ విస్మరిస్తాం.

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో, కొద్దిపాటి సర్దుబాట్లతో జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవచ్చో ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి తన నవల “అందమైన జీవితం”లో చెబుతారు.

రోజూవారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాలను ఆహ్లాదకరమైన అనుభూతులుగా ఎలా మార్చుకోవచ్చో మల్లాది చెబుతారు.

స్త్రీపురుషుల మధ్య స్వచ్చమైన స్నేహం ఉండడం ఎలా సాధ్యమో ఈ నవల తెలియజేస్తుంది.

కుటుంబ సభ్యులు …ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి నుంచి మరొకరు ఏమి ఆశిస్తారు, వాటిని ఎలా నిలబెట్టుకోవచ్చో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో ఈ నవల తెలుపుతుంది.

తోటి వారికి మనకు వీలైనంత సాయం చేయడంలో ఎంత తృప్తి లభిస్తుందో ఈ పుస్తకం  ద్వారా తెలుస్తుంది.

ఎలా ప్రవర్తిస్తే మనమంతా ఒకరితో ఒకరం మానసికంగా కలిసి ఉండగలుగుతామో, ఎలా ఆనందంగా జీవించగలుగుతామో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

అయితే కాలంతో పాటుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో, వైద్య రంగంలో వచ్చిన పురోగతి వలన ఈ నవలలోని కొన్ని ఘట్టాలు విచిత్రంగా అనిపిస్తాయి…ఉదాహరణ: తన భార్య గర్భంలో ఉన్నది ఒక బిడ్డ లేక ముగ్గురా అనేది భర్తకి తెలియకపోవడం.  ఇప్పుడు చదువుతుంటే ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా, దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం స్కానింగులు అందుబాటులో లేని కాలంలో ఇలా జరగడానికి అవకాశం ఉండేదని మరవకూడదు.

ఎలా ప్రవర్తిస్తే మనమంతా ఒకరితో ఒకరం మానసికంగా కలిసి ఉండగలుగుతామో, ఎలా ఆనందంగా జీవించగలుగుతామో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

ఏదేమైనా, హాయిగా చదివించే పుస్తకం ఇది. దీనిలో చెప్పిన అంశాలను పాటించగలిగితే, మన జీవితాలను కూడా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మీరు కొనుగోలు చేసి లేదా, అద్దెకు తీసుకుని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

అందమైన జీవితం On Kinige

– కొల్లూరి సొమ శంకర్

Related Posts:

మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రింట్లో పుస్తక రూపంలో అలభ్య రచనలు ఇప్పుడు కినిగె పై లభ్యం!

 

మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రింట్లో పుస్తక రూపంలో అలభ్య రచనలు ఇప్పుడు కినిగె పై లభిస్తున్నాయి. అవి –

1. ఓ మంచి మాట

2. తాత్విక కథలు

3. సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర

 

వివరాలు –

ఓ మంచి మాట

రామాయణం, మహాభారతం లాంటి పురాణాలలో, వివిధ ధర్మ శాస్త్రాలలో పెద్దలు చెప్పిన అనేక సుభాషితాలు, ఆథ్యాత్మిక సూత్రాలు ఈ పుస్తకంలో చదవ్వచ్చు. పాఠకులకి విసుగు పుట్టకుండా ఆద్యంతం ఆసక్తిగా చదివించేలా, ప్రతి మంచి మాటకి ముందు ఓ జోక్ ని కలిపి, తరువాత దానికి సరిగ్గా జోడయ్యే సుభాషితం చెప్పడం జరిగింది. ఆథ్యాత్మిక పాఠకులకే కాక, హాస్యాన్ని ప్రేమించే పాఠకులందరికీ ఓ మంచి మాట ఆసక్తికరంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతి డైలీ శుక్రవారం నివేదన పేజీల్లే ఇవి వెలువడ్డాయి.

ఓ మంచి మాట On Kinige

 

తాత్విక కథలు

రకరకాల సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు తెలుసుకోదగ్గ అనేక సూక్ష్మ విషయాలని అతి చిన్న కథలుగా మలిచి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన కథా సంకలనం ‘తాత్విక కథలు.’ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకొనే ఆలోచనలని మనకి ఈ కథలు అందిస్తాయి. చిన్న పిల్లల చేత ఈ తాత్త్విక కథలని చదివిస్తే వారికి బాల్యంలోనే దైవభక్తి, పాపభీతి ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ పాఠకులను కూడా ఈ ‘తాత్త్విక కథలు’ ఆకర్షిస్తాయి.

తాత్విక కథలు On Kinige

 

సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర

కేరళలో పుట్టి, హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసి, కర్నాటకలో కొంతకాలం అనేక ప్రదేశాలలో ఉండి, చివరికి మహారాష్ట్రలోని ముంబయికి నూరు కిలోమీటర్ల సమీపంలో ఉన్న గణేష్ పురిలో స్థిరపడ్డ జీవన్ముక్త అవధూత ‘సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర’ ఇది. ఎందరికో ఎన్నో చమత్కారాలని బాబా చూపించారు. ‘సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర’ ఆథ్యాత్మిక సాధకులని, సాధారణ పాఠకులని కూడా అలరిస్తుంది.

సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర On Kinige

Related Posts: