మెడికో శ్యాంగా ప్రసిద్ధులైన డాక్టర్ చిర్రావూరి శ్యాం కథలు చదవడం, వాటి గురించి రాయడం అదో ముచ్చటైన ముచ్చట. ఇవి కథలా…ఊహూ… కవితలా… కాదే… మరి భయానక బీభత్స, సైకో అనాలసిస్లా.. కానే కాదు.. మ్యూసింగ్స్లాంటి… కవితాత్మక వచనం!! మొదట గాలికి నడిచాను.. తర్వాత నడవాలని నడిచాను.. నడవలేక ఆగాను.. ఆగి గతం తలచాను… ఇంతకీ నడిచానా లేదా.. అని తనని తనే ప్రశ్నించుకొని, మారని కాలాన్ని వడసి పట్టి, తనదైన చమక్కుతో చురుకుమనేలా మనకి అందించారు.. వీటికి ఉదాహరణ.. కథకుని కథ, ఆలోచనల ట్రైన్లో, సాహిత్యం కథ.
ఈ కథలు చదవటం ఒక అనుభవం.. అన్ని అనుభవాల్లాగే.. ఎవరికివారు అనుభవించి.. కథకుడు చెప్పిన విషయాల్ని అర్థంచేసుకొని, చెప్పలేని భావాన్ని కూడా ఆస్వాదించేలా చేస్తాయి. ఒక్కోసారి ఇది ఒక కొటేషన్ల పుస్తకంలా అనిపిస్తుంది… మరోసారి… జీవన సారాన్ని కాచివడపోసిన వైద్యవృత్తిలో మనుషుల శరీరాల్ని, రచయితగా వాళ్ళ మానసిక ప్రవృత్తులను కూడా.. యవ్వన గీతలంత స్పష్టంగా చెప్తారు.
ఒక్కోసారి.. శ్యాం ఎలక్తడ్ థాట్స్ లాంటి…ఈ కథలు చదువుతుంటే… మన ఆత్మని మనం స్పర్శిస్తున్నట్టు ఉంటుంది. ఈ ముసుగులన్నీ తీసి మానవత్వంవైపు.. అది అర్థంచేసుకొనే మనుష్యుల వైపు…వాళ్ళ మనసులవైపు మనల్ని నడిపిస్తాయి.
నాకున్న సెక్తోరియాల్ చదువరులు నాకు చాలు అని రచయిత ధైర్యంగా చెప్పగలిగినా… అంత నిజాయితీని కావాలనుకుంటూ… భరించలేని మనుషులు కూడా ఏకాంతంలో.. నిజాన్ని ఒప్పుకుని… ఒక సంజాయిషీ లాంటి.. సంవేదన పడేలా చేసే కథలివి..!!
కాదేదీ కవితకనర్హం.. అన్నారు కవి వర్యులు.. శ్యాంగారి లాంటి వారి చేతిలో పడితే, కాఫీ, ముక్కుపుడక, యెర్ర జాకెట్టు, మెత్తబుగ్గలు కూడా అద్భుత కథావస్తువులవుతాయని.. ఇందులో కథలు చదివితే తెలుస్తుంది.ఇక.. వ్యక్తిగా సామాజిక దృక్పధాన్ని.. మనలోని మారని తనాన్ని, యిట్టే చెప్తాయి ఈ కథలు,. ప్రత్యేక ఉదాహరణ, డౌరీ హౌమచ్..? లాంటి కథలు… ఈ రచయిత ఈ కథలన్నీ అతని విద్యాకాలంలో అంటే అరవై డెబ్భై దశకాల్లో రాసారంట… నిజం.. కుర్ర డాక్టర్ల కలల షామియానా మీద ఒట్టు…!!
కొన్ని కథలు, మ్యూసింగ్స్ మాత్రమే రాసినా.. అవన్నీ ఒక కావ్యంలా అనిపిస్తాయి… సామాజిక పరిస్థితులపైన అశక్తతని కూడా… అందమైన కవితాత్మక సందేశాలు… మనల్ని హడావిడి పెట్టకుండా ఆలోచింపచేస్తాయి. ఉయ్యాలలో కూర్చున్న వాళ్ళు ముందుకే కాదు.. వెనక్కి కూడా ఊగుతారు.. ఎక్కువగా తూగకుండా ఈ కథలు మనల్ని మానవత్వం వైపుకి వడిసి పట్టటం ఖాయం.
– సాయి పద్మమూర్తి, ఆంధ్రభూమి దినపత్రిక 30/09/2012
* * *
శ్యామ్యానా డిజిటల్ రూపంలో కినిగెలోలభిస్తుంది. మరిన్నివివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
శ్యామ్యానా On Kinige