ఎన్నారై కథలు

కినిగెలో ఉన్న ప్రవాసాంధ్ర రచయితల కథల సంక్షిప్త పరిచయం ఈ వ్యాసం.

ఎన్నెమ్మ కథలు:
చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడిపడిపోయిన రచయిత్రి నిడదవోలు మాలతి కథల సంకలనం ఇది. ఎన్నెమ్మ కథలు అనేవి నిడదవోలు మాలతి గారు తన బ్లాగులో ’ఊసుపోక’ అనే శీర్షికతో రాసుకున్న టపాల సంకలనం. పత్రికలలో ప్రచురించాలి అంటే అది కథో, వ్యాసమో, కవితో, ఫీచరో అయి ఉండాలి. ఇలాంటి వర్గీకరణ చట్రాలలో ఇమడవు ఈ ఎన్నెమ్మ కథలు. ఎన్నో చెణుకులు, చురకలు, చమక్కులు ఉన్న వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఎన్నెమ్మ కథలు On Kinige

శ్యామ్‌యానా:
మెడికో శ్యామ్‌గా సుప్రసిద్ధులైన డా. చిర్రావూరి శ్యామ్ రాసిన కథల సంకలనం ఇది. రచయిత మెడికో అయినప్పటికీ, ఈ సంకలనంలో వైద్యం, ఆసుపత్రి, రోగుల నేపధ్యంలో అల్లిన కథలు తక్కువే. ఈ కథలను రచయిత 1971/72 నుంచి 1979 మధ్యలోనూ, ఐ.సి.సి.యు అనే కథని 1981-82 మధ్యకాలంలోను రాసారు. వీటిని ఓ సంకలనంగా తెచ్చే ప్రయత్నం 2010 నాటికి సాధ్యమైంది. ఈ కథా సంకలనాన్ని జులై 2010లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు. మంచి కథలున్న ఈ శ్యామ్‌యానా హాయిగా చదివిస్తుంది.
శ్యామ్‌యానా On Kinige

రంగుటద్దాల కిటికీ:
బ్లాగ్ ప్రపంచంలో కొత్తపాళీగా ప్రసిద్ధులైన ఎస్. నారాయణ స్వామి గారి కథాసంకలనం ఇది.
అమెరికా అవడానికి లేండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అయితే అవచ్చు కాని, అమెరికాలో జీవితం పూలబాట కాదు. అలాగని భరించలేనిదీ కాదు. సాధారణంగా అమెరికాకి సంబంధించిన తెలుగు కథల్లో కనబడే ఆహార భాషా వ్యవహార భేదాల చర్చని అధిగమించి, వలసవచ్చిన తెలుగు మనుషులు ఈ అమెరికా సమాజంలో అంతర్భాగమయ్యే ప్రయత్నంలోని అనుభవాలని కొంచెం లోతుగా, మరికొంచెం విశాలంగా పరిశీలిస్తూ – కొన్ని సరదా కథలు, కొన్ని ఆలోచింపచేసే కథలు, మరి కొన్ని సులభంగా మరిచిపోలేని కథలు, చక్కని భాష, కథకి తగిన కథన శిల్ప వైవిధ్యం – అన్నీ కలిసి రంగుటద్దాల కిటికీ.
రంగుటద్దాల కిటికీ On Kinige

సరిహద్దు:
గొర్తి సాయి బ్రహ్మానందం గారి రచన “సరిహద్దు”. అన్ని చక్కని కథలైనా, పుస్తకం శీర్షిక అయిన సరిహద్దు కథ అద్భుతంగా ఉంటుంది. మెక్సికో సరిహద్దు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన హేవియర్ అనే ఓ వ్యక్తి కథ ఇది. స్వదేశంలో ఇంటి దగ్గర చిన్నచిన్న పనులైనా చేసి ఎరుగని వ్యక్తి అమెరికాలో జానిటర్‌గా పనిచేస్తాడు. అమెరికన్లు తలచుకుంటే ఇల్లీగల్‌గా దేశంలో ఉంటున్న వారిని ఏరేయడం పెద్ద కష్టం కాదు, కానీ మరెందుకు అలా చేయడం లేదు? దాని వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? ఈ అమెరికా అన్నది ఓ మాయాజాలమని, వయసులో ఉన్న కుర్రాడు అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈ దేశపు మాయలో పడిపోతారంటాడు హేవియర్. మనసు భారమైపోతుందీ కథ చదివాకా.
సరిహద్దు On Kinige

ఉరి:
బ్లాగర్ శరత్ నాగం రచించిన నవల ఇది. ఇది ఒక మనో వైజ్ఞానిక నవల మరియు మానసిక విశ్లేషణాత్మక నవల. మానసిక మాంద్యంతో, అలజడితో వ్యక్తులు ఎలా యాతన అనుభవిస్తారో, తమకు సరిపడని బాహ్య ప్రపంచంతో ఎంత సంఘర్షణ అనుభవిస్తారో ఒక చక్కని థ్రిల్లర్ రూపేణా ఉత్సుకత కలిగిస్తూ చెప్పడం జరిగింది. ఇది చదవడం వలన మనోరుగ్మతల గురించి మంచి అవగాహన రాగలదు. ఓ రకంగా ఇది రచయిత ఆత్మకథగా అనుకోవచ్చు.
ఉరి On Kinige

మూడోముద్రణ:
కన్నెగంటి చంద్ర రాసిన 22 కథల సంకలనం ఇది. అన్నీ కథలు బావున్నా, “సిగ్గు కథ” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. చిన్న పాప నుంచి, పెళ్ళయి శ్రీమతిగా మారేవరకు ఆడపిల్లల జీవితం ఎలా సాగుతుందో ఈ కథ చక్కగా చెబుతుంది. తలను నేలకు తాకేదాకే వంచగలిగే స్థితికి స్త్రీలు ఎందుకు చేరుతారో ఈ కథ చెబుతుంది. ఓ మహిళ అచ్చమైన ఆడదిగా ఎలా మారిపోతుందో చెబుతుందీ కథ. మిగతా కథలూ తక్కువేం కాదు.
మూడోముద్రణ On Kinige

* * *

విభిన్న సమాజాల కథలను భిన్న దృక్పథాల నుంచి చదవడం గొప్ప అనుభూతి. వీటిని హాయిగా ఆస్వాదించవచ్చు.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కాలేజీ కథల, వ్యక్తిత్వ కలల షామియానా

మెడికో శ్యాంగా ప్రసిద్ధులైన డాక్టర్ చిర్రావూరి శ్యాం కథలు చదవడం, వాటి గురించి రాయడం అదో ముచ్చటైన ముచ్చట. ఇవి కథలా…ఊహూ… కవితలా… కాదే… మరి భయానక బీభత్స, సైకో అనాలసిస్‌లా.. కానే కాదు.. మ్యూసింగ్స్‌లాంటి… కవితాత్మక వచనం!! మొదట గాలికి నడిచాను.. తర్వాత నడవాలని నడిచాను.. నడవలేక ఆగాను.. ఆగి గతం తలచాను… ఇంతకీ నడిచానా లేదా.. అని తనని తనే ప్రశ్నించుకొని, మారని కాలాన్ని వడసి పట్టి, తనదైన చమక్కుతో చురుకుమనేలా మనకి అందించారు.. వీటికి ఉదాహరణ.. కథకుని కథ, ఆలోచనల ట్రైన్‌లో, సాహిత్యం కథ.
ఈ కథలు చదవటం ఒక అనుభవం.. అన్ని అనుభవాల్లాగే.. ఎవరికివారు అనుభవించి.. కథకుడు చెప్పిన విషయాల్ని అర్థంచేసుకొని, చెప్పలేని భావాన్ని కూడా ఆస్వాదించేలా చేస్తాయి. ఒక్కోసారి ఇది ఒక కొటేషన్ల పుస్తకంలా అనిపిస్తుంది… మరోసారి… జీవన సారాన్ని కాచివడపోసిన వైద్యవృత్తిలో మనుషుల శరీరాల్ని, రచయితగా వాళ్ళ మానసిక ప్రవృత్తులను కూడా.. యవ్వన గీతలంత స్పష్టంగా చెప్తారు.
ఒక్కోసారి.. శ్యాం ఎలక్తడ్ థాట్స్ లాంటి…ఈ కథలు చదువుతుంటే… మన ఆత్మని మనం స్పర్శిస్తున్నట్టు ఉంటుంది. ఈ ముసుగులన్నీ తీసి మానవత్వంవైపు.. అది అర్థంచేసుకొనే మనుష్యుల వైపు…వాళ్ళ మనసులవైపు మనల్ని నడిపిస్తాయి.
నాకున్న సెక్తోరియాల్ చదువరులు నాకు చాలు అని రచయిత ధైర్యంగా చెప్పగలిగినా… అంత నిజాయితీని కావాలనుకుంటూ… భరించలేని మనుషులు కూడా ఏకాంతంలో.. నిజాన్ని ఒప్పుకుని… ఒక సంజాయిషీ లాంటి.. సంవేదన పడేలా చేసే కథలివి..!!
కాదేదీ కవితకనర్హం.. అన్నారు కవి వర్యులు.. శ్యాంగారి లాంటి వారి చేతిలో పడితే, కాఫీ, ముక్కుపుడక, యెర్ర జాకెట్టు, మెత్తబుగ్గలు కూడా అద్భుత కథావస్తువులవుతాయని.. ఇందులో కథలు చదివితే తెలుస్తుంది.ఇక.. వ్యక్తిగా సామాజిక దృక్పధాన్ని.. మనలోని మారని తనాన్ని, యిట్టే చెప్తాయి ఈ కథలు,. ప్రత్యేక ఉదాహరణ, డౌరీ హౌమచ్..? లాంటి కథలు… ఈ రచయిత ఈ కథలన్నీ అతని విద్యాకాలంలో అంటే అరవై డెబ్భై దశకాల్లో రాసారంట… నిజం.. కుర్ర డాక్టర్ల కలల షామియానా మీద ఒట్టు…!!
కొన్ని కథలు, మ్యూసింగ్స్ మాత్రమే రాసినా.. అవన్నీ ఒక కావ్యంలా అనిపిస్తాయి… సామాజిక పరిస్థితులపైన అశక్తతని కూడా… అందమైన కవితాత్మక సందేశాలు… మనల్ని హడావిడి పెట్టకుండా ఆలోచింపచేస్తాయి. ఉయ్యాలలో కూర్చున్న వాళ్ళు ముందుకే కాదు.. వెనక్కి కూడా ఊగుతారు.. ఎక్కువగా తూగకుండా ఈ కథలు మనల్ని మానవత్వం వైపుకి వడిసి పట్టటం ఖాయం.

సాయి పద్మమూర్తి, ఆంధ్రభూమి దినపత్రిక 30/09/2012

* * *

శ్యామ్‌యానా డిజిటల్ రూపంలో కినిగెలోలభిస్తుంది. మరిన్నివివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
శ్యామ్‌యానా On Kinige

Related Posts:

శ్యామ్‌యానా

మెడికో శ్యామ్‌గా సుప్రసిద్ధులైన డా. చిర్రావూరి శ్యామ్ రాసిన కథల సంకలనం ఇది. “సాహిత్య కుటుంబంలో జన్మించిన శ్యామ్ చిన్ననాటి నుంచే గొప్ప సాహితీపరుల సాంగత్యంలో పెరిగారు. తండ్రీ, రోణంకీ, చాసో…వంటి వారి మాటలు….వాదనలు…. ఇంటినుండా ఉన్న ఉత్తమమైన పుస్తకాలు – వీటన్నింటికీ తోడు గొప్ప ధారణా శక్తితో శ్యామ్‌లో రిఫ్లెక్టివ్ థాట్‌కి పునాది పడింది” అని అంటారు ఈ కథల గురించి, కథకుడి గురించి రాసిన చాగంటి తులసి గారు.

రచయిత మెడికో అయినప్పటికీ, ఈ సంకలనంలో వైద్యం, ఆసుపత్రి, రోగుల నేపధ్యంలో అల్లిన కథలు తక్కువే. ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

మధ్యతరగతి మనస్తత్వాలను, ఓ ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రిందటి మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ” ఇదీ మా కథ“లో చక్కగా చిత్రించారు.

తేడా” అనే చిన్న కథ సరదాగా ఉంటుంది. చురుక్కుమనిపిస్తుంది.

గీతలు” కథలో ప్రేయసికి తనకిష్టమైన హిందీ పాటలు వినిపించాలనుకుంటాడు ప్రియుడు. ప్రేయసికేమో తెలుగు పాటలిష్టం. ఏవేవో మాట్లాడనుకుంటాడు ప్రియుడు, కానీ వారు కలిసినప్పుడు ఆ సమావేశం – ఇద్దరు మేధావులు పావుగంట సేపు కలుసుకున్నంత మౌనంగా ఉంటుంది. ప్ర్రేమంటూ అమ్మాయిల వెంట పడేవారి మనస్తత్వాన్ని ఈ కథలో వివరించే ప్రయత్నం చేసారు రచయిత.

రామం ఇంజనీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తూ, పెళ్ళికి సిద్ధంగా ఉంటాడు. పెళ్ళిచూపుల కోసం ఓ పల్లెటూరు వెడితే, అక్కడ అతన్ని స్వాగతించడానికి కాబోయే పెళ్ళికూతురు రాధే స్వయంగా వచ్చేసరికి రామం ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ నడుస్తూ రాధ వాళ్ళింటికి బయల్దేరుతారు. రాధ ఆధునిక యువతని, ఆమె ఇష్టాలు, తన ఇష్టాలు కలవవని రామం అర్థం చేసుకుంటాడు. ఇల్లు చేరాక, రాధ కుటుంబ సభ్యులతో పరిచయాలవుతాయి. అందరూ అతనిని ఆకట్టుకుంటారు. ” నాకు ఆంధ్ర వనిత కావాలి గానీ, ఆధునిక వనిత కాదని ఎలా చెప్పడం?” అని రామం తటాపటాయిస్తాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే “వేయబోవని తలుపు” కథ చదవాల్సిందే.

వారిజాక్షులందు” కథలో రైలు ప్రయాణంలో జరిగే పదనిసల్ని హాస్యంగా వివరిస్తారు రచయిత. ప్రయాణంలో ఆడ మగల మధ్య అనవసరంగా సాగే సంభాషణల పట్ల చిరాకు వ్యక్తం చేస్తారు. ‘ అసలెందుకు వారిజాక్షులందు కుర్రాళ్ళు చిత్తం చిత్తం అంటారో ‘ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘ చిత్తం చిత్తమే ‘నని నవ్వుతారు. ఈ కథలోని ఓ వాక్యం ‘ రైల్లో పరిచయాలు రైల్లోనే. రైల్లో లవ్ అంటే సినిమాల్లో హర్షిస్తారేమో గానీ బైట తంతారు…. ‘ చాలా వాస్తవికంగా ఉంటుంది.

‘మనుషుల మీద నమ్మకం లేకపోతే జీవితం జిడ్డుగా అయిపోతుంది. స్మూత్‌నెస్ నశిస్తుంది’ అని అంటారొకరు. ఎందుకు? ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిందో తెలుసుకోవాలంటే “సన్నాయి పాట” కథ చదవాలి.

‘కొందరు ముందు సంపాదిస్తారు, కొందరు వెనుక. కొందరు ఎక్కువ సంపాదిస్తే మరికొందరు తక్కువ.. కొందరు న్యాయంగా, కొందరు అన్యాయంగా… ఏది కావలిస్తే అది ఎన్నుకో. దేని సుఖాలు దానివి, దేని కష్టాలు దానివి’ అంటారు రచయిత “సరాగమాల” కథలో.

‘ప్రతీ విషయానికి కదిలీ, అసంతృప్తి స్థితిలో, అసహాయ స్థితిలో, క్షణక్షణం స్ట్రెస్‌కి స్టెయిన్‌కీ లోనౌతూ ఏదో చేయాలని తెలిసినా ఏం చేయాలో తెలీక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న యువతీయువకుల కథ “హంతకుడి కథ“.

‘మనుషులు ఎందుకు వాళ్ళ తెలివితేటలని చూపాలని ప్రయత్నిస్తారు?’ అని అడుతుతూ, ‘బ్రిలియన్సీ మస్ట్ బీ ఎపారెంట్, బట్ నాట్ టు బీ ఎక్టివేటెడ్’ అని అంటారు “ముక్కు పుడక” కథలో. ఓ అతివ అతిశయం గురించి చెబుతుందీ కథ. ఓ వైద్యుడు ఆసుపత్రిలో వివిధ రోగులతో ప్రవర్తించే తీరుని తెలియజేస్తుందీ కథ.

క్రేన్” అనే చిన్న కథని చదువుతుంటే, అందులోని వ్యంగ్యానికి మన ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది.

ఉత్తమ రచనలు ఉన్నాయా లేవా అంటూ ఈనాడు మనం వాపోతున్నట్లే, దాదాపు ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ క్రితం రచయిత కూడా వాపోయారు. ‘ నీకు చూడాలని ఉండాలే గాని ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తుంది ఉత్తమ రచన. మనం గ్రహించడంలో ఉంటుంది’ అంటారు రచయిత “నత్తివాడి కథ“లో. నత్తితో ఆత్మన్యూనతకి గురైన ఓ వ్యక్తి పుస్తకాలతో స్నేహం చేస్తాడు. రేడియో వినడం అలవాటైన అతనికి రేడియోలో మాట్లాడేవారిలో చాలామంది అనేక పదాలను సరిగా పలకలేకపోతున్నారని అర్థమవుతుంది. ‘నాకు తెలిసినా పలకలేను’ అనుకుంటాడు. ఆర్ద్రత నిండిన కథ ఇది.

కథకుడి కథ” లోని ఘటనలు దాదాపుగా అందరు రచయితలకు ఎదురయ్యేవే.

లీవిట్” కథ తాము సంస్కారవంతులం అనుకునేవారి సంస్కారాన్ని బయటపెడుతుంది.

సాహిత్యం కథ” లో రచయిత వర్ణించిన పరిస్థితులు ఈనాటికీ కొనసాగుతునే ఉన్నాయి. ‘సాహిత్యం కూడా బురఖావే’ అయిపోయిందని వాపోతూ, ఎక్కడో సుదూర సీమలో సాహిత్యాన్ని జీవితం కంటే విలువైనదిగా భావిస్తూ, సాహిత్యాన్ని పీలుస్తూ, సాహిత్యాన్ని జీవిస్తూ, ప్రపంచం దృష్టిలో పడని వారి కోసం రాసిన కథ ఇది.

కట్నం తీసుకోడాన్ని ఇద్దరు ప్రేమికులు ఎలా సమర్థించుకున్నారో, ఎంత గడుసుగా ప్రవర్తించారో తెలుసుకోవాలంటే “డౌరీ హౌ మచ్” కథ చదవాలి.

కుష్టు వ్యాధిగ్రస్తుడు బస్ ఎక్కితే, అతన్ని ఆ బస్ ఎక్కేందుకు అనుమతించినందుకు తోటి ప్రయాణీకులు విసుక్కుంటారు, ఆ ప్రయాణం చేయాల్సివచ్చినందుకు తమని తాము నిందించుకుంటారు. అయితే అదే బస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ వ్యాధి అంత ప్రమాదకరం కాదని, సరైన మందులు వాడితే తగ్గిపోతుందని బిగ్గరగా అరచి చెప్పాలనుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోతాడు. అప్పటి దాక తనని తాను – రోగుల వ్యధని గుర్తించగలిగే వైద్యునిగా ఊహించుకున్న అతను కూడా ఓ రోగే. గొంతు కాన్సర్ కారణంగా అతని స్వరపేటిక తొలగించబడింది. “సాటి మనిషి కష్టాలు అర్థం చేసుకోడానికి నువ్వు అలాంటి కష్టాన్ని పడివుండాలి అనే సత్యాన్ని చెబుతున్నట్లుగా రెండు కన్నీటి చుక్కలు రాలి నేల మీద పడతాయి. “వెన్నెల సోన” అనే కథ చదవండి.

ఈ కథలను రచయిత 1971/72 నుంచి 1979 మధ్యలోనూ, ఐ.సి.సి.యు అనే కథని 1981-82 మధ్యకాలంలోను రాసారు. వీటిని ఓ సంకలనంగా తెచ్చే ప్రయత్నం 2010 నాటికి సాధ్యమైంది. ఈ కథా సంకలనాన్ని జులై 2010లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.

మంచి కథలున్న ఈ శ్యామ్‌యానా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది
శ్యామ్‌యానా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: