మగవారి కోసం తెలుగు కవితలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ కవితాసంకలనాన్ని రచించినది అరుణ్ సాగర్. ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఈయన గతంలో “మేల్ కొలుపు” అనే కవితాసంకలనాన్ని వెలువరించారు.
అరుణ్ సాగర్ కవిత్వంలో వస్తురూపాలు కలగలసి పోతాయని, నిజానికి సాగర్ కవిత్వంలో కనిపించేది వస్తు వైవిధ్యమో లేక, రూప వైవిధ్యమో కాదని అది అనుభవ సందర్భ వైవిధ్యమని అంటారు ఈ పుస్తకానికి ముందు మాట రాసిన సీతారాం.
దాపరికాలు….దాగుడుమూతలు..నక్క వినయాలు…..బేవార్స్ మాటలు మచ్చుకైనా కనవడవీ సంకలనంలో అని అంటారు ప్రసాదమూర్తి.
ఈ పుస్తకంలోని కొన్ని కవితలను చూద్దాం.
భ్రమరమోహం: ఏదో సౌందర్యం కోసం వెదుకుతున్నాడు కవి ఈ కవితలో:
“ఏమరుపాటున రాలిపడి/ ఏ సౌందర్యం కోసమో/కళ్లు అరచేతుల్లో అద్దుకుని/శిశిరాకాశం కింద/అనుమానాస్పదంగా సంచరిద్దాం”
హోమ్‌కమింగ్: చాలా రోజులకు ఇంటికి తిరిగొచ్చే వారి భావానుభూతులను కవి చక్కగా వర్ణించారు. తమ కోసం ప్రకృతి ఎలా ఎదురుచూస్తుంటుందో వివరించారు:
“చిన్నప్పటి ఫోటోని /గుండెకు తగిలించుకున్న మట్టి గోడ/నా కోసం వానలో తడిసి/పరిమళాలు పోయింది/వంగిన చూరు నుంచి” -ఎంత ఆహ్లాదకరమైన భావన. తాను అక్కడందరికి పరిచయమేనని చెపుతూ
“అందుకే కదా/ నేను వచ్చానో లేనో/టేకు చెట్టు/పూల గుచ్ఛంతో నవ్వింది/ ఓ పాట పింఛం విప్పింది” అని అంటారు.
ది డోర్స్: తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో తనలోకి తాను రావాలనుకుంటాడో వ్యక్తి. గుండె కవాటాలను తెరచుకోవాలనుకుంటాడు.
“కుటుంబం నుంచి/కార్యాలయం నుంచి/రక్తపాశాల నుంచి/ఆడవాళ్ళ నుంచి / అడుక్కుతినేవాళ్ళ నుంచి / మొబైల్ ఫోన్ నుంచి /గడియారం లోంచి/ ఏటిఎం మిషన్ లోంచి/గోడలు దూకి దూసుకువస్తున్నాను”
నీలె గగన్ కె తలె: పాటల్ని ప్రేమించే ఓ భావుకుడి కవిత ఇది. నా గడచిన రోజుల్ని ఎవరైనా వెనక్కి తెస్తే బాగుండు అనుకుంటాడు.
షాన్: తన జీవితానికి ఘనసమయం గురించి చెబుతున్నాడు ఇందులో.
“నా ఖజానా తెరిస్తే /స్నేహితులు/తన్హా సఫర్ /ఆకాశం కింద ఎన్నో రుతువులు/పలురుచులు /విసవిసా దాటిన దశలు…..
“జీవితపు ఘనసమయం/నేనకసాన్నంటిన!”
సాలభంజిక: ఇది ఇలియానా గురించి రాసిన కవిత
“మగధ నుంచి /నేరుగా దిగుమతి చేసుకున్న/గాంధార శిల్పం/కళింగ తీరపు/ లావణ్య రేఖావిలాసం”
టి. ఆర్. పి: డెడ్లైన్లే లైఫ్‌లైన్లని చెబుతారు ఈ కవితలో.
“ప్రతీరోజూ ఒక పరీక్ష/ప్రతీరోజూ ఒక ఫలితం / ప్రతివిజయం ఇంధనం/ ప్రతి స్వప్నం రేపటి కోసం/”
“టుమారో నెవర్ డైస్/మనకు కావాలి/అంతులేనన్ని టుమారోస్”
24 సెవెన్: ఈ కవితలో ఫ్రేముల గురించి చెబుతారు.
“నీ చుట్టూ నా చుట్టూ ఫ్రేముల్/సెకనుకు ఇరవైఅయిదు వేగంతో”
“ఫ్రేములు ప్రేమలు/అద్దం పట్టిన అన్నం మెతుకులు”
లాగాఫ్: ఈ కవితని సాటి పాత్రికేయులకి అంకితమిచ్చారు.
“మోడీగార్డ్ అద్దాల గోడ/కలం వీరుడా/సృజనశీలుడా/ఆట మొదలైంది/ష్ నిశ్శబ్దం/…….” ఇదో పత్రికాఫీసుని స్ఫురింపజేస్తుంది.
మరణవాంగ్మూలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపధ్యంలో క్షణక్షణం చెదిరిపోతున్న మునిగిపోతున్న మానవుని జాడలు వెతుకున్నారు కవి ఈ కవితలో. ప్రతీదీ తొలగించబడుతుంది రెవెన్యూ రికార్డులలోంచి అని బాధపడతారు.
“పాయం బొజ్జిగాడు/లాస్ట్ ఆఫ్ ది కోయాస్/పెరిగి పెద్దయి/అలెక్స్ హేలీ అవుతాడా/ఆనకట్ట వెనుక అశ్రుజలథిలో/సీతమ్మ ముక్కుపుడక వెతుకుతాడా/లేక /అంతర్ధానపు అంచుల వేలాడి/రామాపితికస్ వలె/ఆంత్రోపాలజీ పాఠమవుతాడా”
జేగురు రంగు జ్ఞాపకం: ఈ కవితలో తన పాత స్నేహితులను, సామ్యవాద భావజాలపు అనుచరులను తలచుకుంటారు.
“ఒక రెట్రోవేదన మదిలో కదిలినప్పుడు/నా కార్పోరేట్ చింతల కొలిమిలోంచి/ఒక నిప్పు రవ్వ వేరుబడి -/ నిద్రించిన చైతన్యపు అంచులు ముట్టించినప్పుడూ/కామ్రేడ్స్!/మిమ్మల్నే తలచుకుంటాను”
కులగ్యులా: ఈ కవితలో కులపిచ్చి ఉన్న వాళ్ళని ఆక్షేపిస్తారు కవి.
సెంట్ ఆఫ్ ఎ ఉమన్: అరుణ్ సాగర్ కవితలు మగవాద కవితలని, స్త్రీవాద వ్యతిరేక కవితలని శంకించేవారు తప్పక చదవాల్సిన కవిత ఇది.
నెత్తుటి రుణం: పెట్రోలియం వనరుల కోసం ఇతర దేశాలపై అగ్రరాజ్యం చేస్తున్న దాష్టీకాన్ని వివరిస్తుంది ఈ కవిత.
“రాలిపడ్డ కుత్తుకలలో/కుతకుత ఉడుకుతున్న ప్రశ్నలు/నూనెకి నెత్తుటికి మధ్య రగులుతున్న రసాయన/ చర్యలు”
“ఎన్ని గాలన్ల నెత్తురు పోస్తే మీ కార్లు పరిగెడతాయి?/ఎన్నెన్ని మాంసఖండాలని పిండితే మీ ఆయిల్ దాహం తీరుతుంది?”
కవి పట్ల ప్రీ-ఫిక్స్డ్ నోషన్స్ లేకపోతే ఈ కవితలను హాయిగా ఆస్వాదించవచ్చు.
ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ.30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.
మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige

Related Posts: