మిసిమి మార్చి 2012 సంపాదకీయం

భామనే… సత్యభామనే… అంటూ కూచిపూడి నృత్యరీతులను సత్యభామ వాలుజడ తాకిడితో నేల నాలుగు చెరుగులా తీసుకువెళ్ళిన కళాకారులు వేదాంతం సత్యనారాయణ శర్మ – సత్యభామకు ఏ విధంగా అంచెలంచెలుగా మెరుగులు దిద్దారో ఆయన వివరణ చదవండి.

శ్రీకాకుళంలో ఎగళ్ళ రామకృష్ణ అని సాహిత్య కళాభిమాని వున్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు రంగరంగ వైభవంగా జరిపి అన్ని రంగాల ప్రతినిధులకు పూలదండలు వేస్తారు, పురస్కారాలు ఇస్తారు. ఆ సందర్భంగా ‘ఆధునిక సాహిత్య ధోరణులు’పై సదస్సు నిర్వహించి వ్యాసాలను ఆహ్వానించారు. అందులో కొన్నింటిని వారి సౌజన్యంతో మిసిమి పాఠకులకు అందిస్తున్నాము.

మనకు రంగుల పండగ దసరానే. కాని ఒకప్పుడు రెడ్డి రాజుల కాలంలో ‘వసంతోత్సవం’ -ఇప్పటి హోళీ లాంటిదే – నిర్వహించేవారని వేదుల రాజేశ్వరి తెలియజేస్తున్నారు.
రేడియోతో పెరిగాము ఒక తరం. అప్పతి కవులు, సాహిత్యకారులు, ఆకాశవాణిని ఎంతో పరిపుష్టం చేసారు. ఆకాశవాణి బాణిని, చరిత్రను ఓలేటి పార్వతీశం అ, ఆ ల దగ్గర్నించి వివరిస్తున్నారు.

కుప్పడు ఎలా అక్షరభిక్ష పెట్టాడో ఈ నెల ‘సామాన్యుడి సాహిత్యం’లో తెలుసుకుంటే మనసు ఆర్ద్రమై పోతుంది.

మనకు స్వాత్రంత్ర్య భిక్ష పెట్టిన వారిలో ఎందరో మనకు తెలియనే తెలియదు. ఉరితాడుని పూలదండలా వేసుకుని దేశం కోసం నవ్వుతూ ప్ర్రాణాలర్పించిన ‘బిస్మిల్’ ఉత్తరాన్ని చదివితే మన బాధ్యత కొంతవరకైనా తెలుస్తుందేమో.

నాలుగు ‘అట్టమీది బొమ్మలు’ నల-దమయంతి కథకు సంబంధించినవి -రష్యన్ చిత్రకారుడు పెన్‌బర్గ్ ఆవిష్కరణ.

అమ్మ సత్యమని, నాన్న నమ్మకమని వింటుంటాము. తమ ఆశయం కోసం, తల్లి లేని కొడుకుని పెంచి ప్రపంచానికివ్వటానికి, తన వయసును పేదల సేవల ఆవిరి చేస్జుకున్న తండ్రి విశ్వాసమే సత్యమనిపిస్తుంది – ‘డాక్టరు గారు’ చదవండి.

సంపాదకులు

* * *

మిసిమి మార్చి 2012 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ అనుసరించండి.

మిసిమి మార్చి 2012 On Kinige

Related Posts:

మిసిమి ఫిబ్రవరి 2012 సంచిక సంపాదకీయం

చరిత్రలో ఎన్నో సిద్ధాంతాలు – వాదాలు మానవజాతి పురోగమనానికి దోహదం చేశాయి. కొన్ని తిరోగమనానికీ సహకరించాయి. అయితే ఏదీ శాశ్వత పరిష్కారం చూపలేదు. చర్చకు, ఆచరణ సాధ్యానికి మధ్య ఎంతో అగాధం వుంటుంది. వాదాలన్నీ ఏకరువు పెట్టే సందర్భం కాకపోయినా, మానవీయ సంబంధాలను ఎక్కువగా ప్రభావితం చేసిన స్త్రీ వాద మూలాలెక్కడ అని చూడబోతే, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలే వెలుగులోకి వచ్చాయి. అలాగే తెలుగులో స్త్రీ వాద రచనల తీరుతెన్నులు స్పృశించి వివరించారు త్రివేణి.

భారతీయ నాటకం ఎలా వుందో – ఎలా వుండేదో – ఎలా వుండాలో ఎంతో సాంకేతికంగా విపులీకరించి లోతుపాతలను తెలియజేశారు తెలుగు నాటకానికి ఊపిరులూదుతున్న చాట్ల శ్రీరాములు.

ఈ నాటి క్లిష్టపరిస్థితులలో ‘మేధావి’ ఏం చేయాలి? ఏమి చేయగలడు? ఎందుకు ఇంత దీనావస్థలో మిగిలిపోతున్నాడు? ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ చర్చకు తెర తీసినవారు వేదాంతం లక్ష్మీప్రసాదరావు.

మనకు కలంకారీ అంటే పెడన – బందరు. కానీ శ్రీకాళహస్తి కలంకారీ కళ ప్రత్యేకతను, ఆధునికీకరించిన తీరును వివరించాము ఈ సంచికలో.

దగ్గర బంధువులో, మిత్రులో తమ సన్నిహితులను కోల్పోతే – మనకు ఓదార్చేందుకు మాటలే దొరకవు. ఈ ఓదార్పు ఉత్తరం చదవండి.

ఈనాటి అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి మూలాలెక్కడ? మనిషికి ఇంత హింసాప్రవృత్తి ఎందుకు పెరిగి పోతున్నది? ఎన్నో కారణాలు. కాని సృజనాత్మకత అనే వ్యాపకం పెంపొందించుకోగలిగితే కొంత వరకైనా హింసను అడ్డుకోవచ్చేమో?

‘రూపాయిల లెక్కలు చూసుకునే వ్యాపారస్తుల చేతుల్లోంచి సినిమాను విడిపించాలి. మన అభ్యుదయ ఆలోచనలకు ఆశ్రయమిచ్చే సంపన్నుల అండతో ఇదే సినిమాను ప్రచార సాధనంగా ఉపయోగించాలి. జనాభ్యుదయానికి, సంఘశ్రేయస్సుకు, దేశ సంస్కరణకు సినిమాను సాధనంగా వాడుకోవాలి’ అని రామబ్రహ్మం ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో సినీరంగంలో అడుగుపెట్టి గాంధి ఆశయాలకు ప్రచారం కల్పించారు. అటువంటి వైతాళికుని పరిచయం చదవండి.

ఆలపాటి రవీంద్రనాథ్ 16వ వర్థంతికి మా శ్రద్ధాంజలి.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కొరకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి ఫిబ్రవరి 2012 On Kinige

Related Posts:

మిసిమి మాసపత్రిక నవంబరు 2011- సంపాదకీయం

అర్థశతాబ్దం పాటు పత్రికలను అర్థవంతంగా నడిపి, ఎందరో రచయితలను వెలుగులోకి తెచ్చి వారికి అండగా నిలిచిన బుద్ధిజీవి ఆలపాటి రవీంద్రనాథ్. నవంబరు నాలుగు వారి జన్మదినం. చిరాయువులకు సంవత్సరాలతో పని ఏముంది? రవీంద్రనాథ్ స్మృతిగా మధురవాణితో వారి సంభాషణ, వారిని సన్నిహితంగా ఎరిగిన నరిసెట్టి ఇన్నయ్య పంపిన పరిశీలన – పత్రికా సంపాదకునిగా వారి వైదుష్యం – అందునా మిసిమి ప్రత్యేకత – ఇవి ఆలపాటి రవీంద్రనాథ్ పుట్టిన రోజు ప్రత్యేకతలు.

చరిత్రకారులు అధికారుల కథనాలతో, పాలకుల దినచర్యలతో లేదా యుద్ధాల భీభత్స్ దృశ్యాల వర్ణణతోనే పుస్తకాలను నింపారు. గ్రామ చరిత్రలు రాసిన వారు చాలా అరుదు. వీరులపాడు గ్రామ చరిత్రను వెంకటపతిరాయలు పదిహేను సంవత్సరాలు శ్రమించి గ్రంథస్తం చేశారు. వీరికి ఇప్పుడు 97 సంవత్సరాల ఆరోగ్యకరమైన వయసు. సాంఘిక చరిత్ర ఎక్కడ మొదలవుతుందో, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూ ప్రజల నాయకుడు. ఆయనొక గొప్ప రచయిత కూడా. రచయిత యిక్కట్లు, ప్రచురణకర్తల వ్యాపారధోరణి ఆయన ఉత్తరంలో ఎత్తి చూపారు. అలాగే నిరాలా వంటి రచయితను ఆదుకున్న తీరు చెప్పుకోదగిందే. నవంబరు 14 ఆయన పుట్టిన రోజు.

మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన మణిపూస కనుపర్తి వరలక్ష్మమ్మ. స్త్రీల హక్కుల పోరాటం కోసం మనం పాశ్చాత్య దేశాల పుస్తకాలు వెతుకుతాం. కాని మన చుట్టూ ఎందరో మహిళామణులు తమ విప్లవాలను నిశ్శబ్దంగానే నడిపారు.

తెలుగువారిలో చిత్రకారిణులను లెక్కించడానికి ఒక్క చేతివేళ్ళు కూడా ఎక్కువే. అరుదైన చిత్రకారిణి సీతాదేవి గురించిన వ్యాసం చదవండి.

మన్ జీవితం రోజూవారీ కష్టాలతో నడుస్తునే ఉంటుంది. కానీ మనిషికి అసలు భయం, రోగం – మరణం. ఇవి తప్పించుకోలేనివి. అందుకే మరణానంతర జీవితం గురించి ఊహాగానాలు చేస్తూ ఆ భ్రమలో ఈ భయాలను మర్చిపోయే ప్రయత్నం చేస్తూంటాడు. ఈ చర్చ సంజీవ్ దేవ్ ’మరణ శయ్య’ లో చదవండి.

మన తెలుగుకు ఏమయింది? మనకు అష్టదిగ్గజాలు వుండేవారు. కన్నడ భాషలో ఇప్పుడు అష్ట జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలున్నారు. ఇంత వరకు మనకున్నది ఇద్దరే. తెలుగుని ఇప్పుడున్న స్తబ్దతలో నుంచి రక్షించలేమా? మిసిమి అహరహము కృషిసల్పేది ఈ దిశగానే…

– సంపాదకులు

మిసిమి తాజా సంచికను కినిగెలోలో చదవండి.
మిసిమి నవంబరు 2011 On Kinige

మిసిమి ఈ-మాసపత్రికకు చందాదారులుగా చేరండి. వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

Misimi 2011 Subscription On Kinige

Related Posts: