మిసిమి ఫిబ్రవరి 2012 సంచిక సంపాదకీయం

చరిత్రలో ఎన్నో సిద్ధాంతాలు – వాదాలు మానవజాతి పురోగమనానికి దోహదం చేశాయి. కొన్ని తిరోగమనానికీ సహకరించాయి. అయితే ఏదీ శాశ్వత పరిష్కారం చూపలేదు. చర్చకు, ఆచరణ సాధ్యానికి మధ్య ఎంతో అగాధం వుంటుంది. వాదాలన్నీ ఏకరువు పెట్టే సందర్భం కాకపోయినా, మానవీయ సంబంధాలను ఎక్కువగా ప్రభావితం చేసిన స్త్రీ వాద మూలాలెక్కడ అని చూడబోతే, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలే వెలుగులోకి వచ్చాయి. అలాగే తెలుగులో స్త్రీ వాద రచనల తీరుతెన్నులు స్పృశించి వివరించారు త్రివేణి.

భారతీయ నాటకం ఎలా వుందో – ఎలా వుండేదో – ఎలా వుండాలో ఎంతో సాంకేతికంగా విపులీకరించి లోతుపాతలను తెలియజేశారు తెలుగు నాటకానికి ఊపిరులూదుతున్న చాట్ల శ్రీరాములు.

ఈ నాటి క్లిష్టపరిస్థితులలో ‘మేధావి’ ఏం చేయాలి? ఏమి చేయగలడు? ఎందుకు ఇంత దీనావస్థలో మిగిలిపోతున్నాడు? ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ చర్చకు తెర తీసినవారు వేదాంతం లక్ష్మీప్రసాదరావు.

మనకు కలంకారీ అంటే పెడన – బందరు. కానీ శ్రీకాళహస్తి కలంకారీ కళ ప్రత్యేకతను, ఆధునికీకరించిన తీరును వివరించాము ఈ సంచికలో.

దగ్గర బంధువులో, మిత్రులో తమ సన్నిహితులను కోల్పోతే – మనకు ఓదార్చేందుకు మాటలే దొరకవు. ఈ ఓదార్పు ఉత్తరం చదవండి.

ఈనాటి అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి మూలాలెక్కడ? మనిషికి ఇంత హింసాప్రవృత్తి ఎందుకు పెరిగి పోతున్నది? ఎన్నో కారణాలు. కాని సృజనాత్మకత అనే వ్యాపకం పెంపొందించుకోగలిగితే కొంత వరకైనా హింసను అడ్డుకోవచ్చేమో?

‘రూపాయిల లెక్కలు చూసుకునే వ్యాపారస్తుల చేతుల్లోంచి సినిమాను విడిపించాలి. మన అభ్యుదయ ఆలోచనలకు ఆశ్రయమిచ్చే సంపన్నుల అండతో ఇదే సినిమాను ప్రచార సాధనంగా ఉపయోగించాలి. జనాభ్యుదయానికి, సంఘశ్రేయస్సుకు, దేశ సంస్కరణకు సినిమాను సాధనంగా వాడుకోవాలి’ అని రామబ్రహ్మం ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో సినీరంగంలో అడుగుపెట్టి గాంధి ఆశయాలకు ప్రచారం కల్పించారు. అటువంటి వైతాళికుని పరిచయం చదవండి.

ఆలపాటి రవీంద్రనాథ్ 16వ వర్థంతికి మా శ్రద్ధాంజలి.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కొరకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి ఫిబ్రవరి 2012 On Kinige

Related Posts: