మిసిమి మే 2012 సంపాదకీయం

గాంధీ విద్యార్థి దశలో లండన్ లో ఉన్నప్పుడు మాథ్యూ ఆర్నాల్డ్ వ్రాసిన “లైట్ ఆఫ్ ఏషియా” గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదివి ఎంతో ప్రభావితుడయ్యాడు. “కార్య కారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఏకైక ఆచార్యుడు, గౌతముడే” నని గాంధీ వక్కాణించాడు.

ఇరవైయవ శతాబ్దపు ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా బౌద్ధధర్మాన్ని “ఆధునిక శాస్త్ర విజ్ఞాన అవసరాలకు సరితూగే ధర్మం ఏదైనా ఉందంటే అది బౌద్ధమే” అని ప్రశంసించారు.

ఆధునిక జీవితంలో విజ్ఞాన పరిశోధనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బౌద్ధంలో సత్యశోధనకూ అలాంటి ప్రాముఖ్యతే ఉంది. ఈ విషయానికి కాలామ సుత్త లో ఒక ఉదాహరణ: కాలాములు నివాసమున్న కేసపుత్త అనే నిగమాన్ని భగవానుడు దర్శించినపుడు కాలాములు ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగారు: “భగవాన్! ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులు, శ్రమణులు ఇతరుల సిద్ధాంతాలను, విశ్వాసాలని ఎండకడుతూ, తమ ధర్మాలను ఘనమైనవిగా ఘోషిస్తున్నారు. మరొక వర్గీయులైన బ్రాహ్మణులు, శ్రమణులుకూడా వారి వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను ప్రశంసిస్తూ ఇతరుల ధర్మాన్ని నిరసిస్తున్నారు. ఈ సంఘటన మమ్ములను సంశయంతో, సంఘర్షణతో నింపివేస్తోంది. వీరిలో ఎవరు సత్యాన్ని చెబుతున్నారు, ఎవరు అసత్యాన్ని చెబుతున్నారు?”

కరుణాసముద్రుడైన భగవానుడు ఇలా అన్నాడు. “అవును కాలాములారా, మీరు లోనైన సందిగ్ధంలో ఈ సందేహం రావడం సహజమే. ఒకరు చెప్పింది కానీ, మరొకరు చేరవేసింది కానీ, సంప్రదాయంలో ఉన్నదని కాని, మీరు దేనినీ విశ్వసించి గుడ్డిగా అనుసరించకండి. మత గ్రంథాలలో పేర్కొన బడిందని, తర్కంతో లేదా సూచనల వలన, ఊహాజనిత విషయాల వలన, సాధ్యాసాధ్యాల వలన, అభిప్రాయాల వలన ప్రేరేపితులు కాకండి. కానీ, మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతం కావని తెలుసుకొన్నపుడు వాటిని వదిలివేయండి; మీ విజ్ఞతతో మీరు కొన్ని విషయాలు సర్వజన సమ్మతమని తెలుసుకొన్నపుడు వాటిని గ్రహించి ఆచరించండి.”

ముఖ్యంగా ఈ ప్రాథమిక అంశాల సంయోగ సహకారాల వలననే బౌద్ధం శాస్త్ర పరిశోధనకు సమాంతరస్థాయిలో ఉంటుంది. విశ్వాసం కంటే పరిశోధనా ప్రమాణాలే బౌద్ధానికి ప్రధానాంశాలు. ఈ ముఖ్యలక్షణమే బౌద్ధాన్ని ప్రపంచంలో ఇతర మతాలనుంచి భిన్నంగా ఉంచుతోంది. బౌద్ధం ఒక దైవదత్తమైన మతవిశ్వాసం కాదు. దీనికి దైవప్రోక్తమైన గ్రంథమేదీ లేదు. ఒక ప్రవక్త లేడు, అందువలన మూఢనమ్మకాలనూ, పిడివాదాన్ని ఆశ్రయించదు. వీటిపై ఆధారపడిన మతవిశ్వాసాలు, ఈనాటి సాంకేతిక సమాచార ప్రభావంతో పేకమేడల్లా కూలిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో బౌద్ధం ఒక్కటే శాస్త్రవిజ్ఞానం, హేతుసంకేత పరంగానే ఉన్నదని, ఇప్పటి ప్రాచ్య, పాశ్చాత్య దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్షరాస్యత అధికంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో బౌద్ధానికి గుర్తింపు ఎక్కువగా లభిస్తున్నది.

2556 బుద్ధ జయంతి సంచికలో బౌద్ధ ధర్మంలోని లోతుపాతులను పరిశీలించి చిక్కని రచనలందించిన రచయితలకు మా కృతజ్ఞతలు.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మిసిమి తాజా సంచిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి మే 2012 On Kinige

మిసిమి వార్షిక చందాపై రాయితీ లభిస్తోంది. ఆ వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

Misimi 2012 Subscription On Kinige

Related Posts:

మిసిమి ఫిబ్రవరి 2012 సంచిక సంపాదకీయం

చరిత్రలో ఎన్నో సిద్ధాంతాలు – వాదాలు మానవజాతి పురోగమనానికి దోహదం చేశాయి. కొన్ని తిరోగమనానికీ సహకరించాయి. అయితే ఏదీ శాశ్వత పరిష్కారం చూపలేదు. చర్చకు, ఆచరణ సాధ్యానికి మధ్య ఎంతో అగాధం వుంటుంది. వాదాలన్నీ ఏకరువు పెట్టే సందర్భం కాకపోయినా, మానవీయ సంబంధాలను ఎక్కువగా ప్రభావితం చేసిన స్త్రీ వాద మూలాలెక్కడ అని చూడబోతే, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలే వెలుగులోకి వచ్చాయి. అలాగే తెలుగులో స్త్రీ వాద రచనల తీరుతెన్నులు స్పృశించి వివరించారు త్రివేణి.

భారతీయ నాటకం ఎలా వుందో – ఎలా వుండేదో – ఎలా వుండాలో ఎంతో సాంకేతికంగా విపులీకరించి లోతుపాతలను తెలియజేశారు తెలుగు నాటకానికి ఊపిరులూదుతున్న చాట్ల శ్రీరాములు.

ఈ నాటి క్లిష్టపరిస్థితులలో ‘మేధావి’ ఏం చేయాలి? ఏమి చేయగలడు? ఎందుకు ఇంత దీనావస్థలో మిగిలిపోతున్నాడు? ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ చర్చకు తెర తీసినవారు వేదాంతం లక్ష్మీప్రసాదరావు.

మనకు కలంకారీ అంటే పెడన – బందరు. కానీ శ్రీకాళహస్తి కలంకారీ కళ ప్రత్యేకతను, ఆధునికీకరించిన తీరును వివరించాము ఈ సంచికలో.

దగ్గర బంధువులో, మిత్రులో తమ సన్నిహితులను కోల్పోతే – మనకు ఓదార్చేందుకు మాటలే దొరకవు. ఈ ఓదార్పు ఉత్తరం చదవండి.

ఈనాటి అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి మూలాలెక్కడ? మనిషికి ఇంత హింసాప్రవృత్తి ఎందుకు పెరిగి పోతున్నది? ఎన్నో కారణాలు. కాని సృజనాత్మకత అనే వ్యాపకం పెంపొందించుకోగలిగితే కొంత వరకైనా హింసను అడ్డుకోవచ్చేమో?

‘రూపాయిల లెక్కలు చూసుకునే వ్యాపారస్తుల చేతుల్లోంచి సినిమాను విడిపించాలి. మన అభ్యుదయ ఆలోచనలకు ఆశ్రయమిచ్చే సంపన్నుల అండతో ఇదే సినిమాను ప్రచార సాధనంగా ఉపయోగించాలి. జనాభ్యుదయానికి, సంఘశ్రేయస్సుకు, దేశ సంస్కరణకు సినిమాను సాధనంగా వాడుకోవాలి’ అని రామబ్రహ్మం ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో సినీరంగంలో అడుగుపెట్టి గాంధి ఆశయాలకు ప్రచారం కల్పించారు. అటువంటి వైతాళికుని పరిచయం చదవండి.

ఆలపాటి రవీంద్రనాథ్ 16వ వర్థంతికి మా శ్రద్ధాంజలి.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కొరకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి ఫిబ్రవరి 2012 On Kinige

Related Posts: