మిసెస్ అండర్‌స్టాండింగ్

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన గురించి, ఆ అవగాహన ఉంటే సంసారం ఎంత అన్యోన్యంగా ఉంటుందో చెబుతారు బ్నిం ఈ పుస్తకంలో.

“చాలామంది… ఆయన్లకి…. ఆవిళ్ళంటే ఇష్టమేగానీ… ఆవిడ ఇష్టాలే అంత ఇష్టం వుండడు… చాలా మంది మొగుళ్ళు తమ భార్యల ఆంతరంగిక ఇష్టాలని, అంతర్గత సంతోషాలని చెడగొట్టేస్తారు. దానికి బదులుగా భార్యలు ఎలా ప్రతిస్పందిస్తారో చెబుతారు “మీరెప్పుడు ఇంతే”లో. ఆ మాట అంటున్నప్పుడు ఆవిడ మొహంలో కనపడే కోపం… బాధ… చికాకు… అసమర్థత… అసహ్యం… హృదయనేత్రంతో చూడగలిగితే, మనోకర్ణంతో వినగలిగితే… మగవాళ్ళెప్పుడూ అలా ప్రవర్తించరు” అని అంటారు రచయిత.

అయినదానికి కానిదానికి కన్నీళ్ళు పెట్టే స్త్రీల గురించి చెబుతారు “కన్నీటి మాటలు”లో. చుక్క కన్నీరెట్టకుండా తన భార్య తన చేత సిగరెట్లు ఎన్నిసార్లు మానిపించగలిగిందో చెబుతారు.

పెళ్ళయ్యాక, “ప్రేమించే హృదయం”కు నో వెకెన్సీ బోర్డు పెట్టిన వైనాన్ని హాస్యంగా వివరిస్తారు రచయిత. చదువుతున్నంత సేపు చిరునవ్వు కదలాడుతుంది పెదాలపై.

భార్య పుట్టిల్లు అదే ఊర్లో ఉండడంలోని కష్టనష్టాలు; వేరే ఊర్లో ఉంటే ఎదురయ్యే ఈతిబాధల గురించి చెబుతారు రచయిత “పుట్టిల్లు”లో. ఆ ఇంటి మీద కాకులు ఈ ఇంటి మీద వాలడం తగ్గాలంటే ఏం చేయాలో సరదాగా చెబుతారు.

భార్యల సెంటిమెంట్లను కనీసం పర్వదినాలలోనైనా మన్నించాలని చెబుతారు రచయిత “కార్తీక పౌర్ణమి”లో.

భార్యాభర్తల మధ్య అసలు గొడవలు ఎందుకు మొదలవుతాయో, రెండు వాక్యాలలో చెబుతారు రచయిత “దుర్ విధి”లో. “భార్య యొకటి యోచించిన భర్త వేరొకటి యాలోచించును – భర్య యొకటి ఆశించిన భార్య వేరొకటి చేయును -” అంటూ సూక్ష్మం వివరించారు.

భర్త గర్ల్ ఫ్రెండ్‌తో భార్య, భార్య బోయ్ ఫ్రెండ్‌తో భర్త ఎలా ప్రవర్తిస్తారో రచయిత చెప్పిన విధం నవ్వు తెప్పిస్తుంది. ” ఆమె గారి బాయ్ ఫ్రెండ్, ఈన గారి గాల్ ఫ్రెండ్” హాయిగా చదివిస్తుంది.

“అందరి మొగుళ్ళూ వాళ్ళంతట వాళ్ళే వెళ్లి పెళ్ళానికి చీర కొనుక్కుని తెస్తారు – కొందరు మొగుళ్ళు పెళ్ళాన్ని తీసుకెళ్లి నచ్చిన చీర కొనిపెడతారు…. ఒక్క మనింట్లోనే పక్కింటి వాళ్ళతో వెళ్ళి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం” అంటూ సతి గారు పతిదేవుని దుమ్ము దులిపేస్తుంది “దసరా చీర”లో. ఒక్కో చీరకి ఒక్కో ఫ్లాష్ బాక్ ఉంటుందని, – దాన్ని కదపద్దని హెచ్చరిస్తారు రచయిత.

స్త్రీజనోద్ధరణ కోసం రేడియోలో/టివిలో టాక్ వచ్చినప్పుడల్లా మాలాంటి వాళ్ళిళ్ళల్లో… చిన్నపాటి తుఫాన్ చెలరేగుతుంది… అంటూ వాపోతారు రచయిత “ఛానెళ్ళు చెడగొడతాయి”లో.

దాంపత్య కాలంలో భార్య పేరు పలకకుండా… నిండు నూరేళ్లు పబ్బం గడిపేసుకున్న మగవాళ్ల గురించి చెబుతారు “భామ నామాలు”లో.

మర్చిపోకపోతే, భార్య హాయిగా పులిహోరా పాయసం వండి పెట్టే రోజూ, మర్చిపోతే కారాలు మిరియాలు నూరే రోజూ ఏదో చెబుతారు “పెళ్ళిరోజు”లో. పెళ్ళి రోజుని మర్చిపోతే మీ భార్యకి మీరు పరాయి మగాడుగా కనిపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు.

ఎదురుగా ఉండి ఎంత ప్రేమ ప్రకటించినా క్షణంలో గాల్లో కలిసిపోతుంది గానీ… ఉత్తరాల్లో చెక్కిన ప్రేమాక్షరాలు చక్కిలిగిలి పెట్టి… చక్కని లోకాలు చూపిస్తాయి… ఉక్కిరి బిక్కిరి చేసి కట్టిపడేస్తాయి… అంటారు “ఇంటి (తి) పోరు”లో.

“పెళ్లెందుకు చేసుకున్నారు” లో భార్యభార్తల విధుల గురించి చెబుతారు రచయిత. ఆవిడకి తెల్సు… పెళ్లంటే భర్త ఇంటిని చక్కదిద్దు ఉద్యోగమని, ఆయనకి తెల్సు… అచ్చటా ముచ్చటా తీరుస్తూ జీవితాంతం స్నేహంగా మెలగాల్సిన వ్యక్తి భార్యేనని – అయితే ఈ విధులు ఒకరివి ఒకరు గుర్తు చేసుకోడంతోనే అసలు పేచీ మొదలవుతుందని అంటారు. అడక్కుండా… అవసరాలు; కోరకుండా…. మురిపాలు తీర్చుకునే అదృష్టవంతులే… మేడ్ ఫర్ ఈచ్ అదర్ గాళ్ళు…” కాదంటారా?

’సారీ’ అన్న రెండక్షరాలతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది – కానీ ఎవరు అనాలో తేలక… తెలీక…. అపార్థాలు పెరిగి, అలక ముదిరి… మంచం మీద ఎడమొహం పెడమొహంగా పడుకుని నిద్రరాని “కాళ రాత్రి”ని గడుపుతారు. అప్పుడెలా నడుచుకోవాలో చెబుతారు “కాళరాత్రుళ్ళు”లో.

భార్యభర్తలిద్దరూ “నీయమ్మ నాయత్తో… నాయమ్మ నీ యత్తా..” అని డ్యూయట్ పాడుకోగలగాలంటే ఏం చేయాలో చెబుతారు రచయిత “అత్తలొచ్చిన వేళ”లో. ఏడాదికో ఏణ్నర్థానికో చుట్టపు చూపుగా వచ్చిన కన్నతల్లుల గురించి చాటుగానైనా కస్సుబుస్సులాడుకోడం, సణుక్కోడం బావుండదని, – ఇంటికెవరైనా ఇలా పెద్దాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళున్న రెణ్నాళ్ళూ (పోనీ, వారం రోజులు) వంతులేసుకుని గౌరవించేస్తే మనసుకు హాయిగా ఉంటుందని అంటారు.

స్వీట్ హోమ్‌కి కొత్త అర్థం చెబుతారు రచయిత “సెకండ్ హీరోయిన్”లో. ‘దాపరికం – అసత్యం’ కలిస్తేనే దాంపత్యమని అంటారు.

“పెళ్ళికావల్సిన వాళ్ళూ… కొత్తగా పెళ్ళయిన వాళ్ళూ… ప్రేమలో పడ్డ వాళ్ళూ… పడిపోదామని సరదా పడుతున్నవాళ్ళూ… అంతెందుకు… ఆడాళ్ళూ మగాళ్ళూ . కలివిడిగా… విడివిడిగా చదవాల్సిన పుస్తకం ఓ రకంగా…. పెళ్ళి పుస్తకం…. ఇంకో రకంగా ప్రేమ పుస్తకం….” అంటారు రచయిత.

మిసెస్ అండర్‍స్టాండింగ్ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ప్రింట్ పుస్తకాన్ని మీరు కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మిసెస్ అండర్‌స్టాండింగ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

  • No Related Posts