మిషన్ టు పెకింగ్

ప్రఖ్యాత డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు రచించిన నవల “మిషన్ టు పెకింగ్“.

సరిహద్దులమీద ఉద్రిక్తతల్ని సృష్టించే దేశాల తాకిడిని తట్టుకోవటం కోసం తప్పనిసరిగా సైనికబలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితులు మన దేశానికి ఎదురవుతున్న నేపధ్యంలో భారత క్షిపణి పరిశోధన శాస్త్రవేత్తలు రెండు వందల కిలోమీటర్ల దూరంలో వున్న టార్గెట్‌ని గురితప్పకుండా ఛేదించగల క్షిపణిని తయారుచేసారు. అయితే, ఆ క్షిపణిని ప్రయోగించే సమయంలో అనుకోని విధంగా బయటపడిన ఒక విచిత్రాన్ని గమనించి అవాక్కయ్యారు.

వారెవరూ ఊహించనిరీతిలో అది రెండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగల సత్తావున్న ఆయుధంగా… ఆర్డినరీ క్షిపణి కాస్తా కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సయిల్‌గా రూపొందింది. తక్కువ దూరంలో వుండే టార్గెట్‌ని ఛేదించేటందుకు క్షిపణిలో అమర్చిన కంట్రోల్ మెకానిజం ఎక్కువ దూరానికి సరిపోదని గ్రహించి, వెంటనే మార్పులు చేశారు ఇంజనీర్లు. అత్యంత ఆధునికమైన కంప్యూటర్ వ్యవస్థను అందులో ప్రవేశపెట్టి పరీక్షల నిమిత్తం ప్రయోగించారు. ఆఖరి క్షణంలో ఏదో పొరపాటు జరిగి క్షిపణి అదుపు తప్పి చైనా భూభాగంలోకి దూసుకుపోయింది. సికియాంగ్ పర్వతశ్రేణుల్లో ఎక్కడో కుప్పకూలిపోయింది.

ఆ క్షిపణి అవశేషాల్ని వెతికి, వాటిల్లోనుంచి కంట్రోలింగ్ వ్యవస్థను విడదీసి వెంటనే భారతదేశంలోకి తీసుకురాకపోతే…. శత్రువులకు ఆ వ్యవస్థ రహస్యం తెలిసిపోతుంది…. ఆ క్షిపణి తయారీకి ఖర్చుపెట్టిన ధనమంతా వృథా అయిపోతుంది.

సి.ఐ.బి తరపున ఈ బాధ్యత షాడోకి అప్పగిస్తారు. భారతదేశంలోనుంచి గాని, బర్మా వైపునుంచి గాని సరిహద్దులు దాటి చైనాలోకి అడుగుపెట్టడం ప్రమాదకరమని నిర్ణయించుకుని, జపాన్ నుంచి బయలుదేరాడతను. గంగారం సహాయంతో చిన్న సైజు వ్యాపారవేత్తగా పత్రాలు సృష్టించుకుని మారువేషంలో కాయ్‌ఫెంగ్ నగరంలో అడుగుపెడతాడు. షాడో పట్ల అనుమానాలు పెంచుకున్న అక్కడి పోలీసులు అతన్ని పట్టుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వారి నుంచి తప్పించుకోడానికి, వారు అరెస్టు చేసిన హూవాన్ చూ అనే మంచి దొంగని వారి అదుపులోంచి తప్పిస్తాడు.

ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కుంటాడు. తానెవరో హువాన్ చూకి తెలియజేయకుండా, పెకింగ్ నగరం గుండా మిస్సైల్ కూలిపోయిన ప్రాంతాలలోకి చేరుకోడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నాలలో హువాన్ చూ సోదరి ఈషా షాడోకి ఎందుకు అడ్డు తగిలింది? ఆమె ఎవరు? అటవీ ప్రాంతంలో చైనా ఆటవీక జాతి నాయకుడు షాడోకి ఎందుకు సాయం చేసాడు? షాడో గూని ఎలా మాయమైంది? షాడో ఈషాకి అందించిన అపూర్వ కానుక ఏంటి?

ఈ ప్రశ్నలకి జవాబులు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.

“మిషన్ టు పెకింగ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిషన్ టు పెకింగ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: