‘మో’ స్మృతికి అంజలి

ప్రముఖ రచయిత , కవి వేగుంట మోహన్ ప్రసాద్ ది ౩ ఆగష్టు 2011 నాడు మృతి చెందారు. రెండు రోజుల క్రితం బ్రెయిన్ హెమరేజ్‌తో ఆయన కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామం. ఆయన కాలేజి లెక్చరర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మరణంతో సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందరెందరో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

వేగుంట మోహన్ ప్రసాద్ సాహితీ ప్రపంచంలో ‘మో’గా సుపరిచితులు. తెలుగు కవిత్వానికి కొత్త పరిభాషను పరిచయం చేసారు ‘మో’. చితి-చింత, పునరపి, రహస్యతంత్రి, నిషాదం, సాంధ్యభాష, వెన్నెల నీడలు మొదలైనవి ఆయన రచనలు. ఆయన రచించిన ‘నిషాదం’కు ఇటీవలే తనికెళ్ల భరిణి సాహితీ పురస్కారం లభించింది.

వారి స్మృతికి అంజలి ఘటిస్తూ, ‘మో’ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం, ఆయన కవిత్వం గురించి నరేష్ నున్న ఏమంటున్నారో చూద్దాం.

” ‘మో’ కవిత్వం కత్తిరించిన క్రోటన్ మొక్కల వరుసలాగో, అడితిలో పేర్చిన కట్టెల మోపుల్లానో పొందికగా ఉండదు. పసిపిల్లలు చిందరవందర చేసిన ఇల్లులా, ఆంక్షలకు లొంగని సెలపాటలా ఉంటుంది. అదే ఆయన కవితలో మృదు బీభత్స సౌందర్యం. అథోజ్ఞాపికల ఆసరా, అర్థవివరణల సాయం, ప్రపంచ సాహిత్యాల పరిచయం… ఇవేవి లేకుండానే కవిత మొత్తంగా ఓ భావాన్ని బట్వాడా చేస్తుంది. ఆ భావం ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండక పోవచ్చు. సముద్ర ఘోషని ఏ ఇద్దరూ ఒక్కలా అర్థం చేసుకోనట్టు. భావం భవాన్ని దాటి అనుభవమవుతుంటే, టీకా టిప్పణి అనవసరమనే స్థితికి చేరుస్తుంది ‘మో’ కవిత. ”
” ఇంతకాలం ఒక జీవ నదిలా ప్రవహించి వస్తున్న ‘మో ‘ కవిత్వాన్ని ఒక విస్మృత గీతంలా నేటికీ చూస్తున్నందువల్లే తెలుగు సాహిత్యం [………] జ్ఞానస్థాయిని అందుకోలేదనిపిస్తోంది”

మో రాసిన నిషాదం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

నిషాదం (మో) On Kinige

కొల్లూరి సోమ శంకర్

 

 

Related Posts: