నానీల పరిశోధనా దిక్సూచి

విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనగానే కొంత తేలికభావం, నిరాసక్తత చోటు చేసుకున్న రోజులివి. ఒక పునరావాసం కోసం పిహెచ్‌డిలో చేరి వ్యక్తిగత పనులు చేసుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పరిశోధక విద్యార్థులున్న కాలమిది. ఇటువంటి ప్రాక్టికల్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్న దశలో ప్రముఖ కథారచయిత, పాత్రికేయుడు చింతకింది శ్రీనివాసరావునవ్య కవితారూపం నానీ-వివేచన’ అనే పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం కొంత విస్మయాన్ని, కొత్త ఆశను, సరికొత్త నమ్మకాన్ని అందిస్తుంది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తునుండి వచ్చిన ఈ సిద్ధాంత గ్రంథం నానీలపై వచ్చిన మొట్టమొదటి పరిశోధన కావడం విశేషం.

ఏదో ఒక పత్రికలో నానీలు చదివి ఆకర్షితుడైన చింతకింది వాటిపై పరిశోధన చేయాలనే తీవ్రమైన అనురక్తిలోకి వెళ్లడం ఆశ్చర్యం. అందుకోసం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ తెలుగు కరస్పాండెన్స్‌లో చేరడం, కాలేజీ కుర్రాళ్లా కాంటాక్ట్ క్లాసులకెళ్లడం, ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వడం, ఆ తర్వాత పిహెచ్‌డిలో చేరడం, థీసిస్ రాయడం, దాన్ని ముద్రించడం సామాన్యమైన విషయం కాదు. అదీ ఎంతో పని వత్తిడి ఉండే పాత్రికేయ వృత్తిలో వుంటూ ఇవన్నీ చేయడం అంటే చాలా పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ శ్రీనివాసరావులో నిండుగా వున్నాయి. అంతేకాదు మధ్యలో చదువు మానివేసిన వారికి ఈ వయసులో ఏం చదువుకుంటాములే అనుకునేవారికి, అన్ని సౌకర్యాలు, సమయాలు అందుబాటులో ఉన్న పరిశోధకులకు ఈ వ్యక్తి మార్గదర్శిగా స్ఫూర్తికారుడుగా నిలుస్తాడు.ఇక చింతకింది శ్రీనివాసరావు పరిశోధనలోకి వెళితే వీరి సిద్ధాంత రచన కూడా ప్రామాణికమైన పరిశోధనా పద్ధతులకు అనుగుణంగా, స్ఫూర్తిదాయకంగానే జరిగింది. ఒక సిద్ధాంత గ్రంథం గొప్పదనం అధ్యాయంలో విభజనల్లో తెలుస్తుంది. అలాంటి స్పష్టమైన పటిష్టమైన విభజన చేసుకున్నారు చింతకింది. పరిశోధన పేరుతో అనవసరపు సమాచారాన్ని కుప్పపోసి ఇచ్చే అధ్యాయాలు ఇందులో లేవు. చర్విత చరణాంశాలను విపులంగా వివరించే ప్రయత్నం చేయలేదు. రేఖామాత్రంగా ఆ విషయాలన్నీ మనకు అర్థమయ్యేట్లుగా సరళంగా పరామర్శించుకుంటూ వెళ్లారు. తన పరిశోధనను ఏడు అధ్యాయాలుగా చేసుకుని ప్రతి అధ్యాయంలో సూటిగా విషయ వివరణలోకి వెళ్లి విశే్లషణలు చేశారు చింతకింది.

ఇప్పటివరకు నానీల ప్రక్రియ పేరు మాత్రమే తెలిసి దాని నేపథ్యం, ఆవిర్భావం, వికాసం తెలియని వారికి, అసలు ప్రక్రియ అంటే ఏమిటి? లఘు ప్రక్రియల గురించిన స్థూల వివరాలు కథనాత్మకంగా సూటిగా మొదటి అధ్యాయం తెలియజేస్తుంది. ఇక నానీల్ని నాలుగు పాదాల్లో ఇరవై ఇరవై ఏడు అక్షరాల్లో రాయాలనే వౌలిక లక్షణాన్ని తెలుపుతూ వాటిలోని రూప నిర్మాణ శిల్పాన్ని, వ్యూహాల్ని రెండవ అధ్యాయం వివరిస్తుంది. ఇందుకోసం వీరు తీసుకున్న ఉదాహరణ పూర్వక నానీలు ప్రక్రియా లక్షణ నిర్మాణానికి బలమైన నిరూపణలుగా నిలబడతాయి. ‘ఒక రచనలోని కవితాత్మకతను, కవిత్వ సాంద్రతను గుర్తించడానికి భాష, భావం, వస్తువు, ధ్వని తదితర ఉపకరణాలు తోడ్పడతాయి’-అంటూ నానీల్లోని కవితాత్మను మూడవ అధ్యాయంలో విశే్లషించారు. ఇందుకోసం వారు ఎన్నుకున్న నానీలు చదివితే నానీలు ఎందుకు పాఠకులను ఆకట్టుకున్నాయో అర్థమవుతుంది. అందుకే సామాన్య పాఠకుల్ని సైతం కదిలించగల శక్తి ఈ ప్రక్రియకు నిసర్గ లక్షణమైంది అని పరిశోధకుడు సరైన అంచనా వేయగలిగారు.కవిత్వం వర్తమానానికి అద్దం లాంటిది. భవిష్యత్ తరాల వారికి చరిత్రను నిష్పాక్షికంగా తెలుసుకోవడానికి కవిత్వం విశ్వసనీయ భావోద్వేగ ఆధారంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నానీలు కూడా సమకాలీనతను ప్రతిబింబించడంలో ముందు వరసలో ఉంటాయి. తెలుగు సాహితీ రంగంలో నానీలు ప్రవేశించిన కాలంలో, తదనంతరం అవి ప్రజాదరణ పొందుతున్న వేళవరకు మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని చింతకిందివారు నిశితంగా పరిశీలించారు.

ఆ పరిశీలనా ప్రతిఫలనాలు స్థానికంనుండి అంతర్జాతీయం వరకు నానీల్లో ఏ విధంగా ప్రతిఫలించాయో ‘నానీలు సమకాలీనత – కేశీయత’ అనే నాల్గవ అధ్యాయంలో విస్తృతంగా లోతుగా చర్చించారు. సమకాలీనత నానీల కవిత్వానికి ఆరవ ప్రాణంగా అభివర్ణించారు. ఈ అధ్యాయంలోనే మరో పార్శ్వంగా నానీల్లోని దేశీయతను, స్థానీయ మూల్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సంపూర్ణమైన దేశీయ సాహితీ విభాగానికి చెందిన ప్రక్రియగా నానీలనీ, అందుకనుగుణమైన లక్ష్యాత్మక నానీల్ని విభిన్న కోణాల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకోసం చింతకింది చేసిన వ్యాఖ్యానం ఆర్ద్రంగా మనల్ని పలకరిస్తుంది. నిజానికి దేశీయత-స్థానికతలపై ప్రత్యేక అధ్యాయాలుగా రాయవలసినంత పరిధిగల అంశాలు.భరతావనికి గ్రామాలు సహజ చిరునామాలు. సాహిత్యకారులకు వౌలిక స్ఫూర్తిని అందించే నేపథ్య కేంద్రం గ్రామం. నానీల్లో గ్రామీణ వాతావరణం విస్తృతంగా చిత్రితమైంది. ఇందుకు ప్రధాన కారణం నానీల కవుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన వారే. పల్లెసీమల్లో వస్తున్న మార్పుల్ని దగ్గర్నుండి గమనించినవారే. అందుకే చూసింది చూసినట్టుగా నానీల్లోకి అనువదించారు. ఈ విషయాల్ని చింతకిందివారు ‘‘నానీల్లో పల్లె-ప్రపపంచీకరణ, మానవీయత’ అనే ఐదో అధ్యాయంలో సంక్షిప్తంగా వివరించారు. ప్రపంచీకరణ, మానవీయత అనే అంశాలపై వచ్చిన నానీల్ని కూడా ఇదే అధ్యాయంలో పరిశీలించారు. పరిశోధకుడు గ్రంథ విస్తరణ భీతితో అధ్యాయాల్ని సంక్షిప్తీకరించుకుని పఠన సౌలభ్యం కోసం చేసిన కసరత్తుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులోని నానీలను చదివితే మూల నానీల కవితా సంపుటాలను చదవాలనే ఆసక్తి ఏర్పడుతుంది.ఆధునిక కవిత్వంలో ఎన్నో వాదాలు, ధోరణులు ఉన్నాయ్. అవన్నీ నానీల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా స్ర్తివాద సిద్ధాంతాల్ని బలంగా ప్రతిఫలించేట్టుగా సుమారు ఇరవై మంది కవయిత్రులు రాసిన నానీలపై ‘నానీల్లో స్ర్తి-తాత్వికత’ అధ్యాయంలో చర్చించారు. వచన కవిత్వంలో స్ర్తి హృదయ సంవేదన ఎంత గాఢంగా అభివ్యక్తీకరించబడిందో ఆ స్థాయిలో స్ర్తివాద ధోరణులు నానీల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని చింతకిందివారు నిరూపణ చేశారు. మనిషి జీవితంలో అనివార్యమైన తాత్విక చింతన గురించి నానీలను ఇదే అధ్యాయంలో రేఖామాత్రంగా పరామర్శించారు. నానీల్లోని తాత్విక వేదన లోతులనూ స్పర్శిస్తూ నానీ కవుల తాత్త్విక చైతన్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు పరిశోధకుడు.ఏ ప్రక్రియకైనా వస్తువైవిధ్యమే ప్రధాన బలం. ముఖ్యంగా నానీల్లాంటి లఘు ప్రక్రియకు వస్తువే ప్రధానాంశం. ఈ కీలకాంశాన్ని పరిశోధకుడు గుర్తించాడు. కవుల గుండెలోతుల్లోంచి గంగాధారలా పైకి వచ్చిన నానీల్లో వస్తువైవిధ్యం సామాన్యమైంది కాదు.

‘నానీల కవులు ముట్టని కవితా వస్తువు లేదు, చుట్టని లోకం లేదు. జీవితం అనే విశాలమైన సాగరాన్ని నానీల్లో ఇంకిపోయేలా చేయగలిగారు’’ అంటూ ‘నానీల వస్తువైవిధ్యం’ అనే ఏడో అధ్యాయంలో పరిధిమేరకు సమగ్రంగా వివరించారు. ఒక కొత్త ప్రక్రియ రావడం, అది పదిహేనేళ్లకుపైగా కొనసాగుతూ ఉండడం, రెండు వందల కవితా సంపుటాలు వెలువడడం, ఇంకా గ్రంథ రూపంలోకి రాని నానీలు, కవులు అసంఖ్యాకంగా వుండడం అనే అద్భుతాన్ని ప్రశంసిస్తూ నానీల రూపకర్త డా.ఎన్.గోపి గారిని ఎందుకు నానీల కవులంతా అభిమానంగా ‘నానీల నాన్నగారని’ పిలుచుకుంటారో చెప్పిన తీరు ఔచిత్యవంతంగా, ఆమోద యోగ్యంగా ఉంది.చింతకింది వారి పరిశోధన సాంతం ఏకపక్షంగా, ప్రశంసాపూర్వకంగానే నడవలేదు. ఈ సిద్ధాంత గ్రంథం ఉపసంహారంలో అతనిలోని నిష్పాక్షిక పరిశీలకుడు, విమర్శకుడు నిష్కర్షగా కనిపిస్తాడు. నానీల లక్షణాలను పాటించకుండా నియమోల్లంఘన చేసిన నానీలను ప్రస్తావించాడు. నానీల ప్రక్రియపైన, నానీలు రాస్తున్న కవులపై వచ్చిన విమర్శలను యధాతథంగా ఉటంకించాడు. ఆ విమర్శలకు ప్రతిగా వచ్చిన సమాధానాలను, వాదనలను వినిపించాడు. వీటిని నిశితంగా విశ్లేషిస్తే నానీలపై వచ్చిన విమర్శలు సాహిత్య పరమైనవా, సాహిత్యేతర కారణాలపై, వైయక్తిక విభేదాలపై వచ్చినవా అనే సత్యం వెల్లడవుతుంది. వీటన్నింటిని పరిశోధకుడు సంయమనంతో పాఠకుల ముందుంచాడు.చివరగా నానీలు ఏ ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి, నానీల ఎదుగుదల, నానీల సదస్సులు, నానీల అవార్డులు, నానీల వర్తమాన స్థితి, భవిత మొదలైన అంశాలన్నింటిని వివరిస్తూ తన పరిశోధనకు ఒక సమగ్ర స్వరూపాన్ని అందించే ప్రయత్నం చేశారు చింతకిందివారు. 1998 నుంచి 2007 వరకు దశాబ్ద కాలంలో వెలువడిన 112 నానీల సంపుటాలను పరిశోధనకు ప్రమాణంగా తీసుకున్నారు. అయినా అక్కడి వరకే ఆగిపోకుండా 2013లో వచ్చిన 200వ నానీ సంపుటి ‘సిరిమాను నానీలు’ వరకు నానీల గ్రంథాల జాబితాను, తను సంప్రదించిన ప్రతి చిన్న సమాచార వివరాలను ఉపయుక్త గ్రంథ సూచికలో ఇవ్వడం పరిశోధకుడి శ్రమకు, అంకిత స్వభావానికి నిదర్శనం. తన ముందున్న విస్తృతమైన వివరాలను, విశేషాలను, కొటేషన్లను ఎక్కువగా వాడుకోకుండా తన పరిశీలనను, విశ్లేషణకు ప్రాధాన్యమిచ్చారు పరిశోధకుడు. పరిశోధనలో ఇది ఒక మంచి ప్రయత్నం. చేయి తిరిగిన కథకుడిననే స్పృహ, ఎన్నో ఆలంకారిక కథనాలు అందించిన పాత్రికేయ వృత్తికార్మికతను పక్కనపెట్టి అకడమిక్ ప్రమాణాలకు లోబడి పరిశోధక విద్యార్థిగా-బాధ్యతాయుతంగా చేసిన పరిశోధన ఇది. ప్రత్యేకంగా ఏ రాగద్వేషాలను పెట్టుకోకుండా విషయానికే ప్రాధాన్యతను ఇచ్చాడు.

ఈ గ్రంధాన్ని ఒక పరిశోధనా గ్రంథంగా కాకుండా అద్భుతమైన కవితా గ్రంథంగా కూడా చదువుకోవచ్చు. నానీలపై పరిశోధన చేయాలనుకునే వారికి, నానీలు రాయాలనుకునే వారికి ఈ గ్రంథం బహుళార్ధక దిక్సూచిగా ఉపయోగపడుతుంది!

డా.ఎస్.రఘు , ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీ, 25 మే 2013

* * *

“నవ్య కవితారూపం నానీ – వివేచన” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్నివివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
నవ్య కవితారూపం నానీ – వివేచన On Kinige

Related Posts:

సంక్షుబ్ధ సౌందర్యం ఆశారాజు పేరాగ్రాఫు కవిత్వం – ఒగరు

పదమూడు కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన ఆశారాజు గురించి ఏ పరిచయమూ అవసరం లేదు. ‘నేపథ్యం’ కావ్యానికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డును, ‘ఒక తడిగీతం’ కావ్యానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని, సినారె కవితా పురస్కారాన్ని, కామిశెట్టి కవితా పురస్కారాన్ని, ‘సారంగి’ కావ్యానికి విశ్వకళాపీఠం స్నేహనిధి పురస్కారాన్ని అందుకొన్న ఆశారాజు పిన్న వయసులోనే రంజని – కుందుర్తి అత్యుత్తమ పురస్కారం పొందం విశేషం. ‘ఆశారాజు ఈ పదమూడో కావ్యంతో పుస్తకప్రియుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు’ అంటున్నారు సుప్రసిద్ధ విమర్శకులు థింసా (పి.సి.రాములు).

* * *

కవి కామరూపుడు కాదు. కాల స్వరూపుడు. తన కాలానికి నిబద్ధుడు. భవిష్యత్తరానికి మార్గదర్శకుడు. కవి ప్రవక్త. కవిత్వం ప్రవచనం. ప్రవచనం భాషకు లొంగదు. కవిత్వానికి భాష చాలదు. దరిమిలా కవిత ఒక భాషా శకలంగా కాక ఒక ప్రవచనంగా (discourse) మనకు ద్యోతకమవ్వాలంటే సాంప్రదాయక విమర్శనా పద్ధతులు సరిపోవు. రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక మానవ మనోవైజ్ఞానిక శాస్త్రాల పరిచయం తప్పనిసరి. అప్పుడే text వెనకున్న context కానీ context ని text చేసిన సామర్థ్యంగానీ మనకు బోధపడదు. కవిత్వం భాషా చమత్కారిక కాదు. కనిపించని గాయాలను గానం చేసే సామాజిక సంకీర్తన.

కవిత్వానికి రంగు, రుచి, వాసన, దిక్కు, దిశ, చూపు, తోలతు ఉంటాయనడనికి ఇదుగో అపురూప కవి ఆశారాజు. ఇప్పుడు పదమూడవ సంపుటిగా వెలువరిస్తున్న తన ఒగరు ప్రబల నిదర్శనం. అవును… నిజం… ఇది ఒగరు కవిత్వం… తొగరు కవిత్వం… నగర కవిత్వం… నరుడి కవిత్వం… కొండొకచో పొగరు కవిత్వం కూడ…!
వివిధ పత్రికల్లో ఆశారాజు పేరాగ్రాఫు కవితల్ని చదివినప్పుడు కొందరు విస్తుపోయి వుండొచ్చు. చాటు మాటుగానో, జనాంతికంగానో, స్వగత ప్రకాశంగానో ఈ కవిత్వం ప్రస్తావన కొచ్చి కొందరు ఉడుక్కొని ఉండొచ్చు. అద్భుతమైన ఊహా శాలిత్వంతో కవిత్వం పలికే ఆశారాజేనా, ఈ మతి తప్పిన, తలతిక్క కవిత్వాన్ని రాస్తున్నాడని నివ్వెరపి ఉండొచ్చు. ఎందుకింత అస్తవ్యస్తంగా అ(తి)ధి వాస్తవికంగా వక్రోక్తి వైచిత్రిగా నైరూప్య విరూపణగా, విరోధాభాసగా ఆశారాజు తన కవిత్వాన్ని ప్రకటిస్తున్నాడని సందేహమందేహులై ఉండొచ్చు. నిజానికి – అధివాస్తవిక ఛాయలు ఈ కవిత్వంలో కొంతమట్టుకు కనిపిస్తునప్పటికీ, వికృతాలోచనల వక్రభావనలు మాత్రం లేశమాత్రమూ కనిపించవు. సామాజిక వాస్తవిక సంక్షోభ జీవన సంక్షుభిత దృశ్యాలీ కవిత్వంలో దృగ్గోచరమవుతాయి. ధనస్వామ్య యాంత్రిక నాగరికత సృజించిన విశృంఖల విషసంస్కృతి, నగర జీవన సంక్లిష్టత, నైతిన విలువల విధ్వంసనం, పడదోసి పైకెక్కిపోవాలనే మనస్తత్వం, మనిషి పరాయీ కరణకు గురై ఈ సమాజపు టంధకార కీకారణ్యంలో ఒంటరి సామాజికుడిగా మిగులుతున్న దుర్మార్గపు సందర్భం… ఈ ‘ఒగరు‘ వ్యక్తీకరణగా ద్యోతకమవుతుంది.

హింస… హింస… క్రౌర్యం… పైశాచికం… బీభత్సం… భయానకం… ఎటుచూసినా కత్తుల భాషే… కత్తులు మింగి నిద్రపోతున్న ప్రేమికులే… ఎక్కడ చూసినా
నరికేసిన తలలే… రాలిపడ్డ కనుగుడ్లే… దొర్లుతున్న మొండలే… ఖండిత పసిదేహాలే… ఎక్కడ చూసినా కళింగయుద్ధానంతర దృశ్యాలే…! హింస… హింస…
అటుచూడు హింస… ఇటుచూడు హింస… ఎటుచూడు కటువైన చటుల హింస… ‘హింస రచన… ధ్వంస నచణ… ధ్వంస నచణ… ధ్వంస రచన… హింస నచణ… violent love… violent love… గొడ్డళ్ళతో, వేట కొడవళ్ళతో, పిడిబాకుల్తో, యాసడ్ దాడుల్తో ప్రేమస్వరూపాన్ని గాలించి కనుగొనబూనడం… దారుణాతి దారుణం. కనుకనే… హింసాయ మరణం చుట్టు ముట్టిన వేళ సంభోగేచ్ఛ కట్టలు తెంచుకుంటుంది. హింసారాజ్యం… రాజ్యహింస… నిరంతరం… రాజ్యం ఉక్కుపాదం కింద నలుగుతున్న బతుకులే… అభద్రతతో ఆవిరవుతున్న అసువులే… రాజ్యహింసకు తరతమ భేదాలు లేవనీ, ఉండవనీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి రావడం విచారకరం. రాజ్యహింస ఎన్ని రకాలుగా ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఆశారాజు చెప్పిన తీరు ప్రశంసనీయం. ‘రాక్షసులు… రాక్షసులు… రాక్షస రతి… ఇప్పుడొస్తున్న సినీమాలు ఒక రాజ్యహింస… సెన్సార్లు ఒక ఎన్‌కౌంటర్‌… అన్నింటికి ఆడశరీరమే కారణమా? మందులమ్ముకునేవాడు చూపించే మగకండల బొమ్మలే కారణమా? మీరు ఒప్పుకోరుగానీ ఇది రాజ్యహింసనే…’ వాచ్యంగానే అయినా ఒకానొక నిగూఢ భయంకర వాస్తవాన్ని మనముందుంచిన ఆశారాజు అభినందనీయుడు. భౌతిక అణచివేత సాధనంగా ఆధునిక రాజ్యం అవధరిస్తే బౌద్ధికంగా భావజాల పరివ్యాప్తికి దోహదపి రాజ్యహింసోపకరణాలుగా రూపెత్తుతున్న సాంస్కృతిక, మీడియా, సినిమా, విద్యాలయాలు, కుటుంబం, కార్మిక సంఘాలు, మొదలగు సామాజిక సంస్థల లోగొట్టును రట్టు చేసిన ఆశారాజు కవిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడని చెప్పడనికి ఈ ‘ఒగరు‘ కవిత్వమే నిలువెత్తు సాక్ష్యం.

ఉనికి కోసం ఉబలాటపడుతున్న అస్తిత్వ క్రోధనలన్నీ ఏకమై సామ్రాజ్య వాదాన్ని మట్టికరిపిస్తాయని ఆశాభావపుటల్ప సంతోషంతో సంబరప్డం తప్ప సదరు అస్తిత్వపు క్రోధనలన్నీ రాజ్యానికి అనుషంగిక ఉపకరణాలుగా మారిపోయి అంకుల్‌ శ్యామ్‌ మూతి తుడుచుకొనే టిష్యూ పేపర్లవుతాయని ప్రగతిశీలురు కూడ గ్రహించకపోవడమే అత్యంత విషాదకరం.

అంతా డంబికత్వమే…అంతా డంబాచార్యులే… అసలు ముఖం కనిపించదు. నకిలీ మెరుగుకే మార్కెట్‌ ఎక్కువ. ఫ్యూడల్‌ ఉదారగుణమే ఎదురులేని జనాకర్షక
భూషణమై మురిపిస్తున్నదా!? విప్లవస్ఫూర్తి ఏమారుతున్నదా? ప్రలోభాలే ప్రధాన ఆదర్శంగా పరిణమిస్తున్నాయా? ఎవరి స్వార్థం వారి నెట్‌వర్క్‌ను పెంచి లాబియింగే ఒక అదనపుటలంకారమవుతున్నదా? కరప్షన్‌… కరప్షన్‌… ఇంటలెక్చువల్‌ కరప్షన్‌… మేధా పతనం… పతనమేధా… ‘రాచకొండ’ ఒక రాచపుండు కాకపోవడనికీ, ‘మానాల’ రాజ్యభ్రష్టత్వానికి కొలమానంగా మారకపోవడనికీ కారణాలనేకం… కానీ కనిపిస్తున్న దొక్కటే… పోరాటం పాలుమాలుతున్నట్లుండం… సంపాదనే సర్వోత్కృష్ట కార్యం కావడం…! కానీ రాజ్య నరమేధాన్నరికట్టే సత్తా ఒక్క వర్గపోరుకే ఉందన్న నగ్నసత్యాన్ని గ్రహించం మన విధి.

కవులు స్వప్నాధిపతులు. కలలు కనడం వారి నైజం. కలని నిజం చేయడం కాదు కవిత్వం… నిజాన్ని కలగనడమే కవిత్వం గదా! ఈ ‘ఒగరు‘లో స్వప్నాంతర్గత
దృశ్యాల చిత్రిక కనిపిస్తుంది. కలని కవిత్వంలో పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆశారాజు. సామాజిక వాస్తవికతే కలల్నినియంత్రిస్తాయని ప్రత్యేకించి ప్రస్తావించనక్కర్లేదు.
ఇక్కడే ఒక విషయం చెప్పాలి. ఏమంటే… సుప్తచేతనలోని గుప్త రహస్యాలకు, విఫల వాంఛల విపరీత సైకీ వ్యక్తీకరణ కాదీ కవిత్వం. హింసాత్మక జీవన విధ్వంస దృశ్యాల్ని మన కళ్ళకు కట్టే కవిత్వం. మొత్తం సమాజాన్నే ఈడ్చి జాడించిన బలమైన వ్యాఖ్యాన కవిత్వం. సర్రియలిస్టు ధోరణిలో కనిపించే ఇరోటిక్‌ భావాలీ కవిత్వంలో కన్పించక పోవడం ఈ ఒగరు కవిత్వానికబ్బిన అదనపు సుగుణం.

తీరమ్మీద ఇసుకంతా చిన్నపిల్లల కళ్ళలా కదలాడుతున్న రాత్రిగా లలితమైన ఊహ చేయగలిగిన ఆశారాజు ఒక్కోసారి ప్రబంధ కవుల వ్యక్తీకరణని తలపించే విధంగా గుసైన అభివ్యక్తితో విస్మయాద్భుతం గొల్పుతాడు.

రెండు చిలుకలు ఆమె ముక్కెరలోని కెంపు కొరుకుతున్నాయి.
వెన్నెల కురిసి నేలమీది గడ్డి కాలిపోయింది
పెదాల మీద జారిపిన చినుకుల ముత్యాలు గుండె శిఖరాల
మీద దొర్లి చిట్లిపోతున్నాయి…
లాంటివే గాక
సర్పాలు తిరిగే అధరాలు
ఈ షెహనాయిలో సర్పం దూరి బుసకొడుతోంది.

లాంటి వినూత్నాభివ్యక్తీకరణలు ఈ ఒగరులో మనల్ని ‘మంత్ర’ ముగ్ధుల్ని చేస్తాయి. సున్నితత్వంలో కర్కశత్వం, కర్కశత్వంలో సున్నితత్వం, భయంలో ఆనందం, ఆనందంలో భయం, బీభత్సంలో సౌందర్యం, సౌందర్యంలో బీభత్సం – అన్నీ ఏక క్షణంలో కలగలసి అనుభవానికొచ్చే పికాసో గుయెర్నికా చిత్ర రసన ఈ ఆశారాజు ఒగరు.
ఒకింత మనసుపెట్టి ఏకాగ్రతతో ఈ కవిత్వాన్ని పఠిస్తే… ఇందులోని గదలాడించే సౌందర్యం, గజవజ వణికించే సౌందర్యం, రవజవ లాడించే సౌందర్యం, సలమల
మసలించే సౌందర్యం… బీభత్సరస ప్రధాన వైచిత్య్రానంద సౌందర్యం… సారాంశం… సంక్షుబ్ధ సౌందర్యం మనల్ని అచ్చెరువు గొలుపుతుంది.

“There can be no beauty at all, as far as I am concerned -convulsive beauty – except at the cost of affirming the reciprocal relations linking he object seen it its motion and in its repose”

-Mad Love – Andre Breton

ఒక వస్తువు చలనంలో ఉన్న క్షణాన్ని
అదే వస్తువు సరిగా చలనం ఆగిపోయిన క్షణంతో
కలిపేటప్పుడు స్ఫురించే పరస్పర సంబంధాన్ని
ప్రదర్శించేదే సంక్షుబ్ధ సౌందర్యం

అర్థరాత్రి సంచరించే నాగిని సౌందర్యాన్ని, బతుకు తీగ మీద నడిచే రాజమణి మరణ వాంగ్మూలాన్నీ, చితి ముందు కూర్చుని పాడుతున్న ఎరుకలసాని చివరి జోస్యాన్నీ, పాములోడి ప్రియురాలి వెన్నెల బుసల్నీ, కవిత్వం విషకన్య పచ్చల పిడిబాకుల రహస్యపు చుంబనాల్నీ, తియ్యని పాముకాటునీ, బిగబట్టిన పెదాల సౌందర్యాన్నీ, బిగించిన పిడికిలి సౌందర్యాన్నీ చవిచూసేందుకు ఒగరును ఆస్వాదించండి.

థింసా (పి.సి.రాములు)
(జయంతి త్రైమాసిక పత్రిక, జనవరి – మార్చి 2010 సంచిక)

* * *

ఒగరు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

ఒగరు On Kinige

Related Posts:

రాజా హైదరాబాదీ ”పాగల్‌ షాయర్‌”

ఇతను నిన్నమొన్నటి వరకు కవిగా ”ఆశారాజు”. ఇతని అసలు పేరు కూడ అదే. కలం పేరు వేరే లేదు కదాయని ఏదో కొంత కొరతగా భావించి ఈ మధ్య ”రాజా హైదరాబాదీ” యని కలంపేరు మార్చుకున్నాడు. ఇతని ”పాగల్‌ షాయర్‌” చదివితే ఇతను ఎన్నుకున్న కలం పేరు బాగా కుదిరిందని అనిపించింది నాకు. ఒక కవి యొక్క తుది మెట్టు తనను తాను మరచి పోవడమే, అతని కవితలో ”కవిత్వం”, అంటే ”రసం” తప్ప మరొకటి ఉండకపోవడం. అదే ఒకవిధంగా ”భక్తి స్థితి” కూడ. భక్తి స్థితికి రానిదే ఒక కవి ”రసస్థితి”కి రాలేడు. దానినే కదా మనం ”ఋష్యస్థితి” యని కూడ అంటుంటాం. ఈ స్థితిలో కవి ”హేతువు”ను దాటి వెళ్తాడు. కేవలం ప్రేమికుడు అవుతాడు. అతనికి ప్రేమ తప్ప మరేదీ కనిపించదు. ”విషయం”, ”వస్తువు” అతనికొక మిష, కవిత్వమొక ”నిషా”. అతికి ప్రేమే విషయం, ప్రేమే వస్తువు, ప్రేమే భక్తి. ఈ స్థితి ”పూర్ణ విలీన స్థితి”, హేతువును దాటిన ”విశ్వాస స్థితి”. ఈ స్థితిలో ఇక ప్రశ్నలు, జవాబులు ఉండవు. ఇది ”పూర్ణ జ్ఞానోదయ స్థితి”. ఇదే రసస్థితి కూడ. అలాంటి స్థితిలో ఒక కవి కవిత్వం రాయడు, కవిత్వమే అతనిని రాయిస్తుంది. ఇదే మన ”పాగల్‌ షాయర్‌” రచించిన ‘రాజా హైదరాబాదీ’ స్థితి.

దేశాన్ని అందరూ ప్రేమిస్తారు, వారు పుట్టిన మెట్టిన భూమిని, నేలను. కాని, ఆ ప్రేమను వ్యక్తీకరించంలో ఎంత తేడా! ప్రఖ్యాత కళాకారుడు ”పికాసో” అంటాడు ”నేను చూచిందే కళగా నిర్మిస్తాను”యని. కాని, ఆ చూడడంలో ఎంత తేడా ! ఆశారాజు హైదరాబాదును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలియాలంటే అతని ”పాగల్‌ షాయర్‌” చదవండి మీకే తెలుస్తుంది. అసలు ఆశారాజు ఒక గొప్ప ప్రేమికుడు. దేనిని ప్రేమించినా అలాగే ప్రేమిస్తాడు, ఏది రాసినా అలాగే రాస్తాడు. అతను ప్రేమించకుండ రాయలేడు, ప్రేమ కొరకే రాస్తాడు కాని కేవలం విషయం కొరకు కాదు. అందుకే ఆతని కవిత ”అచ్చం కవిత” (pure poetry) అవుతుంది. వస్తువుంటుంది కాని, వస్తువును మించిన ప్రేముంటుంది, భక్తి ఉంటుంది, ప్రేమరసం, భక్తిరసముంటుంది. అతనికి సిద్ధాంతమంటూ ఏదైనా ఉంటే నా ఉద్దేశ్యంలో అది ప్రేమసిద్ధాంతమే, భక్తి సిద్ధాంతమే, మానవీయ సిద్ధాంతమే. ఈ మధ్య ”సెట్లర్స్‌” యను పదం ఒకటి వినిపిస్తోంది హైదరాబాదు నగరంలో పదే పదే. దానిని వేరు వేరు అర్థాల్లో వాడుతున్నారు వాడేవారు. ఆశారాజు ఒక సెట్లర్‌కు, ఒక అసలు వానికి ఉండే తేడా చూపిస్తారు అడుగడుగునా ”పాగల్‌ షాయర్‌”లో. నీవు ఒక కాందిశీకుని లాంటివాడివో, వలసవాది లాంటివాడివో, సెట్లర్‌ లాంటివాడివో లేక ఈ హైదరాబాద్‌లో నివసించే వారిలో నీవూ ఒక అసలు సిసలైన వాడివో తేల్చుకోవాలంటే ”పాగల్‌ షాయర్‌” చదివితే తెలుస్తుంది.

ఒక సెట్లర్‌ది కేవలం ఉద్యోగ పిచ్చే, వ్యాపార పిచ్చే, ఆస్తి పిచ్చే, ఆదాయపిచ్చే కాని, రాజా హైదరాబాదీ లాంటి మాతృపిచ్చి, పితృపిచ్చి, పుట్టిన మెట్టిన పిచ్చి కాదు, కానేరదు. అసలు సిసలైన వానిది మట్టి వాసన పిచ్చి. ఒకనాడు నోబుల్‌ ప్రైజ్‌ గ్రహీత ‘పర్ల్స్‌ ఎస్‌.బక్‌’ వ్రాసిన ‘గుడర్త్‌’లోని కర్షకుని పిచ్చి. అలాంటి వాడు ఆ భూమికి విలువ తప్ప ఖరీదు కట్టడు. అతను అతని నేలను అమ్ముకోవడం అతనిని అమ్ముకోవడం లాంటిదిగా భావిస్తాడు.
అతని నేలలో అతడు అతని అస్తిత్వాన్ని చూస్తాడు. అలాంటివాడు సెట్లర్‌ లాంటివాడు కాడు, ఈ గడ్డవాడౌతాడు, ఈ నగరం వాడౌతాడు, ఈ నేలవాడౌతాడు, ఇచటి అసలు సిసలయిన వాడవుతాడు. అలాంటివారు ఎవరైనా వారిని ఎవ్వరూ ‘సెట్లర్‌’గా, కాందిశీకునిగా, వలసవచ్చినవానిగా చూడరు. ఆశారాజు ”రాజా హైదరాబాదీ” అలాంటి అసలు సిసలైన వాడు.

డా. కొండలరావు వెల్చాల

(జయంతి త్రైమాసిక పత్రిక, జులై – సెప్టెంబరు 2010 సంచిక)

* * *

”పాగల్‌ షాయర్‌” కవితాసంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పాగల్ షాయర్ On Kinige

Related Posts:

“ఆకాశం” కవితాసంపుటి గురించి బి.వి.వి. ప్రసాద్ …

మీరు కవిత్వ ప్రేమికులై, కొంతసేపైనా మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.

‘ఆకాశం’ కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం రాయలేదు. ఈ కాలం సాహిత్య వాతావరణంలో బాగా ప్రచారంలో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహతోనూ రాయలేదు.

నా జీవితానుభావాన్నుండి, చింతన నుండీ నేను జీవితం అంటే ఏమిటి అనుకొంటున్నానో, జీవిత లక్ష్యం ఏమిటి అనుకొంటున్నానో, మరింత ఉన్నతమైన, ఉదాత్తమమైన జీవితానుభవం కావాలంటే మనం ఎలా అనుభూతించాలో, ఆలోచించాలో, వేటిని ధ్యానించాలో, వేటిని ఉపేక్షించాలో నాకు చాతనైనంత వరకూ చెప్పటానికి ప్రయత్నించాను. అయితే సౌందర్యావిష్కారం కవిత్వ ప్రధానధర్మమని నమ్మటం వలన చాతనైనంత సౌందర్య స్పృహతోనే రాశానని, చాలావరకూ సఫలమయ్యాననీ చెప్పగలను.

ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వంగా పిలవటం సాహిత్య ప్రపంచంలో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతనలు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్‍కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.

కాలం గడిచే కొద్దీ చింతన కన్నా, అనుభవానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందువలన కవిత్వం కూడా, కొన్ని ఆలోచనలను ప్రోది చెయ్యటం కన్నా, సరాసరి అనుభూతినీ, అనుభవాన్నీ ఇవ్వటానికే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని నా భావన. అందువలన నా కవిత్వం అనుభూతీ లేదా అనుభవ ప్రధానంగా ఉంటూ వచ్చింది నా వచన కవిత్వంలోనూ, హైకూలలోనూ కూడా. అయితే ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి ఎంత సాంద్రమైన అనుభవాన్ని పొందే శక్తీ, అభివ్యక్తి నైపుణ్యమూ కావాలో, పాఠకుడికి కూడా ఆ శక్తులు అంతగానూ కావాలి. తేలికైన మాటలలో చెప్పాలంటే, జీవితం లోని విషయాల పట్ల మాత్రమే కాకుండా, మొత్తం జీవితం పట్ల శ్రద్ధ కావాలి. కనీసం తనతో తాను నిజాయితీగా ఉండగల స్వచ్చత కావాలి.

కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు పిచ్చి గీతలు గీసిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు మిమ్మల్నిలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను. ఇది తప్పక మీ లోలోపలి శాంతికీ, స్పష్టతకీ ఒక మంచి స్నేహితుడిలా సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాను.

ఈ పుస్తకం కినిగె.కామ్ లో ఈబుక్ రూపంలో కూడా లభిస్తోంది.

బి.వి.వి. ప్రసాద్
నా బ్లాగ్: http://bvvprasad.blogspot.in/

ఆకాశం On Kinige

Related Posts:

అలరించే అరాచక కవిత్వం

అలరించే అరాచక కవిత్వం అనే శీర్షికతో ఇండియా టుడే పత్రికలో (27 సెప్టెంబరు 2011 సంచిక) వచ్చిన ఈ వ్యాసం అరుణ్ సాగర్ రాసిన ‘మియర్ మేల్’ అనే కవితాసంపుటిపై సమీక్ష. రామా చంద్రమౌళి గారు ఈ పుస్తకాన్ని సమీక్షించారు.

కవిత్వమంటే కవి పాఠకునికి రాసిన రహస్య లేఖని వినూత్న నిర్వచనం ఉందని సమీక్షకులు పేర్కొన్నారు. అరుణ్ సాగర్ దృష్టి కొత్తదని, జీవితాన్ని అవలోకిస్తున్న కోణం కొత్తదని, అందువల్ల జీవితం అతనికి క్రొంగొత్త మిత్రులతో, వినూత్న కొలతలతో విచిత్రమైన నూతన రూపురేఖలతో దర్శనమిస్తుందని అంటారు.

కవి వాడిన కొత్త పదబంధాలు, పదచిత్రాలు కవితావాక్యాలని రసవంతం చేసాయని చంద్రమౌళి గారు అంటారు.

పూర్తి సమీక్షని ఈ దిగువ బొమ్మలో

చదవచ్చు.

ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ. 30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: