చదవాల్సిన పుస్తకం: మనీప్లాంట్

ఇతర భాషా కథల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న రచయితల్లో ముందువరుసలోని కథకుడు – కొల్లూరి సోమ శంకర్. సోమ శంకర్ అనువాద కథల సంపుటి – ‘మనీప్లాంట్‘.
కొన్ని ప్రత్యేకతలని సంతరించుకుని, ఒక విలక్షణ గ్రంథంగా మనముందుకొచ్చింది – ఈ ‘మనీప్లాంట్’.

ఈ పుస్తకానికి “వికసించిన అనువాద సృజన” అని గుడిపాటి ముందుమాట ఉంది. పుస్తకంలోని ప్రత్యేకతల్లో మొదటిది ఈ ముందుమాట.

తెలుగులో చక్కని వచనం రాయటం చక్కని కవిత్వం రాయటం కంటే కష్టం. ‘శైలి రచయిత వ్యక్తిత్వం’ అంటారు. కొంతమంది శైలి బాగా incisive గా వుంటుంది. అతి తక్కువ అక్షరాల పదాలు, అతి తక్కువ పదాల వాక్యాలు, భావం వాటి వెంట పరిగెత్తుతుంది. ప్రతిపాదిస్తున్న అంశం మళ్ళీ గాఢంగా అందుతూ వుంటుంది పఠితకి.
ఇంతటి శక్తివంతమైన శైలి తెలుగు రచయితల్లో చాలా తక్కువ మందిలో చూస్తాము.

గుడిపాటి అభిప్రాయభాగాన్ని ఉదహరిస్తున్నాను. చూడండి. “జీవితం అందరికీ ఒకేలా ఉండదు. మనుషులు తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవర్తించరు. సహేతుకంగా ఉండాలని ఆశించడం తప్పుకాదు. కానీ ఉండలేకపోవడమే జీవిత వాస్తవం. తమలా ఎదుటివారు ఆలోచించాలని, నడుచుకోవాలని మనుషులు ఆశిస్తూంటారు. కానీ అలా ఎవరూ ఉండలేరు. నిజానికి తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కూడా ఉండలేరు. కారణాలేమయినా, మనుషుల్ని ఉద్వేగాలే నడిపిస్తాయి. అందుకే ఒక తీవ్రతలోంచి మరో తీవ్రతలోకి ప్రయాణిస్తారు. ఈ మనిషి చచ్చిపోతే బాగుండును అనుకున్న మనిషి పట్లనే అవాజ్యమైన ప్రేమ కలుగుతుంది. అదెలా సాధ్యమనే ప్రశ్నకు హేతువు సమాధానం చెప్పదు. జీవితమే దాని సరైన జవాబు. ఇలాంటి జీవిత సత్యాన్ని చెప్పే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి”.

భావాస్పదమైన పదాల పోహళింపు, భావ విపులీకరణ – రెండూ అద్భుతంగా నిర్వహించబడిన రచనా పరిచ్ఛేదం ఇది.

ఇక, గుడిపాటి వ్యక్తం చేసిన జీవన తాత్వికతకి వస్తే – ఇది పూర్తిగా భౌతిక వాస్తవికత పునాదిగా కల్గిన అవగాహన. మనిషి బహిరంతర వర్తన, ఆలోచన – వీటికి గల పరిమితి, వీటి మీద external and internal forces ప్రభావాలు – అన్నీ సద్యస్ఫూర్తితో ఆకళించుకుని చెప్పిన ఒక గొప్ప అభిప్రాయంగా అంగీకరిస్తాము దీన్ని.
జీవితం పట్ల ఒక తాత్విక వివేచనని సముపార్జించుకోకుండా, అధ్యయన రాహిత్యంతో కథల్ని పునాదులు లేని మేడలుగా నిర్మించబూనడం – ఆరుద్ర అన్నట్లు ‘బంతి లేకుండా ఫుట్‌బాల్ ఆడడం’ వంటిది. జీవితం, జీవన విధానం, గతి – సరళరేఖ కాదు. దీన్ని గమనించకుండా, ప్రతీ సంఘటనకీ, కథలోని ప్రతీ పాత్రకీ కార్యకారణ సంబంధాల్ని అంటగట్టాలని కృతకమైన రీతికి తలపడడం – కథౌచిత్యాన్ని దెబ్బతీస్తుంది.

గుడిపాటి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించేవారు – అటు పాఠకుల్లోనూ, ఇటు కథకుల్లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు గుడిపాటి చెప్పినంత స్ఫుటంగా, ఇంత సరళంగా, ఇంత శక్తివంతంగా – తెలుగు కథా సాహిత్యంలో ఎవరూ చెప్పలేదు. గుడిపాటి చెప్పిన ఈ అంశాన్ని కొత్తకథకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

‘మనీప్లాంట్’ పుస్తకంలోని Contents విషయానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలని చూద్దాం. ‘పట్టించుకోని వాళ్ళయినా వాస్తవాలని ఎదుర్కోక తప్పదు’ అంటాడు ఆల్డస్ హక్స్‌లీ. మనకు బాగా దూరంగా నివసించే ప్రజల గురించీ, వారి జీవన విధానాన్ని గురించీ, స్థితిగతులను గురించీ మనం ఎక్కువగా పట్టించుకోము. కానీ, అవే మనకూ తారసపడవచ్చు. మనమూ వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. కనుక, ఆయా స్థితిగతుల్ని మనమ్ ముందుగానే పరిచయం చేసుకొని వుంటే, నిజజీవితంలో ఆయా సంభవాలు ఎదురయితే, వాటిని ఎదుర్కోడం సుళువవుతుంది. అంటే మానసికంగా తయారై వుండటమన్న మాట. ఇతర భాషాసాహిత్య పఠనం ఇందుకు బాగా వుపయోగపడుతుంది. అందునా కథలు – వివిధ జీవన పార్శ్వాల మెరుపుల్నీ, మరకల్నీ, మనకు గాఢతతో అందించగలవు; మన ఆలోచనల విస్తృతికి దోహదం చేయగలవు. ఇదీ అనువాద కథల ప్రయోజనం.

ఈ పుస్తకానికి “అనువాద ‘కథం’బం” ముందుమాట కూర్చిన కె. బి. లక్ష్మి ఇదే విషయాన్ని ఇలా చెప్తున్నారు, “స్నేహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసుయలు, కలిమిలేములు, కష్టసుఖాలు, వినోద విలాసాలు – వగైరాలు విశ్వమానవులందరికీ సమానమే. ఏ భాష వారు ఆ భాషలో ఘోషిస్తారు”. కనుక, ఆ ఘోషల మూలాల్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు తోడ్పడుతాయి.

‘మనీప్లాంట్’ లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ – వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో – ‘ఈనాటి’ జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ – ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల్ ఎన్నిక – ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
“లుకేమియా”తో బాధపడుతున్న క్లాస్‌మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ ‘పెరుగన్నం’తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి – జీరోగా గేలిచేయబడిన ‘శూన్య’ చివరికి గురువుగారి సాంత్వనలో “నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు” అనుకునే స్థితికి ఎదిగిన “సున్నాగాడు” వరకూ – ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.

మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత – కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా – సోమ శంకర్‌లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా – అనువాదం నిర్వహించారు సోమ శంకర్.

కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ – పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి ‘మనీప్లాంట్’. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)

* * *

“మనీప్లాంట్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మనీప్లాంట్ పుస్తకాన్ని కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

మనీప్లాంట్ On Kinige

Related Posts: