ఎప్పుడూ కొత్తగా అనిపించే పాత కథలు (వేలుపిళ్లై సమీక్ష)

దాదాపు ఈ కథలన్నీ ఏభై ఏళ్ళనాటివి. ఐనా పాతబడ్డకొద్దీ విస్కీ విలువ పెరిగినట్లు యిప్పుడొస్తున్న వాసి ప్రధానం కాని కథల రాశితో, నాణ్యతతో పోల్చినప్పుడు ‘అబ్బా… ఆ పాత కథలు ఎంత కొత్తగా, ఎంత తాజాగా, వాడిపోకుండా పరిమళభరితంగా ఉన్నాయా’ అని ఆశ్చర్యపడ్తూ, ఆనందపడే స్థాయిలో ఉన్న కథలు ‘వేలుపిళ్లై‘ పుస్తకంలోనివి. వీటిని రాసిన సి. రామచంద్రరావు కూడా ఈ కథల వలెనే ఒక విలక్షణమైన వ్యక్తి. తెలుగు పాతకథల వైభవం తెలిసిన వరిష్ట పాఠకులకు బాగా తెలిసినవాడు. బాగా అంటే ఎక్కువ అని కాదు, మంచి కథలు రాసే రచయితగా అని. అతను రాసిన కథలే అతి తక్కువ. తన యాభై అరవై ఏళ్ళ రచనా జీవితంలో అతని రాసినవి ఈ పుస్తకంలోని తొమ్మిది కథలే. తక్కువ కథలు రాసిన వారందరూ గొప్ప రచయితలు కారు కాని ఎందుకో చాలామంది గొప్పరచయితలు తక్కువ కథల్నే రాసిన ఉదంతాలు చాలా ఉన్నాయి.
‘వేలుపిళ్లై’లోని దాదపు అన్ని కథల్లోనూ స్థలం తెలుగుప్రాంతం కాదు. పాత్రలు, వాతావరణం, పరిసరాల స్వరూప విశేషాలూ తెలుగువి కావు. కథావస్తువు కూడా జనానికి బాగా తెలిసిన, సార్వజనీనమైన జీవితంలోంచి స్వీకరించినది కాదు. రచయిత తనకు తెలిసిన, తనదైన, తన అభిరుచికి తగిన ఒక అసాధారణ జీవిత పర్యావరణంలో నుండి ప్రత్యేకంగా ఎన్నుకున్న కథావస్తువులే అన్ని కథల్లోనూ ఉన్నాయి. పాత్రలు ఎక్కువగా తమిళులు, ఇంగ్లీషు దొరలు, ఎస్టేట్ కొండలు, లోయలు, అక్కడి ప్రత్యేకమైన జీవితపు అలవాట్లు, సంస్కృతి, జీవన విధానం చాలావరకు అధునాతనమైన నియోరిచ్ క్లాస్ అలవాట్లు, కథనం… ఇవన్నీ వందేళ్ళ తెలుగు కథతో పోలిస్తే, రామచంద్రరావు విలక్షణంగా ప్రవేశపెట్టి, మెప్పించి, అనేక బహుమతులను సాధించి, తనదైన వింత గొంతుతో తనదైన ముద్రని మిగిల్చిన బాపతు… ఐతే ఈ కథలు అనేకమంది విజ్ఞులైన సాహిత్యకారులతో సహా బహుళపాఠకుల ఆదరణని పొందడానికి కారణం పూర్తిగా తెలుగువాడైన రచయిత ప్రతీ కథలోనూ నిజాయితీతో నిండిన తెలుగుదనాన్ని సజీవంగా అందివ్వడం. పాత్రలలో పారదర్శకమైన ప్రతిస్పందనలను, ప్రతిఫలనాలను ఉన్నదున్నట్లుగా ప్రస్ఫుటపరచడం. సందర్భాన్ని అందమైన శిల్పం వలె చెక్కి సన్నివేశాన్ని రూపుకట్టించడం.
రచయిత ఎవరైనా తన కథలను తను ఎరిగిన జీవితం నుంచే సృజిస్తాడు. తను కూడా ఒక భాగస్వామియైన తానెరిగిన సామాజిక వాతావరణం నేపధ్యం నుండీ ఏరుకుని కథనుగానీ, ఏ ఇతర ప్రక్రియనుగానీ సృజిస్తాడు. కథకు అక్కడి భౌగోళిక, వాతావరణ, సన్నివేశ సంబంధ వైవిధ్యత వంటివన్నీ కూడా అదనపు అలంకారాలై కృతిని పరిపుష్టం చేస్తాయి. దృశ్యమాధ్యమమైన ‘సినిమా’లో శ్యామ్ బెనెగల్, గోవింద్ నిహలనీ, సంతోష్ శివన్ వంటి సృజనాత్మక దర్శకులు తమ చిత్రాల్లో కథను చెప్పేముందు ఆ సన్నివేశాన్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ముందు ప్రేక్షకుల ముంచు ప్రతిష్టించి ఒక చదరంగంలో పావులవలె పాత్రలను కదుపుతారు. అందుకే వాళ్ళ చిత్రాలు కళాపిపాసులైన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సి. రామచంద్రరావు కూడా తన కథల్లో కథా సందర్భాన్ని వాతావరణ సహిత ప్రస్తావనలతో ఉన్నతీకరిస్తారు. అంతిమంగా ఒక కొసమెరుపుతో, అనూహ్య మలుపులతో కథను ముగించి ఒక విభ్రమని కలిగిస్తారు. రచయిత మంచి టెన్నిస్ ప్లేయర్. వింబుల్డన్ క్రీడాకారుడు మహేష్ భూపతి రామచంద్రరావు సోదరుడి కొడుకు. స్వయంగా కూడా ఆయన టెన్నిస్ చాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. జీవితంలో ఎక్కువ కాలం టీ తోటల మేనేజర్‌గా, నిర్వాహకుడిగా బ్రిటీష్ అధికారుల మధ్య హుందాయైన ఉద్యోగంలో ఉంటూ వెలుగునీడలను చూశారు. అందువల్ల చాలా కథల్లో టెన్నిస్ ఆట ప్రస్తావన, వివరణ… టీ తోటల్లోని తమిళ వ్యక్తుల, జీవితాల వివరణ, తేయాకు తోటల ఎస్టేట్లలో ఒక అనివార్యభాగమైన ఆఫీసర్స్ క్లబ్బుల ప్రస్తావన, పార్టీలు, విస్కీ విందులు, అత్యాధునిక విలాసవంతమైన యువతీయువకుల అగ్రేసివ్ ప్రవర్తనలతో నిండిన ‘గెట్ టుగెదర్‌లు’… ఇవన్నీ అంతర్లీనంగా ప్రవహిస్తూ అతి సహజమైన కథలికలతో సజీవంగా మన ముందు కదలాడ్తూ కథని సమగ్రం చేస్తూ హృదయాన్ని స్పర్శిస్తాయి. రచయిత తనదైన చమత్కార పాటవంతో సాధించిన విజయమిది.
‘వేలుపిళ్లై’ కథలో ఒక టీ ఎస్టేట్ బజారులో మాములు సరుకులమ్ముకునే వేలుపిళ్లై టోకు వస్తువ్యాపారి గోపాల్ చెట్టియార్ స్నేహంతో ఎలా ఆర్ధికంగా పుంజుకుని ఎదిగి గయ్యాళి పెళ్ళాం పవనాళ్‌ని విడిచి వయసులో ఎంతో చిన్నదీ, వ్యవహారజ్ఞురాలైన సెందామరైతో ఎలా జీవితాన్ని జయించాడో చెప్పాడు రచయిత. సెందామరై శ్రుతి మించిన చురుకుదనంపై అందరికీ కండ్లమంట. అపవాదులు, ఏడుపు. ఐనా జనం మాటలను లక్ష్యపెట్టకుండా సైందామరైని స్వచ్ఛంగా ఇష్టపడే వేలుపిళ్లై అంతరంగాన్ని రచయిత విప్పి చెప్పిన తీరు పాఠకులని చకితులని చేస్తుంది. ముగింపు ఒక గాలితెప్ప స్పర్శవలె పులకింపజేస్తుంది.
మరోకథ ‘ఏనుగుల రాయి’ కూడా అంతే. టీ ఎస్టేట్, ప్లాంటేషన్ ఏరియాలు, తేయాకు మొక్కల నర్సరీలు, ఏటవాలు కొండల నేపథ్యం….. తేయాకు తోటలపైకి ఏనుగుల దాడి…. విధ్వంసం…. అక్కడి ఒక తమిళ బాలుడు కడకరై ఏనుగులతో పరిచయం పెంచుకుని, స్నేహితునిగా మరి, ఏనుగులతో ఎడబాటు, వియోగం…. మళ్ళీ ఏనుగులను కలుసుకుని స్నేహించి…. చివరికి ఏనుగులరాయి దగ్గర రాళ్ళు దొర్లి కడకరై చనిపోవడం… మనిషికీ, జంతువులకూ, ప్రకృతికీ మధ్య అదృశ్యమై సజీవంగా ఉన్న బంధాన్ని ఈ కథ అద్భుతంగా చెబుతుంది.
‘టెన్నిస్ టూర్నమెంట్’, ‘గాళిదేవరు’, ‘ఫాన్సీ డ్రెస్ పార్టీ’, ‘కంపెనీ లీజ్’, ‘క్లబ్ నైట్’…… కథలన్నీ సమాజంలోని ఉన్నత విద్యావంతులైన టీ ఎస్టేట్స్, టెన్నిస్ రంగాలలో ప్రసిద్ధులైన వ్యక్తులు పాత్రలుగా నిండిన విశ్లేషణలే…. ఆడ, మగ… కలతలు, అతి సున్నిత మానవీయ సంబంధాలు, బలాలు, బలహీనతలు…. సెక్స్ ప్రతిఫలనాలు…. లోలోపల రహస్యమై నడిపించే అంతరంగ స్వభావాలు….. అంతా ఒక ‘న్యూ సాండ్‌విచ్’. ఈ కథలన్నీ యిదివరకు ఎన్నోసార్లు ‘పాతకథల’ ప్రస్తావన కింద ఎన్నో ప్రముఖ పత్రికల్లో మళ్ళీ మళ్ళీ వెలువడ్డవే.
కొత్తగా కథలను రాయాలనుకుంటున్న రచయితలు ‘వేలుపిళ్లై’ కథల్ను నమూనాగా అధ్యయించి కథను ఎంత సరళ సుందరంగా నడిపించవచ్చో నేర్చుకోవచ్చు. ఈ కథలు ‘తెలుగు కథ’ యాత్రలో తారసపడే అందమైన జ్ఞాపికలు. శాశ్వతమైనవి. మరుపురానివి.

రామాచంద్రమౌళి
(పాలపిట్ట జూన్ 2012 సంచికలో ప్రచురితం)

* * *

“వేలుపిళ్లై” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
వేలుపిళ్లై On Kinige

Related Posts:

అచలపతి కథలు-1

గ్రేట్ ఆంధ్రా డాట్‍కామ్‍లో ఎమ్బీయస్ కబుర్లు శీర్షిక ద్వారా సుపరిచరితులైన రచయిత ఎమ్బీయస్ ప్రసాద్.

ఆంగ్ల హాస్యరచయిత పి.జి.ఉడ్‌హౌస్‌ రచనలంటే ఎమ్బీయస్ ప్రసాద్ గారికెంతో ఇష్టం. ఆయన భావవ్యక్తీకరణను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ప్రయత్నమే అచలపతి కథలు. జీవ్స్‌, వూస్టర్‌ పాత్రల స్ఫూర్తితో అచలపతి, అనంతశయనంలను మలచుకుని ఈ కథలు రాశారు.

ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు – అనుసృజనా కాదు.. తెన్గింపు కాదు – తెలుగింపు. ఇంపైన సొంపైన తేట తెలుగులో హాయిగా చెప్పారు.

అచలపతి అనంతశయనానికి కార్యదర్శిలాంటివాడు. అనంత్ పెద్ద తెలివైన వాడని భావించుకుని చిక్కుల్లో పడినప్పుడల్లా అచలపతి తన తెలివితేటలతో అతన్ని బయట పడేస్తూ ఉంటాడు. ప్రింట్ పుస్తకంలో మొత్తం 18 కథలుండగా, ఈ-బుక్‌ని రెండు భాగాలుగా విభజించి తొమ్మిది కథలతో మొదటి భాగాన్ని విడుదల చేసారు రచయిత.

ఈ కథల గురించి తెలుసుకుందాం. హాస్యపూరితమైన సంభాషణలు కథలకి సొబగులద్దాయి.

అచలపతీ – అమితజీవీ: ఈ కథలో ఓ కుర్రాడికి సినిమా పిచ్చి. తన తండ్రి తనకు నిజమైన తండ్రి కాదని, తాను ఏ జమీందారు బిడ్డనోని, చిన్నప్పుడు దొరికితే ఈ తల్లిదండ్రులు పెంచుకుంటున్నారని భావించే వ్యక్తి. ఈ పిచ్చిని వదిలించడానికి అనంతశయనం ఓ ఉపాయం పన్నుతాడు. ఆ అబ్బాయి ఏమైతే ఊహించుకుంటున్నాడో అవన్నీ నిజమని, అయితే వాళ్ళ కుటుంబాన్ని వేరు చేసిన ఆ ముగ్గురు విలన్లు ఇప్పుడు జీవించి లేరని, పగప్రతీకారలనే ఆలోచనలు మానుకుని ఇక బుద్ధిగా చదువుకోమని చెబుతాడు. అయితే పదిరోజుల తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. నువ్వే నా తండ్రివంటూ ఆ కుర్రాడు అనంతశయనం వెంట పడతాడు. ఈ సమస్యని అచలపతి ఎలా పరిష్కరించాడనేది ఆసక్తికరం. “శివాజీ గణేశన్ మైలుకి తక్కువ డైలాగు చెప్పినంత ఒట్టు… ముళ్ళపూడి వెంకటరమణ దీర్ఘోపన్యాసం ఇచ్చినంత ఒట్టు” – అనేది ఈ కథలో బాగా నవ్వించే వ్యాక్యం.

అచలపతీ – అరబాటిలు ధైర్యమూ: ఖగపతి అనే మిత్రుడు ఓ స్కూలు టీచరుని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గురించి ఆమెకి ఎలా చెప్పాలో, ఏమని ఒప్పించాలో తెలియక అనంతశయనం వద్దకు వస్తాడు. అ టీచరు ఖగపతి బొత్తిగా చవటని, చొరవలేని మనిషని భావిస్తుంది. అందుకని అర్జెంటుగా ఖగపతిని ధైర్యశాలిని చేసేయ్యాలని నిర్ణయించుకుంటాడు అనంతశయనం. బడిపిల్లలకి బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా ఖగపతిని ఏర్పాటు చేస్తాడు. భయస్తుడైన ఖగపతి వణికిపోతుంటే అరబాటిల్ ధైర్యాన్ని పోయిస్తాడు అనంతశయనం. మత్తులో స్టేజి మీద వీరంగం వేస్తాడు ఖగపతి. మత్తు దిగాక, మర్నాడు అతనికి మరో భయం పట్టుకుంటుంది – ఆ టీచర్ తనని అసహ్యించుకుంటుందేమోనని! అనంతశయనం మరో అయిడియా ఇచ్చి – ఆ టీచర్ పేరుతో ఉత్తరం రాయిస్తాడు. కథలో మలుపేంటంటే – ఖగపతి, అనంతశయనం ఊహించుకున్నట్లు కాకుండా ఆ టీచర్ ఖగపతిని ఇష్టపడుతుంది. తనను మర్చిపొమ్మని ఖగపతి రాసిన ఉత్తరం అచలపతి ఆమెకివ్వడం ఆలస్యం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. “పిల్లాడిని బాగా చదివించినందుకు నా రుణం ఇంకెలా తీర్చుకోనూ?” – అనేది బాగా నవ్వించే వాక్యం ఈ కథలో.

అచలపతీ – క్రి ‘కేటూ’: రాయుడనే పిల్ల జమీందారు బ్రాకెట్ ఆట మోజులో పడి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటాడు. తిరిగి పుంజుకునే మార్గాన్ని వెతుకుతూండగా ఓ దూరపు బంధువు చనిపోతే తన ఆస్తినంతా రాయుడి పేర రాసేస్తాడు, కొత్తగా వచ్చిన ఆస్తితో ఏం చేయాలో కనుక్కుందామని అనంతశయనం దగ్గరికి వస్తాడు రాయుడు. ఓ క్రికెట్ మ్యాచ్‌ని స్పాన్సర్ చేయమని సలహా యిస్తాడు అనంతశయనం. దానికన్నా ఓ ఆటగాడితో మాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు రాయుడు. ఆటగాడు చేసే పరుగుల మీద పందేలు కాయిస్తాడు. మధ్యవర్తిగా అనంతశయనాన్ని ఉంచుతాడు. ఎంతోమంది ఆ ఆటగాడి మీద పందేలు కాసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. దాంతో రాయుడు మహాభినిష్క్రమణం గావించడానికి ప్లాన్ చేస్తాడు. కానీ రాత్రికి రాత్రికి అచలపతి పన్నిన ఉపాయంతో రాయుడు, అనంతశయనం కఠిన పరిస్థితుల నుంచి బయటపడతారు. “మీ మహాభినిష్క్రమణం వీడియో తీయించి హొరైజన్‌కి అవతల మీకందజేసే ఏర్పాట్లు చూడమంటారా సర్?” ఈ వాక్యం, దీని తరువాతి వాక్యాలు చదువుతుంటే నవ్వాపుకోలేం.

అచలపతీ- అభౌతిక జీవులూ: అనంతశయనం అత్త కవయిత్రి. తానే సొంతంగా ఓ పత్రిక స్థాపించి నడుపుతూంటుంది. పత్రిక కంటెంట్ కోసం, ఫైనాన్సు కోసం ఓ పేరుమోసిన బొంబాయి పబ్లిషర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుని, అతన్ని ఆహ్వానిస్తుంది. తమ వంటవాడి రుచికరమైన వంటలతో పబ్లిషర్‌ని పడగొట్టి, ఒప్పందం కుదుర్చేసుకోవాలనుకుంటుంది. ఆమె ఆశించినట్లే జరుగుతుంది. రుచికరమైన ఆ వంటలు అతనికి బాగా నచ్చేస్తాయి. అతను వంటతని పట్టణ జీవితం ఆశ చూపి తన వైపుకి తిప్పేసుకుంటాడు. బదులుగా అత్త మరో ఉపాయం పన్నుతుంది. ఆ పబ్లిషర్ కూతురిని వలలో వేసుకోమని అనంతశయనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆమె తలచింది ఒకటైతే, జరిగేది మరొకటి అవుతుంది ఈ విషయంలో కూడా. చివరికి అచలపతి రంగంలోకి దిగితేగానీ, సమస్య పరిష్కారం కాదు. “త్వమేవాహం అర్థమయిందన్న పాఠకుడికేసి ఆరుద్రలా అపనమ్మకం, ఆశ్చర్యం, అనందం, సంభ్రమం మేళవించి నాకేసి చూసింది” – పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే ఇలాంటి వాక్యాలు మరెన్నో ఉన్నాయి ఈ కథలో.

అచలపతీ – ఆరంజి కోటూ: బ్లాక్‌మెయిలర్ బారిన పడిన బంధువు కొడుకుని రక్షించడానికి ఓ బ్రోతల్ హౌస్‌కి వెళ్ళిన అనంతశయనం తాను కూడా వాళ్ళ బ్లాక్‌మెయిల్ బారిన పడతాడు. అచలపతి పూనుకుని రక్షిస్తేగానీ, ఆ ప్రమాదంలోంచి బయటపడలేడు. “అచలపతి ముఖం మాడినట్లు తెలియనివ్వలేదు గాని నాకు వాసన తగిలింది.” ; “మనవాళ్ళకి మాక్రో ఆస్ట్రో ఫిజిక్స్ (ఈ శాస్త్రం ఉందో లేదో నాకు తెలీదు. కానీ, ఏ సబ్జెక్ట్ కైనా సరే మైక్రోయో, మాక్రోయో తగిలిస్తే హుందాగా, గంభీరంగా ఉంటుందని నాకో గట్టినమ్మకం) ఇంకా సరిగా వంటబట్టలేదు.” – ఈ వాక్యాలు చదువుతూంటే నవ్వాగదు.

అచలపతీ- పాదధూళీ: బెంగాలీ అనువాద నవలలు చదివి త్యాగమూర్తిగా మారిపోయిన మరదలు మణి బారినుంచి అనంతశయానాన్ని అచలపతి రక్షించిన విధానాన్ని ఈ కథ చెబుతుంది. కథ మొత్తం హాస్యమే. ప్రత్యేకించి కొన్ని వాక్యాల గురించి రాయనవసరం లేదు.

అచలపతీ- భాగవిపణీ: అనంతశయనం అత్తయ్య తన పత్రికని పాపులరైజ్ చేయడం కోసం షేర్ కాలం ప్రవేశపెట్టి, పాఠకులకు పిచ్చి సూచనలు చేసి వాళ్ళందరు షేర్ల వ్యాపారంలో నష్టపోయే ప్రమాదంలోకి తీసుకువెడుతుంది. దీనికి విరుగుడుగా అనంతశయనం చెప్పిన ఉపాయం వికటిస్తుంది. చివరికి అచలపతి రంగప్రవేశం చేయకతప్పదు. ఈ కథంతా హాస్యమే. “గులేబకావళి పుష్పం ఎక్కడినుంచో తెచ్చినా చేతికివ్వకుండా తానెక్కిన కొండలు, గుట్టలు గురించి వర్ణిస్తున్న పుత్రుణ్ణి ‘చూసి’ అసహనంగా ఫీలవుతున్న గుడ్డితండ్రిలా అడిగింది అత్తయ్య” – ఇలాంటి నవ్వించే డైలాగులు ఈ కథలో బోలెడు.

అచలపతీ- ఆయుర్వేదం చాక్లెట్లూ: తన మిత్రుడుకి అల్లం సబ్బులు తయారు చేసి అమ్మమని ఒకసారి, ఆయుర్వేదం చాక్లెట్లు అమ్మమని మరోసారి సలహా ఇచ్చి అతని కొంప ముంచుతాడు అనంతశయనం. ఈ కష్టం నుంచి – యథా ప్రకారం – అచలపతి బయటపడేస్తాడు. కథ చదువుతున్నంత సేపు పాఠకుల పెదాలపై చిరునవ్వు కదలాడుతునే ఉంటుంది.

అచలపతీ – అటెండెన్సు: లైబ్రేరియన్‌గా పనిచేసే ఓ మిత్రుడికి సలహాలిచ్చి అతనికి కొత్త సమస్యలు సృష్టిస్తాడు అనంతశయనం. లైబ్రరీలో పాఠకుల సంఖ్య పెరగడం, రిజిస్టర్‍లో అడ్రసులు రాయడం వంటి విషయాలలో అనంతశయనం సలాహాలాచరించి భంగపడిన ఆ లైబ్రేరియన్ అచలపతి సూచనలు పాటించి తన ఉద్యోగాన్ని నిలుపుకుంటాడు. ఇది కూడా బాగా నవ్వించే కథే.

చదువుతూ హాయిగా నవ్వుకోగలిగే ఈ అచలపతి కథలు-1 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

అచలపతి కథలు 1 On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

విలక్షణమైన గొప్ప కథకుడు సి. రామచంద్రరావు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా రాణించగల రమ్యగాథలు అంటూ వేలుపిళ్లై కథలు గురించి 21 డిసెంబరు 2011 నవ్య వార పత్రికలో సమీక్షించారు సుధామ.

రాసింది తక్కువైనా, వాసిగల రచనతో పాఠకులను హృదయదఘ్నంగా ప్రభావితం చేసిన కథకులలో సి. రామచంద్ర రావు ఒకరని సుధామ అన్నారు.

ఈ కథలలో ఇంగ్లీషు, తమిళ పాత్రలు తెలుగు పాత్రలతో ఎక్కువ సహచరిస్తూ, ఆ పాత్రల మాటుచాటుల నుంచి అద్భుత జీవన అంతరంగ తరంగాలను ఎగసి పడేలా చేస్తాయని సమీక్షకులు పేర్కొన్నారు.

“అద్భుత ‘జీవనసారం’ గల పాత్రలనూ, గొప్ప పఠనానుభూతినీ పాఠకులకిచ్చి, ఇప్పటికీ తలచుకునే కథా విన్నాణం చూపిన రామచంద్రరావుగారు తెలుగు కథా ప్రపంచంలో విలక్షణమైన గొప్ప కథకులు! ‘వేలుపిళ్లై’ నిలిచిపోయే కథా సంపుటి” అని వ్యాఖ్యానించారు సుధామ.

పూర్తి సమీక్షకై ఈ లింక్ నొక్కండి.

వేలుపిళ్లై కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Velupillai now in Tenglish !!

 

telugu lipi cadavaṭaṃ rāni telugu vāriki oka suvarṇāvakāśaṃ. telugulō atyaṃta goppa kathallōvigā pērgāṃcina vēlupiḷlai kathalu ippuḍu teglish lipilō kūḍā kinigepai labhyaṃ. vivarālaku cūḍaṃḍi

Details are @ http://kinige.com/kbook.php?id=310 

For those Telugu souls who cannot read Telugu script, here is a great
opportunity to enjoy one of the finest Telugu short stories!
Now Velupillai kathalu from C. Ramachandra Rao are available in
Tenglish script on Kinige .

 

తెలుగు లిపి చదవటం రాని తెలుగు వారికి ఒక సువర్ణావకాశం. తెలుగులో అత్యంత గొప్ప కథల్లోవిగా పేర్గాంచిన వేలుపిళ్లై కథలు ఇప్పుడు తెగ్లిష్ లిపిలో కూడా కినిగెపై లభ్యం. వివరాలకు చూడండి 

Visit now http://kinige.com/kbook.php?id=310 to buy / gift this eBook @ 50Rs only.

VĒLUPIḶLAI On Kinige

Related Posts:

పొగడపూలు (వేలుపిళ్ళై కథలకు ముళ్ళపూడి ముందు మాట)

వేలుపిళ్లై On Kinige

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొడుగు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…

-ముళ్ళపూడి వెంకటరమణ.

వేలుపిళ్లై On Kinige

The eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts: