విభిన్న కోణం.. “తలుగు” పుస్తకంపై సమీక్ష

డబ్బు చేతులు మారాక, వస్తువు కొన్న వాడిదే. దాని లాభనష్టాల భారమంతా సొంతం చేసుకున్నవాడిపైనే ఉంటుంది. కానీ, అది ఓ వస్తువు కాకుండా ప్రాణి అయితే… చంపేందుకు అమ్మిన గొడ్డు గేదె కాస్తా బతికి బట్టకడితే, పాడిగేదెగా మారితే… అది కొన్నవాడిదే అవుతుందా, లేకపోతే అమ్మిన వాడింటికి దాన్ని మళ్లీ తోలెయ్యాలా? ఇలాంటి సందర్భాల్లో న్యాయం డబ్బున్నవాళ్లవైపే ఉంటుందా లేక పేదోడివైపు మొగ్గుతుందా? – ఇలా అనేకానేక ప్రశ్నలూ సమాధానాల పరంపరగా నడుస్తుంది వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు‘ కథ. పేద ముస్లింల జీవితాల ఆధారంగా ప్రాణంపోసిన రచన ఇది. ఇందులో గొడ్డుమాంసాన్ని అమ్మే కటిక వ్యాపారి మనస్తత్వాన్ని భిన్నమైన కోణంలో చూపించే ప్రయత్నం చేశారు రచయిత. తలుగు అంటే రాయలసీమ మాండలికంలో పశువుల మెడకువేసే తాడు. పుస్తకం చివర్లోని షేక్ హుస్సేన్ సత్యాగ్ని వ్యాసం ‘విస్తరిస్తున్న ముస్లిం కథ’ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.

– హరిత, ఈనాడు-ఆదివారం, 27/04/2015.

తలుగు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

తలుగు on kinige

Talugu600

 

Related Posts:

జీవనపార్శ్వాలు – “బహెన్” పుస్తకంపై సమీక్ష

ముస్లింల అస్తిత్వ వేదనలకూ సామాజిక సమస్యలకూ అద్దంపట్టే కథా సంకలనం- బహెన్. రహమతుల్లా రాసిన ఈ పన్నెండు కథల సంపుటి వారి జీవనపార్శ్వాల్ని స్పృశిస్తుంది. వారిలోని ఆత్మగౌరవ చైతన్యాన్నీ పరిస్థితుల్ని దీటుగా ఎదుర్కోడానికి పడుతున్న తపననూ ప్రస్ఫుటం చేస్తుంది. ముస్లిం మహిళల జీవితాల్లోని అనేక కోణాల్ని ‘మా’ కథ వ్యక్తీకరిస్తుంది. రంజాన్ పర్వదిన దృశ్యాల సమాహారంగా ‘చాంద్‌కి ఈద్’ ప్రకటితమవుతుంది. సహజత్వానికి దూరమై, కృత్రిమత్వానికి దగ్గరైన ఓ వ్యక్తి మానసిక స్థితిని ‘బుచ్చిగాని బాగోతం’ వెల్లడిస్తుంది. గోద్రా సంఘటనల పరిణామాల్ని ‘బోర్డర్స్’ కథ ఆవిష్కరిస్తుంది. ‘బా’ కథ తండ్రిపట్ల ఉండే మమకారాన్ని ధ్వనింపజేస్తుంది. అబ్దుల్లా పాత్ర ఎదుర్కొనే కష్టనిష్ఠురాలను ‘కిరాయి మకాన్’ ప్రతిబింబిస్తుంది. వర్తమాన పరిస్థితుల్ని కథల్లోకి అన్వయించి, వాటిలో జవజీవాల్ని నింపడంలో రహమతుల్లా సఫలీకృతులయ్యారు.

– కావూరి లాస్యశ్రీనిధి , ఈనాడు ఆదివారం , 25-07-2014.

 

Bahen_EenaduSunday_25-07-2014

 

బహెన్డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

బహెన్ on kinige

 

Bahen600

Related Posts:

జుమ్మా

వేంపల్లి షరీఫ్ రాసిన ఈ కథల సంపుటిలో పన్నెండు కథలున్నాయి. భారతీయ సమాజంలో భాగమైన గ్రామీణ పేద ముస్లిం కుటుంబాల జీవితాలను ఈ కథలు చిత్రించాయి.
ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

పర్దా: ఈ కథలో ప్రధాన పాత్రధారి జేజి. అంటే నాయనమ్మ. కథకుడి నాయనమ్మ. ఇంటి పర్దాకి, ఆవిడకి ఎంతో సంబంధం ఉంటుంది. బీదకుటుంబీకుడైన కథకుడి తండ్రికి తన కూతురికి పెళ్ళి చేసేంత ఆర్ధిక స్తోమత ఉండదు. కనీసం సంప్రదాయబద్ధంగా ఉన్నట్లు కనపడినా తన కూతురికి ఏదో ఒక సంబంధం రాకపోదనే ఆశ అతనిది. అతని తల్లి పల్లెటూరి నుంచి వస్తుంది. అక్కడెంతో స్వేచ్ఛగా జీవితం గడిపిన ఆమెకి కొడుకు ఇంట్లో జరుగుబాటు కష్టం అవుతుంది. సంప్రదాయం పేరుతో, నాగరికత సాకుతో తనని కట్టిపడేయాలనుకోడం ఆమెకి నచ్చదు. కోడలి సూటిపోటి మాటలు, కొడుకు నిరాదరణ భరించలేక తిరిగి పల్లెటూరికే వెళ్లిపోతుంది. తమ గురించి నలుగురు ఏమనుకుంటారో అనే మధ్య, దిగువ తరగతి కుటుంబాలకుండే భయాన్ని ఈ కథ బాగా వ్యక్తం చేసింది.

జుమ్మా: ఇది ఓ అమ్మ కథ. ఓ కొడుకు కథ. ప్రార్థన అంటే, ముఖ్యంగా శుక్రవారం నమాజు అంతే తల్లికి ప్రాణం. దేన్నయినా సహిస్తుంది గానీ, శుక్రవారం నమాజుకి వెళ్ళకపోతే ఊరుకోదు. కొడుకు పెద్దవాడై హైదరాబాద్ నగరంలో ఉద్యోగానికొస్తాడు. తల్లిని నగరానికి రప్పించి, ఇక్కడ అన్నీ చూపించి మక్కా మసీదుకు తీసుకువెడతాడు.”ఇలాంటి చోట నమాజు చదివితే పుణ్యం నాయనా” అని ఆమె కొడుకుకి మళ్ళీ గుర్తు చేస్తుంది. సరేనంటాడు. కానీ బ్రతుకుపోరులో పడ్డాకా, ఎన్నో శుక్రవారాలు గడచిపోతాయి. ఒక దుర్ఘటన జరుగుతుంది. తల్లికి ఆ విషయం తెలిసాక, కొడుకుని మసీదుకే వెళ్ళద్దంటుంది. కడుపు తీపి ముందు దేవుడు చేదయ్యాడా? ప్రార్థన కానిదైందా అని కథకుడు బాధపడుతూ దేవుడిని స్మరిస్తాడు.

ఆకుపచ్చ ముగ్గు: పేరులోనే ఇతివృత్తం సూచన కలిగి ఉన్న కథ ఇది. చందమామ కనపడక, రంజాన్ ఏ రోజో తెలియక కథకుడు ఆలోచనల్లో ఉండగా కథ ప్రారంభమవుతుంది. ఇంతలో వాళ్ళ అక్క వచ్చి గోరింటాకు పెడుతుంది. తనకి గోరింటాకు పెట్టుకోడం ఇష్టం లేకపోయినా, అక్క మీది ప్రేమతో పెట్టించుకుంటాడు. అక్కకి పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టినా, గోరింటాకుని వదలకపోవడంతో “అక్కా, నీకు గోరింటాకు పెట్టడమంటే ఎందుకింత ఖాసే..” అని అడుగుతాడు. దాని అక్క చెప్పిన సమాధానంతో కథకుడు నివ్వెరబోతాడు. అక్క గొప్ప తత్వవేత్తలా కనపడుతుందా క్షణంలో.

దస్తగిరి చెట్టు: కథకుడికి ఓ కోరిక ఉంటుంది. వేసవి సెలవల్లో తన అమ్మమ్మ వాళ్ల ఊరెళ్ళాలని. చిన్న కోరికే, కానీ తీరేది కాదు. ఎంత అడిగినా తల్లి పంపించడానికి ఒప్పుకోదు. గొడవ చేస్తే, కొడుతుంది, కంట్లో కారం పెడుతుంది. కానీ ఊరు పంపడానికి ఒప్పుకోదు. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెడితే అక్కడ హాయిగా గడపచ్చు, మనసులోని కోరికలు తీర్చే దస్తగిరి చెట్టుకింద దోస్తులతో కాలక్షేపం చేయచ్చు అనే కోరిక కథకుడిది. తన తల్లి కుటుంబం బీదదని, వాళ్ళకే తిండికి గడవడం లేదని, మరో మనిషి వెళ్ళి అక్కడ ఉంటే ఆ భారం మోయడం కష్టమని కథకుడి తల్లి ఆవేదన. కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. కథకుడు అమ్మమ్మ వాళ్ళకి, తమకి బోలెడు డబ్బు రావాలని దేవుడిని, దస్తగిరి చెట్టుని ప్రార్ధిస్తుండగా కథ ముగుస్తుంది. చదువరుల కళ్ళు చెమరుస్తాయి ఈ కథ చదువుతుంటే.

రజాక్‌మియా సేద్యం: ఓ ముస్లిం రైతు మానసిక సంఘర్షణకి అద్దం పట్టిన కథ ఇది. ఎలాగోలా తన పంటని కాపాడుకోవాలి అనే బెంగ ఒక వైపు, ఇంట్లో నూకలు నిండుకున్నాయనే దిగులు మరో వైపు రజాక్‌మియాని కృంగదీసేస్తుంటాయి. అతని పేదరికాన్ని అవసరాన్నిఅవకాశంగా తీసుకుని, అతని కొద్దిపాటి భూమిని కాజేయాలనుకుంటాడు ఓ రెడ్డి. కామందుల దాష్టీకం, బీద రైతుల నిస్సహాయతని ఈ కథ కళ్ళకు కట్టినట్లు వ్యక్తం చేస్తుంది. అలాగే, రోజూ కూలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి, సరైన ప్రయాణపు వసతులు లేక ప్రమాదాలు కొనితెచ్చుకునే బీదవారి జీవితాలను కళ్ళకు కడుతుంది.

అయ్యవారి చదువు: ఓ పేదవాడు చదువుకోడానికి ఎంత కష్టపడ్డాడో, చిన్నప్పుడు అలా ఎప్పుడూ చదువుతునే ఎందుకుండేవాడో చెబుతుంటే మనసు ద్రవించిపోతుంది. దీనిని ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధికి కథలా చెబుతాడు. చదువు విలువ చాటి చెప్పే కథ ఇది.

జీపొచ్చింది: ఓ పేద రైతు కథ ఇది. పొలం బాగా పండాలని బోరు వేస్తాడు, కానీ నీరు చాలా లోతుకు వెడితే గానీ పడలేదు. ఆ నీళ్ళు పైకి తేవడానికి మోటారు కావాలి, మోటారు నడవడానికి కరెంటు కావాలి….. అప్పు చేసి మోటారు అద్దెకి తెచ్చుకుంటాడు, తన గేదెని అమ్మేసి మోటారుకి కరెంటు కనెక్షన్ ఇప్పించుకుంటాడు వెంకట్రెడ్డి. కానీ విధి వక్రిస్తుంది. బోరుఎండిపోతుంది. నీటి చుక్క పైకి రాదు. ఇదిలా ఉంటే కరెంటు బిల్ కట్టలేదంటూ కరెంటు ఆఫీసు వాళ్ళు మోటార్ల స్టార్టర్లు తీసుకుపోడానికి వస్తారు, వద్దని బతిమాలుతూ వాళ్ళ కాళ్ళమీద పడతాడు వెంకట్రెడ్డి. వాళ్ళు గట్టిగా విదిలించుకుని పోతారు. ఆ విదిలింపుకి రెడ్డి ప్రాణం పోతుంది. మనసు ఆర్ద్రమైపోతుందీ కథ చదివాక. హృదయం మొద్దుబారిపోతుంది.

పలక పండగ: చదువుకోవాలనే ఆశ ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. పిల్లాడికి అక్షర జ్ఞానం కలిగితే, ఫీజు డబ్బులిస్తానంటుంది తల్లి. వాళ్ళ నుండి డబ్బులు రాబట్టాలంటే కుర్రాడికి చదువు వచ్చినట్లు నిరూపించాలి మాస్టారు. అందుకని ఓ పండగ సందర్భంగా అందర్ని పలకల మీద అక్షరాలు రాసుకురమ్మని చెబుతాడు. ఈ కుర్రాడికి పలక దొరకదు. వాళ్ళమ్మ ఎక్కడెక్కడో అడిగి చూసి, చివరికి తుక్కు సామాన్ల కొట్లో ఓ తుప్పు పట్టిన రేకు పలకని సంపాదించి కొడుక్కి ఇస్తుంది. దాని మీద ఎంత రాసిన అక్షరాలు పడవని తెలుసుకున్న కొడుకు దాన్ని విసిరేస్తే, అది తాకి తల్లికి గాయమవుతుంది. కోపంతో కొడుకుని ఉతికి ఆరేస్తుంది. ఏడుస్తూ పడుకుంటాడు. వాడికో చక్కని కల వస్తుంది.

చాపరాయి: అరకు దగ్గర చాపరాయి అనే పర్యాటక ప్రదేశంలో ప్రాకృతికంగా ఏర్పడిన శిలలపై పేర్లు చెక్కి వాటి సహజ అందాన్ని పాడు చేస్తున్నారని కథకుడు బాధ పడతాడు. అక్కడ ప్రేమికుల పేర్లు రాసే ఓ పెయింటర్‍ని కలిసి అతను చేసే పని తప్పని చెబుతాడు. బదులుగా ఆ పెయింటర్ కథకుడు చేస్తున్న తప్పు గురించి చెబుతాడు. దేన్నైనా ఒకరి దృష్టికోణం నుంచే చూడకూడదని, అవతలివారి కోణం కూడా ఒక్కోసారి సరైనదే అవుతుందని ఈ కథ చెబుతుంది.

ఇంకా కొన్ని చక్కని కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినెగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జుమ్మా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: