ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లినుడే కీలకం

అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14న దేశమంతా పండుగ. బడుగుల ఆత్మగౌరవ ప్రకటనకు అంబేద్కర్‌ ప్రతీకయ్యాడు. దళితుడిగా పుట్టి, ఈసడింపులతో అణచివేతతో సంఘర్షిస్తూ, ఒక మేధావిగా, మహానాయకుడిగా ఎదిగి, చివరికి బౌద్ధమే తనవారికి దిక్కు అని గట్టిగా నమ్మి, ఆ దారిన తన అడుగువేసి తోటి దళిత బడుగు జీవులకు దిక్సూచి అయ్యాడు. స్వాభిమాన పతాకను చేపట్టి బౌద్ధమార్గాన్ని అనుసరించడం ద్వారా తాను ఈ సమాజానికి చెప్పదలచుకున్నదంతా చెప్పేశాడు. అప్పటిదాకా వ్రాసినదంతా, మాట్లాడినదంతా, పొందిన జ్ఞానాన్నంతా ఆ ఒక్క నిర్ణయంతో, ఆ ఒక్క అడుగుతో ప్రపంచానికి చెప్పేశాడు.
తన భూమిని, తన జనాన్ని, తన తాత్విక భూమికను తన ఆత్మగౌరవానికి సంకేతాలుగా చూపించాడు. అందులో తరతరాల అణచివేతకు, అసహనానికీ, దోపిడికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసిరాడు. భయంతో కన్నీటితో బీదరికంతో కునారిల్లుతున్న బడుగులను ఓదార్చి, వారి సమస్యలకు పరిష్కారంకోసం ముందుకు సాగాల్సిన త్రోవను చూపించాడు.
ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడేవారంతా అంబేద్కర్‌ నిర్ణయాన్ని, ముందడుగును లోతుగా అధ్యయనం చెయ్యాలి. ఈ సమాజంలో ఉన్న కులాల కుళ్లును, ఆధిపత్య భావజాలపు దుర్మార్గాన్ని, అణచివేతను ఎదుర్కోదలచిన వాళ్లంతా అడుగులు వేయాల్సిన త్రోవ అదే. ఆ త్రోవ దేశీయం. సర్వజనావళికి సుఖశాంతుల్ని కలిగించేది. అన్ని కాలాలకూ వర్తించేది. వేల ఏండ్ల జాతి సమస్యలకిదే పరిష్కారం.
ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆధారం ‘తనది’ అనే భావం. ఈ ‘తనానికి’ మూలం – తాను పుట్టిపెరిగిన నేలపైన, తోటి జనంపైన నెనరు – అభిమానం. తన భాష, తన కళలు, తన తెలివితేటలు ఆధారంగా విశ్వమంతా తానుగా ఎదగమే ప్రత్యామ్నాయ సంస్కృతి.
బడుగులు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకురాలేకపోవడనికి రెండు మౌలికమైన అడ్డంకులున్నాయి. మొదటిది – ఇష్టారాజ్యంగా పెరిగిన సంస్కృత భావజాలం బడుగులను వారి సాంప్రదాయక నుడి సంపదకు, తమ వృత్తులతోపాటు, కళలతోపాటు ఎదిగిన సంస్కృతికి, తమదైన ఆలోచనకు దూరంచేసింది. ఆత్మన్యూనతకు గురిచేసింది. ఈ నేల మూలవాసులు తమ భాషాసంస్కృతులకు దూరంకావడం సహజంగా జరిగింది కాదు. బయటివారి సాంస్కృతిక దాడికి బలై ఆత్మన్యూనతకు లోనయ్యారు. కాగా, రెండవ అడ్డంకి మరొకవైపు నుంచి వచ్చింది. పైనచెప్పిన మొదటి అడ్డంకిని దాటడనికి, పరాయి పాలకుల కాలం నుండి నేటి వరకూ చూపబడుతున్న మరోదారే వారి స్వయంప్రకాశానికి మరో అడ్డంకి అయింది. ఇది పరభాష రూపంలో, పరమత రూపంలో వారికి అడ్డంకిగా నిలిచింది. ఈ రెండు అడ్డంకులనూ గుర్తించిన వైద్యుడు అంబేద్కర్‌. అందుకే సరైన మందుకోసం అన్వేషించాడు. దాన్ని సూచించాడు. అదే బౌద్ధమార్గం. వేల ఏండ్ల చరిత్రలో అనేక విధాలుగా చెదిరిపోయిన తీరులను అధ్యయనం చేసి, బౌద్ధాన్ని ఈ కాలానికి కావలసిన రీతిలో వివరించాడు అంబేద్కర్‌.
పైన పేర్కొన్న రెండు అడ్డంకుల్లోంచీ బడుగులు బయటపడలేకపోతున్నారు. ఆ రెండు అడ్డంకుల మధ్యా నలిగిపోతున్నారు. ఆయన చూపిన త్రోవలో నడవడనికి వేలాది బడుగులు ముందుకు వచ్చారు. భద్రజీవుల్లో కూడ దేశభక్తులు, మానవతను ప్రాణంగా నమ్మినవారు ఆయనకు తోడయ్యారు. కాని, అంబేద్కర్‌ ఆశించిన ఆ ‘గొప్ప సామాజిక మార్పు’ ఆయన అకాల మరణంతో ఆదిలోనే ఆగిపోయింది. సాగవలసినంతగా ముందుకు సాగలేదు. ఆ మహోన్నత వ్యక్తి మరి కొంతకాలం బ్రతికివుంటే పై రెండు అడ్డంకుల నుంచీ బడుగులు బయటపనికీ, స్వాభిమాన ప్రాతిపదికన తమదైన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించుకోవడనికీ బలమైన త్రోవ ఏర్పడి వుండేది. ఆయనలేని లోటును పూడ్చగల అంతటి నేతృత్వం బడుగులకు నాటికీ నేటికీ ఒనగూడలేదు.
అందువల్ల ఆధిపత్య భావజాల విషసంస్కృతిలో తాము కూడ భాగమవుతున్నారు. ఆంగ్ల సంస్కృతి మోజులోపడి తమదైన మౌలిక శక్తియుక్తులను, భాషాసంస్కృతులను కోల్పోతున్నారు. గత 50 ఏళ్లుగా ఈ దేశంలో పెరుగుతున్న విషరాజకీయాల్లో భాగమై తమ ఎదుగుదలకు తామే అడ్డుకట్టలు వేసుకొంటున్నారు.
బడుగులు అన్నివిధాలుగా ఇప్పుడు సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. ఆత్మన్యూనత నుండి బయటపడడానికి తమకు రాజకీయాలే మార్గమనీ, అధికారంలోకి రావడమే పరిష్కారమనీ భావిస్తున్నారు. నేటి రాజకీయాల్లోకి ఎలాగైనా చొచ్చుకు రావడంకోసం పార్టీల ఎత్తుగడలకు పావులవుతున్నారు తప్ప, తమ బలాన్ని పంచి ఇస్తున్నారు తప్ప, బడుగులందరి అభివృద్ధి కోసం అన్ని రంగాల్లోనూ జరగవలసిన కృషి గురించి నిర్మాణాత్మకంగా ఆలోచించే ధోరణి లేకుండా పోయింది.
ఈ దేశంలో బడుగువర్గాలకు తమదైన భాష ఉంది. తమవైన వృత్తినైపుణ్యాలున్నాయి. తమవైన కళారూపాలున్నాయి. తమవైన మానవీయ జీవన విలువలున్నాయి. అవి కులాలవారీగా వున్నాయి. నేటి పరిస్థితుల్లో వారు తమ కులాల వారసత్వాన్ని ఆత్మన్యూనతా చిహ్నాలుగా భావించకూడదు. అవి ఉన్న పళంగా పోవు. కనుక వాటికి విలువను సంతరింపచేసుకోవడమే మార్గం. మాదిగ కులస్థుడు తన పేరు చివర ‘మాదిగ’ అని చేర్చుకొని దాన్ని ఒక ఆత్మగౌరవ చిహ్నంగా చేసుకొన్నట్లే బడుగులంతా తమ కులాల గుర్తుల్ని తమ పేరుచివర ఆత్మగౌరవ సంకేతాలుగా ఉంచుకోవడనికి ఇక ఏమాత్రం సంకోచించనక్కరలేదు. కులాల సంకేతాల్ని పేరులోంచి తొలగించుకోవడనికి అందరూ ఇష్టపడనంతకాలం బడుగుల ఆత్మగౌరవానికి వారి కులాలు అడ్డుకాకూడదు.
అంతేకాదు, తమ వృత్తులతోపాటు ఎదిగిన తమ తల్లి నుడిని కించపరచుకోకూడదు. తమ నుడినీ, నుడికారాన్నీ తమ ఆత్మగౌరవ అంశాలుగా, తమ సంపదగా భావించాలేగాని, వాటిని ఆత్మన్యూనతకు చిహ్నాలుగా అనుకోకూడదు. తరతరాలుగా తమ ఆస్తిగా వచ్చిన తమ నుడి సంపదకు సంస్కృతంవల్లా ఆంగ్లంవల్లా కలిగిన నష్టాన్ని వారు తెలుసుకోవాలి. తమ నుడి సంపద రక్షణకోసం వారు పోరాడలి. నేటి అవసరాలకు తగ్గట్లుగా ఆంగ్లంలోనో, మరొక భాషలోనో ప్రవీణులు కావడనికి తమ భాషను కోల్పోనక్కరలేదు. పరభాషల్ని నేర్చుకోవడనికి, ఈకాలపు అవసరాల్లో దూసుకుపోవడనికి వారి భాషాసంపదే వారికి గొప్ప పెట్టుబడి. తాము నివసిస్తున్న సమాజంలోగాని, ఇతర దేశాల సమాజాల్లోగాని వికసించడానికి తమ నుడి సంపద ఎంత గొప్పగా పనికొస్తుందో వారు తెలుసుకోవాలి. దాన్నే వారొక ఆయుధంగా మలచుకోవాలి. ఈ దేశాన్ని అన్ని రంగాలలో ఏలడానికి మూలవాసులుగా వారికి హక్కు ఉంది. దానికి వారి తల్లినుడి, తరతరాలుగా తమవైన కళలు, చేతివృత్తులు పెట్టుబడులు. తమ కళల్ని, తమ నుడిని, తమ సంస్కృతిని కాపాడుకోవడమంటే తమ ప్రగతిని నిరోధించుకోవడం కాదు – తమ వారసత్వాన్ని ఆధునికం చేయడం. వాటికి గౌరవాన్ని సంతరించుకోవడం. అనేక బడుగు కులాల్లో నిలిచివున్న జానపద కళారూపాలకు సామాజిక గౌరవాన్ని సంపాదించి వాటిపట్ల అన్ని వర్గాలకూ ఆకర్షణ కలిగించిననాడు అవి కూడ భరతనాట్యం వలె, కూచిపూడివలె గౌరవకేంద్రాలవుతాయి. అదే విధంగా తమ వృత్తులలోని విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఎదిగించుకొని ఆయా వృత్తులకు గౌరవాన్ని సాధించాలి.
తెలుగు భాషోద్యమంలోకి బడుగువర్గాలు దూసుకురావాలి. తెలుగంటే తెలుగే. అది బడుగు జీవులనుండి, శ్రామికుల నుండి పుట్టింది. వారి సాహిత్యం నుండి వికసించింది. సామాజిక, రాజకీయ పెత్తందారీతనంవల్ల, ఆధిపత్యంవల్ల అది క్రమంగా తన తనాన్ని కోల్పోతూ వచ్చింది. ఉద్యమాల ఫలితంగా తెలుగు నుడి ప్రజాస్వామ్య త్రోవలో కొచ్చింది. అది ఇంకా మౌలికంగా ప్రజలభాష కావాల్సి ఉంది. ఆ పనీ మొదలయింది. ఇదంతా అత్యంత సహజంగా జరిగేదే. అడ్డంకుల్ని అధిగమించగల శక్తి తెలుగు నుడికి ఉంది. అయితే ఇందుకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగాలి. అది బడుగువర్గాల వల్ల, మహిళలవల్ల మాత్రమే వీలవుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లి నుడే కీలకం. అంబేద్కర్‌ ఆశయసాధన కోసం బడుగుల త్రోవ – తల్లి నుడిని కాపాడుకుంటూ స్వాభిమానంతో ముందుకు సాగడమే. అంబేద్కర్‌ చూపిన బౌద్ధమార్గానికి ప్రాతిపదిక ఇదే. తన నుడి, తన నాడు, తన నెనరు (స్వాభిమానం) మాత్రమే బడుగుల కరదీపికలు.
– సామల రమేశ్‌బాబు (నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 సంచిక సంపాదకీయం)

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్ చూడండి.

నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 On Kinige

Related Posts: