‘చీకటి గదులు’ కథపై పి. వి. కృష్ణారావు అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘చీకటి గదులు’ కథపై పి. వి. కృష్ణారావుగారి అభిప్రాయం చదవండి.

* * *

“డెప్త్ సైకాలజీకి సత్తావున్న రచయిత ఇచ్చిన సాహిత్య రూపం ఈ చీకటి గదులు. మనో వ్యాపారాల రహస్యాల కోసం, అంతర్బాహిర్జగత్తుల అనుసంధానం కోసం నిరంతరం అన్వేషించే ఓ ఆలోచనాపరుడి స్థితి వర్ణణ అద్బుతమైన నేపధ్యంతో సాగి పోతూంటే కళ్ల ముందు గెలక్సీలు కదుల్తాయి. భావాల మెరుపులకి భాష ఉరుములకి చలిస్తూ, వివరణ అందని చోట ప్రక్షేపణతో (projection) సమాధాన పడుతూ కథ ముగించే సరికి ఆలోచనలు పాత్రల్ని అధిగమించి రచయిత చుట్టూ తిరుగుతాయి.

సలిపే పంటిని నొక్కినా, అచేతనాన్ని తరచినా ధ్యేయం ఒక్కటే. రిలీఫ్. సాహిత్య కళారూపాల సృష్టిలో సైతం కెథారసిస్ వుంటుంది. ఇమడని వర్తమానంలో భాస్కరం, జీవితంలో పరీక్షా సమయం వచ్చినప్పుడు, కోరివచ్చిన కళ్యాణితో మనిషిగా ప్రవర్తించడు. ఆ తిరస్కారంతో ఎన్నుకున్న జీవితంలో సుఖపడలేక, తెగ్గొట్టుకొని తిరిగి వస్తున్న కళ్యాణిని దయతో, తన జీవితంలో మార్పుకోసం కూడా స్వీకరిద్దామని సంకల్పిస్తాడు. కానీ, కసిగా బ్రతికేసే అతని మిత్రుడు శేషు వల్ల అది జరగదు.

ఈ కథాంశం పునాదిగా త్రిపుర నిర్మించిన మనోజ్ఞహర్మ్యాన్ని రేడియం దారుల్లో నడచి అవలోకిస్తాం. వ్యక్తుల ఇన్స్యులేషన్ని, మెంటల్ ప్రావిన్సెస్‌ని సింబలైజ్ చేసే చీకటి గదుల తలుపులు ఆలోచనలతో, అనుభవాలతో మూసుకోవడం…. తెరచుకోవడం… గమనిస్తాం.

నాకు త్రిపుర అన్నా, ఆయన రచనలన్నా వండర్!”

పి. వి. కృష్ణారావు

త్రిపుర కథలు On Kinige

Related Posts: