పాకిస్తాన్‌లో పది రోజులు

ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మార్చి 2010లో జరిపిన పాకిస్తాన్ పర్యటన అనుభవాలతో రచించిన పుస్తకం “పాకిస్తాన్‌లో పది రోజులు“.

ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్నప్పటికీ, నిరంతర హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పటికీ, అవినీతి పెచ్చరిల్లినప్పటికీ, పేదలు, మహిళల పట్ల తీవ్ర అణచివేత కొనసాగుతున్నపపటికీ, అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద శక్తులు అక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నప్పటికీ, పాకిస్తాన్‌ ముందుకు సాగుతున్న దేశమే కానీ వెనక్కు మళ్లుతున్న దేశం కాదన్న అభిప్రాయం తనలో బలంగా నెలకొందని రచయిత చెబుతారు. మనదేశం కంటే అక్కడ సంస్కరణలు ముందుగా అమలయ్యాయని, అనేక ఆధునిక విధానాలు విజయవంతమైన దాఖలాలున్నాయని తెలుసుకున్న రచయిత ఒక మతరాజ్యంలో ఇలాంటి పరిణామాలు జరగటం సాధ్యమా? అని ఆశ్చర్యపోతూ, పాకిస్తాన్‌ను సందర్శించాలని కోరుకున్నారు.

కుల్‌దీప్ నయ్యర్, ఎ.కృష్ణారావు, మహేశ్ భట్, జతిన్‌ దేశాయ్‌, రాజ్యసభ సభ్యుడు బాలచంద్ర ముంగేర్కర్‌, మాజీ ఎంపి సాహెద్‌ సిద్దిఖీ, సంజయ్‌ నహర్‌, హైదరాబాద్‌లో కోవా అనే స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్న మజహర్‌ హుస్సేన్‌, అమృత్‌సర్‌కు చెందిన ఫోక్‌లోర్‌ రీసర్చ్‌ అకాడమీ అధ్యక్షులు రమేశ్‌ యాదవ్‌, ఢిల్లీకి చెందిన పాకిస్తాన్‌ ఇండియా పీపుల్స్‌ ఫోరమ్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ డెమోక్రసీ (పిఐపిఎఫ్‌) ప్రధాన కార్యదర్శి హరీష్‌ కిద్వాయ్‌ వంటి ప్రముఖులున్న శాంతి బృందం ఒకటి పాకిస్తాన్ బయల్దేరుతుంటే, రచయిత కూడా వారితో చేరారు.

అయితే, వీసాలు అంత సులువుగా మంజూరు కాలేదని, పాకిస్తాన్‌లో కుల్‌దీప్ నయ్యర్‌కున్న పేరు ప్రఖ్యాతుల వల్ల వీసాలు చివరి క్షణంలోనైనా లభించాయని రచయిత చెబుతారు. సామాన్య ప్రజలకు, ఇరుదేశాల్లో తమ బంధువులను కలుసుకునేందుకు రావాలనుకుంటున్న వారికి వీసాలు రావడం అంత సులభం కాదని, వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తారని పాకిస్తాన్‌ చేరాక అర్థమైందని, భారత, పాకిస్తాన్‌ దేశాల మధ్య అపనమ్మకాలు ఎంత ప్రబలిపోయాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చని రచయిత వ్యాఖ్యానించారు.

వీరి ప్రయాణంలో మొదటి మజిలీ కరాచీ. ఇక్కడ సింధ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్వర్‌ హుస్సేన్‌ ఖాన్‌, కార్యదర్శి ఆబిద్‌ జుబేరీ, కోశాధికారి యూసఫ్‌ ఇక్బాల్‌, కరాచీ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఆఖిల్‌, పాకిస్తాన్‌ మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నూర్‌ నాజ్‌ ఆఘా మొదలైన వారిని కలిశారు. తర్వాత సింధ్‌ ముఖ్యమంత్రి సయ్యద్‌ ఖ్వైమ్‌ అలీ షా నివాసానికి వెళ్లారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, సింధ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నాసిర్‌ అస్లాం జాహిద్‌ వీరికి ప్రత్యేక విందు ఇచ్చారు.

తరువాత హైదరాబాద్ నగరం సందర్శించారు. సింధ్‌ రాష్ట్రంలో భాగమైన హైదరాబాద్‌ పాకిస్తాన్‌లోనే ఒకప్పుడు రెండవ పెద్ద నగరం. ఇపుడది నాల్గవ పెద్ద నగరంగా మారింది. సింధూ నదీ తీరంలో మౌర్య సామ్రాజ్య శిథిలాలపై ఈ నగరాన్ని 1768లో అప్పటి సింధ్‌ పాలకుడు మియా ఫులాం షా నిర్మించారు. ఈ నగరానికి మహమ్మద్‌ ప్రవక్త మనువడు హైదర్‌ పేరు పెట్టారు. పాకిస్తాన్‌ ఏర్పడకముందు ఈ నగరాన్ని భారతదేశ పారిస్‌గా అభివర్ణించేవారు. ఈ నగరం తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన తీరుని వివరించారు రచయిత. ఇక్కడ కూడా ఎందరో సుప్రసిద్ధ వ్యక్తులను కలుసుకున్నాక, తదుపరి మజిలీ అయిన ఇస్లామాబాద్‌కు చేరారు.

ఇస్లామాబాద్‌, రావల్పిండి రెండూ జంట నగరాలు. రావల్పిండి, ఇస్లామాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం జనాభా విషయంలో పాకిస్తాన్‌లో మూడో పెద్ద ప్రాంతం. పంజాబ్‌, ఖైబర్‌ ఫక్తూన్‌ల మధ్య ఉన్న ఇస్లామాబాద్‌ ఈ రెండు ప్రాంతాలకు గేట్‌వేగా ఉపయోగపుతున్నది. 1960 వరకు కరాచీ పాకిస్తాన్‌ రాజధానిగా ఉన్నది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ పాక్‌ రాజధానిగా మారింది. పాకిస్తాన్‌లో అత్యంత అభివృద్ధి చెందిన నగరం ఇదని అంటారు రచయిత. ఇస్లామాబాద్‌లో ఉన్న అద్భుతమైన ఫైజల్‌ మసీదును చూశాకా, ఈ బృందం పాకిస్తాన్ ప్రధాని గిలానీతో సమావేశమైంది.

తదుపరి రచయిత బృందం లాహోర్‌కి పయనమైంది. లాహోర్ చరిత్రని క్లుప్తంగా, చక్కగా వివరించారు రచయిత. అక్కడి పురప్రముఖులతోనూ, అధికారులతోను సమావేశాలు పూర్తయ్యాక, దర్శనీయ స్థలాలని చూసాక, వారంతా అమృత్‌సర్‌కి బయల్దేరి వాఘా బోర్డర్ దాటి భారత్‌లో ప్రవేశించారు.

పాక్‌ పర్యటన తర్వాత ఆ దేశ ప్రజల పట్ల ప్రేమ, జాలి తప్ప ద్వేషం కలుగలేదని, జరిగిన చరిత్రలో వారి ప్రమేయం ఏమాత్రం లేదని అర్థమైందని అంటారు రచయిత.

“పాకిస్తాన్‌ పర్యటన అంతటా.. ఎక్కడ మరో దేశంలో అడుగుపెట్టానని కానీ, మరో దేశ ప్రజలతో మాట్లానని కాని నాకు అనిపించలేదు. పాక్‌ ప్రజలు మా పట్ల అడుగుగునా చూపిన ఆప్యాయత, భారత్‌తో శాంతి కోసం వారు చూపిన తపన, భారత్‌లో అడుగుపెట్టేందుకు వారి తహ తహ చూసిన తర్వాత విద్వేషాలు ఎంత త్వరగా అంతమైతే అంత మంచిదని నాకు అనిపించింది. ఒకటే ప్రజ – రెండు దేశాలన్న భావన మిగిలిపోయింది” అంటూ తన పర్యటన అనుభూతులను పాఠకులతో పంచుకున్నారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.

పాకిస్తాన్ చరిత్రని, వర్తమానాన్ని సంక్షిప్తంగా వివరించిన ఈ యాత్రాకథనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పాకిస్తాన్‌లో పది రోజులు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: