చదవాల్సిన పుస్తకం: మనీప్లాంట్

ఇతర భాషా కథల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న రచయితల్లో ముందువరుసలోని కథకుడు – కొల్లూరి సోమ శంకర్. సోమ శంకర్ అనువాద కథల సంపుటి – ‘మనీప్లాంట్‘.
కొన్ని ప్రత్యేకతలని సంతరించుకుని, ఒక విలక్షణ గ్రంథంగా మనముందుకొచ్చింది – ఈ ‘మనీప్లాంట్’.

ఈ పుస్తకానికి “వికసించిన అనువాద సృజన” అని గుడిపాటి ముందుమాట ఉంది. పుస్తకంలోని ప్రత్యేకతల్లో మొదటిది ఈ ముందుమాట.

తెలుగులో చక్కని వచనం రాయటం చక్కని కవిత్వం రాయటం కంటే కష్టం. ‘శైలి రచయిత వ్యక్తిత్వం’ అంటారు. కొంతమంది శైలి బాగా incisive గా వుంటుంది. అతి తక్కువ అక్షరాల పదాలు, అతి తక్కువ పదాల వాక్యాలు, భావం వాటి వెంట పరిగెత్తుతుంది. ప్రతిపాదిస్తున్న అంశం మళ్ళీ గాఢంగా అందుతూ వుంటుంది పఠితకి.
ఇంతటి శక్తివంతమైన శైలి తెలుగు రచయితల్లో చాలా తక్కువ మందిలో చూస్తాము.

గుడిపాటి అభిప్రాయభాగాన్ని ఉదహరిస్తున్నాను. చూడండి. “జీవితం అందరికీ ఒకేలా ఉండదు. మనుషులు తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవర్తించరు. సహేతుకంగా ఉండాలని ఆశించడం తప్పుకాదు. కానీ ఉండలేకపోవడమే జీవిత వాస్తవం. తమలా ఎదుటివారు ఆలోచించాలని, నడుచుకోవాలని మనుషులు ఆశిస్తూంటారు. కానీ అలా ఎవరూ ఉండలేరు. నిజానికి తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కూడా ఉండలేరు. కారణాలేమయినా, మనుషుల్ని ఉద్వేగాలే నడిపిస్తాయి. అందుకే ఒక తీవ్రతలోంచి మరో తీవ్రతలోకి ప్రయాణిస్తారు. ఈ మనిషి చచ్చిపోతే బాగుండును అనుకున్న మనిషి పట్లనే అవాజ్యమైన ప్రేమ కలుగుతుంది. అదెలా సాధ్యమనే ప్రశ్నకు హేతువు సమాధానం చెప్పదు. జీవితమే దాని సరైన జవాబు. ఇలాంటి జీవిత సత్యాన్ని చెప్పే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి”.

భావాస్పదమైన పదాల పోహళింపు, భావ విపులీకరణ – రెండూ అద్భుతంగా నిర్వహించబడిన రచనా పరిచ్ఛేదం ఇది.

ఇక, గుడిపాటి వ్యక్తం చేసిన జీవన తాత్వికతకి వస్తే – ఇది పూర్తిగా భౌతిక వాస్తవికత పునాదిగా కల్గిన అవగాహన. మనిషి బహిరంతర వర్తన, ఆలోచన – వీటికి గల పరిమితి, వీటి మీద external and internal forces ప్రభావాలు – అన్నీ సద్యస్ఫూర్తితో ఆకళించుకుని చెప్పిన ఒక గొప్ప అభిప్రాయంగా అంగీకరిస్తాము దీన్ని.
జీవితం పట్ల ఒక తాత్విక వివేచనని సముపార్జించుకోకుండా, అధ్యయన రాహిత్యంతో కథల్ని పునాదులు లేని మేడలుగా నిర్మించబూనడం – ఆరుద్ర అన్నట్లు ‘బంతి లేకుండా ఫుట్‌బాల్ ఆడడం’ వంటిది. జీవితం, జీవన విధానం, గతి – సరళరేఖ కాదు. దీన్ని గమనించకుండా, ప్రతీ సంఘటనకీ, కథలోని ప్రతీ పాత్రకీ కార్యకారణ సంబంధాల్ని అంటగట్టాలని కృతకమైన రీతికి తలపడడం – కథౌచిత్యాన్ని దెబ్బతీస్తుంది.

గుడిపాటి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించేవారు – అటు పాఠకుల్లోనూ, ఇటు కథకుల్లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు గుడిపాటి చెప్పినంత స్ఫుటంగా, ఇంత సరళంగా, ఇంత శక్తివంతంగా – తెలుగు కథా సాహిత్యంలో ఎవరూ చెప్పలేదు. గుడిపాటి చెప్పిన ఈ అంశాన్ని కొత్తకథకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

‘మనీప్లాంట్’ పుస్తకంలోని Contents విషయానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలని చూద్దాం. ‘పట్టించుకోని వాళ్ళయినా వాస్తవాలని ఎదుర్కోక తప్పదు’ అంటాడు ఆల్డస్ హక్స్‌లీ. మనకు బాగా దూరంగా నివసించే ప్రజల గురించీ, వారి జీవన విధానాన్ని గురించీ, స్థితిగతులను గురించీ మనం ఎక్కువగా పట్టించుకోము. కానీ, అవే మనకూ తారసపడవచ్చు. మనమూ వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. కనుక, ఆయా స్థితిగతుల్ని మనమ్ ముందుగానే పరిచయం చేసుకొని వుంటే, నిజజీవితంలో ఆయా సంభవాలు ఎదురయితే, వాటిని ఎదుర్కోడం సుళువవుతుంది. అంటే మానసికంగా తయారై వుండటమన్న మాట. ఇతర భాషాసాహిత్య పఠనం ఇందుకు బాగా వుపయోగపడుతుంది. అందునా కథలు – వివిధ జీవన పార్శ్వాల మెరుపుల్నీ, మరకల్నీ, మనకు గాఢతతో అందించగలవు; మన ఆలోచనల విస్తృతికి దోహదం చేయగలవు. ఇదీ అనువాద కథల ప్రయోజనం.

ఈ పుస్తకానికి “అనువాద ‘కథం’బం” ముందుమాట కూర్చిన కె. బి. లక్ష్మి ఇదే విషయాన్ని ఇలా చెప్తున్నారు, “స్నేహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసుయలు, కలిమిలేములు, కష్టసుఖాలు, వినోద విలాసాలు – వగైరాలు విశ్వమానవులందరికీ సమానమే. ఏ భాష వారు ఆ భాషలో ఘోషిస్తారు”. కనుక, ఆ ఘోషల మూలాల్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు తోడ్పడుతాయి.

‘మనీప్లాంట్’ లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ – వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో – ‘ఈనాటి’ జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ – ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల్ ఎన్నిక – ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
“లుకేమియా”తో బాధపడుతున్న క్లాస్‌మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ ‘పెరుగన్నం’తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి – జీరోగా గేలిచేయబడిన ‘శూన్య’ చివరికి గురువుగారి సాంత్వనలో “నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు” అనుకునే స్థితికి ఎదిగిన “సున్నాగాడు” వరకూ – ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.

మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత – కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా – సోమ శంకర్‌లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా – అనువాదం నిర్వహించారు సోమ శంకర్.

కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ – పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి ‘మనీప్లాంట్’. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)

* * *

“మనీప్లాంట్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మనీప్లాంట్ పుస్తకాన్ని కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

మనీప్లాంట్ On Kinige

Related Posts:

విద్వాన్ విశ్వం సాహితీ విరాట్ రూపం

రాజకీయ సాహిత్య సామాజిక రంగాల్లో అవిరళమైన కృషి చేసిన రాయలసీమ రత్నం – విద్వాన్ విశ్వం. అయితే ఆయన నిజాయతీ, నిబద్ధత కలిగిన సంపాదకుడిగా, ‘పెన్నేటి పాట’వంటి గ్రంథ రచయితగా అసామాన్య కీర్తిమంతుడు. ఆధునిక పంచకావ్యాల్లో ఒకటొగా ‘పెన్నేటి పాట’ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందింది. విద్వాన్ విశ్వం సాహితీ విరూపాక్షుడు. ఆయన వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తిత్వం దర్పణంగా ఈ మంచి పుస్తకాన్ని వెలువరించారు అబ్జ క్రియేషన్స్ (హైదరాబాదు) వారు. ఆలోచనీయమైన, అధ్యయనావశ్యకమైన, విలువైన సమాచారగతమైన ఈ వ్యాస సంపుటికి సంపాదకత్వం వహించిన ప్రసిద్ధ రచయితలు డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్.

ఈ వ్యాస సంపుటిలో నాలుగు అధ్యాయాలున్నాయి. ‘విశ్వజీవి’లో విశ్వంగారి జీవితాన్ని, సాహిత్యాన్ని, వారిపైగల అభిప్రాయాల్ని, వారితోగల పరిచయాల్ని వివరించే వ్యాసాల్ని పొందుపరిచారు. ‘విశ్వరూపి’లో విశ్వంగారు నడిపిన శీర్షికలు తెలుపు – నలుపు, మాణిక్యవీణలతో పాటు మరికొన్ని వ్యాసాలున్నాయి. ‘విశ్వభావి’లో రచయిత మాటలౌ, పీఠికలు, పుస్తక సమిక్షలూ వచ్చాయి. ‘విశ్వమేవ’లో విశ్వంగారి సందేశాలు, ఇంటర్వ్యూలు వున్నై. మొదటి అధ్యాయంలో సాహితీ ప్రముఖులైన విశ్వనాథ, వేలూరి, దివాకర్ల, దాశరథి, ఆరుద్ర, అనంతకృష్ణశర్మ, మిక్కిలినేని, ఏటుకూరి బలరామమూర్తి, కల్లూరు అహోబలరావు, మహీధర రామ్మోహనరావు వంటి వారి వ్యాసాలు కాక నేటి లబ్ధప్రతిష్టులు అద్దేపల్లి, మాలతీచందూర్, వెలుదండ నిత్యానందరావు, నాగ్సూరి మొదలైన సాహితీపరుల వ్యాసాలున్నాయి. ఈ 20 వ్యాసాల్లోనూ విశ్వం గారి గురించిన ప్రశస్త విషయాలూ, విశేష విషయాలూ ఎంతో వివరణాత్మకంగా ప్రస్తావించబడినై. వీటిలోని సమాచారం ఈతరం పాఠకులకు ఎంతో స్ఫూర్తిదాయంగా వుంది.

‘విశ్వం జీవితమే ఆయనకొక దృక్కోణాన్ని అందించింది’ అంటూ ఆ దృక్కోణం ద్వారా ఆయన రచనల్లో స్థూలంగా చెప్పిన అంశాల్లోని సూక్ష్మార్థాల్నీ, ఆయన సూక్ష్మంగా చెప్పిన వాటిల్లోని స్థూలార్థాల్నీ విశ్లేషణాత్మకంగా చెప్పారు – యాదాటి కాశీపతిగారు. ఈ అధ్యాయానికి నిండుతనాన్నీ, విశిష్టతనీ తెచ్చిన ఎంతో ముఖ్యమైన వ్యాసం వారిది. రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాల్లో విశ్వం కృషికి దర్పణంగా వుందీ వ్యాసం.

అలాగే ‘సమన్వయ మూర్తి విద్వాన్ విశ్వం’ అనే తమ సమగ్ర వ్యాసంలో నాగసూరి వేణుగోపాల్ ‘విశ్వంగారి ఆలోచనా సరళి, పాండితీ సమన్వయం, విశాల దృక్పథం, నేటి రచయితలకు, పాత్రికేయులకు ఎందుకు స్ఫూర్తిదాయకమో సోదాహరణంగా వివరించారు. తనదైన ప్రత్యేక వ్యాసరచనా విలక్షణతతో, ప్రణాళికతో – నాగసూరిగారి వ్యాసంలో కొండంత విశ్వంకి తన ప్రతిభాదర్పణం పట్టారు.

విశ్వంగారు నిర్వహించిన శీర్షికల్లో తెలుపు – నలుపు మాణిక్యవీణ వ్యాసాల్లో ఎన్నికగన్న వాటిని రెండో అధ్యాయంలో చేర్చారు. వీటన్నిటా విశ్వంగారి ప్రతిభావ్యుత్పత్తి ద్యోతకమవుతూ వున్నై. అన్నిటా సమాజం గుండె చప్పుళ్లని విశ్వంగారు విని, సంవేదనాత్మకంగా, ఆలోచనీయంగా పాఠకులకు వినిపించిన విధానానికి అబ్బురం కలుగుతుంది. ఆనాటికి వర్తమాన సామాజికాంశాల్ని వారు గవేషించిన తీరుకి ఆశ్చర్యపోతాము. ఉదాహరణకు 1.12.70 నాటి మాణిక్యవీణ వ్యాసం ఇలా మొదలవుతుంది. ‘అనుభవిస్తున్నప్పటి తీవ్రతను ఏ బాధ అయినా తర్వాత గోల్పోతుంది/ నడుస్తున్నప్పుడు పడిన వేసట గమ్యం చేరుకున్న తర్వాత మఱుగున పడిపోతుంది/ సరికొత్త తరం వారికి తెలంగాణా అలనాటొ రూపు ఎంత ఊహించుకున్నా కానరాదు/ పాతతరం వాఇకైనా అప్పటి అనుభవాలు కొన్ని పరగడుపున బడిపోవడం సహజం. ఆ తర్వాత ఆయా విశేషాల్ని చదువుతాము.’ ఇదీ విశ్వం శైలి. ఈ శైలిలో పఠితని ఒక మూడ్‌లోకి లాక్కొచ్చే గుణంతో పాటు, రచనని చదివించే గుణాన్ని సమకూర్చే నేర్పూ గోచరిస్తుంది.

మూడవ అధ్యాయం ‘విశ్వభావి’లో విశ్వంగారు రాసిన పీఠికలు, సమీక్షలు ఉన్నాయనుకున్నాం. వీటిలో రంగనాయకమ్మ నవల ‘కళ ఎందుకు?’కు రాసిన ‘ఆముఖం’ – విశ్వంగారి రచనలోని వొంపు వాటాల్నీ, ఎత్తుపల్లాల సొబగుల్నీ; అక్షరంతో చదువరి గుండెని తాకే పదశక్తినీ తెలుపుతుంది. తెలుగు వచన రచనలోని సరళత్వాన్నీ, సరసత్వాన్నీ, గాఢతనీ, సాంద్రతనీ – ఒక్కచోట చూసి చదివి ఆనందించే అదృష్టాన్నిస్తుందీ ‘ఆముఖం’. అదే సందర్భంలో ఎంతో పదునైన భావజాలాన్ని విసిరి ఆలోచనా ప్రేరకంగా నిలుస్తోంది.
నాలుగో అధ్యాయంలోని ఇంటర్వ్యూల్లో విశ్వంగారి నిర్భీతీ, నిబద్ధతా, లోకజ్ఞతా, సాహిత్య విజ్ఞతా – అన్నీ పారదర్శకంగా కనిపిస్తాయి. ‘జానపద కవిత్వమెంత సజీవంగా వుందో, అదే విధంగా పురాణ కవిత్వం కూడా నేటికీ నిలిచే వున్నది. దానికి కారణం రెండింటిలోనూ వున్నటువంటి రసస్ఫోరకత్వమే’ అన్నవారి ప్రకట దీనికి ఒక ఉదాహరణ.
ఈ పుస్తకం సంపాదకులిద్దరూ ఒక కష్టసాధ్యమైన పనిని జయప్రదంగా పూర్తిచేశారు. విద్వాన్ విశ్వం వ్యక్తి జీవితంలోనూ, సాహిత్య వ్యక్తిత్వంలోనూ వున్న బహువిధ పార్శ్వాల్నీ, బహుముఖ కోణాల్నీ తెలుసుకునే అవకాశాన్ని తెలుగు పాఠకులకందించి సాహితీలోకానికి గొప్పమేలు చేశారు. అభినందనీయులు!!

విహారి
(పాలపిట్ట జూన్ 2012 సంచికలో ప్రచురితం)

* * *

“సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ప్రింట్ పుస్తకం ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం On Kinige

Related Posts:

నిజానికివి వేట కథలు (పర్యావరణ కథలు – సమీక్ష)

ప్రఖ్యాత కన్నడ రచయిత కువెంపుగారి కుమారులైన పూర్ణచంద్ర తేజస్వి అనతికాలంలోనే తన రచనల ద్వారా తండ్రిని మించిన తనయుడిగా పేరుపొందారు. పూర్ణచంద్ర తండ్రి ప్రభావం తనమీద పడకూడదన్నట్లుగా రామమనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణగార్ల సమాజవాద సిద్ధాంతాల ఆకర్షణకు లోబడి కులాంతర వివాహం చేసుకుని రైతుపోరాటాల్లో ముఖ్యపాత్ర నిర్వహిస్తూ, ఘోరారణ్యం చెంతన పొలం కొని కాఫీ ఎస్టేట్‌గా దాన్ని మలచి ఎక్కువ శాతం తన హాబీలైన ఫోటోగ్రఫీ, పరిసర అధ్యయనం, భూమిపుత్రుల జీవితాలు, సంగీతం, చిత్రలేఖనం, మొదలైన వాటిలో మునిగి వీలు కుదిరినప్పుడు రచనల్ని చేస్తుండేవారు. కాఫీ ఎస్టేట్ వేసేందుకు వచ్చిన రచయిత తుపాకీ భుజం మీద వేసుకుని రోజంతా టామీ అనే కుక్కతో అడవిలో శికారు చేయడం దినచర్యగా మారింది. అలా అక్కడ ఉంటూ అడవితో పొందిన అనుభవాల్ని ఇలా కథల రూపంలో అందించారు.
మలైనాడులోని అడవి, వన్యప్రాణులు, వేట గురించిన ఆసక్తికరమైన విషయాలను ఈ కథల్లో రికార్డు చేశారు. ఇందులో రచయిత అతని వద్ద పనిచేసే ప్యారడు, మారడు, టామీ అనే పెంపుడు కుక్క ప్రధాన పాత్రలుగా ఈ కథనాలు కొనసాగుతాయి.

ఒక రాత్రి అడవిలో మొరుగుతున్న టామీ అరుపులు విని వెళ్ళిన రచయితకు, అది ‘ఉడుం’తో చేస్తున్న పోరాటం కనిపిస్తుంది. ఆ ఉడుంను పట్టుకుని తాడుతో చెట్టుకి కట్టివేస్తే, అది పాక్కుంటూ చిటారు కొమ్మను చేరుకుంటుంది. తాడుతో దాన్ని ముగ్గురు గుంజినా కిందపడదు. దాంతో ఉడుం పట్టు అంతే ఏమిటో తెలిసివస్తుంది. ఈ కథలో ఉడుం జీవన విధానం గురించి, దానికి సంబంధించిన ఎన్నో విశేషాల గురించి సందర్భోచితంగా వివరిస్తారు. “టామీతో ఒకరోజు” కథలో ఇంగ్లీష్ రీడరిఅన మిత్రుడొకరు శ్రీరామ్‌తో కలసి అడవికి వేటకెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించారు. అడవి జంతువులు విపత్కర పరిస్థితులలో అసాధారణంగా మసలుకుంటాయనీ వాటి గురించి, వాటి “దెయ్యం కోడి” లో చూడవచ్చు. ప్రతీ వేసవిలో రచయిత ఇంటివద్ద ఎదురయ్యే పాముల నుంచి ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. ఒక వేసవిలో నాగుపాము సృష్టించిన భయోత్పాతాన్ని, దాన్ని చివరకు ఎలా పట్టుకున్నారో ఆసక్తికరంగా వివరించే కథ “కాళప్పగారి కోబ్రా”. అయిదు గ్రామాలను పీడించే కోతుల సమస్య గురించి చర్చించిన కథ “గాడ్లి”. రామలక్షమ్మగారి తోట మేనేజర్‌గా పనిచేస్తున్న గాడ్లి కోతులను పారద్రోలడానికి పడిన పాట్లను, ఆయన భంగపాటును ఈ కథ వివరిస్తుంది. ఒక్కొక్క వన్యప్రాణికి ఒక్కొక్క రకమైన విచిత్ర రక్షణ తంత్రం ఉంటుంది. కప్పలు, తాబేలు, అడవిపంది అవలంబించిన రక్షణ విధానాలు “చెరువు ఒడ్డున” గమనిస్తున్న రచయిత దృష్టి నుండి తప్పించుకోలేకపోతాయి. దెయ్యాలు ఉన్నాయో లేవో తేల్చడానికి స్మశానికి వెళ్ళివస్తుండగా, చిన్న గజ్జి కుక్కపిల్ల వెంటబడుతుంది. దెయ్యమే ఆ రూపంలో వస్తుందని, దాన్ని వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది వెంటబడడాన్ని “మాయామృగం”గా వర్ణిస్తారు. అనేక సందర్భాలలో ప్రాణులు మరియు వృక్షాలకు సంబంధించిన ఎన్నో కథలు నిదానంగా జనం మనస్సుల నుంచి తొలగిపోయినా, అప్పుడప్పుడు వాటి మీద కలిగే ఇష్టాయిష్టాల నుంచి అవి జనం మనసులో అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఏదో కథలోని దృష్టాంతం నిరూపణగా లేకపోయినా, కొన్ని జంతువుల నడవడిక మీద ఏర్పడే దురభిప్రాయాలు అలాగే ఉండిపోతాయని అనేక ఉదాహరణలో వివరించిన కథ “సైతాన్ నుంచి ప్యారడికైన నష్టం”, “సుస్మిత మరియూ చిన్న పక్షిపిల్ల” కథలు పక్షుల ఫోటోలు తీయడం ఎంత కష్టమో, వాటిని సాకడం కూడా అంతే కష్టమని రచయిత తన అనుభవాలతో వివరిస్తారు. “ఔషద తీగ”, ఇదొక విచిత్రమైన మూలికాతీగ కథ. అడవిలోని దట్టమైన పొదలలో కనిపించే ఈ తీగ అవసరమైన వారికి ఓ పట్టాన కనిపించదు. ఈ తీగ గురించి ఉండే అబద్ధాలు, నిజాలు, కల్పనలోని కథలు…. వీటన్నింటి గురించి రచయిత చేసిన సత్యాన్వేషణే ఈ కథగా రూపొందింది.

ఈ కథలన్నీ అడవి – అటవీ సంపద, వన్యమృగాలపై ఆధారపడిన ప్రజల అవసరాలు, అనుభవాలను తెలియజేస్తాయి. రచయిత వీటిని పర్యావరణ కథలన్నారు. కానీ నిజానికివి వేట కథలు. వేటగాడిగా రచయిత అడవిలోని పరిస్థితులు, వన్యప్రాణుల ప్రవర్తనను విశ్లేషిస్తారు. ఆయన చేసిన పరిశీలనలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పనివాళ్ళల్లో, గ్రామాల్లో వున్న మూఢవిశ్వాసాను హేతువాద దృష్టితో నిగ్గుతేల్చి అసలైన సత్యాన్ని తెలుసుకుంటాడు. సంచార జాతుల వాళ్ళయిన “మాస్తి మరియు బైరడు” వేట నైపుణ్యాలను పరికించినప్పుడు, అల్లం శేషగిరిరావు, డిబింగాడు తప్పకుండా జ్ఞాపకం వస్తారు. కన్నడంలో ఈ పుస్తకం 16సార్లు పునర్ముద్రణకు నోచుకుందట. ఈ పర్యావరణ కథలు కర్నాటకలో ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకూ ఆయా తరగతుల భాషానైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలుగా పెట్టారు. ప్రముఖ అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నిద్రాణమైన ఈ కథలను సంపాదించి, అనువదించి తెలుగువారికి అందిస్తున్నారు. అనువాదం చాలా బాగుంది.

కె.పి. అశోక్ కుమార్
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. అంతేకాదు, ఈ కథల సంకలనం ప్రింట్ బుక్‌ని ఇప్పుడు కినిగె ద్వారా తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పర్యావరణ కథలు On Kinige

Related Posts:

నిగ్గు తేల్చిన సత్యాలు (“గంధం చెట్టు” పై సమీక్ష)

“ఆవేశం వద్దు శేఖరం. పతివాళ్ళకీ ఒక సిద్దాంతం, దృక్పథం ఉంటాయి. అందరూ మన భావాల్తో ఏకీభవించాలనుకోవటం కూడా తప్పే”. ఈ విధంగా జీవన సిద్ధాంతాల్ని తనదైన కోణంలోంచి చూసి విశ్లేషించి నిగ్గు తేల్చిన సత్యాలు ఎన్నో ‘గంధం చెట్టు‘లో పరిమళిస్తాయి. తన చుట్టూ ఉన్న జీవితాల్నీ మనుషుల్నీ ఒక బయటి వ్యక్తిగా పరిశీలించి, ఒక్కోచోట నిష్పాక్షికంగా పరిష్కార మార్గాల్ని చూపించారు రచయిత. ఒకప్పటి గ్రామీణ నేపధ్యంతో నేటి గ్రామాల్ని పోల్చి చూపడం; పోలీసులు వారి విధి నిర్వహణ, ప్రభుత్వం, ప్రజలు, ఉన్నవారి, లేనివారి ఆలోచనా సరళి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల మెరుపుల వెనుక వున్న మరకలని ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత.

15 కథలున్న ఈ సంకలనంలో 12 కథలు ‘ప్రథమ పురుష’లో చెప్పడం వల్ల కథల్ని అల్లినట్లు కాకుండా జీవితాలని చిత్రించిన అనుభూతి పాఠకులకు కలిగిస్తాయి. నెలకు యాభైవేలకు పైగా సంపాదిస్తేనే గానీ గడపలేమనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాల్లోకి తొంగి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయినా ఇది నిజం (ఊబి). అయితే అవగాహనతో పరిస్థితులను చక్కదిద్దు కోవచ్చునంటాడు రచయిత (ముందుగోడ). “పోలీసు ఉద్యోగం పులిస్వారీ వంటిదని బ్రతకాలనుకున్నవాళ్ళూ ఈ స్వారీ చేయవల్సిందే”నంటాడు రచయిత. తనని నరికేసినా సువాసనా, చల్లదనం ఇచ్చే గంధం చెక్కలాంటి హోటల్ ఓనర్ ‘అయ్యర్’లు ఇంకా ఉన్నారని చెప్పినా, రెక్కలు రాగానే చెట్టంత కొడుక్కి అందాక ఉన్న ఇల్లు ‘పంజరం’లా కనిపిస్తుందని చెప్పినా, కొల్లేరుకు వలస వచ్చే పక్షుల గురించి పట్టించుకునే ప్రభుత్వం అక్కడ బ్రతికే ప్రజల గురించి ఆలోచించడం లేదని చెప్పినా రచయిత గన్నవరపు నరసింహమూర్తి కథల్లో క్లుప్తత, వాస్తవితకత పుష్కలంగా కనపడుతుంది.

కూర చిదంబరం
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“గంధం చెట్టు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. అంతేకాదు, ఈ కథల సంకలనం ప్రింట్ బుక్‌ని ఇప్పుడు కినిగె ద్వారా తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
గంధం చెట్టు On Kinige

Related Posts:

నిర్మాణాత్మక కథలు (పరాయోళ్ళు సమీక్ష)

ఇంజనీరింగ్ విద్యలో ఒక పాఠ్యాంశముంటుంది, ‘ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్’ అని. ఒక వస్తువును సమగ్ర అవగహన కోసం నిర్థిష్టమైన బహుకోణాల్లో శాస్త్రీయంగా దర్శించడం. బహిర్ అంతర్ వివరాలను నిస్పష్టంగా గ్రహించగల్గడం… యిక, ఆ వస్తువు / యంత్రభాగం / నిర్మాణం రూపకల్పన, అభివృద్ధి, ఉద్ధరణ దిశలో అడుగులు వేయడం… ఇదీ ఈ ‘పరాయోళ్ళు’ రచయిత వృత్తిరీత్యా ఒక ఇంజనీర్ కావడం వల్ల ‘సమాజం’ అనే వ్యవస్థను బహుముఖమైన కోణాల్లో దర్శిస్తూ పౌరబాధ్యతతో, వ్యథతో, ఆశావహమైన కాంక్షతో అనుశీలించారు. భ్రష్టుపట్టిపోతున్న సమాజం, పూర్తిగా నేలమట్టస్థాయికి పతనమైపోయిన నైతిక విలువలు, అదుపూ ఆజ్ఞాలేని అవినీతి, నిస్సిగ్గు దోపిడి, రాజకీయ అరాచకం, సున్నిత హృదయాలను దుఃఖమయం చేసే అతిసేచ్ఛ… ఇవన్నీ ఈ పుస్తకంలోని దాదాపు అన్ని కథల్లోనూ కథావస్తువులుగా పాఠకునికి కనబడ్తూ లోతుగా ఆలోచింపజేస్తాయి. ఒక వ్యవస్థలోని లోటుపాట్లనూ, లోపాలనూ ఎత్తిచూపడమంటే వాటిని మరమ్మత్తు చేయదగిన కీలకాంశాలుగా తెలియజేస్తూ స్పృహింపజేయడమేకదా… అన్న కోణంలో గనుక ఈ పుస్తకంలోని ప్రతి కథను పాఠకుడు స్వీకరించగల్గితే ‘పరాయోళ్ళు‘ కథాసంపుటి వర్తమాన ఆధునిక సమాజంలోని వివిధ రంగాల్లో దృశ్యాదృత్యంగా ఉన్న రుగ్మతలన్నింటినీ పాఠకుల ముందు పరిష్కారార్థం ప్రతిపాదించింది. వీటిలో ఒక్కటి కూడా ప్రేమకథ, వ్యంగ్య, హస్య, ఉబుసుపోక, కాలక్షేప, చమత్కార కథ లేదు. ప్రతి కథా ఏ హృదయమున్న భారత పౌరున్నయినా సంక్షుభితున్ని చేస్తున్న సామాజిక జాఢ్యాల గురించే విప్పి చెబుతుంది. ఆలోచింపజేస్తుంది. పౌరబాధ్యతను గుర్తుచేసి తనవంతు కర్తవ్యాన్ని స్ఫురింపజేస్తూ ప్రతి కథా సామాజిక కోణంలో ప్రయోజనకరమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఉమామహేశ్వర్ అవగాహన కల్గిన ఇప్పటి యువతరానికి ప్రతినిధి. వృత్తిరీత్యా ఇంజనీరై ఉండి బోధనావృత్తినుండి సాఫ్ట్‌వేర్ పరిశ్రమలోకి చేరి మేడిపండువంటి రంగాల్లోని డొల్లతనాన్నీ, అంతర్గత పర్యావరణాన్నీ గుప్తంగా దాగిఉన్న ప్రపంచీకరణ వికృత విధ్వంసాన్నీ అతిదగ్గరగా వీక్షిస్తున్న వాడు. అందుచేతనే కొన్ని కథల్లో అత్యంత హానికరమైన, కాకిబంగారంలా కనిపించే సందర్భాల మూలల్లోకి చేరి జీవితాలను విప్పి చూపించగలిగాడు. ఇవేవీ ఊహించి, కల్పించి, అలంకరించి చెప్పిన కథలు కావు. అందుకే ఈ కథలు సరళంగా, స్వచ్ఛంగా నిరలంకారంగా గొప్పగా ఉన్నాయి. సమాజ సౌందర్యానికి టెక్కు లెక్కువ ఉండనట్టే ఈకథలకు కృత్తిమ ప్రక్కవాయిద్యాలు లేవు. సూర్యకిరణాల్లో సూటిగా ఉన్నాయి.

1991 నుండి గరళజలంవలె విస్తరించడం మొదలైన ‘ప్రపంచీకరణ’ స్థానీయరంగాల్లోకి ప్రవేశించి కనబడకుండా ఎలా వ్యాపించి కళ్ళముందే చూస్తూండగా చూస్తుండగానే ఎలా మూలాలను ధ్వంసం చేస్తుందో రచయిత ‘ది ధూల్ పేట ఇండస్ట్రీస్(ప్రై) లిమిటెడ్’ కథలో ఎంతో సంయమనంతో వివరించాడు. మల్లేష్ యాదవ్ ఒక బడుగుదేశానికి ప్రతీకగా, సుబ్బిరాజు అగ్రదేశానికి ప్రతీకగా గ్రహించి చదువుకుంటూపోతే కుట్రపూరిత వ్యాపార వికృత రూపురేఖలు కళ్ళముందు ప్రత్యక్షమౌతాయి. అట్లాగే ‘నిశ్శబ్ద విప్లవం’లో ఐ.టి. పరిశ్రమల్లోని బోలుతనాన్నీ, కార్పొరేట్ సంస్కృతి మాయలో వ్యక్తులు వంకర్లుపోతూ అపసోపాలుపడే సూడో ప్రవర్తనలు, తన జీవవంతమైన మూలాలను మరిచి ప్రదర్శించే వికార పోకడలు, అసలు మనిషికి జీవదాతమైన ఆహారాన్నందించే వ్యవసాయ రంగంపట్ల చులకనభావం… యివన్నీ కృష్టమోహన్, సంజన్న పాత్రలద్వారా
ఒక ఆశావహమైన భావిని దృశ్యమానం చేశాడు రచయిత. ‘మాయరోగం’ కథలో కూడా ప్రశాంతమైన చిన్న పట్టణాల్లో ఆర్.ఎమ్.పి.ల ద్వారా స్థానిక వైద్యసదుపాయాలను ఎలా కార్పొరేట్ ఆస్పత్రులు ఆక్టోపస్‌లా విస్తరిస్తూ ధ్వంసం చేస్తున్నాయో వృద్యంగా చెప్పబడింది. ‘వాటర్’, ‘బ్లాక్ హోల్’, ‘రూపాంతరం’ కథలు మనుషుల్లో ఆలోచనలు, మాటలు, చేతలూ పూర్తిగా వేర్వేరనీ, లోలోపల అంతా ఆదర్శవంతంగా వల్లిస్తూ… చేతలదాకా రాగానే అవకాశవాద తత్వంలో లంచాల రూపంలో, దోపిడీ తత్వంతో ఎగబడి దండుకోవడమేననీ శక్తివంతంగా చెప్పబడింది.

రచయితగా ఉమామహేశ్వర్ కు ఈ సమాజం ఇలా ఉంటే బాగుంటుంది అని ‘స్వప్న సదృశ’మైన కొన్ని ఊహలున్నాయి. ‘మన అవసరం’ అన్న కథలో సూర్యప్రకాశ్ పాత్రద్వారా ఆ ఆరోగ్యవంతమైన ఆకాంక్షను బలంగా చెప్పారు. అదేవిధంగా ‘ఆనందకుటీరం’ కథలో వృద్ధులు కొందరు తమ ప్రశాంత జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న ఆశ్రమం అనుకున్నట్లుగానే శాంతివంతంగా ఉన్నా దాన్నింకా అర్థవంతం, ఆదర్శవంతం చేసేందుకు అనాథ బాలల ఆలనపాలనను కూడా స్వీకరించడం ద్వారా ఓ పరిపూర్ణతను సాధించవచ్చునని వినూత్న సూచనను చేశారు. బాగుంది.

దీంట్లోని కథలన్నీ యిదివరకు ప్రముఖ తెలుగు వెలువడ్డయే. సీరియస్ కథా పాఠకులకు తెలిసినవే. రచయిత పాఠకులకు ఆరోగ్యవంతమైన ఆలోచనలను శాస్త్రీయంగా అందివ్వడంలో కృతకృత్యుడయ్యాడు. శైలి సరళంగా, పఠనీయంగా ఉంది. మంచి కథల సంపుటి ఇది. ఉమామహేశ్వర్ అభినందనీయుడు.

రామా చంద్రమౌళి
(పాలపిట్ట , జూలై 2012 సంచిక నుంచి)

* * *

పరాయోళ్ళు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె నుండి “పరాయోళ్ళు” ప్రింటు పుస్తకం తగ్గింపు ధరకు తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పరాయోళ్ళు On Kinige

Related Posts:

బ్లాగు పుస్తకం పై సమీక్ష

బ్లాగు పుస్తకం పై చిత్ర మాసపత్రిక జూలై 2012 సంచికలో ప్రచురితమైన సమీక్ష ఇది. సమీక్షకులు శ్రీమతి వలబోజు జ్యోతి.

Blagu Pustakam Review Chitra July 2012

బ్లాగు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలోలభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఈ పుస్తకం ప్రింట్ పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
బ్లాగు పుస్తకం On Kinige

Related Posts:

అద్దంలో ఆ ఊరి చరిత్ర

ఉన్న వూరు కన్న తల్లి సమానమంటారు. అమ్మను ఎలా మరిచిపోలేమో పుట్టిపెరిగిన ఊరును కూడా మరిచిపోలేం. దేశ చరిత్రలు ప్రాంతీయ చరిత్రలు రాయటం సులువు. గ్రామ చరిత్ర రాయటానికి ముందుగా పుట్టి పెరిగినవూరిపై మమకారముండాలి. ఆ వూరు చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, అభివ్యక్తులపై అధికారముండాలి. ఇన్నీ ఉన్నా ఒక్కోసారి చారిత్రక ఆధారాలు దొరకవు. తెలిసిన ఒకరిద్దరు పెద్దలూ తమ పిల్లలతో కలిసి ఉండటానికి దూరప్రాంతాలకు నివాసాలు మార్చుకున్న సందర్భాల్లో ఇది మరింత కష్టమవుతుంది. మిగతా వృత్తుల్లో ఉన్నవారు గ్రామచరిత్రలు రాసే కన్నా, ఉపాధ్యాయులు ఆ పనికి పూనుకుంటే మాత్రం ఊరి చరిత్రకు నిజంగా న్యాయం జరుగుతుంది.

తెలంగాణ సాహితీకారుల జాబితాలో చేరాల్సిన కవులనూ, వారి రచనలనూ పొందుపరచటానికి కృషి చేసిన సాహితీపరుడు. చిన్నప్పట్నుంచి తాను విన్న జానపద గేయాలు, నోటి పాటల వివరాలను సేకరించిన అసలు సిసలైన జానపదుడు. చరిత్ర అంటే పాలకులు మాత్రమేకాదు, పాలితులు కూడానని గ్రామ చరిత్రకు ఆనవాళ్ళైన చారిత్రక శకలాలతో పాటు గ్రామ పెద్దల జ్ఞాపకాలను కూడా ఒక్క చోట చేర్చి గ్రామం పుట్టినప్పటి నుంచి నాలుగు వందల ఏళ్ల చరిత్ర సమాహారంగా పుస్తకాన్ని తీర్చిదిద్దారు యాదగిరి. మోడెంపల్లిగా ఉన్న బేచిరా కుగ్రామ పునాదుల్ని తవ్వి ఎల్లమ్మ రంగాపురం ఆనవాళ్ళను వెదికి పట్టుకొని, గ్రామ నామాలపై గతంలో చేసిన పరిశోధనలకు దీటైన రచన చేశారు.

బిజినేపల్లి దగ్గరున్న నందివడ్డమాను (వర్థమానపురం) రాజధానిగా చేసుకొని, రాయచూరుదాకా పాలించిన గోన వంశీయుల కాలంతోనే అంటే క్రీ.శ.13వ శతాబ్దంలో ఆ వూరు పురుడు పోసుకుందని నిరూపించారు. వీర వైష్ణవ విజృంభణతో ఆలయాలు, వాటిలో విగ్రహాలతో పాటు గ్రామ నామాలు కూడా మారిపోయాయి. చదివేవారికి గ్రామ గ్రంథాలయం,పేరొందిన సాహితీ పరులు, వారి రచనలు, వ్యవసాయ పద్ధతులు, పాడి పంటలు, తూనికలు, కొలతలు, గ్రామ దేవతలు, ఆలయాలు, అపురూప శిల్పాలు, అన్ని విషయాలు యాదగిరిగారి పరిశోధనా పటిమకు నిదర్శనాలు.

జి.యాదగిరిగారు స్వయానా కవి, కళాకారుడు కాబట్టి ఆయన ఒంట పట్టించుకొన్న ఈ రెండు లక్షణాలు ఆయన వ్యక్తిత్వంలో భాగమై, వంద సంవత్సరాల కవిత్వం, ఏభై ఏళ్ల నాటక రంగం, యక్షగానాలు, బైలాటలు, యక్షగాన కళాకారులు వైద్యం గోపాల్,చాకలి ఎల్లయ్య, బెస్త బసవయ్య, రాచమళ్ళ గొల్లనారాయణ, బెస్త కృష్ణయ్య, ఒగ్గు కథకులు కురువ బీరన్నలపై అందించిన సమాచారం ఆ గ్రామాన్ని మరికొన్ని శతాబ్దాలపాటు బతికించుకుంటుంది. తాను స్వయంగా చిత్రకారుడు, విశ్వకర్మ అనువంశీకుడు, గ్రామానికి చెందిన శిల్పాలు, చింతోజు వీరయ్య, బెస్త మల్లయ్య, తోలుబొమ్మల కమ్మరి చంద్రయ్య, రంగయ్యగారు శిల్పితో పాటు వడ్ల లింగయ్య, ఆర్ చంద్రశేఖర్ లను వారు వేసిన చిత్రాలను శిల్పాలను పేర్కొంటూ గ్రామ చరిత్రలో, సాంస్కృతిక అనుబంధాలలో తానూ ఒక శకలమైనాడు జి.యాదగిరి. ఎల్లమ్మను తవ్వితీసి మసక బారిన చరిత్రను అద్దంలా తీర్చిదిద్ది గ్రామం పేరు ప్రఖ్యాతులు ఈ తరానికి అందించటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కవులు, కళాకారులు, వృత్తి పనివాళ్ళు, పండుగలు, పబ్బాలు, జాతర్లు, సంబరాల ఫోటోలను సేకరించి ఆ వూరి చరిత్రతో పాటు నడుస్తున్న చరిత్రను కళ్ళకు కట్టినట్టు, మన ముందర ఒక్కో దృశ్యం కదలాడేటట్లు వర్ణించిన తీరు యాదగిరి గారి తపనకు తార్కాణం.

ఈరోజుల్లో చేష్టలుడిగిన ముసలోళ్ళు, శిథిలమైన గుళ్ళు, పుస్తకాల గ్రంథాలయం, ఊరు చుట్టూ దడి గట్టినట్టు పురాతన శిల్పాలు, ఇవన్నీ ఎవరిక్కావాలి? ఆధునికత పేరుతో నిన్నను కూడా మరిచే నేటి మనను తట్టిలేపి, వాటి ప్రాముఖ్యతను వివరించి, గ్రామంలోని ప్రతివారూ గర్వపడేలా మా వూరికీ చరిత్ర ఉంది. సాహిత్యం ఉంది, ఆటలున్నాయి. పాటలున్నాయి అన్న సోయిని రగిలించటంలో ఆయన పెకలించిన గత కాలపు పెళ్ళలు దాచినా దాగని సత్యాలు.

తెలంగాణలో గ్రంథాలయోద్యమం 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో ప్రారంభమైనా, రంగాపురంలో 1951 సంవత్సరంలో ‘బాలవాణి’ గ్రంథాలయాన్ని నాటి యువకులు ఎలా నడిపించుకున్నారో చదివినవారికి ఏ మాత్రం స్వార్థ చింతనలేని గ్రామీణుల స్వచ్ఛమైన ఆలోచనలు ఈ తరం యువకుల్ని ప్రేరేపిస్తాయి.
ఇక శ్రామిక రంగంలో జిల్లెళ్ళ జంగయ్య, షబ్బీరలీలతో జరిపిన ఇంటర్యూలు, మానవ సంబంధాలను, నాటి జీవన విధానాన్ని, విద్య, రాజకీయ రంగాలు, వివిధ రంగాల్లో మొదటి వ్యక్తులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, అరుదైన 1869 నాటి రాజాచందూలాల్ రామగిరి సనదులను సేకరించి పి హెచ్ డీ పట్టాకు సరిపడ సమాచారాన్ని సమకూర్చాడు.

పుస్తకం చివర్లో రంగాపురం ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ ప్రశస్తి, ఊరి ప్రజలనోళ్ళలో నానుతున్న తెలంగాణ సామెతలు, పొడుపు కథలు మనం మరిచిపోయినా యాదగిరిగారు మాత్రం అక్షరబద్ధం చేసారు. తాను సంప్రదాయ కుటుంబంలో జన్మించి, సాంప్రదాయ విద్యనభ్యసించినా, అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితుడై, ఉద్యమాల బాటపట్టి, కొత్త బాణీలు కట్టి ఆ వూరిలో ఉద్యమాల్లో పాల్గొన్న త్యాగ జీవుల నేకరువుపెట్టారు.

పేరు కోసం పాటుపడని, పేరు చెప్పటానికే ముందుకు రాని సామాన్య జానపద గాయక, గాయకురాళ్ళ వివరాలతో పాటు వారి పాటల్ని కూడా సేకరించి మనముందుంచారు.
తన అరవై ఏడేళ్ల జీవన గమన నేపథ్యంలో కాచి వడపోసి మానవ సంబంధాలను మెరుగుపరచడంలో ఆ వూరి ఆచార వ్యవహారాలు ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తూ, గ్రామ సమాచారాన్ని చిత్రపటాలు, ఫోటోలతో సహా ప్రచురించి గ్రామ చరిత్రను నిక్షిప్తం చేయటమే గాక గ్రామ చరిత్రలు ఇలా రాయాలని, కొత్త ఒరవడిని దిద్ది, ఎల్లమ్మ రంగాపురానికి ఎన్నో వన్నెలద్దారు జి.యాదగిరిగారు.

ఈమని శివనాగిరెడ్డి
ఆదివారం వార్త 1 జూలై 2012

* * *

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ప్రింటు పుస్తకాన్ని కూడా 20 శాతం తగ్గింపు ధరకు తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర On Kinige

Related Posts:

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం

ఈతరం పాఠకులకు అంతగా పరిచయం లేని సాహితీదిగ్గజం విద్వాన్ విశ్వం. ఈ మహానుభావుడిని పునరావిష్కరించే క్రమంలో డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్ళి మురళీమోహన్ సంకల్పించిన అపురూప గ్రంథం ‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం‘. సంపాదకుల అభిప్రాయంలో “ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, మానవతావాదికి లభించవలసినంత గుర్తింపు లభించలేదు. వారి ప్రతిభకు మనం తగిన పట్టం కట్టలేదు. వారి రచనలపై పి హెచ్.డి. స్థాయిలో ఒక్క పరిశోధన కూడా వెలుగు చూడలేదు”

ఈ కారణంగా, వారి జీవితం, రచనలగురించి కొంతైనా తెలియచేయడానికి, “త్వరలో ఆంధ్రదేశం జరుపుకోబోతున్న విశ్వం (1915-2015) గారి శతజయంతిని దృష్టిలో వుంచుకుని, ఆ సాహితీ పూర్ణచంద్రునికి ఈ నూలుపోగు” సమర్పించారు.

నాలుగు అధ్యాయాలుగా కూర్చిన ఈ పుస్తకంలో, విశ్వంగారి గురించి, సర్వశ్రీ దివాకర్ల వెంకటావధాని, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, ఏటుకూరి బలరామమూర్తి,తిరుమల రామచంద్ర, ఆరుద్ర, దాశరధి వగైరా ప్రముఖులు రాసిన వ్యాసాలూ, పరిచయాలూ ఉన్నాయి. అలాగే, అయిదు దశాబ్దాల పత్రికా జీవితంలో, విశ్వంగారు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, మొదలైన పత్రికల్లో నిర్వహించిన, బహుళప్రచారం పొందిన తెలుపు – నలుపు, మాణిక్యవీణ, మంచీచెడ్డా, ఆనందం, విజ్ఞానం వగైరా రచనల్ని ‘విశ్వరూపి’ అనే అధ్యాయంలో చేర్చారు. మరికొన్ని వ్యాసాలు, సమీక్షలు ‘విశ్వభావి’ లో, ఆయన సందేశాలు, ఇంటర్యూలు చివరి అధ్యాయంలో పొందుపర్చారు. మొత్తంమీద ఈ పుస్తకాన్ని, సమగ్రంగా చదివితే, విశ్వంగారి జీవితం, రచనల గురించి ఒక స్పష్టత ఏర్పడుతుందనటంలో సందేహంలేదు.

అనంతపురంజిల్లాలోని తరిమెలగ్రామంలో జన్మించిన మీసరగండ విశ్వరూపాచారి, సంస్కృతాధ్యయనంతో విశ్వరూప శాస్త్రిగా ఎదిగి, ఆ పేరుతో పలు రచనలు చేసినా, మదరాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పుచ్చుకుని విద్వాన్ విశ్వంగా మారిన క్రమం తెలుసుకోవాలంటే డా.నాగసూరి వేణుగోపాల్ గారి వ్యాసం చదవాలి. సంస్కృత పండితుడైనా, తరిమెల నాగిరెడ్డి సాంగత్యంలో వామపక్షభావాలు వంటపట్టించుకున్నాడు విద్వాన్ విశ్వం. 1938లోనే నవ్య సాహిత్య గ్రంథమాలను ప్రారంభించి పాసిజం, లెనిన్, స్టాలిన్ ల గురించి పుస్తకాలు ప్రచురించారు.

ఇరవయ్యవ ఏటనే ‘విరికన్నె’ రచించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వున్నప్పుడు మార్క్సిస్టు సాహిత్యంతో, రాజకీయాలతో సంబంధం పెంచుకున్నారు. 1938లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1945లో, హైదరాబాదు మీజాన్ పత్రికలో వర్కింగ్ జర్మలిస్టుగా చేరి ఆ తర్వాత మరికొన్నాళ్ళు ప్రజాశక్తిలో పనిచేసి, 1952నుండే ఆంధ్రప్రభ వారపత్రికలో వివిధ హోదాలలో కొనసాగారు.

విక్రమోర్వశీయంతో ప్రారంభమైన విశ్వంగారి అనువాద కార్యక్రమం కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘసందేశం, దాకాకొనసాగింది. ఇవి కాక, ఇతర భారతీయ భాషలనుండీ ప్రపంచ సాహిత్యంనుండీ పలురచనలు తెనుగించారు. చెహోవ్, యితర రష్యన్ రచయితల కథలు, ఫ్రెంచి రచయిత రోమా రోలాకు నోబెల్ బహుమతి సంపాదించి పెట్టిన ‘జాఁక్రిస్తోఫ్’ను ‘మానవుడు’గా ఇబ్సన్, షాల నాటకాలను, ఫ్లాహెర్టీ నవలను, రజనీపామీదత్ భారతదేశం గురించి రాసిన వుద్గ్రంధాన్ని, రవీంద్రుని రచనల్ని కూడా తెలుగువాళ్ళకందించాడు. ఇవన్నీగాక, కథా సరిత్సాగరాన్ని పన్నెండు భాగాలుగా తెలుగు చేశారు.

అయితే, మనం యింకా ఎంత చెప్పుకున్నా విశ్వంగారి పేరు చెప్పగానే చప్పున గుర్తుకు వచ్చే కావ్యం పెన్నేటిపాట, పెన్నానది పరీవాహక ప్రాంతంలోని నిజ జీవితాన్ని కరుణరసార్ద్ర హృదయంతో రచించిన కన్నీటిపాటే ఈ పెన్నేటిపాట. రాయలసీమ జన జీవితాన్ని ప్రతిబింబించిన తొలికావ్యం యిది అన్నారు భూమన్. 1956లో, తెలంగాణ రచయితల సంఘం ఈ కావ్యాన్ని ప్రచురించింది. విశ్వంగారు తెలంగాణ రచయితలకు ఆత్మబంధువు అన్నాడు దాశరథి. సంఘంపేరు తెలంగాణ రచయితల సంఘం అయినా, కార్యకలాపాలు ఆ ప్రాంతానికే సీమితం కాలేదు అని కూడా శలవిచ్చారు.

విశ్వంగారి మరొకకావ్యం ‘ఒకనాడు’ 1965లో అచ్చయింది. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా యిది రాశాడాయన. బ్రిటిష్ సైనికుల అత్యాచారం, నుండి యిద్దరు హిందూ మహిళలను రక్షించే క్రమంలో, గుత్తిలోని రైలుగేటు కీపర్ గూళిపాలెం హంపన్న ప్రాణాలొడ్డిన రోజది. (4 అక్టోబర్ 1893).

పత్రికా వుద్యోగం నుండి విరమణ తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం ప్రధాన సంపాదకులుగా పనిచేసిన విశ్వంగారు వేదాలతోపాటు, మరెన్నో సంస్కృత గ్రంథాలను అనువదించారు.
విశ్వంగారిలాంటి సంపాదకులు, రచయితలను స్వేచ్చగా రాయనిచ్చి, సహజంగా ఎదగనివ్వటం వల్లనే ఒక లత, కృష్ణకుమారి, రంగనాయకమ్మ, కౌసల్యాదేవి, విశాలాక్షి అచ్యుతవల్లి మొదలగువారు సుస్థిరమైన స్థానాన్ని పొందగలిగారు’ అంటారు మాలతీ చందూర్.

ఎన్ని పత్రికల్లో పనిచేసినా, ఎక్కడా నిలకడగా చేయలేకపోయాడు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకపోయారు. ఎవరినీ సంతృప్తి పరచలేకపోయారు. అంటారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.
ఏది ఏమైనా, పేర్లుఏవైనా, పత్రికలు ఏవైనా, 1952 నుండి, 1987 దాకా ముఫ్పై అయిదేళ్లపాటు అవిచ్ఛిన్నంగా పత్రికల్లో ఒక (కాలం) ను శీర్షిక నడిపిన బహుశా, ఒకే ఒక తెలుగు సాహితీమూర్తి విద్వాన్ విశ్వం అంటారు వెలుదండ నిత్యానందరావు.

సందేశాలు యివ్వడం చాలా సులభం. అవి ఎప్పుడూ మంచిమాటలుగానే వుంటాయి. కాని ఆ దారిలోనే నడవచ్చని చూపించాలి. ఆశయ విహీనమైన జీవితం వ్యర్థం. ఎవరి ఆశయం వారే నిశ్చయించుకుని, అందుకోసం ఎంత తపించి కృషి చేస్తే అంత మంచిది. నడిచే వారికన్నా, నడిపించేవారిలో చిత్తశుద్ధి అవసరం. అన్న విశ్వంగారి మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం.

ముక్తవరం పార్థసారథి. (నడుస్తున్న చరిత్ర జూన్, 2012 నుంచి)

* * *

“సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ పుస్తకం ప్రింట్ బుక్‌ని మీరు కినిగె వెబ్ సైట్ నుంచి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం On Kinige

Related Posts: