సరిగ్గా ఇరవై ఏళ్ళ కింద 1991 జూలై 1న కేంద్రప్రభుత్వ విధాన ప్రకటనతో ఈ దేశంలో ప్రపంచీకరణ విధానాలు మొదలయ్యాయి. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా, పి. చిదంబరం వాణిజ్యమంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ నూతన ఆర్ధిక విధానాలు అంతకు ముందు నుంచీ కొనసాగుతున్న పాలకవర్గ దోపిడీ, పీడనలను మరింత తీవ్రతరం చేసాయి. ఒక మలుపు తిప్పాయి. దేశాన్ని సామ్రాజ్యవాద రథచక్రాలకు మరింతగా కట్టివేసాయి. ఈ దేశవనరులను దేశదేశాల సంపన్నులకు భోజ్యంగా మార్చాయి. ఈ దేశ శ్రామికులను, పీడితులను మరింత దారిద్ర్యంలోకి, పీడనలోకి నెట్టాయి. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను అధికారంలో ఉన్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలూ ఆ విధానాలను కొనసాగించాయి. అలా ఈ రెండు దశాబ్దాలలో వేరు వేరు రూపాలలో, వేరు వేరు రంగాలలో సాగుతున్న రాజకీయార్ధిక విధానాల మీద సమకాలీన స్పందనల, వ్యాఖ్యల, విశ్లేషణల సంకలనం ఇది. నూతన ఆర్ధిక విధానాల ప్రకటన జరిగిన పది రోజులకు 1991 జూలై 12న అచ్చయిన వ్యాసంతో ఎన్. వేణుగోపాల్ ఆ విధానాలతో సంవాదం ప్రారంభించారు. గడచిన ఇరవై సంవత్సరాలలో ప్రపంచీకరణ రాజకీయార్థిక అంశాలపై రాసిన దాదాపు రెండువందల నలభై వ్యాసాలలోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంకలనం ఇది.
ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఇక్కడ నొక్కండి.