అతివ అంతరంగ మథనం – “అన్వేషణ” నవలపై సమీక్ష

మనిషి జీవిస్తున్నాడా? లేక జీవిస్తున్నానని భ్రమలో ఉన్నాడా? అనే ఒక సందిగ్ధం ఈరోజుది కాదు. పురాణాల నుండి వస్తున్నదే! ఐతే- ఆ మాట నిర్భయంగా నేడు అంటున్నారు. అనుకుంటూనే ఆలోచిస్తున్నారు. గంటి భానుమతి రచించిన ‘‘అన్వేషణ’’ నవలలో నిజంగా మానవ జీవితంలోని అనేక కోణాలను అన్వేషించారు. అందరికీ తెలిసిన సమాధానాలపై ఎదురు తిరిగారు. తెలియని ప్రశ్నలను సంధించారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా అత్తింట్లో ఆవేదనలు, భర్త మూలంగా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొంటున్న నేటి సమాజపు దుస్థితిని అభివర్ణించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. అసలు స్త్రీ సంఘానికి భయపడాలా? లేక తన మనస్సాక్షికి భయపడాలా? అంటే నా ధోరణిలో మనస్సాక్షికే ఎక్కువ మార్కులు వేస్తాను. సంఘం అనేది గాలివాటుకు ఎగిరిపడుతున్న ఎండుటాకు లాంటిది. అదిగో అని చూపితే కనిపించకున్నా, అవును నాకూ కనిపించింది అంటూ ఎదుటిమనిషిని మరింత నిర్వీర్యం చేస్తుంది. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది మనమేంటి? మనం జీవిస్తున్న విధానం ఏమిటి? అని. ఒక స్ర్తి అయినా, పురుషుడైనా మనస్సాక్షి ముందు తలెత్తుకుంటే చాలు గెలిచినట్లే..
అసలు  స్త్రీ అంటేనే ఒక కుటుంబం. స్త్రీ లేనిదే కుటుంబాలు ఎంతగా వెలవెలపోతుంటాయో మనం గమనిస్తూనే ఉంటాం. ఈ నవలలో విజయ అనే పాత్ర ఎన్నో సందిగ్ధాల మధ్య సతమతమవుతూ తన జీవితం అలా ఎందుకు ఒంటరి అయిపోయిందనే విషయంపై అన్వేషణ కొనసాగిస్తుంది. అలాంటి సమయంలో తనను ప్రేమించిన వ్యక్తి కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియకుంటే పెళ్ళిచేసుకోవడం కష్టమని అనడం విజయను మరింత బాధిస్తుంది. పెళ్ళికి యువతి కావాలా? యువతికి యువకుడు ఉంటే చాలదా? అంటే చాలదు. ప్రేమకు ఇద్దరు చాలు పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే మాట విన్నాం. అయితే కుటుంబం ఎందుకు? అంటే మాత్రం రాబోయే తరాలకు ఒక చరిత్ర కావాలి. నాన్న అమ్మ ఎలాగో, అమ్మమ్మ, తాత, పెదనాన్న, చిన్నాన్న పిన్ని అత్త లాంటి వరసలన్నీ ఎంతో కావాలి. వారందరూ మనకంటూ ఏమీ చేయకపోవచ్చు. కానీ ఉన్నారనే ఆశ ముందుకు నడిపిస్తుంది. తల్లిదండ్రులు పునాదులైతే నా అన్నవాళ్ళు మూలస్తంభాలు. ఆ విషయమే ఈ నవలలో కనిపిస్తుంది.
గంటి భానుమతి ఎంతో సున్నిత హృదయులు. వీరిలోని నొప్పించేతత్వం లేని తనమే ఈ నవలకు పునాది అయింది. కారణం ఈ నవలలో మరీ బాధించే పాత్రలు చూపలేదు. కాలానుగుణంగా మనిషి తత్వం మారుతుందే తప్ప ఎవరూ చెడ్డవారు కారనే తత్వాన్ని తెలియజేసిన తీరు కడు రమణీయం. కాకుంటే మనుషుల్లో ఏదో ఒకటి కావాలని బాధ, ఉంటే ఎవరికి చెందుతుందో అనే బాధ, ఆస్తుల పంపకాలు, అక్కచెల్లెళ్ళ పోరాటాలు, రక్తసంబంధీకుల సమస్యలు చదువుతుంటే ఒకటుంటేఒకటిలేదనే తత్వంతో మనుషులు ఎదగలేకపోతున్నారా అనిపించక మానదు. అదే విషయం విజయ జీవితంలో కనిపిస్తుంది. తండ్రి వచ్చినా, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నా ఆస్తుల పంపకాలలో అనేక చేదుకోణాలను చూస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్న విజయ తల్లిని అన్వేషించడం మాత్రం ఆపలేదు. చివరకు తన తల్లి అత్యాచారానికి గురై చేయూతనిచ్చేవారు ఉన్నా అందుకోలేక, సమాజానికి ముఖం చూపించలేక మరింతగా కుంగిపోయి తన జీవితాన్ని పోగొట్టుకుందనే నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతుంది. మరో వివాహం చేసుకుని వారి ద్వారా కూడా బిడ్డలున్నా వారి నుండి ఆదరణ లభించకపోవడంతో మొదటి భార్య కన్నబిడ్డ విజయ తండ్రిని తానే కొడుకై ఆదరిస్తుంది. తల్లిదండ్రులు ఎలాంటివారైనా అనుబంధం ముందు ఓడిపోక తప్పదని నిరూపిస్తుంది.
మనిషి జీవితంలోని మార్పుచేర్పులకు సమాజమే కారణం అయితే, వ్యక్తిగా తనను తాను గమనించుకునే స్థితికి మనిషి ఎపుడు చేరుకుంటాడు? అదే స్త్రీ అయితే తన పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలను సంధించి సరికొత్త సమాధానాన్ని అందించిన తీరులో సాగిన వైనం మనల్ని ఆద్యంతం అలరిస్తుంది. వ్యక్తిత్వం అనేది ఒక స్ర్తికి సంబంధించింది అనడం కంటే వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి సంబంధించింది అని ముగించి ఉంటే మరింత బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్నగా స్త్రీ నిలబడినంతకాలం సమాజం తనకిష్టమైన సమాధానాలు చెబుతూనే ఉంటుంది. తానే ఒక సమాధానమైన రోజు ప్రశ్నలన్నీ ఏమవుతాయి? ఆలోచించాలి…!

-ఎస్.ఎం. అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

***

అన్వేషణ”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

అన్వేషణ on kinige

Related Posts:

సైన్సూ, ఫిక్షన్ కలిపి

కాలంలో ప్రయాణం ఆంగ్లంలో టైమ్‌ట్రావెల్ చిన్న టైటిల్‍తో వెలువడిన ఈ పుస్తకం కొంచెం ఊహాత్మక ప్రతిపాదనతోనూ, ఊహకు మరికొంత శాస్త్రీయ ఆధారంతోను నడిపించారు రచయిత మన్నె సత్యనారాయణ. 4-డైమెన్షనల్ కంటిన్యుమ్ సిద్ధాంతాన్ని ఈ నవలలో కొద్దిపాటి వివరణలతో నడిపించారు. శాస్త్రవిజ్ఞానం ఈనాటికి చేరిన స్థాయినీ, అది పురోగమిస్తున్న వేగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రచయిత చెపుతున్నారు. సంక్లిష్టమైన యంత్రం నుంచి ప్రజలు వాడుకునే చిన్న వస్తువుల తయారీ వరకు వృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞానాన్ని తెలియజేస్తాయని చెబుతూ ఒకనాడు అసంభవం అనుకున్న సాధనాల్ని ఈనాడు శాస్త్రవిజ్ఞానం సాధించి చూపిస్తున్నదని రచయిత చెప్పుకుంటూ వచ్చారు. పైగా మనిషి చేసిన ప్రతి ఆవిష్కరణ ఊహతోనే ప్రారంభం అవుతుందని ఆ ఊహను ఆలోచనను మధించి ప్రయోగం జరిపితేనే సిద్ధాంతంగా రూపొందుతుందని చెప్పారు.
అందుకె రోజూవారీ ఆలోచనల మేలిమి రూపమే సిద్ధాంతం అన్న ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సైన్సు ఫిక్షన్ చరిత్రల నేపథ్యంలో నడిచిన నవలగా చెబుతున్న కాలంలో ప్రయాణం గతంలో ఇంగ్లీషులో ఈ సబ్జెక్టుతో నవలలు వెలువడ్డాయి. ఆయా నవలలు ఆ రచయితలు ఆ భాషలు, ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో రాసారు. అయితే ఈ రచయిత, తెలుగులో, తెలుగు సంస్కృతి నేపథ్యంలో రాయాలనిపించి సఫలీకృతులయ్యారు. టైమ్‌ట్రావెల్ అనేది ఫిక్షన్, ఆ నవల్లలో టైమ్ ట్రావెలర్ వెళ్ళింది కూడా కల్పనాకాలంలోకి. కానీ ఈ నవలలో టైమ్ ట్రావెలర్ తెలుగు చారిత్రక కాలంలోకి వెళతాడని రచయిత వివరించారు. అందువల్లనే ఆ నాటి తెలుగు చరిత్రని పరిశీలనగా చెప్పవచ్చని రచయిత గ్రహించారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనికి, తరవాత నన్నయ్య, రాజరాజనరేంద్రుల కాలంలోకి టైమ్ ట్రావెలర్ వెళతాడు. చరిత్ర కావడంతో చారిత్రక వాస్తవాలకు దగ్గరగా రాయడానికి రచయిత ప్రయత్నించాడు. రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇద్దరు పోర్చుగీసు వారు రాసిన పుస్తకాలను కూడా రచయిత ప్రామాణికంగా తీసుకుని కాలంలో ప్రయాణం పూర్తి చేసారు. రాయల కాలంలో వ్యవసాయం, కొన్ని మౌలిక వసతుల కల్పన గురించి చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. రాయల కాలంలోని నీటి వనరులు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. అయితే వాటిని ఇప్పుడు పాతకాలం కాలవలని చెప్పడం రివాజు. సైన్సు, ఫిక్షన్, చరిత్ర అంశాలుగా నడచిన ఈ పుస్తకానికి మాజీ గవర్నర్ వి. ఎస్. రమాదేవి ముందుమాట రాసారు.

గన్ని మోహన్
(వార్త దినపత్రిక 13 మే 2012)

* * *

“కాలంలో ప్రయాణం” రాష్ట్రస్థాయి నవలల పోటీలో రూ.20,000/- బహుమతిని పొంది, ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన నవల. ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కాలంలో ప్రయాణం On Kinige

Related Posts: