రామాయణ విషవృక్షం

‘రామాయణ విషవృక్షం’ మొదట్లో 3 భాగాలుగా (మూడు వేరు వేరు పుస్తకాలుగా) ఉండేది. ‘విషవృక్షం’లో మొదటి భాగాన్ని రచయిత్రి 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రచించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి భాగం ఏడు ముద్రణలూ, రెండవ భాగం ఆరు ముద్రణలూ, మూడవ భాగం నాలుగు ముద్రణలూ వచ్చాయి. 2005 నుంచీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోయాయి.

అన్ని భాగాలు కలిసిన సంపుటం ఇప్పటికి మూడు సార్లు ముద్రణలు పడింది: 2006 అక్టోబరులోనూ, 2008 మేలోనూ, 2012 ఫిబ్రవరిలోనూ. 2012 ఫిబ్రవరి ముద్రణలో, గతంలో లేని కొత్త వ్యాసాలు 3 చేరాయి. ఇది 2012 ఫిబ్రవరి ముద్రణకు డిజిటల్ రూపం.

* * *

“పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు” అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది ‘పాత’ కాదు. ‘పాత’ అయిపోలేదు. ‘రామాయణం’ ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు ‘రామనామ జపాన్ని’ పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు – ఆ గ్రంథం ‘పాతదైపోలేదని’ నిర్ణయించడానికి!

ఈ ప్రయత్నానికి అర్థం – పాతనంతా తిరస్కరించడం కాదు. ‘పాత’ అంతా మానవ చరిత్రే. ఆ ‘చరిత్ర పరిణామం’లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.

రామాయణ విషవృక్షం On Kinige

Related Posts:

బలిపీఠం (eBook) – Ranganayakamma

సంస్కరణాయుతమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొని ”బలిపీఠం” పేరిట వ్రాసిన ఈ నవల, 5-9-1962 నించీ 2-4-1963 వరకూ ‘ఆంధ్రప్రభ’ వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఇప్పటి వరకు 13 సార్లు పునర్ముద్రితమైంది.

ఈ నవలలో ముఖ్య విషయాలు – సంఘ సంస్కరణా, కులాంతర – మతాంతర వివాహాలూ.

వరద వెల్లువగా కొట్టుకుపోతున్న సంఘానికి ఎదురు నిలిచి, దాని లోని అవకతవకలను ఎత్తి చూపి, పవిత్రంగా – ధర్మబద్ధంగా – సంస్కార పూరితంగా బ్రతకాలనీ, సంఘాన్ని బ్రతికించాలనీ, తాపత్రయపడే వారు కష్ట నష్టాలపాలు గాక మానరు. కారణం, వారిలో పెరిగిన ఔన్నత్యం, చుట్టూ సంఘంలో ఇంకా పెరిగి వుండదు. వారిలో ఉద్భవించిన ధర్మాధర్మ పరిజ్ఞానం, సంఘంలో ఇంకా ఉద్భవించి వుండదు. వారిలో రేకెత్తిన సంస్కార భావం, సంఘంలో రేకెత్తి వుండదు. వారు సంఘం కన్నా చాలా ఎత్తుకు పెరిగి వుంటారు. మొట్టమొదట వారిని అందుకోలేని సంఘం, అపార్థాలతో, అప హాస్యాలతో వారిని కించపరచ ప్రయత్నిస్తుంది. అంత మాత్రాన నిజమైన సంస్కారు లెన్నడూ వెనుకంజ వెయ్యరు. బలీయమైన వారి వ్యక్తిత్వం, కొండ వంటి సంఘాన్ని ఎదిరిస్తుంది. జయిస్తుంది. నిలుస్తుంది.

‘బలిపీఠం’లో వున్న అరుణా, భాస్కర్‌ల వంటి వ్యక్తులు, జీవితంలో కొంత మందైనా తటస్థపడుతూ వుంటారు. పాత కొత్తల మేలు కలయికను లోతుగా అవగాహన చేసుకోలేక, సంకుచితమైన భావాలకు అంకితమైపోయిన అరుణ, ఎంతైనా అభాగ్యురాలు! స్వార్థ చింతన లేక, త్యాగ బుద్ధితో జీవితాన్నే పందెం పెట్టిన భాస్కర్‌కు, చివరికి తాను ఓడిపోలేదన్న సత్యం చాలు, ఆత్మ శాంతికి.

కులాల కలయికలను నిరసించటం గానీ, ముందడుగులు వేసే వారిని నిరుత్సాహ పరచటం గానీ, ఈ నవల ఉద్దేశ్యం కాదు. అన్ని విధాలా తమను తాము అదుపులో పెట్టుకోగలిగిన శక్తివంతులే, సామాన్యులను మించిన సంస్కారులు అవుతారు. తీవ్రమైన సాంఫిుక విప్లవానికి, సంస్కార హృదయాలే అత్యవసరమైనవి.

బలిపీఠం నవలకి 1965లో, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అప్పుడు రచయిత్ర్రికి బహుమతుల సంస్కృతి గురించి ఏమీ తెలియక దాని మీద వ్యతిరేకత లేక, ఆ బహుమతిని తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో, ఎటువంటి అవార్డునైనా స్వీకరించడం మానుకున్నారు.

—-

కొడవటిగంటి కుటుంబరావు బలిపీఠం నవలని వీరేశలింగంగారి రాజశేఖర చరిత్రము, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి మాలపల్లి నవలలతో పోల్చి, తెలుగు నవలా సాహిత్యంలో ఇదొక మైలురాయని అన్నారు.

—–

ఈ నవల ఆధారంగా బలిపీఠం (1975) సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడినది.

——

Related Posts:

స్వీట్ హోం

స్వీట్ హోమ్ నవల మొదటి భాగం 1967లోనూ, రెండవ భాగం 1968లోనూ, మూడవ భాగం 1999లోనూ వెలువడ్డాయి. 2004లో ఈ మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా వెలువడింది.

ఈ నవల విమల, బుచ్చిబాబు అనే భార్యభర్తల కథ. బుచ్చిబాబుకి, ‘భర్త స్వభావం’ లేదు. భార్య మీద పెత్తనాలు చెయ్యడం, ఆధిక్యత కోసం తహతహలాడడం చెయ్యడు. విమలకి కూడా ‘భార్య స్వభావం’ లేదు. భర్త ముందు పిరికిగా, జంకుగా లొంగుబాటుగా ప్రవర్తించదు. ఇద్దరూ చనువుగా, స్నేహంగా ఉంటారు.

కొంతమంది మనుషులు తెలియకే తప్పులు చేస్తారు. తప్పు చేసినట్టు తెలుసుకుగాని దాన్ని సరిజేసుకోడానికి తహతహలాడుతారు. విమలా బుచ్చిబాబు అలాంటి వాళ్ళే. మరి వీరి కథ చదువుకోడం, వీళ్ళని తెలుసుకోడం పాఠకులకు ఆసక్తిగా ఉండదూ?

సంసారంలో కలకాలం కలసిమెలసి సాగేందుకు, నిండైన జీవితం గడిపేందుకు భార్యభర్తలు ఎలా నడుచుకోవాలో సూచించే కథ ఇది. కథ హాస్యంగా సాగుతూనే, భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది.

ఒక ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవ్వాలంటే, స్త్రీ పురుషులిద్దరూ చాలా జ్ఞానవంతులై వుండాలి, మంచి చెడ్డల విచక్షణ గల వాళ్ళై వుండాలని అంటారు రచయిత్రి.

స్వీట్ హోం నవల ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెపై. వివరాలు ఇక్కడ

స్వీట్ హోమ్ On Kinige

Related Posts: