వినవోయీ! అల్పజీవి!

వినవోయీ! అల్పజీవి! అనే పుస్తకం విల్‌హెల్మ్‌ రైక్‌ రాసిన Listen, Little Man! అనే రచనకు అనువాదం. మార్క్స్‌, ఫ్రాయిడ్‌ల ఆలోచనా రీతుల సంశ్లేషణకు ప్రయత్నించిన తొలి మేధావులలో రైక్‌ ఒకడు. ఈ ప్రయత్నం విజయవంతం కానప్పటికీ, కాలక్రమంలో ఈ రెండు మేధో సంప్రదాయాలతో తాను విభేదించినప్పటికీ, మనో విజ్ఞాన శాస్త్రంలో, మనో విశ్లేషణ సిద్ధాంతంలో మౌలిక ప్రాధాన్యత కల భావాలను ప్రతిపాదించి, వాటికై జీవితాంతం పోరాడిన మేధావి రైక్‌.

ఫాసిజాన్ని, నాజిజాన్ని రైక్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వాన్ని రెడ్‌ ఫాసిజంగా విమర్శించాడు. వేల సంవత్సరాలుగా సహజాతాల అణచివేతపై ఆధారపడిన సామాజిక నిర్మాణం మనిషి స్వభావాన్ని ఎలా వికృతపరిచింది తన Listen, Little Man! అనే పుస్తకంలో పరిశీలించాడు.

రచయిత విల్‌హెల్మ్‌ రైక్‌ వెలిబుచ్చిన భావాలు ఈ రోజుక్కూడా విలువైనవే. 1897లో జన్మించిన విల్‌హెల్మ్‌ రైక్‌ 60 సంవత్సరాలు జీవించాడు. రెండు ప్రపంచయుద్ధాలు చూశాడు. సోషలిజం, జాతీయత పేర్లు చెప్పి హిట్లర్‌ ఏం చేశాడో చూశాడు. (నేషనల్‌ సోషలిస్టు పార్టీ-ఇది హిట్లర్‌ పార్టీ పేరు). గొప్ప పేర్లూ, ఆదర్శాలూ చెప్పి జనాన్ని ఎదగనీయకుండా చేసే రాజకీయాలు అప్పుడూ-యిప్పుడూ పెద్దగా మారకుండానే ఉన్నాయి. అవి జనాన్ని కూడా ఎదగనీయటం లేదు. యూరోపియన్‌ ఫాసిజం ఈ పరిశీలన తక్షణ సందర్భం. రైక్‌ వ్యక్తిగత జీవితంలోని ఘటనలు, ఒడిదుడుకులు ఈ అవగాహనను బలపర్చాయి. మానవ స్వభావంలోని చీకటి కోణాలు ఇందులో ప్రధానంగా ఆవిష్కరించబడినప్పటికీ, ఇది నిరాశావహ చిత్రణ కాదు. మేలుకొలుపు ప్రయత్నం. రుగ్మతను తెలియచెప్పడం, దానిని అధిగమించడానికి దోహదపడుతుంది. రైక్‌ రాసిన నాటి చారిత్రక సందర్భం నేడు లేనప్పటికీ, రైక్‌ ఎత్తి చూపిన అల్పత్వ లక్షణాలు ఇప్పటికీ సమాజ జీవనంలో ప్రబలంగా ఉన్నాయి. వీటి మూలాలను అర్ధం చేసుకోవడానికి ఈ అనువాదం ఉపయోగపడుతుంది.

జర్మన్‌ మూలానికి ధియోడార్‌ పి. ఊల్ఫ్‌ చేసిన ఆంగ్లానువాదం నుండి ఈ పుస్తకాన్ని డా. సుంకర రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. ”వినవోయీ! అల్పజీవి!” అనువాద గ్రంథమైనప్పటికీ, స్వేచ్ఛానువాదం కాదు. విషయం కొంత క్లిష్టమైనదే అయినా, గొంతు పట్టుకున్నట్లుగా కాకుండా సులభంగా చదవగలం. రామచంద్ర రావు జర్నలిస్టుగా పని చేశారు. ‘సమ్మర్‌ హిల్‌’, ‘మీ ప్రతిభ మీరు తెలుసుకోండి’, ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు’ అనే పుస్తకాలు గతంలో అనువదించారు. వీటిలో ముఖ్యంగా ‘సమ్మర్‌ హిల్‌’ తెలుగునాట పిల్లల పెంపకం, పిల్లల చదువులకు సంబంధించిన ఆలోచనలపై గణనీయమైన ప్రభావం చూపింది. అనువాదకుడు రైక్‌ జీవితాన్ని, కృషిని పరిచయం చేస్తూ సంక్షిప్త వ్యాసాన్ని కూడా పొందుపర్చారు.

”ఫలానా వ్యక్తి చెప్పాడు కాబట్టి వినాల్సిందే” అంటే అర్థం మనం అల్పజీవులుగా మిగలటమే. అలా అల్పజీవులుగా మిగలొద్దనే రైక్‌ చెప్పింది. “ఆయన చెప్పిన పరిశోధనాంశాలు సరయినవా కాదా అనేది పరిశోధనా క్షేత్రాలు తేల్చాల్సిందే. పనికొచ్చే వాటిని వినమ్రంగా స్వీకరిద్దాం. పనికిరాని వాటిని ‘ఇవి పనికిరావిప్పుడు’ అని నమ్రతగానే నిరాకరిద్దాం.” అంటారు డా. బ్రహ్మారెడ్డిగారు.

ఆలోజింపజేసే చక్కని పుస్తకం ఇది.

వినవోయి! అల్పజీవి!” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

వినవోయీ! అల్పజీవి! On Kinige

Related Posts: