మీ చెప్పులను ఎప్పుడైనా కుక్కలు ఎత్తుకెళ్ళాయా? పల్లెటూళ్ళతో మీకు సంబంధం ఉంటే తప్పనిసరిగా ఈ అనుభవం ఎదురయ్యే వుంటుంది. అయితే వాటి బారిన పడకుండా మీ చెప్పులను రక్షించుకోవాలంటే ఏంచెయ్యాలి? ఎడమ చెప్పు కుడివైపునా , కుడిచెప్పు ఎడమవైపునా ఉంచండి. కుక్కలు వాటివైపు వెళ్ళవు. ఎందుకంటారా? అవి దెయ్యం కాలిజోళ్ళని భయపడతాయి. నమ్మబుద్ధవటంలేదా? పూర్ణచంద్ర తేజస్వి అనే ప్రఖ్యాత కన్నడ రచయిత రాసిన ‘పరిసర కతెగళు’ అన్న కన్నడ కథాసంపుటాన్ని తెలుగుచేసి శాఖమూరి రాంగోపాల్ గారు అందించిన ‘పర్యావరణ కథలు‘ చదవండి. అందులో మరడు ఈ సత్యాన్ని శాస్త్రీయదృష్టిగల తేజస్విగారి ముక్కు పట్టుకుని మరీ చెపుతాడు. ఆయన మన చెవి పట్టుకుని ఆ వైనాన్ని ఓ కథచేసి వినిపిస్తాడు.
ఉడుంపట్టు అనటం వినీ ఉంటారు, అనీ ఉంటారు. ఆ పట్టు ఎలాంటిదో ఎంతటిదో మీరు చూసి ఉండరు. అది కళ్ళకు కట్టినట్టు, మనసుకు ‘ఉడుంపట్టు’ పట్టేటట్టూ చెపుతారు తేజస్వి.
కోతులు వచ్చి ఇళ్లమీదా, దొడ్లమీదా పడి నానాయాగీ చేస్తే మీరేం చేస్తారు? వాటిని చంపెయ్యాలనుకుంటారు. అయితే అవి దైవస్వరూపాలు గదా ఎలా చంపుతాం అంటాడు గాడ్లీ. పాపం ఆ మానవుడు అందుకోసం నానాపాట్లూ పడి ఓ బోను తయారుచేస్తాడు. దానితో వాటిని పట్టుకుని తీసుకువెళ్ళి అడవిలో వదిలెయ్యాలని అతగాడి పథకం. పట్టుకుంటాడు. దైవస్వరూపాలు గదా. అందుకోసం వాటికి తిండి ఏర్పాట్లు చేస్తాడు. తీరా తీసుకువెళ్ళి బోను తెరిస్తే, తిండి మరిగిన ఓ కోతి బయటకు వెళ్ళదు. దానిని బయటకు తరమటానికి తను బోనులోకి వెళ్ళేసరికి పొరపాటున అందులో చిక్కుకుపోతాడు. ఆ గాడ్లీ కథ వింటారా అయితే తేజస్విగారి స్వానుభవాలతో నిండి ఈ ‘పర్యావరణ కథలు’ చదవండి.
పర్యావరణం అన్న పదం తెలుగులో ప్రస్తుతం చెలామణీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పదం ఒకటి రెండు దశాబ్దాలుగా వినపడుతోంది. ఈ పదం వ్యక్తంచేసే అంశంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వన్యజీవుల అంతర్ధానం, వన్య జీవిత విధ్వంసం అందులో ఒకటి. మన అనుభవజ్ఞులైన ప్రాణుల అంతర్ధానానికి కారణం మానవులమైన మన అత్యాశ. మానవీయ దృష్టితో చూచినా, మన బాగుకోసమే అని గ్రహించినా అవి అంతరించిపోకుండా మనం జాగ్రత్త పడాలి. పౌరులు తమ ప్రభుత్వాలనూ, దేశాలు ధనిక దేశాలనూ ఒత్తిడి చేసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నద దీని సారాంశం. వనాలు కొట్టివేసి వానలను తగ్గించి, తద్వారా ఉష్ణోగ్రతలలో మార్పులకు కారణమవుతున్నాం. హానికర రసాయనాల వినియోగంతో మరింత వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాం. పర్యావరణం అనగానే ఈ అంశాలు, వాదనలూ, వివరణలూ మనలో కదులుతాయి. ఈ పుస్తకం శీర్షిక వాటిని ఎంతోకొంత గుర్తుచేస్తుంది. దీనివల్ల పుస్తకానికి అదనపు అమ్మకపు విలువ చేరుతుందా లేక ఆ దృష్ట్యా చదవాలనుకునే వారికి అసంతృప్తి కలిగిస్తుందా అనేది ప్రశ్నార్థకం.
పోతే- కన్నడిగుల రాష్ట్రకవిగా గౌరవింపబడే కువెంపుగారి కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి. 1938లో పుట్టిన వీరు 2007లో కీర్తిశేషులయారు. కవిత్వం, కథ, నవల, నాటకం, యాత్రాసాహిత్యం, అనువాదాలు, విమర్శ, శాస్త్ర -కల్పన (scientific fiction) వంటి అనేక ప్రక్రియలలో సాహిత్య కృషిచేశారు. “అబచూరిన పోస్టాఫీసు” అన్న వీరి కథా సంపుటాన్ని కన్నడ ప్రగతిశీల (progressive) సాహిత్యానికి ఆరంభంగా భావిస్తారు. ఈ పేరుతోనూ, “తబరినకతె” అన్న పేరుతోనూ విడుదలైన సినిమాలు అనేక పురస్కారాలు అందుకున్నాయి. ఈయన చదువు ముగించుకుని లోహియా ప్రభావంతో వ్యవసాయం చేయటానికి పశ్చిమ కనుమలలో తేయాకు తోట కొని వ్యవసాయం చేశారు. అక్కడి అనుభవాలతో తను పరిసరాల ప్రేమికునిగా మారానని, ఆ మారిన విధానాన్ని ఈ కథలలో అర్థంచేసుకోవచ్చని తేజస్వి తన పుస్తకంలోని మొదటి రచనలో ఇలా చెపుతారు. “నేను చెప్పే చిన్నా, చితకా నా స్వంత అనుభవాలలోని సంఘటనలకు, పర్యావరణంకు ఏదో సంబంధాన్ని నేరుగా చూపించలేనండి! అయితే నా బతుకు బాటలో ఇది (ఈ రాతలు) నేను నడచివచ్చిన దారి అని మాత్రం చెప్పగలనండి”. వానలమయమైన పశ్చిమ కనుమలలోని ఓ కుర్రవాని దృష్టినుండి చెప్పిన తొలి కథతోనే రాజ్యోత్సవ పురస్కారం అందుకుని తండ్రి ఛాయనుంచి బయటపడిన తేజస్వి ఈ కథా సంపుటం పదహారు ముద్రణలకు పైగా అమ్ముడుపోయింది “కర్వలు” అనే వారి నవల 26 ఏళ్ళు గడిచినా ప్రతివారం అమ్ముడుపోయే తొలి పది పుస్తకాలలో ఒకటి అంటారు.
ఈ సంపుటంలోని కథలలో పాత్రలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మనలని పాత్రలకు, కథా వాతావరణానికీ అలవాటు చేస్తుంది. తెలియని విషయాలపట్ల, వ్యక్తుల పట్ల, జీవిత వివరాల పట్ల మనలో ఓ పీపింగ్ టామ్ ఉంటాడు. తేజస్వి దీనిని చక్కగా వాడుకుంటారు. సాహసాలు, అడవులు, వేట వంటి వస్తువులతో తెలుగులో కథలు రాకపోలేదు. ఈ వాతావరణంతోనే మనకు సి.రామచంద్రరావు ఇంతకన్న నేర్పరితనంతో కథలు చెప్పారు. వేట ఇతివృత్తంగా పూసపాటి కృష్ణంరాజు, పతంజలి, అల్లం శేషగిరిరావు వంటి వారు రాసారు. ఏమైనా ఈ పుస్తకంలా అవి పదహారు ముద్రణలు పొందలేదని మనం ఒప్పుకోవాలి. పుస్తకాలు కొని చదవటంలోనూ, మంచి రచయితలకు తమ సృజనతో కడుపు నింపుకునే అవకాశం ఇవ్వటంలోనూ, కన్నడిగులు మనకన్న చాలా ముందున్నారన్నది మనం తలొంచుకుని ఒప్పుకోవలసిన విషయం. కనీసం ఈ పుస్తకం విషయంలోనైనా మనమీదున్న ఈ చెడుపేరు తప్పించుకోటానికి దీనిని కొని చదువుదాం. తెలుగులో మనం చదవాలన్న ఆశతో దీనిపై కాలాన్నే కాక ధనాన్ని వెచ్చించిన శాఖమూరి రాంగోపాల్ గారికి కొని, కృతజ్ఞతలు చెపుదాం.
ఈ పుస్తకం అనువాదం గురించి కూడా ఓమాట అనుకోక తప్పదు. కథా వాతావరణానికి భాష అమిరినా, చదువుకోటానికి కాస్త అడ్డుపడుతుంటూనే ఉంటుంది. కొన్ని కన్నడ పదాలు ప్రతిభటన (ప్రతిఘటన) వంటివి వాడకుండా ఉంటే బాగుండేది.
అలాగే దాదాపు అన్ని కథల వెనుకా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీనుండి నిద్రాణమైన కథలు అనటం సరిగా లేదు 16 ముద్రణలు పొందిన కథాపుస్తకాన్ని వెతికి తీసాననటం అనువాదకుని కృషిగా చెప్పవచ్చుగాని, పుస్తకానికి శోభనివ్వదు.
– వివిన మూర్తి
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)
* * *
” పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్ని అనుసరించండి.
పర్యావరణ కథలు On Kinige

Related Posts: