బిగి సడలని ‘సస్పెన్స్’

పట్టు సడలని ‘బిగి’తో, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ‘క్రైమ్’ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు ‘డిటెక్టివ్ సాహిత్యం’ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది. ఇటీవలి కాలంలో క్రైమ్ కథాంశాలతో ‘డిటెక్టివ్ సాహిత్యం’లో కృషి చేస్తున్న రచయితల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ క్రైమ్ కథలకు ఆదరణ పూర్తిగా అంతరించిపోలేదు. కొన్ని పత్రికలు ఇప్పటికీ కొన్ని పేజీలను క్రైమ్ కథలకు ప్ర త్యేకించడం చూస్తున్నాం. పలు టీవీ చానళ్లు కూడా యథార్థ సంఘటనలతో రూపొందించే క్రైమ్ కథలను ప్రసారం చేస్తున్నాయి. ఇ లాంటి కథనాలకు సంబంధించి పేర్లు, పాత్రలు, స్థలాలు మొదలైనవన్నీ కల్పితమని, ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావని ‘క్రైమ్’ కథా రచయితలు చెప్పడం ఆనవాయితీ అయనా, వీటిలో చాలావరకూ మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వచ్చినవే. ఈ కథలు చదవడానికి ఉత్కంఠ భరితంగా ఉండడమే కాదు, నేరాలకు నేపథ్యం ఏ మిటి? ఏ కారణంగా కొందరు నేరస్థులవుతున్నారు? అనే విషయాలపై కూడా పాఠకులకు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇక, క్రైమ్ కథలు రాసే రచయితలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం సహజంగా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. తెలుగు భాషలో అద్భుత శైలితో స్వతంత్రంగా నేరగాథలను ఆవిష్కరించే రచయితల సంఖ్య తక్కువే. ఈ లోటును రేణిగుంట ఉత్తమ్ కొంతవరకూ తీర్చారనే చెప్పాలి. ‘థ్రిల్లర్స్’ పేరిట ఆయన రాసిన పది కథలూ పాఠకుల్లో ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథ నిడివి చిన్నదైనా, పెద్దదైనా ‘సస్పెన్స్’ ఒక్కటే రచయిత ప్రతిభకు గీటురాయి వంటిది. కథనాన్ని అనేక మలుపులు తిప్పుతూ, పాఠకుడి చేత ఏకబిగిన చదివించే లక్షణం ఉత్తమ్ రచనల్లో కనిపిస్తుంది. ‘థ్రిల్లర్స్’లో ‘ద్రోహం’, ‘విషకన్య’, ‘అతడు’, ‘ముసురు’, ‘ద ప్లాన్’ తదితర కథలు దేనికదే వైవిధ్యంతో కనిపిస్తాయి. కొన్ని కథల్లో ముగింపును మనం అంత సులువుగా ఊహించలేం. ప్రేమ, డబ్బు, విలన్లు, తుపాకులు, పోలీసులు.. వీటితో పాటు ‘ఆత్మ’లకూ క్రైమ్ కథల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘67 నిముషాల తర్వాత’ కథలో- రాత్రి వేళ రైలు దిగిన ఓ ఒంటరి అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేర్చిన వ్యక్తి ఆమె బావ కాదని, అది ‘ఆత్మ’ అని ముగింపులో చెప్పడం ఊహించని మలుపు. ఇలాంటి అనుకోని మలుపులే క్రైమ్ కథల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇక, విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలును అంతం చేసేందుకు ప్రత్యర్థులు సాగించిన వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు మహామంత్రి తిమ్మరుసు చేసిన ప్రతి వ్యూహాలకు సంబంధించిన కథ ‘కుట్ర’. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాయలు జీవితానికి సంబంధించిన కథాంశాన్ని ‘క్రైమ్’ కథాసంపుటిలో చేర్చడం విశేషం.

ఎస్‌ఆర్, ఆంధ్రభూమి అక్షర పేజి, 07/09/2013

* * *

“థ్రిల్లర్స్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
థ్రిల్లర్స్ On Kinige

Related Posts: