స’మ్మోహన’ మకరందం

ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కీలకమైన బాధ్యతలు పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి మోహన కందా జీవితానుభవాల చరిత్ర ఇది.. “నేనే కాదు.. ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ్ఱనలే. నన్నయ గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యవహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే”.. అనే మోహన్ కందా జీవితంలోని ఆసక్తికర భాగాలు..
గమనించారా… నా పేరూ, గాంధీగారి పేరూ ఒకటే! – మోహన్! దానికో స్టోరీ ఉంది. ఏడో నెలలో పుట్టిన నేను ఉంటానో, ఊడతానో అని పేరు కూడా పెట్టలేదు మా వాళ్లు. స్వాతంత్య్ర యోధురాలు, మహిళా ఉద్యమసారథి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గారున్నారు కదా, ఆవిడ అందరికీ దుర్గాబాయమ్మగారు కానీ నాకు దుర్గమ్మపిన్నే. తనూ మా అమ్మా కాకినాడలో క్లాస్‌మేట్స్. ప్రాణస్నేహితులు. ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. మేం మద్రాసు వచ్చాక మళ్లీ స్నేహం బలపడింది.
మద్రాసు వచ్చాక ఆవిడ ఆంధ్రమహిళా సభ పెట్టింది. సభకు అడయార్‌లో ఓ భవంతి కట్టి దాని శిలాఫలకాల ఆవిష్కరణకు గాంధీగారిని రప్పించింది. గాంధీగారు వచ్చినపుడు నన్ను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే.. నాకు ఆయన పేరు – మోహనదాస్ అని పెట్టారు. రాను రాను ‘దాసు’ కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అది మోహన్‌బాబుగా.. మోహన్‌గా మిగిలింది.

* * *

కాకినాడలో మా మాతామహుడు చావలి రామసోమయాజులుగారు పేరుమోసిన కాంగ్రెసువాది. ఆయన పేరుమీద వీధి కూడా ఉందక్కడ. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మెంబర్ ఆయన. కాకినాడ మున్సిపాలిటికి పదహారేళ్లు నిర్విఘ్నంగా చైర్మన్‌గా చేసారు. ఆయనకు గుఱ పు బండి ఉండేదట. అది సాయంకాలం ఇంటికెళ్లే టైం అయిపోతే ఎవరు చెప్పక్కరలేకుండానే వెనక్కితిరిగి దానంతట అదే వచ్చేసేదట. తర్వాత గవర్నమెంటు సర్వీసులో చేరాక అటువంటి జీవాలను చాలా చూశాను. ఆఫీసుకి వచ్చే టైం మాట ఎలా ఉన్నా, వెళ్లే టైము కాగానే ఠంచన్‌గా వెళ్లిపోయేవారు. మొహం కడిగేసుకోవడం, బ్యాగ్ సర్దేసుకోవడం అన్నీ సాయంత్రం 5 గంటల లోపునే! అప్పుడు తెలిసింది – ఆ గుఱ ం గత జన్మలో ప్రభుత్వోద్యోగి అయి ఉంటుందని!

* * *

ట్రిక్కులు పనిచేయవు…
నా పేరు చెప్పగానే ఓ తరం వారు “పెళ్లి చేసి చూడు” సినిమాలో చిన్న పిల్లవాడి వేషం వేశారు కదా అంటారు. “అమ్మా నొప్పులే..” అనే ఓ నృత్య నాటికలో నేను స్కూలు పిల్లవాడి వేషం వేశాను. అదెలా జరిగిందంటే – మేం మైలాపూర్‌లో చెంగళనీర్ పిళ్లయార్ వీథిలో ఉండేవాళ్లం. దానికి దగ్గర్లో ఉన్న లజ్ కార్నర్‌లో హిమాలయా కూల్‌డ్రింక్స్ అని ఒక దుకాణం ఉండేది. అక్కడ కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ ఉండేవాడ్ని. ఓ రోజు నేను అక్కడ కూర్చుని వాగుతూ ఉంటే నా ధోరణి చూసి “వీడికి స్టేజి ఫియర్ లేనట్టుంది. మనకు పనికి వచ్చేట్టున్నాడు” అనుకున్నారేమో, ఇద్దరు నా దగ్గరికి వచ్చి “బాబూ సినిమాల్లో యాక్ట్‌చేస్తావా?” అని అడిగారు(ట).
“తప్పకుండానండి పదండి” అన్నాను(ట).
“ముందర మీ అమ్మని, నాన్నని అడుగుదాం. ఇంటికెళ్దాం పద” అన్నారు(ట) వాళ్లు.
“అది మాత్రం వొద్దు. నేను యాక్ట్ చేయాలని మీకుంటే ముందర నన్ను తీసుకెళ్లండి తర్వాత వాళ్లకి చెబుదాం” అని వాళ్లని తొందర పెట్టేశాను(ట). వాళ్లు ఘటికుడివిరా బాబూ అనుకుని ఉంటారు.
తీసుకెళ్లి చిన్న ఆడిషన్ ఏదో చేశారు. అది బాగుంది లాగుంది. వేషం ఆఫర్ చేద్దామని మా ఇంటికి వచ్చారు. నేను సినిమాల్లోకి వెళ్లడం మా అమ్మకి సరదాయే. కానీ మా నాన్నకి చెప్పాలంటే భయం. అందుకే వాళ్లతో “ముందర మీరు కానివ్వండి. తర్వాత నేను ఆయనకు నింపాదిగా చెబుతా” అంది(ట).

* * *

ఎన్‌టిఆర్ – కోడితో పోటీ పడాలి..
ఎన్.టి. రామారావు గారి దగ్గర పనిచేయడం చాలా కష్టం. అలా అని పాపం ఆయన బ్రహ్మరాక్షసుడేమీ కాదు… చిక్కల్లా బ్రాహ్మీముహూర్తంలో.. అంటే తెల్లవారుఝామున ప్రారంభమయ్యే ఆయన దినచర్యతోనే… మనం కోడితో పోటీ పడి లేచి రెడీగా ఉండాలి. అప్పటికప్పుడే ఫోను చేసి నిద్ర లేపి మాట్లాడేస్తారు. “అబ్బే, ఇప్పుడు మీరు చెప్పినా బుర్రకెక్కదు. పదిగంటలకు ఆఫీసుకి వచ్చాక చెప్దురుగాని..” అంటే కుదరదు. ఆయన ముఖ్యమంత్రి. నేను ఆయన దగ్గర స్పెషల్ సెక్రటరీని. ఓ రోజు అటువంటి ‘అసురవేళ’లో నిద్రలేపి “మోహన్, ఆ సొసైటీది వాళ్ల కిచ్చేసేయ్..” అని ఒక్క ముక్క చెప్పేసి ఫోను పెట్టేశారు. నిద్రలో జోగుతూ విన్నాను. నిద్రమత్తు దిగాక ఆలోచిస్తే ఏమీ బోధపడలేదు – సవాలక్ష సొసైటీలలో ఏ సొసైటీ గురించి చెప్పారు? ఏది ఇవ్వాలి? వచ్చిన వాళ్లెవరు? వాళ్లేమడిగారు? ఈయన దేనికి సమ్మతించారు?
ఆయనకే ఫోన్ చేసి అడగాలా? అడగగలనా? ఏమీ తెలియనట్టు ఊరుకోనా?… గలనా? ఆ సొసైటీ ఏదో కనిపెట్టలేక, అప్పుడు సిఎం ఆఫీసులో మిత్రుడు హేమచంద్ర ప్రసాద్‌కి (రామారావుగారికి ప్రయివేట్ సెక్రటరీ) ఫోన్ చేసి “బాబూ, సరిగ్గా కాస్సేపు క్రితం ఆయనను కలిసిందెవరో గుర్తు పెట్టుకో. నేను ఆఫీసుకి వచ్చిన తర్వాత చెప్పు” అని చెప్పాను. ఆఫీసుకి వెళ్లాక ఆ వెళ్లినతన్ని పట్టుకుని, పిలిపించి “నువ్వేం అడిగావ్? ఆయన ఏం చేస్తానన్నారు?” అని కనుక్కుని… ‘ఓహో, ఇతను ఇలా అడిగాడు కాబట్టి ఆయన ఇలా చేస్తానని అని ఉంటారు” అనుకుని… రెండు ప్లస్ రెండు నాలుగన్నట్టు లెక్క వేసి సంగతి తెలుసుకుని దాని ప్రకారం అమలు చేశాను.
రిజర్వ్ బ్యాంక్ గవర్నగా పనిచేసి రిటైరైన వై. వేణుగోపాలరెడ్డి గారంటే నాకు చాలా గౌరవాభిమానాలు. ముక్కుసూటిగా మాట్లాడడంలో ఆయన దిట్ట. చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హైదరాబాదు జిల్లా కలెక్టర్. ఓ రోజు రాత్రి (అదే అర్ధరాత్రి) చెన్నారెడ్డిగారు ఆయనకు ఫోన్ చేసి “ఐ వాంట్ యూ టు కమ్ ఇమ్మీడియేట్లీ. ఓ విషయం డిస్కస్ చేయాలి” అన్నారు. వై వి రెడ్డిగారు తొణక్కుండా చెప్పారు – “నేను మా ఫ్రెండ్స్‌తో కూచుని ఓ చిన్న డ్రింక్ తీసుకుంటున్నాను సర్. ఇప్పుడొస్తే బాగుండదేమో! రేపు పొద్దున్న వస్తాను. కాదూ కూడదు అర్జంటు విషయం అంటారా, ఇప్పుడే ఫోన్‌లో చెప్పేయండి. ఏం చేయగలమో చూద్దాం” అన్నారు. చెన్నారెడ్డి గారికి అలాంటి జవాబు ఎప్పుడూ వచ్చి ఉండదు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఆ విధంగా చెప్పడం మాత్రం వేణుగోపాలరెడ్డిగారికే చెల్లింది.

* * *

మేం ఏ ఎండకా గొడుగు పడతామా?
‘మా బ్యూరాక్రాట్స్‌కు ఎఱా ప్రగడే ఆదర్శం’ అని నేనంటే మీరు ఆశ్చర్యపడతారని నాకు తెలుసు. ఎందుకంటే ‘కవిత్రయం అనగా ఎవరు?’ అన్న బిట్ క్వశ్చన్‌కు ఆన్సర్‌గా రాసేటప్పుడు తప్ప ఎఱా ప్రగడ మనకు ఎక్కడా తగలడు.
నేనే కాదు ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ నలే. నన్నయ్య గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యావహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే. వరుసగా వచ్చే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పార్టీలు వేరే ఉండవచ్చు, సిద్ధాంతాలు తేడాగా ఉండవచ్చు, వయోభేదం ఉండవచ్చు, వేగంలో వ్యత్యాసం ఉండవచ్చు, విద్యాధిక్యతలో, అవగాహనలో, ప్రవర్తనలో, నైతికతలో – ఎన్నో రకాల భేదాలు ఉండవచ్చు.
ఎన్ని ఉన్నా పరిపాలించబడే ప్రజలకు మాత్రం తేడా తెలియకూడదు. ఒకే ప్రభుత్వం అనూచానంగా నడుస్తున్నట్టు అనిపించాలి. ముఖ్యమంత్రి ఎవరైతేనేం, ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, మనం నిత్యం చూసే ఆర్‌డీఓగారు మారలేదు, ఆయన పనితీరూ మారలేదు అనిపించాలి. నిజానికి మార్పు ఉంటుంది. కానీ అది మార్పులా అనిపించకుండా చూడడమే బ్యూరాక్రసీ లక్షణం. ఈ క్రమంలో బ్యూరాక్రసీ చాలా అవస్థే పడుతుంది. ఎఱా ప్రగడను పట్టుకుని నువ్వు నన్నయకు విధేయుడవని తిక్కనా, తిక్కనకు విధేయుడవని నన్నయా శంకించలేదు కానీ బ్యూరాక్రసీకి మాత్రం పాత వ్యవస్థకు విధేయులనే నింద మోయక తప్పదు.

— నవ్య పేజీ, ఆంధ్రజ్యోతి, 20th March 2014

మోహన మకరందం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

***

మోహన మకరందం on Kinige

Related Posts:

రాయల నాటి నిజాలకు దర్బణం

దురదృష్టవశాత్తూ చరిత్రలో వాస్తవాలకంటే పురాణాలూ కల్పనలే ఆంధ్ర దేశ చరిత్రకారులను ఎక్కువ ఆకర్షించినట్టు కనిపిస్తుంది. అందుకే మన చరిత్ర పుస్తకాలలో ఎక్కువ భాగం పౌరాణిక చరిత్రలుగా మిగిలిపోయాయి. చరిత్ర పరిశోధనలో, రచనలో ఈ స్థితిని మార్చే ప్రయత్నం చేసిన వ్యాస సంకలనం మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వెలువడిన ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయశ్రీ’ ఈ పుస్తకంలోని ఇరవై ఏడు వ్యాసాలలో శ్రీకృష్ణదేవరాయలను, విజయనగర సామ్రాజ్యాన్ని పాఠకులకు సరళంగా పరిచయం చేయడమే కాదు, వారి చేయి పట్టుకుని సాదరంగా ఆ కాలానికి తీసుకెళ్ళి నాటి ఘటనలను, నిజాలను కళ్ళకు కట్టినట్టు దర్శింపజేస్తాయి.

గత నూరేళ్ళలో రాయలపై వివిధ కాలాలలో అమరనాథవర్మ, గాడిచర్ల, నేలటూరి వెంకటరమణయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పిలకా గణపతిశాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, కృష్ణశాస్త్రి, భావరాజు వెంకట కృష్ణారావు వంటి ఎంతోమంది ప్రముఖ చరిత్ర, సాహితీకారులు రాసిన అమూల్యమైన వ్యాసాలే కాదు, వి.ఎ.కె రంగారావు, అరిశెట్టి సాయిప్రసాద్ వంటి ఈ తరం చరిత్రకారుల తాజా వ్యాసాలూ ఇందులో ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర, సాహిత్యం వంటి అంశాలపై ప్రచారంలో ఉన్న అనేక అపోహలనూ, మిత్‌లనూ శాస్త్రీయంగా తొలగిస్తూ అదే సమయంలో రాయల వ్యక్తిత్వంపై ఒక అవగాహనను పాఠకులలో ఏర్పరుస్తుందీ వ్యాస సంకలనం.

శ్రీకృష్ణ దేవరాయలపై ఇంతవరకూ ఆంధ్ర, ఆంగ్లభాషలలో వెలువడిన 246 గ్రంథాల జాబితాను ఇవ్వడం చరిత్ర పరిశోధనలకూ, ఆసక్తిపరులకూ ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల సహాయంతో గిరిధర గౌడ్ చిత్రీకరించిన రాయల ప్రతిరూపం ఈ వ్యాస సంకలనానికే కాదు, చరిత్రను దృశ్యమానం చేసే ప్రక్రియకే హైలైట్. ఇది చరిత్రకారులనూ, సామాన్య పాఠకులనూ ఒకే ఆసక్తితో చదివిస్తుంది. కృష్ణదేవరాయల చరిత్రను 102 ఛాయాచిత్రాలతో సహా ఎంతో సమగ్రంగా అక్షరీకరించిన సంపాదకుల కృషి అభినందనీయం.

- డి. లెనిన్, ఆదివారం ఆంధ్రజ్యోతి, 23rd Feb 2014

సాహితీసమరాంగణ సార్వభౌమ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

***

సాహితీసమరాంగణ సార్వభౌమ on Kinige

Related Posts:

జీవన వలయం – వలయం (కథా సంపుటి) పై సమీక్ష

సామాజిక దృక్కోణాన్ని ఆవిష్కరించే కథల్లో వర్తమాన జీవితం తొణికిసలాడుతుంది, చుట్టూ కనిపించే పరిస్థితుల్నే కథలుగా అల్లిన వైనం ప్రస్ఫుటమవుతుంది. రాచపూటి రమేశ్‌ ‘వలయం’ సంపుటి ఇందుకు ఉదాహరణ. మధ్యతరగతి స్థితిగతుల్నీ సంక్షోభాల్నీ ఆనందాల్నీ రచయిత కథల ద్వారా ఆవిష్కరించారు. చేనేతకారుల వెతలకూ కతలకూ ‘తాతకో నూలుపోగు’ అద్దంపడితే, ‘కొన్ని జీవితాలింతే’ ఓ ఏకాకి జీవితపు హృదయ స్పందనల్ని అక్షరీకరించింది. వియ్యాలవారి కయ్యాల్ని ‘ఎదురుకోట’ వైవిధ్యంగా వివరిస్తే, ‘వారికి కొంచెం నమ్మకమివ్వండి’ వ్యథాభరిత పరిస్థితుల్లో ఆశావాదాన్ని ప్రకటిస్తుంది. మనిషితనమే అసలైన మతమనే సిద్ధాంతాన్ని ‘నీడలు… నిజాలు’ మరోసారి గుర్తుచేస్తే, ‘వెంటవచ్చేది’ జీవన పరమార్ధాన్ని వెల్లడించింది. ప్రతి కథలో కొత్త మెరుపును దర్శింపజేయాలన్న రచయిత దృక్పథం మెచ్చదగినది.

—-కావూరి వంశీ విద్వత్, ఆదివారం అనుబంధం, 16th Feb 2014

వలయం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

***

వలయం on Kinige

 

Related Posts:

తెలుగు కథకు నీరాజనం-నవ్య నీరాజనం పుస్తక సమీక్ష

ఒకరా, ఇద్దరా…లబ్దప్రతిష్ఠులైన 50 మంది రచయితలు! కారా మాష్టారు మొదలుకొని ఆవంత్స సోమసుందర్‌, భరాగో, అబ్బూరి ఛాయాదేవి, పోరంకి దక్షిణామూర్తి… అంతా తెలుగు కథా కథనాన్ని కదను తొక్కించినవారే. ‘నాకు నచ్చిన నా కథ’ అంటూ వారే స్వయంగా ఎంపికచేసిన 50 కథాసుమాల్ని గుదిగుచ్చి, తెలుగుతల్లి కంఠసీమన హారంగా అలంకరించారు సంకలనకర్త. ఇందులోని ప్రతి కథా – రచయిత ఆలోచనలు, ఆకాంక్షలు, ఆవేదనలు, ఆపేక్షలను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తోంది. రచయితలు స్వయంగా కథాతరంగాన్ని వెల్లడించడం ఒక ఎత్తు, ప్రతి కథ ప్రారంభానికీ ముందు రచయితల హృదయాంతరంగాల్ని ఆవిష్కరించడం మరొక ఎత్తు. ఏ కథ, ఏ కథనం, ఏ కథాంశం గొప్పదంటే… దేనికదే ప్రత్యేకమైనది.

                                                                   —దత్తు, ఈనాడు ఆదివారం అనుబంధం, 16th Feb 2014

“నవ్య నీరాజనం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

 ***

నవ్య నీరాజనం on Kinige

Related Posts:

నానీల పరిశోధనా దిక్సూచి

విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనగానే కొంత తేలికభావం, నిరాసక్తత చోటు చేసుకున్న రోజులివి. ఒక పునరావాసం కోసం పిహెచ్‌డిలో చేరి వ్యక్తిగత పనులు చేసుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పరిశోధక విద్యార్థులున్న కాలమిది. ఇటువంటి ప్రాక్టికల్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్న దశలో ప్రముఖ కథారచయిత, పాత్రికేయుడు చింతకింది శ్రీనివాసరావునవ్య కవితారూపం నానీ-వివేచన’ అనే పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం కొంత విస్మయాన్ని, కొత్త ఆశను, సరికొత్త నమ్మకాన్ని అందిస్తుంది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తునుండి వచ్చిన ఈ సిద్ధాంత గ్రంథం నానీలపై వచ్చిన మొట్టమొదటి పరిశోధన కావడం విశేషం.

ఏదో ఒక పత్రికలో నానీలు చదివి ఆకర్షితుడైన చింతకింది వాటిపై పరిశోధన చేయాలనే తీవ్రమైన అనురక్తిలోకి వెళ్లడం ఆశ్చర్యం. అందుకోసం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ తెలుగు కరస్పాండెన్స్‌లో చేరడం, కాలేజీ కుర్రాళ్లా కాంటాక్ట్ క్లాసులకెళ్లడం, ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వడం, ఆ తర్వాత పిహెచ్‌డిలో చేరడం, థీసిస్ రాయడం, దాన్ని ముద్రించడం సామాన్యమైన విషయం కాదు. అదీ ఎంతో పని వత్తిడి ఉండే పాత్రికేయ వృత్తిలో వుంటూ ఇవన్నీ చేయడం అంటే చాలా పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ శ్రీనివాసరావులో నిండుగా వున్నాయి. అంతేకాదు మధ్యలో చదువు మానివేసిన వారికి ఈ వయసులో ఏం చదువుకుంటాములే అనుకునేవారికి, అన్ని సౌకర్యాలు, సమయాలు అందుబాటులో ఉన్న పరిశోధకులకు ఈ వ్యక్తి మార్గదర్శిగా స్ఫూర్తికారుడుగా నిలుస్తాడు.ఇక చింతకింది శ్రీనివాసరావు పరిశోధనలోకి వెళితే వీరి సిద్ధాంత రచన కూడా ప్రామాణికమైన పరిశోధనా పద్ధతులకు అనుగుణంగా, స్ఫూర్తిదాయకంగానే జరిగింది. ఒక సిద్ధాంత గ్రంథం గొప్పదనం అధ్యాయంలో విభజనల్లో తెలుస్తుంది. అలాంటి స్పష్టమైన పటిష్టమైన విభజన చేసుకున్నారు చింతకింది. పరిశోధన పేరుతో అనవసరపు సమాచారాన్ని కుప్పపోసి ఇచ్చే అధ్యాయాలు ఇందులో లేవు. చర్విత చరణాంశాలను విపులంగా వివరించే ప్రయత్నం చేయలేదు. రేఖామాత్రంగా ఆ విషయాలన్నీ మనకు అర్థమయ్యేట్లుగా సరళంగా పరామర్శించుకుంటూ వెళ్లారు. తన పరిశోధనను ఏడు అధ్యాయాలుగా చేసుకుని ప్రతి అధ్యాయంలో సూటిగా విషయ వివరణలోకి వెళ్లి విశే్లషణలు చేశారు చింతకింది.

ఇప్పటివరకు నానీల ప్రక్రియ పేరు మాత్రమే తెలిసి దాని నేపథ్యం, ఆవిర్భావం, వికాసం తెలియని వారికి, అసలు ప్రక్రియ అంటే ఏమిటి? లఘు ప్రక్రియల గురించిన స్థూల వివరాలు కథనాత్మకంగా సూటిగా మొదటి అధ్యాయం తెలియజేస్తుంది. ఇక నానీల్ని నాలుగు పాదాల్లో ఇరవై ఇరవై ఏడు అక్షరాల్లో రాయాలనే వౌలిక లక్షణాన్ని తెలుపుతూ వాటిలోని రూప నిర్మాణ శిల్పాన్ని, వ్యూహాల్ని రెండవ అధ్యాయం వివరిస్తుంది. ఇందుకోసం వీరు తీసుకున్న ఉదాహరణ పూర్వక నానీలు ప్రక్రియా లక్షణ నిర్మాణానికి బలమైన నిరూపణలుగా నిలబడతాయి. ‘ఒక రచనలోని కవితాత్మకతను, కవిత్వ సాంద్రతను గుర్తించడానికి భాష, భావం, వస్తువు, ధ్వని తదితర ఉపకరణాలు తోడ్పడతాయి’-అంటూ నానీల్లోని కవితాత్మను మూడవ అధ్యాయంలో విశే్లషించారు. ఇందుకోసం వారు ఎన్నుకున్న నానీలు చదివితే నానీలు ఎందుకు పాఠకులను ఆకట్టుకున్నాయో అర్థమవుతుంది. అందుకే సామాన్య పాఠకుల్ని సైతం కదిలించగల శక్తి ఈ ప్రక్రియకు నిసర్గ లక్షణమైంది అని పరిశోధకుడు సరైన అంచనా వేయగలిగారు.కవిత్వం వర్తమానానికి అద్దం లాంటిది. భవిష్యత్ తరాల వారికి చరిత్రను నిష్పాక్షికంగా తెలుసుకోవడానికి కవిత్వం విశ్వసనీయ భావోద్వేగ ఆధారంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నానీలు కూడా సమకాలీనతను ప్రతిబింబించడంలో ముందు వరసలో ఉంటాయి. తెలుగు సాహితీ రంగంలో నానీలు ప్రవేశించిన కాలంలో, తదనంతరం అవి ప్రజాదరణ పొందుతున్న వేళవరకు మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని చింతకిందివారు నిశితంగా పరిశీలించారు.

ఆ పరిశీలనా ప్రతిఫలనాలు స్థానికంనుండి అంతర్జాతీయం వరకు నానీల్లో ఏ విధంగా ప్రతిఫలించాయో ‘నానీలు సమకాలీనత – కేశీయత’ అనే నాల్గవ అధ్యాయంలో విస్తృతంగా లోతుగా చర్చించారు. సమకాలీనత నానీల కవిత్వానికి ఆరవ ప్రాణంగా అభివర్ణించారు. ఈ అధ్యాయంలోనే మరో పార్శ్వంగా నానీల్లోని దేశీయతను, స్థానీయ మూల్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సంపూర్ణమైన దేశీయ సాహితీ విభాగానికి చెందిన ప్రక్రియగా నానీలనీ, అందుకనుగుణమైన లక్ష్యాత్మక నానీల్ని విభిన్న కోణాల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకోసం చింతకింది చేసిన వ్యాఖ్యానం ఆర్ద్రంగా మనల్ని పలకరిస్తుంది. నిజానికి దేశీయత-స్థానికతలపై ప్రత్యేక అధ్యాయాలుగా రాయవలసినంత పరిధిగల అంశాలు.భరతావనికి గ్రామాలు సహజ చిరునామాలు. సాహిత్యకారులకు వౌలిక స్ఫూర్తిని అందించే నేపథ్య కేంద్రం గ్రామం. నానీల్లో గ్రామీణ వాతావరణం విస్తృతంగా చిత్రితమైంది. ఇందుకు ప్రధాన కారణం నానీల కవుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన వారే. పల్లెసీమల్లో వస్తున్న మార్పుల్ని దగ్గర్నుండి గమనించినవారే. అందుకే చూసింది చూసినట్టుగా నానీల్లోకి అనువదించారు. ఈ విషయాల్ని చింతకిందివారు ‘‘నానీల్లో పల్లె-ప్రపపంచీకరణ, మానవీయత’ అనే ఐదో అధ్యాయంలో సంక్షిప్తంగా వివరించారు. ప్రపంచీకరణ, మానవీయత అనే అంశాలపై వచ్చిన నానీల్ని కూడా ఇదే అధ్యాయంలో పరిశీలించారు. పరిశోధకుడు గ్రంథ విస్తరణ భీతితో అధ్యాయాల్ని సంక్షిప్తీకరించుకుని పఠన సౌలభ్యం కోసం చేసిన కసరత్తుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులోని నానీలను చదివితే మూల నానీల కవితా సంపుటాలను చదవాలనే ఆసక్తి ఏర్పడుతుంది.ఆధునిక కవిత్వంలో ఎన్నో వాదాలు, ధోరణులు ఉన్నాయ్. అవన్నీ నానీల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా స్ర్తివాద సిద్ధాంతాల్ని బలంగా ప్రతిఫలించేట్టుగా సుమారు ఇరవై మంది కవయిత్రులు రాసిన నానీలపై ‘నానీల్లో స్ర్తి-తాత్వికత’ అధ్యాయంలో చర్చించారు. వచన కవిత్వంలో స్ర్తి హృదయ సంవేదన ఎంత గాఢంగా అభివ్యక్తీకరించబడిందో ఆ స్థాయిలో స్ర్తివాద ధోరణులు నానీల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని చింతకిందివారు నిరూపణ చేశారు. మనిషి జీవితంలో అనివార్యమైన తాత్విక చింతన గురించి నానీలను ఇదే అధ్యాయంలో రేఖామాత్రంగా పరామర్శించారు. నానీల్లోని తాత్విక వేదన లోతులనూ స్పర్శిస్తూ నానీ కవుల తాత్త్విక చైతన్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు పరిశోధకుడు.ఏ ప్రక్రియకైనా వస్తువైవిధ్యమే ప్రధాన బలం. ముఖ్యంగా నానీల్లాంటి లఘు ప్రక్రియకు వస్తువే ప్రధానాంశం. ఈ కీలకాంశాన్ని పరిశోధకుడు గుర్తించాడు. కవుల గుండెలోతుల్లోంచి గంగాధారలా పైకి వచ్చిన నానీల్లో వస్తువైవిధ్యం సామాన్యమైంది కాదు.

‘నానీల కవులు ముట్టని కవితా వస్తువు లేదు, చుట్టని లోకం లేదు. జీవితం అనే విశాలమైన సాగరాన్ని నానీల్లో ఇంకిపోయేలా చేయగలిగారు’’ అంటూ ‘నానీల వస్తువైవిధ్యం’ అనే ఏడో అధ్యాయంలో పరిధిమేరకు సమగ్రంగా వివరించారు. ఒక కొత్త ప్రక్రియ రావడం, అది పదిహేనేళ్లకుపైగా కొనసాగుతూ ఉండడం, రెండు వందల కవితా సంపుటాలు వెలువడడం, ఇంకా గ్రంథ రూపంలోకి రాని నానీలు, కవులు అసంఖ్యాకంగా వుండడం అనే అద్భుతాన్ని ప్రశంసిస్తూ నానీల రూపకర్త డా.ఎన్.గోపి గారిని ఎందుకు నానీల కవులంతా అభిమానంగా ‘నానీల నాన్నగారని’ పిలుచుకుంటారో చెప్పిన తీరు ఔచిత్యవంతంగా, ఆమోద యోగ్యంగా ఉంది.చింతకింది వారి పరిశోధన సాంతం ఏకపక్షంగా, ప్రశంసాపూర్వకంగానే నడవలేదు. ఈ సిద్ధాంత గ్రంథం ఉపసంహారంలో అతనిలోని నిష్పాక్షిక పరిశీలకుడు, విమర్శకుడు నిష్కర్షగా కనిపిస్తాడు. నానీల లక్షణాలను పాటించకుండా నియమోల్లంఘన చేసిన నానీలను ప్రస్తావించాడు. నానీల ప్రక్రియపైన, నానీలు రాస్తున్న కవులపై వచ్చిన విమర్శలను యధాతథంగా ఉటంకించాడు. ఆ విమర్శలకు ప్రతిగా వచ్చిన సమాధానాలను, వాదనలను వినిపించాడు. వీటిని నిశితంగా విశ్లేషిస్తే నానీలపై వచ్చిన విమర్శలు సాహిత్య పరమైనవా, సాహిత్యేతర కారణాలపై, వైయక్తిక విభేదాలపై వచ్చినవా అనే సత్యం వెల్లడవుతుంది. వీటన్నింటిని పరిశోధకుడు సంయమనంతో పాఠకుల ముందుంచాడు.చివరగా నానీలు ఏ ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి, నానీల ఎదుగుదల, నానీల సదస్సులు, నానీల అవార్డులు, నానీల వర్తమాన స్థితి, భవిత మొదలైన అంశాలన్నింటిని వివరిస్తూ తన పరిశోధనకు ఒక సమగ్ర స్వరూపాన్ని అందించే ప్రయత్నం చేశారు చింతకిందివారు. 1998 నుంచి 2007 వరకు దశాబ్ద కాలంలో వెలువడిన 112 నానీల సంపుటాలను పరిశోధనకు ప్రమాణంగా తీసుకున్నారు. అయినా అక్కడి వరకే ఆగిపోకుండా 2013లో వచ్చిన 200వ నానీ సంపుటి ‘సిరిమాను నానీలు’ వరకు నానీల గ్రంథాల జాబితాను, తను సంప్రదించిన ప్రతి చిన్న సమాచార వివరాలను ఉపయుక్త గ్రంథ సూచికలో ఇవ్వడం పరిశోధకుడి శ్రమకు, అంకిత స్వభావానికి నిదర్శనం. తన ముందున్న విస్తృతమైన వివరాలను, విశేషాలను, కొటేషన్లను ఎక్కువగా వాడుకోకుండా తన పరిశీలనను, విశ్లేషణకు ప్రాధాన్యమిచ్చారు పరిశోధకుడు. పరిశోధనలో ఇది ఒక మంచి ప్రయత్నం. చేయి తిరిగిన కథకుడిననే స్పృహ, ఎన్నో ఆలంకారిక కథనాలు అందించిన పాత్రికేయ వృత్తికార్మికతను పక్కనపెట్టి అకడమిక్ ప్రమాణాలకు లోబడి పరిశోధక విద్యార్థిగా-బాధ్యతాయుతంగా చేసిన పరిశోధన ఇది. ప్రత్యేకంగా ఏ రాగద్వేషాలను పెట్టుకోకుండా విషయానికే ప్రాధాన్యతను ఇచ్చాడు.

ఈ గ్రంధాన్ని ఒక పరిశోధనా గ్రంథంగా కాకుండా అద్భుతమైన కవితా గ్రంథంగా కూడా చదువుకోవచ్చు. నానీలపై పరిశోధన చేయాలనుకునే వారికి, నానీలు రాయాలనుకునే వారికి ఈ గ్రంథం బహుళార్ధక దిక్సూచిగా ఉపయోగపడుతుంది!

డా.ఎస్.రఘు , ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీ, 25 మే 2013

* * *

“నవ్య కవితారూపం నానీ – వివేచన” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్నివివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
నవ్య కవితారూపం నానీ – వివేచన On Kinige

Related Posts:

నా యెఱుక – శ్రీ ఆదిభట్ల నారాయణదాసు స్వీయ చరిత్ర పై సమీక్ష

‘కథ’ యెఱుక గలిగినవాడి కథ – అనే శీర్షికతో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన సమీక్ష ఇది.
హరికథ అనగానే మనకందరికీ జ్ఞప్తికి వచ్చేది ఆదిభట్ల నారాయణదాసుగారి పేరే. పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ట(ట్ల) నారాయణదాసు (1864-1945). దాసుగారు నవరస భరితమైన నవ హరికథా ప్రక్రియకు ఆద్యులు. దాసుగారి కన్నా ముందు ఎందరో హరికథలు చెప్పారు. కానీ, అపర శారదాదేవిగా పేరొందిన దాసుగారితో హరికథకే గొప్ప గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. నా యెఱుక అనేది దాసుగారి స్వీయ చరిత్ర. ఇది లోగడ పుస్తక రూపం దాల్చి ప్రచురించబడినా, నేడు అందుబాటులో లేని కారణంగా గుంటూరు మిత్రమండలి వారు ఎంతో సాహసం చేసి మళ్లీ వెలుగులోకి తెచ్చారు. దాసుగారు రచించిన వారి యెఱుక 7 అధ్యాయాలు కాగా, పానుగంటివారు, చెళ్లపిళ్లవారు, దువ్వూరి శాస్ర్తీగారు, శంకర రామారావుగారు, పాతూరిగారు దాసుగారిపై వ్రాసిన వ్యాసాలూ పాఠకులకు ఎంతో విలువైన సమాచారాన్నిస్తాయి.
‘సుందర రూపము దృష్టికి, సంగీతమూ చెవికి, సువాసన ఘ్రాణమునకు, సుస్పర్శము శరీరమునకూ, మంచి చవి జిహ్వకు నభీష్టములు కదా!’ అన్నారు దాసుగారు. ఇవన్నీ వేర్వేరుగా అనుభవించే సుఖాలు. ఐతే, దాసుగారి సమక్షంలో అన్నీ ఒకేసారి అనుభవంలోకి వచ్చేవట. వారి జీవితంలో లోక సామాన్యమైన తీరూ, అలౌకికమైన అద్భుత శక్తీ మిళితమై ఉండేది కాబట్టే, గాంధర్వ గానామృతపేయంగా హరికథలు చెప్పగలిగారు. దాసుగారిలో అసాధారణ శక్తులుండేవి. అవన్నీ స్వభావసిద్ధంగా వచ్చినవే. దానికోసం ఆయన గురుశిక్షణ ఏదీ పొందలేదు. ఆట, పాట, ఆశుధార, అసాధారణ పాండిత్యం- వీటన్నిటినీ మించిన ధైర్యం దాసుగారి ఖ్యాతికి కారణాలు. సంగీత సాహిత్యాలూ, వేదమూ వారి కుల విద్యలు. మిగిలినవన్నీ ఆయన అశ్రమంగా నేర్చుకున్నవే. దేశీ సంగీతంతోబాటు ఆయనకు మార్గ సంగీతమూ కొట్టిన పిండే. హిందూస్థానీ సంగీతాన్ని సైతం అలవోకగా పాడేవారాయన. ఈ స్వీయ చరిత్రను గ్రాంథికంలోనే వ్రాసినా ఇప్పటికీ చదవడానికి ఇబ్బందిగా లేకపోవడం గమనార్హం.
అసలు హరికథలు ఎందుకు చెప్పాలని దాసుగారికి అనిపించిందో తెలియాలంటే 27, 93 పేజీల్లో దాసుగారే చెప్పడాన్ని మనం చదివి తెలుసుకోవచ్చు. అంబరీషోపాఖ్యానం ఏకబిగిన రచించి, గానం చేసిన రీతి దాసుగారి ప్రతిభకొక ఉదాహరణ మాత్రమే (పేజీ 101). దాసుగారు ఒకసారి విక్రమోర్వశీయం నాటకంలో రాజు పాత్ర వేసి అందరినీ ఆకట్టుకున్నారట (పేజీ 122). దాసుగారి కవితాశక్తి పరీక్ష, విజయం పొందిన రీతి గురించి చదివితే పాఠకులకు ఆశ్చర్యం కలగక మానదు (పేజీ 123). అలాగే, దాసుగారి క్లాస్‌మేట్స్ గురించి, విద్యాభ్యాసం గురించి వ్రాసిన అంశాలు పాఠకులను అలరిస్తాయి.
దాసుగారికి వ్యవహారిక భాష అన్నా, వితంతు వివాహాలన్నా గిట్టేది కాదు. తెలుగులో ఏమి వ్రాసినా గ్రాంథికంలోనే ఉండాలన్నది దాసుగారి అభిప్రాయం. బహుశా దీనివల్లనే దాసుగారికి వీరేశలింగం పంతులుకి వైషమ్యమేర్పడిందిలా ఉంది. దాసుగారు నా యెఱుక పేరుతో స్వీయ చరిత్ర వ్రాస్తున్నారని తెలుసుకొన్న వీరేశలింగం, ఆయనకన్నా ముందుండాలని తన స్వీయచరిత్ర వ్రాసి ప్రచురించారట. ఈ స్వీయ చరిత్రలో వీరేశలింగంతో జరిగిన మరో సంఘటనను దాసుగారు వ్రాసుకున్నారు. దానికి వీరేశలింగం పేరును ప్రస్తావించకుండా విచిత్ర వివాహకర్త విచిత్ర రచన అని చెప్పారు. ఈసప్ ఫేబిల్స్ (ఈసప్ కథలు) లో కొన్నిటిని తెలుగు చేయమని దాసుగారిని భీముడు అనే ఆయన బావగారు కోరగా, దాసుగారు 100 కథలను తెనిగించి, చివరన 4 పాదాలలో కథనీ, నీతిని ఇమిడ్చి గీతాలను నూఱుంగంటి అనే పేరుతో వ్రాశారు దాసుగారు. దానిని భీముడు వీరేశలింగం ప్రెస్‌లో ముద్రణకు ఇవ్వగా ఆయన ఆ పుస్తకాన్ని వెలుగులోకి రానీకుండా అదే తీరులో తాను వ్రాసి ఈసప్ కథలను ప్రచురించుకొన్నాడట (పేజీ 144- గొప్పవాళ్లుగా చెలామణి కావాలంటే ఆ మాత్రం చేయాలేమో?). మరో సందర్భంలో ఆయన హరికథలను చిన్నబుచ్చి మాట్లాడగా, దాసుగారు సరైన రీతిలో సమాధానాన్నివ్వడం కూడా మనం చదవొచ్చు (పేజీ 161).
మహారాజుల సమక్షంలో ఎన్నో హరికథలు చెప్పినా ఎవరికీ చేతులు జోడించడం గానీ, వారిని ‘యువర్ హైనెస్స్’అని గానీ ఎరుగని ధైర్యశాలి ఆయన. ఆ ఆత్మవిశ్వాసమే ఆయన్ని నడిపించింది. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి హరికథలు చెప్పి మెప్పించిన దాసుగారు అవసరమైనపుడు ఇంగ్లీషు వివరణలనీ ఇచ్చేవారు. అంతేకాదు. టికెట్టు పెట్టి అష్టావధానం జరిపిన ఘనత దాసుగారిది (పేజీ 134). అన్నట్టు, దాసుగారి ఇంగ్లీష్, తెలుగు సంతకాలనూ ఈ పుస్తకంలో చూడొచ్చు (పేజీ 170). ఇక అనుబంధంలో హరికథ గురించి దాసుగారు స్వయంగా వ్రాసిన వ్యాసం అందరూ చదవాల్సిందే. వారు 70 ఏళ్ల వయస్సులో సంక్షిప్తంగా నామాట అనే శీర్షికన వ్రాసిన స్వీయచరిత్ర ద్విపద కూడా ఈ పుస్తకంలో చోటుచేసుకుంది (పేజీ 207). దాసుగారి పాండితీ వైభవాన్ని తెలిసిన రాజుగారు దాసుగారు పాడగా గ్రామఫోను రికార్డుచేశారు (పేజీ 188), కానీ అది మనకు దక్కకపోవడం నిజంగా విషాదకరం.
ఇంతకీ దాసుగారి నా యెఱుక ఎందుకు చదవాలి అని అడిగేవారికి జవాబు ఒక్కటే. ఆ కాలంలో చేతిలో పావలా లేకపోతే పెద్ద చదువులు చదవలేక ఎలాటి బాధపడాల్సి వచ్చేదో తెల్సుకోవాలన్నా వారి బాల్య యవ్వన దశల సంధికాలంలో అధ్యయన రీతుల్లోనూ, సంప్రదాయ నిరతిలోనూ వచ్చిన పెను మార్పులేమిటో తెల్సుకోవాలన్నా నా యెఱుక చదవాలి. అంతేకాదు. లోకంలో అనుకూల శత్రువులు, కృత్రిమ స్వభావులు మోసాలకెలా పాల్పడతారో తెల్సుకోవాలన్నా నా యెఱుక చదవాలి. అలనాటి అచ్చతెనుగు పద ప్రయోగాలను ఆస్వాదించాలన్నా కూడా నా యెఱుకను తప్పక చదవాలి. ఒకటి కాదు, రెండు కాదు. ముప్ఫైఏళ్ళ దక్షిణాపథ చారిత్రక, సాంస్కృతిక విషయాలనన్నిటినో నా యెఱుక చెబుతుంది. అంతేకాదు. దాసుగారి జీవనశైలిని తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఇతోధికంగా ఉపకరిస్తుంది.
చక్కని ముద్రణ, సందర్భోచితంగా దొరికిన మేరకు ఛాయాచిత్రాలు, ఈ తరం వారికి ఇబ్బందిలేకుండా వివరణనిస్తూ ఫుట్‌నోట్స్- అన్నీ ఈ పుస్తకానికి సంపాదకులైన రవికృష్ణగారెంత శ్రమించారో చెప్పకనే చెబుతాయి. అలాగే గిరిధర్‌గౌడ్‌గారు వేసిన దాసుగారి ముఖచిత్రం పుస్తకానికి నిండుదనాన్నిచ్చింది. అట్టవెనక, కరుణశ్రీ పద్యం దాసుగారి గొప్పదనాన్ని గురించి చెప్పకనే చెబుతుంది. డిటిపి కాలంలో కూడా తప్పొప్పుల పట్టిక ఇవ్వడం విచిత్రంగా తోచినా, అది సంపాదకుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
నా యెఱుక- తొలి ముద్రణ ఎపుడు వచ్చింది, ఆ పుస్తకం తాలూకు ముందుమాట, కవర్ పేజీ వంటి వాటికి కూడా ఈ పుస్తకంలో కాస్త చోటు ఇచ్చివుంటే బాగుండేది. అలాగే, దాసుగారి పూర్తి బయోడేటాను తొలి పుటల్లో ఇచ్చి ఉండాల్సింది. వారి కుటుంబం గురించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. అటు దాసుగారూ ప్రస్తావించలేదు. సంపాదకులవారూ ఏమీ చెప్పలేదు. దాసుగారు దాదాపు డజను హరికథలను రచించి, గానం చేశారు. అవి ప్రస్తుతం అందుబాటులో లేవనే చెప్పాలి. ఈ పుస్తకం మనవి మాటల్లో చెప్పినట్లు, దాసుగారి హరికథలను కొద్దిపాటి వ్యాఖ్యానంతోనైనా సరే తిరిగి అన్నిటినీ ఒక సంకలనంగా వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వీక్యూబ్ రమణ
అక్షర, ఆదివారం ఆంధ్రభూమి, 23 సెప్టెంబర్ 2012

* * *

“నా యెఱుక” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా తక్కువ ధరకి ప్రింట్ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
నా యెఱుక On Kinige

Related Posts:

బహుముఖీన వస్తు ప్రకటన శైలజామిత్ర కధానికల సంపుటి ” అడ్డా”

ఈనాటి తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితమయిన పేరు శైలజామిత్ర. సంగీత సాహిత్యాలలో ఉన్నత విద్యా అర్హతల్ని సాధించి, ఆయా రంగాలలో తనదైన ముద్రతో విశేష ప్రశంసల్ని పొందుతున్న విదుషీమణి ఆమె. అనువాద ప్రక్రియలలోనూ ఆరితేరిన చేయి అమెది. కవిత్వం, కధ నవల, సమీక్ష వంటి సాహిత్య ప్రక్రియల్లో ఇబ్బడి ముబ్బడిగా కృషి చేస్తూ చదవరులకి తన రచనా సాదు ఫలాలను అందిస్తున్నారు. ఉషోదయ వెలుగు పత్రికలో ‘మానవీయం’ అనే అంశంపై 48 సామాజిక వ్యాసాల్ని వెలువరించారు. భక్తి రంజనిలో ‘ఆధ్యాత్మికం-జీవితం’ శీర్షికన 54 వ్యాసాలు రాసారు. బాలసాహిత్యంలో ‘నేలపైని నక్షత్రాలు’ అనే నవల telugupoetry.com ద్వారా పాటకులకు అందించారు. శ్రీ వెంకటేశాయ నమహా: అనే మాసపత్రికలో పన్నెండు భక్తి గేయాలు రచించారు. ఇక బహుమతులు, అవార్డులు, సన్మాన సత్కారాలు అనేకం ఆమె ప్రతిభా స్వరాన్ని, ప్రజ్ఞా దురంధరత్వాన్ని వరించాయి. శైలజామిత్ర ఇదివరలో ఆరు కవితా సంపుటాలను, తరంగాలు పేరున ఒక కధా సంపుటి ప్రచురించారు. విస్త్రుత అధ్యయన శీలం ఆమె నిరంతర రచనా కృషికి ఎత్తిన జయపతాక.
శైలజామిత్ర రెండవ కధా సంపుటి ‘అడ్డా‘ ఆమె ‘అక్షరం నా ఆత్మాయుధం, సాహిత్యంతోనే నా సహచర్యం’ అనే లక్ష్య శుద్ధిని ముందుమాటగా కూర్చుకుని వచ్చింది కధానికా సంపుటి. పుస్తకంలో 20 కధలున్నాయి. అన్నీ ఇదివరలో వివిధ పత్రికల్లో ప్రచురింప బడినవే. వీటిలో కొన్ని బహుమతులు పొందిన కధానికలు.
సంపుటిలో ముందుగా చెప్పుకోవలసిన అంశం వస్తు వైవిధ్యం. వర్తమాన సామాజిక (దుః)స్థితికి ‘మనిషి’ బహిరంతర సంఘర్షణకి, దర్పణం పడుతూ అన్ని కధాంశాలు మనల్ని అంతర్ముఖీనం చేస్తాయి. ఆలోచన ప్రేరకంగా నిలుస్తాయి.
‘అడ్డా’ మీది కూలీల్లో పూట గడుపుకోవడానికి పడే యాతనల మధ్య మనిషి బలహీనతలుగా బయటకు వచ్చే ఈర్ష్యాసూయలు, ఎత్తుజిత్తులు తెరమీద కనబడుతూ ఉంటాయి.అయితే, వాటి వెనుక ఉన్న మానవీయ సహజాతులుగా దయ, పరోపకారం వంటి గొప్ప గుణాలు అవసరానికి ప్రచోదితాలై సహాయాన్ని సహకారాన్ని అందిస్తాయి. ‘అడ్డా’ లోని ఇతివృత్తం ఇదే. గుడిసెలు తగలబడుతుంటే ప్రాణాల్ని మాత్రం లెక్కచేయని తీరున గంగమ్మ పిల్లల్ని కాపాడింది బాలమ్మ. ఈ గంగమ్మే బాలమ్మను పక్కకు తోసి, తిట్టిపోసి ఆమె బదులు కులికి పోయిందా రోజు! స్థానీయత, దేశీయత, సహజత్వం, వాస్తవికత , కలిగిన మంచి కధ. భాష శైలి కూడా పానిపట్టు దగ్గరికి వెళ్ళటం వలన కధకొక శిల్ప గుణ వైశిస్త్యాన్ని కుర్చాయి.
భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, దూరంలో ఎవరో వ్యక్తి చనిపోయినట్లు తెలిసాక ఆ వ్యక్తి తన భర్త ఏమో అనుకోని తల్లడిల్లి పోతుంది అంజలి. ఆయనగారు అప్పుల వాళ్ళ నుంచీ తప్పుకోవడానికి ఎటో వెళ్ళాడు! భార్య ప్రేమకు చలించి తన తప్పును గ్రహిస్తాడు భర్త. కధ పేరు ప్రేమాంజలి!
భార్యకు కూడా మనసుంది అని భావించే భర్తలు, కోడలు పరాయి వ్యక్తి కాదు కుటుంబంలో భాగం అని భావిన్చాగలిగే అత్తలు ఉంటే ఈ సమాజం ఇంతకంటే ఆనంద దాయకంగా ఉంటుంది కదానే సంవేదనకు అక్షర రూపం “సరికొత్త సూర్యోదయం” కధ. రచనా పరంగా ఇందులో మాధవి పాత్ర మనస్తాత్విక విశ్లేషణకు మంచి ఉదాహరణగా నిలిచింది.
కొన్ని వర్తమాన సమాజ ధోరణుల మీద ధర్మాగ్రహాన్ని ఎంతో నిశితంగా చూపారు శైలజామిత్ర. ముందు మాటలో వేదగిరి రాంబాబు గారు అన్నట్లు సమాజ ఉద్దరణ కోసం మనుషుల కన్నా ఆయుధాలే ముందు ముందు పనికి వస్ద్తాయని డైరెక్ట్‌గా సూచనా చేసారు. ఆ కధపేరు ” జాతర”
‘బతుకుమోపు’ కధానిక రైతు కష్టాల్ని కన్నీళ్ళనీ ఆర్ద్రంగా స్పృశించి రేపటి శుభోదయం పట్ల ఆశా భావాన్ని ప్రోది చేస్తుంది. డబ్బు వర్సెస్ మానవ సంబందాలు: భక్తి వర్సస్ మోసాలు వంటి అమానవీయ స్థితిగతుల పట్ల తమ భాధా తప్త హృదయానికి అక్షరీకరణం చేసారు రచయిత్రి. కధానిక పేరు “కాలగమనం”
‘అడ్డా’ కధా సంపుటి నిండా మనకు తెలిసిన పరిస్థితులున్నాయి. అవాంచనీయమైన మనస్తత్వాలున్నాయి. మనుషులున్నారు. సమాజంలోని అస్థవ్యస్థత ఉంది. మనుషుల్లోని ప్రవర్తనా సంకీర్ణత ఉంది. ‘ ఇది మంచిది కాదు’ అనే ప్రభోదించే దృశ్య కరణ౦ ఉంది. ‘ ఇది ఇలా ఉంటే మనం మరికొంత హాయిగా ఉండగలం అనే సూచనా చేస్తే ధైర్యాభివ్యక్తీకరణం ఉంది. చీకటిని ద్వేషిస్తూ చీకట్లోనే కుర్చుని బతుకులు తెల్లర్చుకునే బలహీనుల కంటే చీకటి కావాలి, గోరంత వెలుగును పట్టుకుని గట్టుకు చేరే ఆత్మ విశ్వాసం కలిగిన అభిమాన దనులు ఎక్కువగానే ఉన్నారు.
కధానికా నిర్మాణానికి ఒక ఖచ్చితమైన ఒరవడిని పెట్టుకున్నారు శైలజామిత్ర. ఆమె కధలన్నీ ప్రశ్నల్ని రేపుతూ మొదలవుతాయి. వాటి విశ్లేషణతో మొదలవుతాయి. వాటికి సంభావ్యతతో కూడిన సమాధానంతో ముగుస్తాయి. ఆ సమాధానం పరిష్కారం కాకపోవచ్చు. జీవితం అన్ని సందర్భాలలో వడ్డించిన విస్తరి కాదు కదా? ఈ తెలివి కలిగిన రచయిత్రిగా శైలజామిత్ర తన జ్ఞాన గంగని మనకు అందించారు.
కధా శిల్ప పరంగా ‘అడ్డా’లో కధలన్నీ చదివించే గుణంతో మెరుపు లీనుతున్నాయి. కొన్ని వ్యాస కధల్లా ఉన్నా, లేక కధా వ్యాసాల్లా ఉన్నా వస్తైక్యతని కోల్పోని గుణం వాటిని మంచి కధలుగా నిలుపుతోంది. శైలజా మిత్ర ప్రతి కధ పాటకుని హృదయాన్ని ఆత్మీయంగా ఆర్ద్రంగా పలకరిస్తుంది. అదే ఆమె రచనా విజయం.
‘అడ్డా’ని కొని చదివి ఆనందించండి

సమీక్షకులు: విహారి

* * *

“అడ్డా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అడ్డా On Kinige

Related Posts:

నాకు తెలియని నేనెవరో

పుస్తకం పేరు చూస్తే, ఒక తాత్వికుడు, వేదాంతి ‘నాన్‌ ఏర్‌’ అనుకుంటూ దర్శనమిచ్చే అరుణాచల రమణ మహర్షి గుర్తుకు వస్తారు. ముకుంద రామారావుగారు అలాంటి తాత్విక జిజ్ఞాసాపరుడా? అన్న అనుమానం కల్గుతుంది. కవితా సంకలనాన్ని పూర్తిగా చదువితే, మనిషికి ఇలాంటి జిజ్ఞాస అప్పుడప్పుడూ కలుగుతూనే ఉంటుంది; అది తాత్విక పరిధిని ఒరుసుకొని ఒక్కొక్కప్పుడు, కవిత్వపు ఆవరణలో నుంచి పుట్టినట్టు మరికొన్ని చోట్ల కనబడుతుంది.
కవిత్వాన్ని గురించీ, ముఖ్యంగా తమ కవిత్వాన్ని గురించీ చెప్పుకున్న తెలుగు కవులెందరో ఉన్నారు. నన్నయ, తిక్కన, శ్రీనాథుండు, పెద్దన అలా చెప్పుకున్నవారే. ఆధునిక కవి ఆరుద్ర కూడ ‘సాహిత్యోపనిషత్‌’ అని కవిత్వ తత్వాన్ని ప్రయోజనాన్ని ముగ్గురు కవుల మధ్య జరిగిన చర్చలా ప్రదర్శించాడు.  శ్రీ ముకుంద రామారావుగారు సంకలనానికి ఉపోద్ఘాతంలో తనకు కవిత్వమంటే ఎట్టిదో వివరిస్తూ వ్రాశారు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి కవిత్వ తత్వం. అది నిత్య నూతనం, నిరంతరం సాగే ప్రక్రియ.  స్వచ్ఛంగా ఉండలి, మనస్సుకు స్వాస్థ్యం కల్గించాలి. ఆనందం దాని లక్ష్యం అని అనలేదు కాని, అది ఆనందాన్ని కల్గిస్తుంది. రెండవది తనకు కవిత్వం తన్ను తాను తెలుసుకునే సాధనం అంటారు. అంటే కవికి నాకు తెలియని నేనెవరో తెలుసుకోవడనికి కవిత్వం తలుపులు తెరుస్తోందన్న మాట.
కవిత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దానిని కవి కవిత్వా భాషలోనే చెపుతూ తన కవిత్వ స్వభావాన్ని ప్రతిఫలింప జేస్తాం. ఇందులో కూడ అలాగే ఉంది ఆయన కవిత్వం.
‘వెన్నెల అడవిలోకి చొచ్చుకుపోతున్నట్లు
ఎదురు చూస్తున్న మొక్కలకు నీళ్లు పోస్తున్నట్లు’ ఉంటుందట;
ఇందులో కూడ కవి తన కవితలోని సొగసు ఎవ్విధంగా ఉంటుందో, తానెట్టి సున్నిత హృదయ స్పందనలకు లోనవుతాడో, రుచి చూపుతున్నాడు.
కవిత్వానికి భాష ఒక పరికరం. భాషకు రెండు లక్షణాలుంటాయి. శబ్దానికి అర్థమే కాకుండ నాదమూ ఉంటుంది. అదీగాక శబ్దాలను నేర్పరి కూర్చగా ఒక బొమ్మ పుట్టుకొస్తుంది. మొదటి లక్షణం వల్ల కవిత్వం రీతి మార్గాన సాగిపోతుంది. శబ్ద మాధుర్యానికి ముగ్ధుడైన కవి, ఆ మాధుర్యమే కవిత్వమని భ్రమించి, పర్యవసానంగా అర్థం వచనం స్థాయికి దిగిపోవచ్చునని గ్రహించడు. అందుకే అట్టి రచనను అభిజ్ఞుడైన భావకుడు కవిత్వమని అంగీకరించడు.
ఇక కవిత్వంలో మాటలతో బొమ్మను కట్టించే లక్షణం అనాదికాలం నుంచీ అంగీకరింపబడుతూనే ఉంది. అసలు కవిత అనేది నిన్ను పల్కరించే చిత్రం, మాటాడే బొమ్మ. కవితలో దీనిని కనపరచం అంత తేలిక కాదు. దీనికి కవి ఎంతో సాధన చేయాలి. ఆయన మనసున అచేతన వస్తువులు చేతనంగాను, చేతన వస్తు సముదాయం బొమ్మల కొలువుగాను కవికి దర్శనమివ్వాలి. ముకుంద రామారావు గారు దీనిని సాధించిన కవి.
‘ఇంట్లో అందరికీ’ (22) అన్న కవిత చిన్నారులకు ఏమొచ్చినా, ఇంట్లోని వారందరి మనస్థితి ఎలా ఉంటుందో స్నిగ్ధ మనోహరంగా తెలియజేస్తుంది. సజీవమైన బంధు, స్నేహవర్గమే కాదు – ‘నిర్జీవమైన ఇంటితో బాటు చిందరవందరగా వున్న బొమ్మలు సైతం చిన్నారుల చేతుల్లో ఎగిరెగిరి గంతులేయడానికి ఇంటినంతా వెలిగించడానికి దీనంగా ఎదురు చూస్తుంటాయి’
ఇందులో విషాదం ఛాయా మాత్రంగ ఉండడమే కాక, దీనివల్ల గుండెలో కారు చీకట్లు ఆక్రమించుకుంటాయి. సహజంగా, క్లుప్తంగా, గాఢంగా ఉన్న కవిత ఇది.
అసలు ముకుంద రామారావు గారు హృదయ కవి. ఆయన కవితల్లో గుండెల స్పందనలు  వినిపిస్తూనే ఉంటాయి. ‘చెట్లు’ (26) కవితను చూడండి. అవి చెట్లు కాదు ‘ఎవరు పెంచిన పిల్లలో!’ అవి. ఆకాశంలో ‘కొమ్మల చెలతో మేఘాల చిత్రాలను గీస్తాయట!’ అంటే చెట్లు పర్యావరణ పరిరక్షణ బాధ్యత స్వీకరిస్తూ, వానలు కురవడనికి కారణమవుతాయన్న లౌకికార్థాన్ని వెలికితీయడం ఆ చెట్ల ముగ్ధ సచేతన స్థితిని మైలపరచే అభావకుని లక్షణం. అసలు ‘ఈ మేఘాలేమిటో’ (34) కవితను చూడండి. మనకు తెలియని, కవికే తెలిసిన ఈ మేఘాలకెంత అహంకారం! ఎందుకలా కళ్లల్లో నీరు తిరుగుతున్నా, బయట పడకుండ తమాయించుకుంటాయి? ఉన్నట్టుండి అలా ఎందుకు భోరున ఏడుస్తాయి? తనంత ఎత్తుకి ఎదిగిన చెట్లని, కొండల్ని ఆత్మీయంగా అలా గుండెలకు హత్తుకుంటాయి అంటూ, ఇలా అచేతన వస్తుజాలానికి చైతన్యాన్ని కల్గిస్తూ, వానినొక చిత్రశాలగా అలవోకగా చూడడం ఈ కవితలోని వైశిష్ట్యం.
ఎన్నని చెప్పాలి. ‘కదలిక’ (63) కవితకు కదలిపోని భావుకుడుండడు.  చెట్టు ఏడుస్తుంది!, నవ్వుతుంది. ఎన్ని హింసలు పెట్టినా భరిస్తుంది. అయినా సేదతీరనికి నీడనిస్తుంది. ‘ఎక్కడైనా’ (64) కవితలో పంచభూతాలూ మనిషి కోసమే ఎన్నైనా చేస్తాయి. మరి మనిషో!
కవులకు శ్రోతలను ఏడ్పించడం వెన్నతో పెట్టిన విద్య. అయితే రచయితలు భావుకులను గలగల నవ్వించగలరు కూడ. కానీ మరొక స్థితి ఉంది. అది హృదయాన్ని స్పృశించే సన్నివేశం, మాట వలన మనకు సంతోషమో, దుఃఖమో తెలియని మానసిక స్థితికి లోనవుతాము. కంఠం రుద్ధమవుతుంది. కంటివెంట రెండు కన్నీళ్లు రాల్తాయి. అవి దుఃఖాశ్రువులు కాదు, ఆనందభాష్పాలని మనకు తర్వాత తెలుస్తుంది. ‘విదేశంలో మనుమరాలు’ (30)లోని సన్నివేశం అలాంటిది. ఆ తాత ఆత్మీయతను, పాప బంగారు పలుకుల్నీ ఆలకించండి, అదొక దివ్యమైన అనుభవంగా భావకునికి మిగిలిపోతుంది.
అసలు ఈ కవి కంప్యూటరు ఇంజనీరు. 0 1 రెండంకెలతో ఒక  శాస్త్ర భాషను సృష్టించే  నేర్పరితనం ఉంటుందీయనకు. ఆ భాష మనకు తెలియదు. ఈయన ఒకే ఒక అంకె ‘ఒకటి’తో మనకు మన జీవితాన్ని ‘లెక్కలు’ (31) అన్న కవితలో కాస్త రుచి చూపాడు. మనం 1 + 1 కావాలి, వాళ్లు 1 – 1 కావాలి, లేక 1 x 1 కాని, 1/1 కావాలి. జీవితంలో ప్రత్యర్థులు రెండు కుటుంబాలో, తెగలో, జాతులో, వృద్ధి క్షయాలను, కలహించు కోవడన్ని కోరడాన్ని సూచిస్తాయి.
మరి ‘నేనెవరో?’ అన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ‘అవును కాదు’ (52)లో సమాధానం దొరుకుతుందేమోనని ఆశించాము. నీవు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చావు? నీ పయనం ఎటు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతే బాగుండును.
కానీ దొరకదే! కానీ చివరి కవిత ‘యాత్ర’ (70)లో అందరికీ తెలిసినా ఎవరి అనుభవంలోకి రాని సమాధానం ఉంది. మనిషికి చావు లేదు. అతనికినిరంతర ప్రయాణం ఒక చోటు నుంచి మరొక చోటుకు! ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి అంటాడు. ఈ కవితాత్వికుడు చుట్టూ ఉన్న చరాచర జగత్తును చూస్తూ.
అయినా ముకుంద రామారావుగారు కవిగానే స్థిరపతాడు, తాత్విక పరిధిని అక్కడక్కడ స్పృశిస్తూ దూసుకుపోయినా!

వడలి మందేశ్వర రావు
(సౌజన్యం: సాహిత్యనేత్రం, జులై – డిసెంబరు 2008 సంచిక)

* * *

నాకు తెలియని నేనెవరో” కవితా సంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

నాకు తెలియని నేనెవరో On Kinige

Related Posts:

చిన్న కథల పొది – “అస్త్రం”

పదమూడు కథలతో కూడిన “అస్త్రంకె.ఎల్.వి. ప్రసాద్ గారి రెండవ కథా సంపుటి. చూసిన, అనుభవించిన, ఎదురైన, సంఘటనలను కథలుగా మలచి పాఠకులకు అందించారు. చిన్న కథగా కథను మలచడంలో జాగ్రత్త, నైపుణ్యం, అవసరం. అనవసర విషయాలు ఉంటే కథ కుదరదు. ఈ విషయాలు తెలిసిన రచయిత వీరు మర్యాదస్తుడుగా మసలే మనిషి తీరును “అతడు – ఆమెలో” ప్రదర్శనకు పెడతారు. అమ్మాయిలకు పేర్లు పెట్టే రాజశేఖర్‌కు తన పెద్ద చెల్లెలి విషయంలో జరిగిన సంఘటనలో కళ్ళు తెరచినట్లయింది. ఈ సంగతిని కొసమెరుపు రూపంలో కథకుడు అందిస్తాడు. ఈ సంపుటిలో చదువుకు సంబంధించిన కథలు రెండు ఉన్నాయి. “అబ్బాయి చదువు”లో తల్లిదండ్రుల ఆకాంక్షకు వ్యతిరేకంగా తనేం చదవాలో అబ్బాయి నిర్ణయం తీసుకుంటే, “నేరం నాదికాదు” కథలో తన ఆసక్తికి వ్యతిరేకంగా తల్లి ఒత్తిడివల్ల చదివిన అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అవడం కనిపిస్తుంది. ఈ రెండు కథలవల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ఎటువంటి దృష్టి కలిగి వుండాలో తెలుస్తుంది. పిల్లల ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని కథలు చెబుతాయి.

అన్ని సమకూర్చుకొని, వేళకు వివాహం జరుపుకుందామనుకున్న ఆదర్శ జంటకు, మంత్రిగారి జోక్యం వల్ల, ముహూర్తం దాటాక పెళ్ళి జరగడం “ముడి”లో కనపడుతుంది. పేరుకోసం పత్రికలో చోటుకోసం వచ్చిన మంత్రి, వాస్తవంగా పెళ్లి చేసుకున్న జంటకు చేసిన మేలేమి లేదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు, సమాజంలో జరిగే మంచి పనులకు చేయూత నివ్వడంకంటే, వాటి నుండి లబ్ధి పొందడమే పరమావధిగా రాజకీయ నాయకులు నడవడం తెలిసిన విషయమే. ఇలాంటి కథే “అంకితం” ఇందులోని రచయిత వ్యవహరించిన తీరు రాజకీయ నాయకుడి తీరుకు భిన్నంగా లేదు. లీడర్ పేరుకోసం తాపత్రయపడితే, రచయిత డబ్బుకోసం ఆశపడటం కనిపిస్తుంది. ఈ రెండు కూడా విపరీత పోకడలే. వీటిని ఆసక్తికరంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది.

“తోటకూర నాడే మందలించాలి” అనే సూక్తిని గుర్తుకు తెచ్చేకథ “తప్పటడుగులు”. చిన్నప్పుడు కొడుకు చేసిన తప్పుపని, తండ్రికి సంతోషం కలిగిస్తే, అలాంటిపనే పెద్దయ్యాక చేయడంవల్ల తండ్రి ఉనికికే మోసం రావడం కథలో కనిపిస్తుంది. ఇది ఈనాడు సమాజంలో జరిగే తండ్రి, కొడుకుల తగాదాలకు అద్దంపట్టింది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే లాంటివాళ్ళు గొంతెత్తితే రచయిత కథనెత్తాడు.”ఆటోవాలా” అనే కథలో లంచావతారం ఒకడైతే, శ్రమజీవి మరొకరు. అవినీతి తిండితో అరగక ఒకడు బాధపడుతుంటే, అవసరానికి ఆటో నడిపించే ఉద్యోగి మరొకరు. కథ కాస్త సినిమాటిక్‌గా ఉంది. లంచావతారాన్ని అతని భార్యే చీదరించుకోవడం బాగుంది.

అమ్మాయిలను మభ్యపెట్టి, మోసగించి జ్యోతిషం చెపుతున్న వ్యక్తి “బ్రతుకు దెరువు”లో కనిపిస్తే, యవ్వనంలో ఉండే, బస్సులో నిలబడచేతగాక కుంటివానిగా నడించిన వ్యక్తి “కుంటి మనస్సు”లో కనిపిస్తాడు. ఇద్దరూ చేసింది మోసమే. కాని హస్తిమశకాంతరం. నిజాయితీని వదిలిన యువకుని ఒక కథ చూపిస్తే, అమ్మాయిలను చూసి భ్రమసే వృద్ధుణ్ణి మరో కథ చిత్రిక పట్టింది. ఈ రెండు ధోరణుల నేటి వ్యాపార సమాజపు ప్రతిఫలనాలే.

శ్రద్ధగా చదువుకొని, తనను తాను సంస్కరించుకొన్న రాధ “ఆమె గెలిచింది”లో కనపడితే, కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నాటకమాడిన శ్రీనివాస్ “అస్త్రం” లో కనపడతాడు. నిజాయితీలో ఒకరు హృదయాన్ని జయిస్తే, మరొకరు గడుసుగా కాపురం నిలుపుకోవటం వల్ల పాఠకులకు రెండు కథలు ఆహ్లాదాన్ని పంచాయి.

“మనిషి” కథలో చెప్పులు కుట్టేవాని సంస్కారం, డబ్బున్న ఉద్యోగి కనులు తెరిపిస్తుంది. కార్మిక హృదయం ఒక మనిషిని చేరదీస్తే, మధ్య తరగతి ఆలోచన బేరం ఆడడం కనిపిస్తుందీ కథలో. అందుకే అతడు మనీషి అయితే, ఇతడు మనిషిగా మిగిలాడు.

వృత్తిరీత్యా డాక్టరుగా, ప్రవృత్తిరీత్యా సాహిత్యజీవిగా, అవసరం రీత్యా ప్రయాణికుడిగా, రచనారీత్యా కథకుడిగా, అవగాహనారీత్యా మానవతావాదిగా, అంతిమంగా తానే ఒక అస్త్రంగా కె.ఎల్.వి.ప్రసాద్ ఇందులో తారసిల్లుతాడు.

బి.వి.ఎన్.స్వామి.
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

ప్రజాసాహితి” మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌లని అనుసరించండి.

Related Posts:

అస్తిత్వ ఆకాంక్షలను ఆవిష్కరించిన వ్యాస సంకలనం

ఇపుడంతటా తెలంగాణ సంగతులే చర్చనీయాంశాలు. గత నవంబర్‌ నుండి కొనసాగుతున్న ఈ వాతావణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అట్లాగే ఉంటుందని చెబితే అది సరియైన అంచనా అవుతుంది. 2001 నుండి 2009 వరకు ఒక కథ అయితే, గత ఏడాది నవంబర్‌ నుండి రెండవ కథ. ఈ కథలోనే తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది. వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకున్నది. భాగ్యనగరంమొదలుకొని మారుమూల చిన్న పల్లెల వరకు ‘జాక్‌’ లు ఏర్పడ్డాయి. ఒకవైపు రాజకీయ పోరాటాలు ఉధృతమవుతోంటే, అదే వేగంతో సాంస్కృతిక ఆలోచనలు, అన్వేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా పుస్తకం ‘తెలంగాణ అస్తిత్వ పోరాటం‘ (The Telangana Struggle for Idendity) రూపొందింది. ఐదువందలకు పైగా పేజీలున్న ఈ వైవిధ్య వ్యాస సంకలనాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించింది. ప్రసిద్ధ విద్యావేత్తలు డాక్టర్‌ వెలిచాల కొండలరావు, ఆచార్య రాఘవేంద్రరావులతో పాటు సుప్రసిద్ధ దర్శకులు బి. నర్సింగరావు ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. సంకలనంలో తెలుగు-ఇంగ్లీషు వ్యాసాలున్నాయి. ప్రముఖుల తాజా రచనలు, ప్రసిద్ధుల పాత వ్యాసాలు కూడా కనబడతాయి. నాటి వ్యాసాల అవసరం నేడు మరీ ఎక్కువగా ఉందని ఈ వ్యాసాలు చదివితే అర్థమవుతుంది.

ఇంగ్లీషు వ్యాసాల్లో విషయ పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగే రచనలు కొన్ని, మరికొన్ని నాటి హైదరాబాద్‌ స్మృతి పరీమళాల్నినిండుగా వెదజల్లేవి. హైదరాబాదీ సంస్కృతిలోని ప్రత్యేకతల్ని ఇవి విప్పి చెప్పాయి. ఉన్నతాధికారిగా సేవలందించిన నరేంద్ర లూథర్‌ ఇంగ్లీషులో ఎంతో చక్కని రచయిత. ‘And still I long for Hyderabad’ పేరుతో ఆయన రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది. 1998లో లూథర్‌ రచించిన ‘Hyderabad the power of glory’ అన్న పుస్తకం నుండి ఆ వ్యాసాన్ని తీసుకున్నారు. హైదరాబాదీయత్‌ పై డాక్టర్‌ ఎం.ఏ.ఖాన్‌ మంచి వ్యాసాన్ని రచించారు. సి.రాఘవాచారి, రమామేల్కోటే, కె.విజయ రామారావు, హసనుద్దీన్‌ అహమద్‌ వంటి ప్రముఖుల వ్యాసాలు బాగున్నాయి. ‘హిస్టారికల్‌ తెలంగాణ’ పేరుతో చరిత్రకారుడు డాక్టర్‌ జె.రమణయ్య ఇక్కడి చరిత్రను సంక్షిప్తంగా సింహావలోకనం చేశారు. వీటితోపాటు ఆచార్య జి.హరగోపాల్‌, సిహెచ్‌. హనుమంతరావులు రచించిన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. సంకలన సంపాదకుల్లో ఒకరైన వి.కొండలరావు సంస్కృతికి సంబంధించిన వివరణలతో కొన్ని వ్యాసాలు రచించారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటికి సమర్పించిన అంశాల్ని ఇందులో పొందుపర్చారు. ఇకపోతే ‘The city I know’ పేరుతో ప్రసిద్ధ సినీ దర్శకులు శ్యాంబెనగల్‌ రచించిన వ్యాసం సుదీర్ఘమైన స్మృతి గీతం వలె అద్భుతంగా ఉంది. ఇంగ్లీషు వ్యాసాలన్నీ చదివిన తర్వాత హైదరాబాద్‌ నగరపు నాటి సంస్కృతిపై అవగాహన పెరుగుతుంది. తెలంగాణ పోరాటం వెనుక ఉన్న సాంస్కృతికమైన ఆరాటాలు బాగా అర్థమవుతాయి.

తెలుగు వ్యాసాల్లో కొన్ని ఆణిముత్యాలు. ఆనాటి కిన్నెర వంటి పత్రికల నుండి ఎంపిక చేసిన వ్యాసాలు తెలంగాణ గత వైభవాన్ని శ్రావ్యమైన సంగీతం వలె మనముందు నిలుపుతాయి. తెలంగాణ నాటకాలు, తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యాల వికాసం – అనే శీర్షికలతో ‘ఆంధ్ర బిల్హణ’ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి రచించిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో చేర్చారు. ఇందులో తెలంగాణ నాటకాలు కొన్ని విస్తృత విషయాల్ని ఆవిష్కరించింది. మాదిరాజు విశ్వనాథరావు వంటి అజ్ఞాత నాటక రచయితల్ని పరిచయం చేసింది. నాడు నిజాం కళాశాలలో నిర్వహించిన ‘ఆంధ్రాభ్యుదయోత్సవాల’ పరిచయ వ్యాసాల్ని సంకలనంలో పొందు పరిచారు. సుప్రసిద్ధ విమర్శకులు జి.రామలింగం ఆ రోజుల్లో రచించిన ‘తెలంగాణ, సీమ-కవుల దర్శనం’ విలువైన వ్యాసం. ప్రసిద్ధ చరిత్రకారులు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు రచించిన ‘తెలంగాణము ప్రాచీన శిల్పకళ’ వ్యాసం ఎంతో విలువైనది. జానపద కళల్లో తెలంగాణ ప్రత్యేకతను జయధీర్‌ తిరుమలరావు వ్యాసం విశ్లేషించింది. తెలంగాణ సంస్కృతిపై కె.శ్రీనివాస్‌ రాసిన రెండు వ్యాసాలు పలు మౌలికమైన అంశాల్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. సాహిత్య చరిత్ర రచనలో కవులను అంచనా వేయడంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆచార్య ఎస్వీ రామారావు వ్యాసం వివరించింది – డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ‘తెలంగాణ ప్రాచీన కవిత్వ దృక్పథం’ ఎన్నో సూత్రీకరణల్ని ప్రతిపాదించింది. ఈ సూత్రీకరణలతో భవిష్యత్తులో ఎంతోమంది పరిశోధక విద్యార్థులు ముందుకు కదలవచ్చు. తనముందు చోటుచేసుకుంటున్న పరిణామాలపై తనదైన రీతిలో స్పందించవలసిన బాధ్యత మేధావులది. ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” గ్రంథం వెలువడడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిన డాక్టర్‌ వెలిచాల కొండలరావు ఈ రకమైన బాధ్యతగల మేధావిగా వ్యవహరించారు. తెలంగాణ గతం – వర్తమానం – భవిష్యత్తుల్ని వివరిస్తూ సమాచార ప్రతిపాదనలతో, సవిమర్శకమైన వ్యాఖ్యలతో రమారమి పాతిక వ్యాసాల్ని రచించారు. ఇవి ఒక క్రమంలో లేకపోవచ్చు కానీ బలమైన ప్రతిస్పందనలకు ప్రతిరూపాలు. ఆరు దశాబ్దాల కాలవ్యవధిలో నిరంతరం కొనసాగిన పక్షపాత వైఖరిని ఈ వ్యాసాలు ప్రశ్నిస్తున్నాయి. స్వతహాగా విద్యారంగంతో ప్రత్యక్ష సంబంధం ఉంది కనుక ఆ రంగానికి సంబంధించి మరింత బలమైన వ్యాసాల్ని కొండలరావు రచించారు.

”హైదరాబాద్‌ ఒక చాందినీ మహల్‌, పండగ సందడిగా వెలిగే ఒక మహఫిల్‌; ఆకాశం మతిపోగొట్టే తారల ముజ్రా, హైదరాబాదంటే పురాతన మట్టిలోంచి ప్రేమగా వీచే సుగంధ సమీరం” అంటూ ఆశారాజు రాసిన కవిత్వం భాగ్యనగరపు నిసర్గ రాగమయతత్వాన్ని అనుభూతిమయంగా వర్ణించింది. పాగల్‌ షాయర్‌ కావ్యం నుండి సంకలనం కోసం ఎంపిక చేసిన ఆశారాజు కవితలు హైదరాబాద్‌ను వస్తువుగా చేసుకున్న వచన కవిత్వంలో మణిపూసలు.

ఇంతటి విపుల వ్యాస సంకలనంలో ఒకటి రెండు చిన్న లోపాలూ కనబడతాయి. వ్యాసాలు ఒక క్రమపద్ధతిలో లేకపోవడం ఒక లోపం. తెలుగు విభాగంలో ఒకటి రెండు వ్యాసాల్ని తీసుకోకున్నా పెద్దగా లోపమేదీ ఏర్పడేది కాదు. ఇంగ్లీషులో ‘Summing up – Regionalism in India’ వంటి ఒకటి రెండు వ్యాసాలు లేకున్నా ఫర్వాలేదేమో. ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎంతో శ్రమతో ‘ముంగిలి’ అనే గ్రంథాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య చరిత్ర ఇది. ఈ గ్రంథం వెలువడి ఒకటిన్నర సంవత్సరాలు దాటుతోంది. అందులో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య రవ్వాశ్రీహరి, డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన వ్యాసాల్ని ఈ సంకలనంలో తిరిగి ముద్రించారు. ప్రస్తుత సంకలనంలో ఇవి అవసరంలేదేమో. దీనికి బదులుగా సుంకిరెడ్డి పరిశోధనలో వెలుగు చూసిన డజనుమంది గొప్ప కవుల పరిచయాల్ని సంక్లిప్త వ్యాసంగా ప్రచురిస్తే ఇంకా బాగుండేది. ఇంత పెద్దవ్యాస సంకలనంలో ఇటువంటి చిన్న లోపాల్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

”తెలంగాణలో కవులు పూజ్యము” అన్న మడుంబై రాఘవాచార్యుల వారి ప్రశ్నకు ”గోలకొండ కవుల సంచిక” ద్వారా సురవరం ప్రతాపరెడ్డి సరియైన సమాధానం చెప్పారు. అట్లానే ”తెలంగాణ రాష్ట్రం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్న సీమాంధ్ర మేధావి వర్గానికి, నాయకులకు ”తెలంగాణ సాంస్కృతిక వేదిక” చెప్పిన జవాబే ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” వ్యాస సంకలనం.

కొండలరావుగారు అభినందనీయులు.

డా. జి. బాలశ్రీనివాసమూర్తి
(జయంతి త్రైమాసిక పత్రిక, ఏప్రిల్ – జూన్ 2011 సంచిక)

* * *

“తెలంగాణ అస్తిత్వ పోరాటం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

తెలంగాణా అస్తిత్వ పోరాటం On Kinige

Related Posts: