రూపాయి చెట్టు

సుప్రసిద్ధ రచయిత సలీం రాసిన కథల సంకలనం ఇది. ఆయన సాహిత్య స్వభావం మానవతావాదం. మానవ సంబంధాలలోని మంచినీ, చెడుని, కథలుగా మలుస్తారు. వాదాల జోలికి పోని రచయిత సలీం. మనిషే ఆయన వస్తువు.

ఓ వ్యక్తి హైదరాబాద్ నగరంలో స్థలం కొనుక్కుని, కొంత ప్రదేశంలో ఇల్లు కట్టుకుని, ఖాళీ స్థలం మొక్కలు పాతుతాడు. కాలం గడిచేసరికి అదో చిన్న తోటలా మారుతుంది. తన పిల్లల్ని ఎంత శ్రద్ధగా, ప్రేమగా పెంచాడో, ఆ మొక్కలనీ అట్లాగే పెంచాడు. కాని పిల్లలు పెద్దవాళ్ళై బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడ్డాక, వాళ్ళకి డబ్బు జబ్బు చేస్తుంది. తల్లిని ఒత్తిడి చేసి తండ్రితో బలవంతంగా ఆ ఇల్లు స్థలం అమ్మించి, వచ్చిన డబ్బులో వాళ్ళిద్దరూ చెరో ఇరవై లక్షలు తీసుకుని తండ్రికి ఓ అపార్ట్‌మెంట్ కొనిచ్చి, మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి వెళ్ళిపోతారు. మొక్కల మీద, తోట మీద మమకారం వదులుకోని తండ్రి గుండె నొప్పి తెచ్చుకుంటాడు, స్వచ్ఛమైన ఆక్సీజన్ కొనుక్కోవలసి వస్తుంది. “అమ్మకానికి ఆక్సీజన్” కథ హృద్యంగా ఉంటుంది.

ఓ బాల మేధావి బాల్యానికి అతని తల్లిదండ్రులు ఏ విధంగా నాశనం చేసారో “బోన్సాగి” కథ చెబుతుంది. తోటి పిల్లలతో ఆటపాటలకి దూరమై, తన కన్నా పెద్దవారి ఎగతాళికి గురైన ఆ బాలుడి మనసు విలవిలలాడిపోతుంది.

జీవితంలోని మూడు చలికాలాల్లో ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుని చెబుతుంది “మూడు చలికాలాలు” కథ. బాలుడుగా ఉన్నప్పుడు చలికాలంలో తల్లి పొద్దున్నే లేచి చలికి వణికిపోతు ఇంటి పనులు చేసుకోడం చూసి తల్లి మీద సానుభూతి చూపిస్తూ, అమ్మకి సాయం చేయనందుకు నాన్నని తిట్టుకుంటాడు. అదే బాలుడు పెరిగిపెద్దయ్యాక, పెళ్ళి చేసుకున్నాకా, చలికాలంలో తన భార్యకి ఎలాంటి సాయం చేయడు. భార్యకి లోకువై పోతానని భావిస్తాడు. అదే వ్యక్తి ముసలాడయిన తర్వాత తన లోపాన్ని గ్రహించి చలికాలంలో కోడలికి సాయం చేస్తాడు.

కాలువలో కొట్టుకొచ్చే శవాల మీద బంగారాన్ని దోచుకుని దానితో జీవితాన్ని గడిపేసే వ్యక్తి కోటేశు. పెళ్ళయిన చెల్లెలు కట్నం పూర్తిగా ఇవ్వలేని కారణంగా పుట్టింటికి తిరిగొచ్చేస్తుంది. వేరే ఏ పని చేయని కోటేశు చెల్లెల్ని కాపరానికి పంపలేడు. తను చేసే పని దుర్మార్గమైనదని తెలిసినా గత్యంతరం లేక దానినే కొనసాగిస్తుంటాడు. ఓ రోజు నీటిలో ఓ శవం కొట్టుకు రావడం కనిపిస్తుంది, సంతోషపడతాడు. ఆ శవం మీద ఏదైనా బంగారం ఉంటే దాంతో తన చెల్లెల్ని కాపురానికి పంపేయచ్చని ఆశ పడతాడు, గబగబా ఈదుకుంటూ వెళ్ళి బోర్లా పడున్న శవాన్ని తన వైపుకు తిప్పుకోగానే…..ఆ శవం తన చెల్లిదని గ్రహిస్తాడు. హృదయ విదారకంగా ఉంటుంది “లాకులు” కథ.

వైద్యం ‘సేవ’ నుంచి ‘వ్యాపారం’గా మారిపోడాన్ని, రోగులు డాక్టర్ల కంటికి వంద రూపాయల నోట్లు గుత్తులు గుత్తులుగా పూసిన పూల చెట్టులా కనిపించడాన్ని “రూపాయి చెట్టు” కథలో వర్ణించారు.

మందుల తయారీ కంపెనీల మాయాజాలానికి అమాయకులు, నిరక్ష్యరాశ్యులు అయిన పేదవారు ఏ విధంగా బలైపోతారో “వలయం” కథ చెబుతుంది.

నిజమైన మానవత్వం అంటే ఏమిటో నిరూపించిన వ్యక్తి కథే “వామనుడు”. అప్పటి దాక తన మిత్రులు వారి బిడ్డల గొప్పతనాన్ని వర్ణించి చెబుతుంటే, తన బిడ్డని తలచుకుని కించిత్ న్యూనతకి గురైన ఓ తండ్రి సమజాంలో హోదాలు సంపాదించేలా పిల్లల్ని పెంచడం కన్నా, వారిని మానవత్వం ఉన్న మనుషులుగా పెంచడమే గొప్పని గ్రహిస్తాడు.

ఓ వ్యక్తి నిర్జీవమైన శిధిల కళాఖండాల వెంటబడి, సజీవురాలైన మాతృమూర్తిని వృద్ధాశ్రమంలో పడేసిపోతాడు. ఆమె గురించి పట్టించుకోడు. తల్లి చనిపోయిందని చెప్పడానికి వచ్చిన ఆశ్రమం వ్యక్తిని ఎవరిలానో పొరబడి మర్యాదలు చేసి తన సేకరించిన పురాతన వస్తువులన్నింటినీ చూపుతాడు. చివరికి విషయం తెలుసుకున్నాక, తను సేకరించిన ఆ విగ్రహాల మధ్య తనూ ఓ నల్లని విగ్రహంగా నిలబడిపోతాడు. “శిధిల శిల్పాలు” కథ హృదయాన్ని బరువెక్కిస్తుంది.

ఉత్సాహవంతుడైన ఓ ముస్లిం నటుడు తమ వర్గం వారిలో అవగాహన పెంచేందుకు వారి ఆర్ధిక సాంఘిక సమస్యలపై ఓ నాటకాన్ని వేయాలనుకుంటాడు. సహనటిగా తన భార్యతో కలసి నాటకానికి సిద్ధమవుతాడు. నాటకంలో ఓ సన్నివేశంలో భాగంగా మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అని అంటాడు. నాటకం చూస్తున్న ప్రేక్షకులలో ఉన్న పెద్దలు, ఖాజీ వారిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నట్లు నిర్ణయిస్తారు. ఏ నాటకం వల్ల తోటి ముస్లింలకు ప్రయోజనం కలగాలని కోరుకున్నారో అదే నాటకం వలన తమ జీవితాలు చీకటిమయం అవుతాయని ఆలోచించలేకపోయిందా జంట. చివరికి భార్యాభర్తలిద్దరూ ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తారు. “తలాక్” కథ ఆలోచింపజేస్తుంది.

” ఆరో అల్లుడు” కథ కూడా ముస్లిం జీవితాలకి సంబంధించినదే. డబ్బువస్తుందని ఆశపడి చిన్నపిల్లని దుబాయ్ షేక్‌కిచ్చి పెళ్ళి చేసి పంపేసి, ఆ తర్వాత అక్కడ్నించి ఆ అమ్మాయి కబుర్లు తెలియక, విలవిలలాడిపోతారు. చివరికి చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి నుంచి ఉత్తరం వస్తుంది “నాన్నా మీకు ఆరో అల్లుడు” అని మాత్రమే రాసుంటుంది.

జల్లెడలోంచి జారిన నూక ప్రభుత్వోద్యోగులుగా మిగిలిపోయి – జల్లెడలో మిగిలిన నాణ్యమైన గింజలు ప్రైవేటు సంస్థల పరవవడాన్ని “నూకలు” కథలో వివరిస్తారు.

నిరుద్యోగులతో ఆటలాడుకునే గోముఖవ్యాఘ్రాల నిజస్వరూపాన్ని “భవదీయుడు” కథ తెలియజేస్తుంది. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ కథ అమాయక నిరుద్యోగుల పట్ల సానుభూతిని కలిగిస్తుంది.

ఒంటరితనమే తన జబ్బని తెలుసుకోలేని ఓ ముసలి తండ్రి తనకి ఏవేవే జబ్బులున్నాయని భ్రమపడుతూ ఓ కుర్ర డాక్టర్‌ని వేధిస్తూంటాడు. ఓ సారి గుండె నొప్పి అంటూ వస్తాడా ముసలాయన. ఒంటరితనమే ఆయన జబ్బని గ్రహించిన డాక్టరు కొడుకు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపొమ్మని చెబుతాడు. తన కొడుకు కూడా డాక్టరేనని చెబుతూ… వేరెవరితో మాట్లాడిన కొడుకుతో మాట్లాడినట్లు ఉండదని, రెండు మూడు రోజులకి ఈ డాక్టరుతో మాట్లాడే కొన్ని నిముషాలే తనకి గుండె నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తాయని అంటాడాయన. ” పిడికెడు గుండె” కథ చదువరులను కదిలిస్తుంది.

ఏ బంద్ జరిగినా, ఏ ఉద్యమం జరిగినా ముందుగా బలయ్యేవి ఆర్టీసీ బస్సులేనని చెబుతూ, ఓ బస్ చేత తన కథ చెప్పిస్తారు “చేతులుంటే ఎంత బావుణ్ణు!” కథలో. ఈ కథ చదివి బస్‌లపై దాడి చేసేవారిలో ఒక్కరైనా మారితే ఎంతో బాగుంటుంది.

“ఆశ్రమం” కధ గురించి చెప్పడం కంటే చదవడమే బావుంటుంది.

ఇరవై కథలున్న ఈ సంకలనం చదువరులను ఏ మాత్రం నిరాశపరచదు.

ఈ సంకలనాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 2004లో ప్రచురించారు. ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. వెల 90 రూపాయాలు. ఈ పుస్తకాన్ని నెలకు 30 రూపాయల అద్దెతో కూడా చదువుకోవచ్చు.

రూపాయి చెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రూపాయి చెట్టు By సలీం–కథల సంపుటి

ఈనాడు కథల్ని దళిత కథలని, స్త్రీవాద కథలని ప్రాంతీయ కథలని విభజిస్తున్నారు. సలీం రచించిన కథలు అలాంటి విభజనకు లొంగవు. ఈనాడు మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని తన దృక్కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నం చేశాడు రచయిత. ఇతను ఎన్నుకున్న ఇతివృత్తంలోనూ, కథాకథనంలోనూ కొత్తదనం ఉంది. పాఠకులను తన వెంట తీసుకెళ్ళగల్గే చక్కని శైలి ఈ రచయితకుంది. ఎలాంటి డొంక తిరుగుళ్ళు లేకుండా సూటిగా కథనంలోకి ప్రవేశించడం ఈ రచయిత ప్రత్యేకత. పాఠకులకు శాస్త్రీయ దృక్పథాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని కల్గించాలన్న అభినివేశంకూడా ఈ రచయితకుంది.
-ఆదివారం ఆంధ్రభూమి

ఇతని రచనల్లో మారుతున్న మానవ సంబంధాలు, డబ్బుచుట్టు గిరికీలు కొడుతున్న సామాజిక స్థితిగతులు, మహానగరాల విస్త్రుతిలో కనుమరుగైపోతున్న ప్రకృతి రామణీయకత దర్శనమిస్తాయి.
- విశాలాంధ్ర దినపత్రిక

ఈ రచయిత భావుకుడు. సౌందర్య సరస్తీరాల్లో ఆడుకుని అలసిసొలసి పోవడమే కాదు. జీవితంలోని నిష్ఠుర వాస్తవాల్ని కూడా గుర్తించగలిగిన వాడతను. కథ చెప్పే తీరులోని అందం రచయిత స్వంతం. ఈతని రచనాశైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది.
- ఆంధ్రభూమి వారపత్రిక

సలీం సాహిత్య స్వభావం మానవతావాదం. మానవ సంబంధాల్లోని మంచినీ, చెడునీ ఆయన కథలుగా మలుస్తారు. పతితుల పట్ల, బాధాసర్పదష్టుల పట్ల ఆయనకు అంతులేని జాలి. ఆ జాలి కరుణ ఆయన కథలన్నింట్లోనూ కన్పిస్తాయి. సలీం కథలు చదువుతుంటే మానవ స్వభావాలను ఎంత బాగా పట్టుకున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. వాదాల జోలికిపోని రచయిత సలీం. మనిషే ఆయల వస్తువు.
-ఆంధ్రజ్యోతి వారపత్రిక

రూపాయి చెట్టు On Kinige

 

To buy or rent visit now http://kinige.com/kbook.php?id=184 

 

Happy Reading,

Kinige team.

Related Posts: