‘సఫర్’ కథపై స్మైల్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘సఫర్’ కథపై స్మైల్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఒక విప్లవ కారుడి కథ యిది కొంత మనిషి కథ, చాలా ఎక్కువగా మనసు కథ. ఇతనికి భార్యా, పిల్లలూ వున్నారు. స్టీరియో సంగీతం, రికార్డులు వున్నాయి, అతను వున్న ప్రదేశానికి రెండు వేల మైళ్ళ దూరంలో, బాబీ, మన్నాసింగ్, మోసీన్, అనిల్, త్రిపాటీ, అందరూ రాజకీయాల్తో ప్రమేయం వున్నవాళ్ళే- దృక్పథాల్లో కొంచెం తేడాతో, బాబీ ట్రేడ్ యూనియనిస్ట్, మన్నాసింగ్ సాయుధ విప్లవాన్ని నమ్మిన నక్సలైట్, బాబీ భార్య మున్నీ, ఓ పిల్లాడి తల్లి, మున్నీ అంటే విప్లవ కారుడుకి విపరీతమైన ప్రేమ- లోపల్లోపల. జీవితంలో వీళ్ళందరి ప్రయాణమే – సఫర్.

ఇదీ యీ కథ ఔట్ లైన్. స్వగతంలో కథ సాగుతుంది కాబట్టి ‘అనగనగా’ కథల్లా మొదలవదు. ‘అందరూ సుఖంగా వున్నారు’ అంటూ అంతమవదు. మొదటి వాక్యం నుంచే విప్లవ కారుడి, మానసిక ప్రపంచంలోకి వెళ్ళాలి మనం. ఇతనికి బాబీ భార్య మున్నీ అంటే చాలా ప్రేమ అని కూడా వెంటనే తెలుస్తుంది మనకి. ఆవిడకీ ఇతనంటే అభిమానం వున్నట్టే కన్పిస్తుంది. ఇతనికి విపరీతమైన గిల్టీ ఫీలింగ్. స్నేహితుడికి ద్రోహం చేస్తున్నానేమోనని. దూరంగా వున్న తన వేయి కళ్ళ సుశీలకి ద్రోహం చేస్తున్నానేమోనని. విప్లవానికి ద్రోహం చేస్తున్నట్లు అతను అనుకుంటున్నట్లు కన్పించదు – విచిత్రం! ఎందుకంటే – ‘ఏ దేశంలోనైనా. ఏ మనిషేనా, ఏ కారణానికేనా రోదిస్తుంటే నీ హృదయం వింటుంది, నీ మనసు దానికి కంపిస్తుంది’ – అని అనుకుంటాడు. కథంతా కూడా, ఇతని ఆలోచన అంతా కూడా – మున్నీ చుట్టే తిరుగుతూ . మున్నీ అంటే ‘దాహం’ తన ‘దాహంలో ద్రోహం’ అనుకుంటాడు- విస్కీ మత్తులో. అతను చాలా చీకటిగా ఆలోచించ గలడన్న సంగతి మనకి కథ మొదటే తెలుస్తుంది. ‘నువ్వు సీజర్‌వి కావు’. అని అనుకుంటాడు తన గురించి మొట్టమొదటే – వెంటనే ‘జూడాస్‌వి అవగలవు కాని, అది కూడా యిప్పటి దాకా’ అని వెంటనే అనుకుంటాడు. ఈ రెండు ముక్కల్లో అతని మానసిక స్థితిని తెలుసుకోవచ్చు. విస్కీతో తనలో ఎన్నో గదుల్ని ఆవిష్కరించుకుంటాడు. లోనికెళ్తాడు. వస్తాడు – గ్లూమీగా? మున్నీ కావాలి – వద్దు – కావాలి – వద్దు – స్నేహితుడికి ద్రోహం చెయ్యాలా?వద్దా? చేస్తేయేం ? వద్దు చెయ్యలేను. జూడాస్‌వి అవగలవు కాని, అవవు, ‘అది నీ డెస్టినీ.’ అని జాలిపడి సరిపెట్టుకుంటాడు. మానసికంగా అదొక డెస్టినీ. ఇదే కాదు అతని డెస్టినీ. భౌతికంగా యింకోటి కూడా వుంది. అది ‘దైన్యపు రంగుల్లో’ కన్పించే భారత దేశం. దాన్ని ఓ దరి చేర్చడం, దానికి ఓ దారి చూపించడం ఆ ప్రయత్నంలో ప్రయాణం! యితనూ, యింకా ఇతని ఇతర అండర్‌గ్రౌండ్ కామ్రేడ్స్. అతనికి విప్లవమూ కావాలి, మున్నీ కావాలి. ‘ఇయ్యి. నీలోనిదంతా ఇయ్యి’- అని విషాదంగా అనుకుంటాడు. బాబీ కుటుంబ స్వచ్ఛమైన పాలు- “ఆ పాలలో నీ…” అని అసంపూర్తిగా, అయిష్టంగా తన గురించి జాలిగా అనుకుంటాడు. యిదంతా ఒక ముడి ఎవరూ విప్పలేరు. అని సమాధాన పర్చుకుంటాడు. ఇలా కథంతా కూడా ఇతని గిల్టీ ఫీలింగే. దేశానికి మార్గాలు ఏర్పరిచిన వాడు తను – ఓ కుటుంబం ప్రయాణించే దారిలో అడ్డుగా పడిన వృక్షంలా యేమిటిది? మెహ్రోత్రాలో రాజకీయ జూడాస్‌ని పసికట్టాననుకున్న అతను, తన జీవితంలో తనదైన ద్రోహచింతనని తియ్యగా చేదుగా అనుభవిస్తాడు. దేశానికి మార్గాలు చూపిస్తున్న తను, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి కనుక – ఆ మార్గం నుంచి, వ్యామోహమార్గంలోకి చీలిపోకూడదు కనుక-మున్నీని వదలి పోవాలి. బాబీని వదలిపోవాలి. గిల్టుని, సిన్‌ని వదలిపోవాలి. ఓ జవాబును వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాడు. ‘తుఫాన్-మెయిల్లో’ వెళ్ళాల్సినవాడు ఓ మామూలు మెయిల్లోనే వెళ్ళిపోతాడు. ప్రయాణం సాగుతుంది. సఫర్. అది భౌతికమూ మానసికమూ.

అతని ఏ శరీర సౌఖ్య లోపం వల్ల ఇంత చీకటి ఆలోచనలు వచ్చాయో, యింత వూగిసలాట వచ్చిందో మనం గ్రహించ గలం. చాలామంది విప్లవ కారుల జీవితాల్లో చాటున కన్పించే నిజమే యిందులోనూ కన్పిస్తుంది. విప్లవకారులూ మనుషులే కాబట్టి యిలాంటి యిబ్బందులూ వస్తాయి. కొందరు సరిపెట్టుకుంటారు, కొందరు సరిపెట్టుకోరు. కొందరు ప్రయాణం సాగిస్తారు, కొందరు మానేస్తారు. కొందరు వీటన్నిటితోనూ పడుతూనో లేస్తూనో ప్రయాణం సాగిస్తారు. జీవితంలో యిలాంటి వాళ్ళని యెందర్నో మనం ఎరుగుదుం? ఈ కథలో విప్లవ కారుడు మనసులో ఎన్న చక్కర్లు కొడతాడు. చీకటి గదుల్లోకి వెళ్లివస్తాడు. బాధ పడతాడు, బయట పడతాడు. ప్రయాణం సాగిస్తాడు.

త్రిపురగారు ఆయనకే చేతనైన ఆయన పద్ధతిలో కథని ప్రయాణం చేయిస్తారు. ఓ చిన్న కొండెక్కడం లాంటిది ఆయన కథ చదవడం. కొండెక్కిన తర్వాత ఎంత రిలీఫో, ఎంత గాలో, ఎంత దృశ్యమో. సాఫీగా, తాపీగా సాగే కథలకి అలవాటు పడ్డ వాళ్ళు కూడా త్రిపుర గారి కథల్లోకి వస్తే, కథ అయ్యేంత వరకూ బయట పడలేరు. ఆ గ్లూమ్‌ని, ఆ స్టయిల్‌ని, ఆ వాతావరణాన్ని వొదిలి రాలేరు. ఆయన కథల ‘సఫర్’లో పడిన వాళ్ళ కెవరికైనా తెలుస్తుంది.”

స్మైల్

త్రిపుర కథలు On Kinige

Related Posts: