పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం

ఈ పుస్తకం పిల్లల కోసమే మొదలు పెట్టాను. ఈ పిల్లలు, 7, 8 తరగతుల నించీ 10 వ తరగతి వరకూ వున్న పిల్లలు.

పిల్లలకు చిన్న తనం నించీ ఆటలూ పాటలూ కథలూ చాలా కావాలి. ఆ కథలు, మాయలతో మంత్రాలతో వున్నా, వాటితో పాటే పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.

ప్రకృతి విషయాల్లో, ప్రతీ సైన్సునీ నేర్చుకోనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతీ మనిషికీ క్షుణ్ణంగా అక్కర లేదు. రోజూవారీగా పాటించ వలసిన ఆరోగ్య సూత్రలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడినప్పుడు, వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం, ప్రతీ మనిషికీ అక్కర లేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే. కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, ఏ జ్ఞానాలూ అక్కర లేదు. కానీ, మనుషులకు, మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధిక శాస్త్రమే, మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ, వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి – ఇవాల్టి – రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతి మనిషికీ తెలిసివుండాలి.

విజయనగరం నించి ‘నానీ’ అనే పిల్లల మాసపత్రిక ఒకటి వస్తూ వుండేది (ఎడిటర్: ఎన్. కె. బాబు). ఆ పత్రిక కోసమే, మొదట ఈ పాఠాలు ప్రారంభించాను. అప్పుడు, ‘డబ్బు’ వరకే చెపుదామనుకున్నాను. ఈ పుస్తకంలో వున్న 8 వ పాఠం వరకే ఆ పత్రికలో వచ్చింది. తర్వాత, ఆ పత్రిక ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. పిల్లల కోసం, మిగతా పాఠాలు కూడా చెప్పాలని దీన్ని పూర్తి చేశాను.

అయితే, పిల్లల కోసం ఇంత పుస్తకమా? ఇందులో వున్న చివరి పాఠాలు పిల్లలకి అర్థమవుతాయా? అని, నాకే కొన్ని సార్లు సందేహాలు వచ్చాయి. ‘పిల్లల కోసం’ అనే దృష్టి తోనే పాఠాల్ని ఎక్కువ వివరాలతో చెప్పవలసి వచ్చింది. ఇది పిల్లల కోసం కాబట్టి, పుస్తకంలో అక్షరాల సైజు చాలా పెద్దది. చాలా చొట్ల బొమ్మలు. ప్రశ్నలూ – జవాబులూ. చివరి పాఠాల్లో పత్రికల వార్తలు కూడా. ఈ కారణాల వల్ల, పుస్తకం పెద్దది అయింది. కానీ పాఠాలన్నీ చిన్నవే. ఈ మాత్రం పాఠాలు లేకపోతే, ఈ సైన్సుని కనీసంగా అయినా తెలుసుకోవడం సాధ్యం కాదు.

పిల్లలలో అనేక స్థాయిల వాళ్ళు వుంటారు. పుస్తకాలు చదివే అలవాటు, నేర్చుకోవాలనే ఆసక్తి వున్న పిల్లలకు ఇది సమస్య కాదు. తర్కంతో సాగే విషయాలని అర్థం చేసుకోవడంలో సమస్య రాదు.

ఈ పాఠాల పేర్లూ, వాతిల్లో మాటలూ, వాటిల్లో పాత్రలూ, పిల్లల చెవుల్లో, మనసుల్లో పడితే చాలు. అసలు ఇలాంటి శాస్త్రం ఒకటి వుందని పిల్లలకి తెలిస్తే చాలు. ఒక సారి చదివితే అర్థం కాని పాఠాన్ని ఇంకోసారి చదువుకుంటారు. ఇక అదంతా వాళ్ళ ఆసక్తి. పిల్లలకు ఎక్కడైనా అవసరమైతే, పెద్ద వాళ్ళు కొంచెం సహాయం చేస్తే, అసలు సమస్యే ఉండదు.
అయితే, తెలియని ఏ శాస్త్రం నేర్చుకునేడప్పుడైనా, పెద్దలు కూడా పిల్లలతో సమానులే. పెద్దల్లో కూడా నూటికి 99 మందికి, సమాజం గురించి చెప్పే శాస్త్రం తెలీదు. దీని కోసం మార్క్స్ ‘కాపిటల్’ చదవాలి. కానీ, అది మొదట్లో అసాధ్యం. అందుకే, ‘కాపిటల్’కి ‘పరిచయం’ గతంలోనే రాశాను. దాన్ని పెద్దలు తేలిగ్గానే చదువుకోవచ్చు. అయినా, దాని కన్నా ముందు ఈ పుస్తకం, ప్రారంభ పాఠాలుగా ఉపయోగపడుతుంది. ‘కాపిటల్’ అంటే భయపడే, బద్దకించే పెద్దల కోసం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. పిల్లల పుస్తకాలు పెద్దలు కూడా చదవాలి; నేర్చుకోవాలి. పిల్లలకి నేర్పాలి.

రంగనాయకమ్మ.

(“పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం” పుస్తకం ముందుమాట నుంచి)

* * *

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం On Kinige

Related Posts: