పరంజ్యోతి

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఆధ్యాత్మిక నవల ఇది.

నెమలికొండ రాజకుటుంబంలో కడపటి సంతానంగా పుట్టిన విజయరామరాజు అతి గారాబంగా పెరుగుతాడు. పెద్దన్నయ్యకి కష్టపడే తత్వం, చిన్నన్నయ్యకి తెలివితేటలు ఉన్నాయి, కానీ రామరాజుకి మాత్రం ఈ రెండు గుణాలు అబ్బలేదు. విద్య నేర్చుకోడు, ఎంత సేపు ఆటలు, అల్లరి చేష్టలతో బాల్యం గడచి పోతుంది. యవ్వనంలోకి ప్రవేశించాక స్త్రీలోలత్వానికి గురై శారీరకంగా, నైతికంగా పతనమవుతాడు.

వివాహం చేస్తే బాధ్యత తెలిసొస్తుందేమోనని పెద్దలు భావిస్తారు. శ్రీకాకుళం ప్రాంతంలోని ఓ సంస్థానాధీశుడి కుమార్తెతో రామరాజు వివాహం జరుగుతుంది. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు కుదురుగానే ఉంటాడు రామరాజు. కానీ కొత్త పెళ్ళాం పాతబడిపోయాక, పాత వాసనలు తలెత్తుతాయి. ఇంట్లోని ఒక్కో విలువైన వస్తువును వేశ్యల పరం చేస్తూ, సుఖరోగం పాలవుతాడు రామరాజు. అతని ప్రవర్తనని అందరూ అసహ్యించుకోడం మొదలు పెడతారు. ఈ లోగా అతనికి ఓ కొడుకు జన్మిస్తాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా, మళ్ళీ అతని ఆగడాలు మితిమీరిపోతాయి. అతని అఘాయిత్యాలు భరించలేక అతని బావమరిది రామరాజుపై విషప్రయోగం చేస్తాడు. రామరాజు మరణిస్తాడు.

శవాన్ని దహనం చేస్తుండగా కుంభవృష్ఠి కురిసి, గోదావరికి వరదొస్తుంది. సగం కాలిన శవం వరదలో కొట్టుకుపోతుంది. నదిలో కొట్టుకొచ్చిన శవాన్ని సహజానంద అనే ఋషి వెలికి తీయించి, కాయకల్ప చికిత్స చేసి ఆ కాయానికి ప్రాణం పోస్తాడు. కొత్తగా ప్రాణం పోసుకున్న ఆ కాయానికి ‘పరంజ్యోతి’ అనే పేరు పెడతారు. పరంజ్యోతి శరీరం యువకునిలా ఉన్నా, శిశువులా, బాలుడిలా ప్రవర్తించి, కౌమారాన్ని అనుభవించి యవ్వనానికి చేరుకుంటాడు. ఉన్నట్లుండి అతనికి తన తల్లిదండ్రులెవరో, బంధువర్గం ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని చెప్పి అతనికి ధ్యానం చేసుకోమని చెబుతారు సహజానంద. కొన్నాళ్ళయ్యాక ఆధ్యాత్మికంగా కాస్త పురోగతి సాధిస్తాడు. ఉన్నట్టుండి ఒకరోజు అతనికి తన గతం గుర్తొస్తుంది. తనని చంపిన బావమరిదిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ప్రస్తుతం ఉన్న సాధు రూపం అతన్నికట్టిపడేస్తుంది. తనలో చెలరేగుతున్న ద్వైధీభావాన్ని అణచుకునేందుకు గురువుగారిని శరణుకోరుతాడు పరంజ్యోతి. మరింత సాధన చేయమని సెలవిస్తారు సహజానంద. ఆధ్యాత్మికంగా క్రమంగా పురోగతి సాధిస్తాడు పరంజ్యోతి. అతనిలోని దుష్ట సంస్కారాలు మెల్లిగా క్షీణించసాగాయి. ఇంతలో నెమలికొండ సంస్థానానికి చెందిన కొందరు ప్రజలు పరంజ్యోతిని చూసి, రామరాజుగా గుర్తిస్తారు. ఇక ఇక్కడి నుంచి రెండు సంస్థానాలలోను, ఆంగ్ల పాలకులలోను అలజడి కలుగుతుంది. గూఢచారులు పరంజ్యోతిని అనుక్షణం గమనిస్తుంటారు. రామరాజు అక్క, అమ్మమ్మ మాత్రం అతన్ని నీడలా వెంటాడి వచ్చి సంస్థానం బాధ్యతలు స్వీకరించమని వేధిస్తుంటారు. అతన్ని ఎలాయినా పాత రామరాజుని చేయాలని పాత పరిచయాలున్న స్త్రీలను నియోగిస్తారు, అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరికి విషయం న్యాయస్థానానికి చేరుతుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పాడు? తాను రామరాజునని పరంజ్యోతి అంగీకరించాడా? అసలు చనిపోయిన మనిషిని అదే శరీరంతో తిరిగి బ్రతికించగలరా? పరంజ్యోతి తన పగ తీర్చుకున్నాడా? ఇవన్నీ ఆసక్తిదాయకంగా ఉంటాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. నవల ప్రొలోగ్‌లో దశమహా విద్యల అధిదేవతల గురించి చెప్పారు రచయిత. చిన్న మస్తాదేవి గురించి చెబుతూ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆ దేవి ఆలయం గురించి చక్కగా వివరించారు. స్థలపురాణంలోని కథని చెప్పి అందులోని అంతరార్థాన్ని వివరించారు.

ఓ సందర్భంలో మజ్జిగలోని రకాల గురించి, వాటిని సంస్కృతంలో ఏమంటారో, ఆధ్యాత్మిక సాథకులు ఎటువంటి మజ్జిగ తీసుకోవాలో తెలియజేసారు.

‘ ఇల్లు ఇరకటం’ , ‘ఆలి మరకటం’ అనే సామెత జనాలో నోళ్ళలో అపభ్రంశమైందని, అసలు సామెత ‘ ఇల్లు ఇరు కవాటం…… ఆలి మరు కవాటం’ అని స్పష్టం చేస్తారు.

ఈశవాస్యోపనిషత్‌లోని “ఓం పూర్ణమద, పూర్ణమిదం పూర్ణాతీ పూర్ణముదుచ్యతే” అనే శాంతిమంత్రానికి రచయిత వివరించిన అర్థం ఎంతో హృద్యంగా ఉంది.

నర్మదా నదీ పరిక్రమ గురించి చెబుతూ, ప్రదక్షిణలో ఒక రోజు ఒక జన్మకి ప్రతీక అని, నదీపరిక్రమని ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించాలని; అలాగే మనం అనేక జన్మలెత్తాక, ఎక్కడ నుంచి అయితే ప్రారంభించామో అక్కడికే తిరిగి చేరుకుంటామని, అదే ఆత్మసాక్షాత్కారమని చెబుతారు.

పంచపాండవులు పాత్రలను సాధకుడికి ఉండాల్సిన లక్షణాలకి ప్రతీకగా మలిచారని, పాండవుల పేర్ల వెనుక ఉన్న నిగూఢార్థాన్ని విడమరచి చెప్పారు మల్లాది.
మనిషిని కట్టిపడేసే బంధం గురించి రచయిత ఆసక్తికరమైన ఉదాహరణలతో వివరించారు.

దురలవాట్లకు మనుషులు ఎలా బానిసలవుతారో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల ఆథ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/-. నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

పరంజ్యోతి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: