అస్తిత్వ వేదన ధ్వనీ – ప్రతిధ్వనీ : పెద్దిభొట్ల – (మునిపల్లెరాజు)

(from foreward to Peddibhotla Subbaramayya kathalu part one)

His voice is gruff and deep

He keeps his mustache clean and trim

(His registered trade mark is no joke!)

He travels light in the twilight zones

On uncaring streets, a mission on his shoulders

With a tattered Note Book and a broken pencil

To record the marginalized, lonely

Defenseless and the naked urchins!

In this ancient promise he never fails

A conscious keeper of his home town’s soul!!

* * *

సభా వేదిక నుండి ఏవో అసహన కదలికలు, వాకాటి పాండురంగారావుగారు -ఎంతో గంభీరంగా ఉన్నట్లున్నా ఆందోళనగా నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. సాహిత్య సభ నిండుగా వున్నది. ఇంకా వస్తున్నారు- సాహితీ ప్రియులు. దాదాపు గంట ఆలస్యం. పురస్కార గ్రహీత అంతులేడు. కబురులేదు.

సందర్భం- రావిశాస్త్రి స్మారక సాహితీ నిధి పురస్కారం. వేదిక -సుందరయ్య విజ్ఞాన కేంద్రం-హైదరాబాదులో బాగ్‌లింగంపల్లి ప్రాంతం.

నిజం చెప్పద్దూ- నాకూ టెన్షన్‌గానే వుంది. మెట్లకింద గ్రంథాలయం గదిలోకి వెళ్ళి, నా నోట్‌బుక్‌లో పైపద్యం గిలుకుతూ కొట్టివేతలతో తంటాలు పడుతున్నాను. అది-యీ తరుణంలో దైవదత్తంగా జ్ఞాపకం వచ్చింది.

“అడుగో…. అడుగో- పెద్దిభొట్ల…” అని పైనించి వినబడ్డ ఆశ్చర్యార్థకాలతో సభామందిరంలోకి జొరబడ్డాను.

ఆనాటి స్టార్ ఎట్రాక్షన్- శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య! పురస్కార గ్రహీత- ఏ ఆందోళనా లేని నిబ్బరం. ఏ అంతర్యుద్ద పదజాలం వినని వినోద ప్రదర్శన. శ్రీకాకుళం నుంటి ఇప్పుడే దిగానని చెబుతున్నాడో, దారిలో మాగురువుగారి మనుషులెవరో తటస్థిస్తే మాట్లాడుతున్నానని సర్దుబాటు చేస్తున్నాడో! దూరప్రయాణపు దుమ్ములేదు. దేశద్రిమ్మరి ప్రవక్త- శరశ్చంద్ర ఛటర్జీవలె కన్పించాడు. మీసాల చాటున చిరునవ్వును మాత్రం నేను గమనించాను.

ఇటువంటి సాదా భేటీలు (Brief encounters) మరికొన్ని. ఒక్కోక్క (encounter)లో ఒక్కోక్క రూపం! ఒక్కొక్కటీ చెప్పమంటారా?

దుఃఖార్తుల, శ్రమార్తుల, శోకార్తుల, అనాధుల అభాగ్యుల సామూహిక విషాద గానానికి బాణీలు కడుతున్న సంగీత దర్శకుడా?

లోకంలో చరిత్ర హీనుల పదయాత్రకు ప్లేకార్డ్స్ – రాసి పెడ్తూన్న పేవ్‌మెంట్ చిత్రకారుడా?

మాక్టింగోర్కీ అద్భుత నాటకం Lower depths లో వృద్ద యాత్రికుడు ‘లూకా’ లాగా తన వేదాంత ప్రవచనాలతో యీ బీభత్స లోకానికి శాంతిని ప్రసాదిస్తున్న రష్యన్ పౌరుడి రెండవ శరీర ధారియా?

సాంప్రదాయ సాహిత్యంలో అలంకారాలను ఆధునిక సాహిత్యపు ఐడియాలజీలను, ఆధునికాంతర సాహిత్యపు పునాదియైన అనుభవాలను, నినాదాలను నిర్దేశాలనూ, నిర్ణయాలనూ- తృణీకరించి- తన అంతఃకరణే తన ధనస్సుగా, దాని విన్యాసమే తన అభివ్యక్తీకరణగా- కథలల్లిన మహా కథకుడిగా- ఎవరేమని రాసినా- పెద్దిభొట్లవారు నాకొక పొగమంచు వెనక “మిస్టిక్” గానే గోచరిస్తాడు.

దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడిగా వేగుంట మోహన్ ప్రసాదుకూ, బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాతగా కప్పగంతుల మల్లికార్జునరావులకు తోచినా, నాకు మాత్రం-దోస్తా విస్కీపాత్ర, మాస్కోలో పేద విద్యార్థి రోడియన్ రాస్కోల్నికావ్‌గా- చీకటి చలిరాత్రిలో అతడు వేచివున్న వీధిలో శిల్పవిగ్రహంలా, దీనురాలు సోన్యాకోసం నిరీక్షిస్తున్న బుద్దుడిలా గోచరిస్తాడు.

(Rodiam Raskolnikov is involved in a tragic struggle for the good of man facing the dark night of his soul) ఒకసారి ఆయన నాకు టైగర్ స్వామిగా దూరంనుంచి కన్పించాడు (ఈ టైగర్ స్వామి నిజంగా ఎంతో సాత్వికుడైనా, తన తపస్సుకు భంగం కలిగించేవారికి పులిగా కన్పించి దూరానికి తరిమివేసేవాడని దక్షిణామూర్తిగారి రచనల్లో వుంది).

అంతర్జాతీయం స్థాయిలో కథా యజ్ఞాశ్వాల మీద స్వారీ చేసిన “నీళ్ళు, పూర్ణాహుతి” గురించి పునఃమూల్యాంకనానికి ఆవశ్యకతలేదు. ఇది చిరకాలంగా నా నిశ్చితాభిప్రాయం. ఈ కథానికల్లో లౌకిక సాఫల్యతా, ఆధ్యాత్మిక సాఫల్యతాల ముచ్చట ఎవరైనా చేసి వున్నారా? ఒక కథాస్రష్ట విశ్వరూపంలో, ఒక ఉన్మత్త పథికుడి కాలిగుర్తుల్లో ఒక ఉద్విగ్న భావుకుడి సనాతన చింతనలో, కథానికే ఒక చిరు కావ్యంగా పరివర్తన చెంది, వస్తుశిల్ప శైలీ నిర్మాణాల్లో రాగ మాలికల రూపం దాల్చి- నీరు నిదురరాని యామినీ యాతనలో వినిపించే ముఖారి రాగ విషాదగీతాలు-కొన్ని పెద్దిభొట్ల వారి కథలు. కొన్ని గాదు, ఎన్నో.

నాకు ఎన్ని పర్యాయాలో ఆశ్చర్యం కలిగించిన విషయం- యింతటి భావుకుడు, తన గురువు గారు కవిసామ్రాట్ విశ్వనాథ వార ముద్దువడ్డనలను ముసిముసినవ్వులతో స్వీకరించిన శిష్యుడు-కవిత్వారాధనకు ఏల పూనుకోలేదో.

పెద్దిభొట్లవారిలో ఒక విద్రోహ కవి- కాజీ నజ్రుల్ ఇస్లాం, మరొక జిడ్డు కృష్ణమూర్తి, వేరొక విశ్వప్రేమి, ఒంగోలు నుంచి గుంటూరు పట్టణం దాటి విజయవాడలో విగ్రహారాధన చేయని పూజారిగా, తనను ప్రవాసిగా భావించకుండా, విజయవాడ భూధూళినే మహిమాన్వితంచేయ బూనుకున్న కనకదుర్గామాత కాపాలికుడు- కలిసి వున్నారు.

విజయవాడ కర్మక్షేత్రంలో రాజమార్గాలను కాలిమార్గాల్నీ-సర్వే చేసినవాడు- కనకనే “చీకటి” కథలో పాసెంజర్లకోసం వేచివున్న సావిత్రినీ, జలగలాంటి అప్పారావును, కథలో వచ్చే సోషలిస్టు స్వప్నాన్నీ కాపాలికుడిగానే సృష్టించగలిగాడు.

తనకాలపు నిరంతర అంతర్యుద్ధ చరిత్రను అర్థనిమీలిత నేత్రాలతో రక్తిగా చెప్పగల-కన్యాశుల్కంలో పాత్రను అవలీలగా పోషించగలడు.

మరెందరు రచయితలో నాముందు నిలిచి సుబ్బరామయ్యగారితో పరిచయం చేయమంటున్నారు.

ఎడ్గార్ వాలెన్ కాబోలు అతని పేరు. నా చిన్నతనంలో అతని డిటెక్టివ్ నవలలు చాలా చదివి వుంటాను. అప్పుల బాధలు మీద పడ్డప్పుడల్లా, హోటల్ గదిలో బైఠాయించి, ఏకదాటిగా పందొమ్మిది స్టెనోగ్రాఫర్లకు పందొమ్మిది నవలలను డిక్టేటు చేయగలిగిన అపూర్వ మేధావి. లండన్ నగరపు అండర్ వరల్డ్ మోసగాళ్ళు, చిల్లర దొంగలు, పెద్దబందిపోట్లు- అందరినీ ముద్దు పేర్లతో పిలువగలిగినవాడు.

తన చుట్టూ సమాజంలోని దీన జీవుందరిసమస్యలను మననం చేసుకునే చిన్న కథలచక్రవర్తి ఆంటన్ చేహోవ్, ఏడుసార్లు నోబెల్ పురస్కారానికి ప్రతిపాదించినా తిరస్కృతుడైన అద్భుత కథకుడు, మానవకారుణ్యం గురించి వ్రాయని సోమర్ సెట్ మామ్, కథా ప్రపంచంలో నా వారసుణ్ణి గుర్తించానని స్వర్గ దామం నుంచి వక్కాణిస్తున్న తిలక్- పెద్దిభొట్లవారి మిత్రవర్గం బహుదొడ్డది.

మహా కథక మాంత్రికులు- తమ జన్మ పట్నాలనుండే ఆవిష్కృతులైనారు. గైడీ మొపాసా పారిస్ నగరం, ఓహెన్రీ న్యూయార్క్, మార్క్‌ట్వైన్ మిసిసిపీ, శ్రీ పాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారి రాజమహేంద్రవరం, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మచిలీపట్నం, కొడవటిగంటి కుటుంబరావుగారి తెనాలి, రావిశాస్త్రిగారి విశాఖపట్నం, చాసో “యిజీనగరం” దాశరథి వారి ఖమ్మంమెట్టు, కాళీపట్నంవారి “చిక్కోలు” వట్టికోట ఆళ్వారుస్వామి సికిందరాబాదు- జన్మభూమి వాసన లేనిదే ఏ కథకూ- దీర్ఘకాలిక విలువ వుండగలదా?

విజయవాడ ఇంద్రకీలాద్రి శిలలపైన చెక్కవలసిన మానవ వేదనా గాథల- పౌరాణికుడు యీ పెద్దిభొట్లవారు.

ఎట్లాగో- ఒక ఆంగ్ల కవితతో పదం పలికింది. ఇక ఒక ఆంద్ర కవితతో యీ ప్రసంగాన్ని ముగిద్దాం. అసుకవి సహబాధితుడు- అజంతా- అభిశప్త జీవుల Muffled drum beater! ఆంద్రప్రభ దినపత్రికలో తేదీ లేకుండా వ్రాసిన శిలాఫలకం మీద చెరిగిపోని శాసనం.

“వాళ్ళను ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయని ముందే హెచ్చరిస్తున్నాను” – ప్రారంభ పంక్తి.

“బహుశ ఇది చరిత్ర శాపం కావచ్చునేమో! లేక ప్రతీకారం అనాలా? ముమ్మాటికి యిది వాస్తవం వాస్తవం. చరిత్ర సుడిగాలిలో ఎవరైనా కొట్టుకుని పోక తప్పదు, కాలానికి దయాదాక్షిణ్యాలు లేవు.

సామాన్య గృహస్థుడు బతకటం ఇప్పుడు ఎంత కష్టం? బ్రతుకు ఎంత దుర్బరం, ఎంత బాధాకరం?” చివరి పంక్తులు.

***

ఈ శాపగ్రాస్తులకు చరిత్రలో చిరస్థానం కల్పించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయ్యవార్లను కథా వినువీధిలో ధ్రువతార అనండి (కప్పగంతుల) కొండంతవెలుగు అనండి (విహారి) అన్ని Under statements కిందే లెక్క.

సికిందరాబాద్,

3-5-2010.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు – 1 On Kinige

Visit now http://kinige.com/kbook.php?id=190 to rent/buy this short story collection from Peddibhotla Subbaramaiah.

Related Posts: