సజీవన చిత్రణ (జీవన శిల్పం సమీక్ష)

రచయిత్రి కన్నెగంటి అనసూయ జీవన శిల్పం బాగా పట్టుకున్నారు. అందుకే ఆవిడ కథానికల్లో శిల్పం, శైలి అంటూ ప్రాకులాడక మానవ జీవన సంవేదనలకు ఆలోచనాత్మకమైన అక్షరాకృతి నివ్వడమే ప్రధానంగా రచన చేసారు. జీవితాన్ని జీవించడం తప్ప నటించడం సరికాదని ప్రగాఢంగా విశ్వసించిన కలం తనది. కథలు కథలకోసమే కాదు సాటివారి జీవన వ్యధలు సాధ్యమైనంత మేరకు తీర్చగలిగే సేవా దృక్పథానికి ప్రోది కావాలన్న సంకల్పం గల రచయిత్రి కనుకనే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తన రచనలే కాక మాటలూ, చేతలూ కూడా సాటివారి సహకారంతో తదనుగుణంగా నిర్వర్తిస్తున్న సేవాపరాయణ అనసూయ. అమ్మగారి స్ఫూర్తితోనే కమ్మని కథలు రాయడం అలవడిందంటారు.

ఇరవై కథల ఈ సంకలనంలోని కథలన్నీ అనురాగాలకు, ఆర్ద్రతలకు, మానవీయతకూ అద్దం పట్టేవిగా ఉన్నాయి.

‘బియ్యపు రవ్వ ఉప్మా’ అనే కథలో అమ్మ ఆప్యాయతకే కాదు, మాతృభూమి మమకారానికీ ‘ఉపమ’గా వృద్ధాప్యపు రాజారావు జ్ఞాపకాల మనుగడను మనోజ్ఞంగా చిత్రించారు. మనసుకు మనసు పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశంబగునని చాటుతూ రాసిన చిన్న కథే అయినా ‘ఏ సంధి’ అంతరంగపు సందులోకి చొరబడకుండా వుండదు. పినతల్లే తల్లిగా పసివాడి వసివాడని విశ్వాసాన్ని కథనం చేసిన తీరు బాగుంది.

మోసం, వంచన అనే వాటికి ‘జెండర్’ అంటూ ఏమీ లేదు. మోసం చేయడానికైనా, మోసపోవడానికైనా. రచయిత్రి తాను స్ర్తి అయివుండీ కొందరు సంఘంలో స్ర్తిలే ఎలాంటి వంచనలు చేస్తుంటారో ‘రెండొందలు’ కథలో చిత్రించారు. అంతేకాదు మహిళా సంఘాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల వంటివి కూడా అలాంటి వారిని వెనకేసుకు రాకూడదని ధ్వనింపచేసారు.

‘పడమటి సంధ్యారాగం’ అనే కథ పేరు ఆ కథకి ఎలా నప్పిందో తెలియదుగానీ, సాహిత్యాభిలాష ఉన్న ఓ పంజాబీ సైకియాట్రిస్ట్ రైల్వే స్టేషన్‌లో పిచ్చిదానిగా పుస్తకాల మూటతో నలుగురితో చీత్కరింపబడుతూ కనబడే విషాద సంఘటనను కథగా చిత్రించారు. కానీ ఆవిడ అలా మారడానికి గల కారణం కథలో ఎక్కడా చిత్రించబడలేదు. అంత విద్యాధికురాలు పిచ్చిదవడానికి గల హేతువు వివరించకుండా చెప్పడంవల్ల ఆ పాత్రమీద సానుభూతికి సాంద్రత గాఢత సమకూడినట్టు తోచదు.

వయోజన విద్య గూర్చిన అక్షర దీక్షా చైతన్యాన్ని ‘చైతన్యం’ వంటి కథలో చూపించి ప్రభుత్వ పథకాలని త్రోసిరాజనక ప్రజాప్రయోజన అంశాలు అందరూ అందిపుచ్చుకుని ప్రచులితం కావించవలసినవేనని అనిపించారు.

‘‘ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టరు నయం చెయ్యగలడు. మిగతా సగం రోగానికే డాక్టరు మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టరుపట్ల పెంచుతుంది’’
‘‘మాటలూ భావాలూ ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకోచోట వేస్తే మట్టీనీరూ రెండూ ఉన్నా, సరిగ్గా నిలబడడానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది. ఇక మనుష్యుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వారం, నెల లేదా సంవత్సరం పట్టవచ్చు. అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కలు. కాకపోతే ఈలోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే!’’
రెండు విభిన్న పాత్రల ద్వారా ఈ సందేశాలను సంకలించిన కథ ‘చిరునవ్వు’. అదృష్టం మనతోనే మనని వెన్నంటి ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టమూ కష్టపడుతుందట. మనం నిద్రపోతే అదీ నిద్రపోతుందట అన్న అంశంతో చిత్రించిన కథ ప్రోత్సాహం.

అనసూయ కథల నిండా ఇలా జీవన సారస్యాన్ని వివరించే మంచి పంక్తులు సంభాషణలుగా, వ్యాఖ్యానాలుగా ఔచిత్యంతో తొణికిసలాడుతుంటాయి. అందుకే జీవన శిల్పం అంటే ఉదాత్త ఆశయాల విలవల శిల్పీకరణమే అనిపింపచేస్తారు. చదివించే మంచి శైలి అలవాటే ఈ యలమాటి పుట్టింటి పడతికి. కన్నెగంటి అనసూయగారి వెన్నవంటి మృదుభావాల మానవీయ కథానికల సంపుటి ‘జీవన శిల్పం’.

అల్లంరాజు
ఆంధ్రభూమి దినపత్రిక, 28/10/2012

* * *

“జీవన శిల్పం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జీవన శిల్పం On Kinige

Related Posts:

విలక్షణమైన గొప్ప కథకుడు సి. రామచంద్రరావు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా రాణించగల రమ్యగాథలు అంటూ వేలుపిళ్లై కథలు గురించి 21 డిసెంబరు 2011 నవ్య వార పత్రికలో సమీక్షించారు సుధామ.

రాసింది తక్కువైనా, వాసిగల రచనతో పాఠకులను హృదయదఘ్నంగా ప్రభావితం చేసిన కథకులలో సి. రామచంద్ర రావు ఒకరని సుధామ అన్నారు.

ఈ కథలలో ఇంగ్లీషు, తమిళ పాత్రలు తెలుగు పాత్రలతో ఎక్కువ సహచరిస్తూ, ఆ పాత్రల మాటుచాటుల నుంచి అద్భుత జీవన అంతరంగ తరంగాలను ఎగసి పడేలా చేస్తాయని సమీక్షకులు పేర్కొన్నారు.

“అద్భుత ‘జీవనసారం’ గల పాత్రలనూ, గొప్ప పఠనానుభూతినీ పాఠకులకిచ్చి, ఇప్పటికీ తలచుకునే కథా విన్నాణం చూపిన రామచంద్రరావుగారు తెలుగు కథా ప్రపంచంలో విలక్షణమైన గొప్ప కథకులు! ‘వేలుపిళ్లై’ నిలిచిపోయే కథా సంపుటి” అని వ్యాఖ్యానించారు సుధామ.

పూర్తి సమీక్షకై ఈ లింక్ నొక్కండి.

వేలుపిళ్లై కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

‘మో’లోని ఇంటీరియర్ మోనోలోగ్

‘మో’ పుస్తకం నిషాదంను ప్రముఖ రచయిత సుధామ ఆంధ్రభూమి పత్రికలో సమీక్షిస్తూ…”‘మో’ కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీ కాదని అంటారు. కవికీ పాఠకుడికి మధ్య ఎడం ఎందుకొస్తుందో చెబుతూ – “అర్థ బదలాయింపును దబాయించే చేసే మెటాఫర్స్, రూపకాలు కవికి వున్నంత చిరపరిచితంగా చదువరికి ఉండకపోవడమేనని” సుధామ అంటారు.
‘మో’ ది క్లోజ్ ఎండింగ్ రచన అని, అందువల్లే పాఠకుడి ఆలోచనాశక్తికి ఎక్కువ శ్రమ ఇస్తుందని సుధామ అంటారు.
అయితే, శ్రమయేవ జయతే అన్నట్లుగా, పాఠకులు శ్రమిస్తే, మో కవిత్వాన్ని ఆస్వాదించగలరని సుధామ వ్యాఖ్యానిస్తారు.
పూర్తి సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

 

మో రాసిన నిషాదం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

నిషాదం (మో) On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: