అడ్డా (పుస్తక సమీక్ష)

ఆలోచనలను రేకెత్తించి, జీవితం పట్ల అవగాహనను పెంచి, ఆశావహ దృక్పథాన్ని కలిగించడం మంచి కథల లక్షణాలలో ముఖ్యమైనది. ఈ లక్షణం శైలజామిత్ర గారి ‘అడ్డా‘ కథానికల సంపుటిలోని కథలన్నిటిలోనూ ప్రస్పుటంగా కనిపిస్తుంది. వివిధ పత్రికలలో ప్రచురితమైన ఇరవై కథలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. కొన్ని కథలు జీవితంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూనే, వెలుగునూ చూపుతాయి. అన్నీ హాయిగా చదివించే కథలే.
కూలినాలి చేసుకుంటూ గుడిశెల్లో బతుకీడ్చే వాళ్ళ మధ్య రోజూ చోటుచేసుకునే కీచులాటలు,గొడవలతో పాటు ఒకరిపట్ల ఒకరికున్న కనికరం అత్యంత సహజంగా చిత్రించబడిన కథానిక ‘అడ్డా’. పొద్దున్న తను పనిలోకి వెళ్ళడానికి అడ్డుపడిన గంగమ్మ బిడ్డలను, మధ్యాహ్నం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల నుంచి కాపాడుతుంది బాలమ్మ. దాంతో బాలమ్మ పట్ల గంగమ్మకు చెప్పలేని కృతజ్ఞత పుట్టుకువస్తుంది. దాచకున్న పైసలూ,బట్టలూ, నిలువ నీడా సర్వం బుగ్గిపాలైన కష్టంలోనూ మనుషులు ఒకరి మనసులో ఒకరు స్థానం పదిలం చేసుకోవడం మనసుకు హత్తుకునేలా వివరించారు ఈకథానికలో. భార్యాభర్తల మధ్య ప్రేమను సైతం ఆర్థిక పరిస్థితులే నిర్ణయిస్తాయి. అవసరాలకు తగ్గ ఆదాయం లేని దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇవి మరీ చిక్కులు తెచ్చిపెడతాయి. అలాంటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, లేనిపోని భావోద్వేగాలకు, వాదవివాదాలకు లోనై కన్నీళ్ళకు బలైపోకూడదని హెచ్చరిస్తుంది ‘ప్రేమాంజలి’ కథానిక.
తాగుబోతు మగడి చేత చావుదెబ్బలు తినివచ్చిన పనిమనిషి లక్ష్మమ్మకూ, ఆమె పిల్లలకూ ఇంత తిండిపెట్టి రాత్రి పడుకోవడానికి చోటిస్తుంది సీత. అర్ధరాత్రి దాటాక పీకల దాకా తాగివచ్చిన సీత భర్త, తల్లిగారింటి నుంచి డబ్బులు తెమ్మని ఆమెను వేధించడం గమనించిన లక్ష్మమ్మ, తన స్థితి డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నదని గ్రహించి తెల్లవారేసరికి మొగుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ‘పనిపిల్ల’ కథలో, అన్నీ ఆద్యంతం చదివించే కథలే.

స్వప్న మాసపత్రిక, సెప్టెంబరు 2012 సంచిక నుంచి

* * *

“అడ్డా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అడ్డా On Kinige

Related Posts: