‘మో’లోని ఇంటీరియర్ మోనోలోగ్

‘మో’ పుస్తకం నిషాదంను ప్రముఖ రచయిత సుధామ ఆంధ్రభూమి పత్రికలో సమీక్షిస్తూ…”‘మో’ కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీ కాదని అంటారు. కవికీ పాఠకుడికి మధ్య ఎడం ఎందుకొస్తుందో చెబుతూ – “అర్థ బదలాయింపును దబాయించే చేసే మెటాఫర్స్, రూపకాలు కవికి వున్నంత చిరపరిచితంగా చదువరికి ఉండకపోవడమేనని” సుధామ అంటారు.
‘మో’ ది క్లోజ్ ఎండింగ్ రచన అని, అందువల్లే పాఠకుడి ఆలోచనాశక్తికి ఎక్కువ శ్రమ ఇస్తుందని సుధామ అంటారు.
అయితే, శ్రమయేవ జయతే అన్నట్లుగా, పాఠకులు శ్రమిస్తే, మో కవిత్వాన్ని ఆస్వాదించగలరని సుధామ వ్యాఖ్యానిస్తారు.
పూర్తి సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

 

మో రాసిన నిషాదం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

నిషాదం (మో) On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మిశ్రమ భావోద్వేగాల సమాహారం

కరువు కురిసిన మేఘం” వై. హెచ్. కె. మోహన్‌రావు గారు రాసిన కవితా సంకలనం. ఇందులో 37 కవితలున్నాయి.

“విభిన్నమైన అంశాలపై కవితలున్నా, వాటిల్లో అంతర్లీనంగా ఉన్న వేదనంతా, మనిషి మనిషి కాకుండా పోతున్నాడనే” అని అంటారు శ్రీ శివారెడ్డి ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో.

మోహన్‌రావు గారు తన గురించి చెబుతూ, తనది “క్రింద పడిపోయినవాడి పక్షాన నిలిచే తత్వమని” అన్నారు. తెలుసుకోవాలనే తపన, సాహిత్య పఠనం తనని కవిత్వం రాసే దిశకు నడిపించాయని చెప్పారు.

ఈ సంకలనంలోని ఎక్కువ కవితల్లో రైతుల కడగండ్లను గురించి వర్ణించారు. వాటిల్లో కొన్ని “కరువు కురిసిన మేఘం”, “స్వేదం సహనం వీడక ముందే”, “హాలా’హలధరు’డై”, “పల్లె మేల్కొంటునట్లు…..” “సుంకురాలిన కంకి”.

కరువుకురిసిన మేఘం” కవితలో, “చల్లగా వర్షించే మేఘం నలుపు/మృత్యు సంకేతమని/అది కరువును కురిసిన తరువాత తెలిసింది” అని అంటారు. “పంట పొలాల్లో/పైరుకు జీవంపోసే నది/చుక్క జారకుండా/ప్రాణాలు తీయడం కూడా /నేర్చిందని తెలిసింది” అని రైతుల వ్యధని వ్యక్తం చేసారు.

స్వేదం సహనం వీడక ముందే” అనే కవితలో, కాడిజారిన సేద్యం గురించి బాధ పడుతూ, “అదేమిటో ఎంత వెదికినా/మేఘంలో చిరునామా దొరకని వాన చినుకు/కంటిలో కన్నీరై కనిపించింది/పాతాళం దాకా ఆనవాలు చిక్కని నీటిచుక్క అడ్రస్సూ/అక్కడే దొరికింది” ఎంత ఆర్ద్రత! మనసు చెమ్మగిల్లించే పదాలు ఇవి.

హాలా’హలధరు’డై” అనే కవితలో – సకాలంలో వర్షాలు కురవక రైతులు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావిస్తారు, “చినుకు కోసం ఎదురుచూసే ఆ కళ్లు/చేను దు:ఖానికి చెమరిస్తాయి/వర్షించని మేఘాన్ని చూసి కన్నీళ్లు కురుస్తాయి” అని అంటారు. అదే వరదలొచ్చి రైతులు నష్టపోతే, ” పుట్లెన్ని పండించినా ఉట్టిమీదకు పెడ్డరాదు” అని అంటారు.

సుంకురాలిన కంకి” అనే కవితలో “నాగలి తప్ప నాగరికం తెలియని తల్లి/కరువురాగం శృతి చేసుకుంది !” అని చెబుతూ, “గుండె పగిలిన పత్తి/రైతు బ్రతుకును వత్తినిచేస్తే/తలగుడ్డ ‘పాశమై’ వెక్కిరించింది” అంటూ బాధ పడతారు. ఏం చేస్తే సంక్రాంతి పండుగ రైతుల్లో ఉత్సాహం నింపుతుందో ఈ కవితలో చెబుతారు కవి.

పల్లె మేల్కొంటునట్లు…..” అనే కవితలో కష్టాలు పడుతున్న రైతులు చైతన్యవంతులై పట్టణ వీధుల్లో నకిలీమందుల్ని, అందిరాని ధరల్ని నిలదీయాలని చెబుతారు.

ప్రపంచీకరణ ముప్పు గురించి రాసిన కవితలు – “ఒక విధ్వంసానంతరం”, “మనీ+మనీ=మనిషి”, “విషాదాంతం”.

ఒక విధ్వంసానంతరం” అనే కవితలో ప్రపంచీకరణ కొండచిలువలా మింగేసిన తర్వాత, “బ్రతుక్కీ చావుకీ తేడా తెలియని అవాంఛిత స్థితులే గాని/నాలుగు నవ్వులు పూచే ముఖాలేవి ?” అని ప్రశ్నిస్తారు. “ఎక్కడ చూసినా కరెన్సీ కట్టల అభ్యంగనాలే తప్ప/కాస్త ఊరటనిచ్చే ఆలింగనాలే కరువయ్యాయి” అని వాపోతారు.

మనీ+మనీ=మనిషి” అనే కవితలో అంతరించిపోతున్న మానవ సంబంధాల గురించి చెబుతూ, “ప్రపంచం దగ్గరౌతున్న కొద్దీ/మనిషి మార్కెట్‌సరుకులా మారుతున్నాడు/మనిషి కొనుగోలు వస్తువులా మారిన తరువాత/తాను వస్తువుతోనే జీవనం సాగిస్తున్నాడు”అని అంటారు. సున్నితత్వాన్ని కోల్పోడాన్ని చక్కగా వర్ణించారు కవి.

విషాదాంతం” అనే కవితలో ప్రపంచీకరణ గురించి చెబుతూ, “‘’గ్లోబ్’ అంతా కుగ్రామం కావడమంటే బ్రతుకును పాతాళానికి తొక్కడమేనా?” అని ప్రశ్నిస్తారు. “గ్లోబలైజేషన్‌దోపిడి పర్యాయం/పేద దేశాల కొల్లగొట్టే బహిర్‌మార్గం/ప్రపంచీకరణ పరదాస్యమే” అని అంటారు.

అమ్మ ప్రేమ గురించి, మాతృవాత్సల్యం గురించి రాసినవి – “కొంగు సాక్షిగా”, “మమకారానికి సాకారం”.

కొంగు సాక్షిగా” అనే కవిత అమ్మకంటే సొమ్మే విలువని భావించే వారి గురించి రాసినది. ” అమ్మంటే రెండక్షరాల కూర్పు కాదు/కడుపుతీపిలో కారుణ్యం కలిస్తే అమ్మ” అంటూ అద్భుతమైన నిర్వచనం చెప్పారు.

మమకారానికి సాకారం” అనే కవిత అమ్మ గురించి గొప్పగా చెప్పిన మరో కవిత. “అమ్మకు భాష్యం అమ్మే / అమ్మను మించిన జన్మలేదు” అని అంటారు. పిల్లల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో చెబుతూ “నా బ్రతుకుకోసం, ఆమెచేతులెపుడూ పనితో పోటీ పడేవి” అని అంటారు.

గాంధీజీ గురించి, గాంధీ తత్వాన్ని గురించి రాసినవి రెండు కవితలు – “మరో సిద్ధార్థుడు”, “రెక్కలు తెగిన భారతం”.

“సత్యానికి శరీరాన్ని తొడిగితే ఆయన/రూపమొస్తుంది/సత్యాగ్రహానికి అక్షర రూపమిస్తే/ఆయన పేరే ధ్వనిస్తుంది” అని అంటారు “మరో సిద్ధార్థుడు” అనే కవితలో. గాంధీజీని ఇంత చక్కగా వర్ణించిన కవిత మరోకటి లేదంటే అతిశయోక్తి కాదు.

జాతిని సమూలంగా మార్చడానికి గాంధీమార్గం అవసరమని చెబుతూ, “రాచపుండులా మారిన జాతి రుగ్మతకు/మరో శస్త్రచికిత్స జరగాలి” అని అంటూ, “గాంధీ మార్గం విశ్వ నాందీవాచకం కావాలి” అని కోరుకుంటారు “రెక్కలు తెగిన భారతం” అనే కవితలో.

కృష్ణా నదితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాసిన కవితలు – “నదీరాగం”, “కృష్ణతరంగిణి”.

“రాగాలు తీయడం కోయిలకే కాదు/’కృష్ణ’మ్మకి కూడా తెలుసు” అంటారు కవి “నదీరాగం” అనే కవితలో. కృష్ణానది తన ప్రవాహదిశలో ఒక్కో చోట ఒక్కో రాగాన్ని పలికిస్తుందని అంటారు.

నదిలో నీటి ప్రవాహం బాగా ఉన్నప్పుడు పల్లెలెలా ఉండేవో వర్ణిస్తారు, “కృష్ణతరంగిణి” అనే కవితలో. నీటి ప్రవాహం తగ్గిపోతే, రైతుల గుండెలు వడబడుతున్నాయని అంటారు. కరువుని త్రోలగ గలగల సాగమని నదిని కోరుకుంటారు కవి.

ఘనీభవిస్తున్న నదులు” అనే కవితలో మతమౌఢ్యాన్ని నిరసిస్తారు.

తెలుగు భాష గురించి, “అమ్మంటే ఏమిటి మమ్మీ!” అనే కవితలో చక్కగా చెప్పారు.

పైర్లను కబళిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి “రియల్ రోగం” అనే కవితలో హృద్యంగా చెప్పారు.

వివిధ పత్రికల్లో ప్రచురితమై, బహుమతులు పొందిన కవితలివి. పాఠకులలో మిశ్రమ భావోద్వేగాలను కలిగించే కవితలివి. కవితావస్తువు సార్వజనీనమై, భాష సరళంగా ఉండడం వలన ఈ కవితలని ఆసాంతం హాయిగా చదువుకోవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/-. నెలకి రూ.30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కరువు కురిసిన మేఘం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కుండీలో మర్రిచెట్టు

విన్నకోట రవిశంకర్ రాసిన ఈ కవితాసంకలనంలో 29 కవితలున్నాయి. “మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయని, జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్” అని ముందుమాటలో ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం అనిపిస్తుంది ఈ కవితలు చదివితే.

ఇందులోని కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.

హోళీ: వసంతోత్సవం పండుగ సందర్భంగా రంగులతో ఆడుకుంటూ తనలోని భేషజాలని వదిలించుకుని, మనిషి తనని తాను చేరుకోడాన్ని; ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురించి పూలు పూచడంతో పోల్చారు ఈ కవితలో.

ఉదయాలు: చిన్న చిన్న పదాలలో ఎంతో చక్కని భావల్ని నింపిన కవిత ఇది. ఆశనిరాశల మధ్య జరిగే దోబూచులాటని ఈ కవిత వర్ణిస్తుంది. కల అందమైన భ్రమ కాగా, జీవితం కఠినమైన వాస్తవం అని ఈ కవిత చెబుతుంది.

కుండీలో మర్రిచెట్టు: విశాలంగా, ఊడలు దాల్చి పెరిగే మర్రిచెట్టుని, కుండీలో పట్టేడట్టుగా బోన్సయ్‌గా మార్చేసారని బాధ పడుతూ, నిండైన దాని జీవితాన్ని ఎవరో అపహరించారని వాపోతారు కవి. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని, అది ఎదుటివారికే ప్రయోజనకరమని వారిని నమ్మిస్తాడని అనే అర్థం గోచరిస్తుంది ఈ కవితలో.

స్త్రీ పాత్ర: తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది స్త్రీ. మహిళలు లేని పరిసరాలని ఊహించడం కష్టం. “హఠాత్తుగా అసంగతంగా మారిన/అక్కడి వాతావరణానికి/ఆమె అర్థం కల్పిస్తుంది” ఎంతో లోతైన అర్థం ఉందీ కవితలో.

నిద్రానుభవం: రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా బాధపడేవారికి, అతి తేలికగా నిద్ర పట్టేసే వాళ్ళకి మధ్య తేడాని ఈ కవిత చూపుతుంది. అతి తేలికైన పదాలతో అలవోకగా సాగిన కవిత ఇది.

రామప్ప సరస్సు: తమకి దూరమైన మిత్రుడి స్మృతిలో ఈ కవిత రాసారు రవిశంకర్. ఎంత అందమైన, క్రూరమైన సరస్సో అని బాధ పడతారు.

జ్ఞాపకం: తరచూ విస్మరించే సన్నిహితులను తలచుకుంటూ రాసిన కవిత ఇది. అమ్మని ఉద్దేశించి రాసినా, దీన్ని మనం విస్మరించే వ్యక్తులకు అన్వయించుకోవచ్చు. బంధాలను పునర్దర్శించేందుకు ఉపకరిస్తుంది ఈ కవిత.

ట్రాన్సిషన్: ఈ కవిత మానవ జీవితానికి అద్దం పడుతుంది. జీవితమంటేనే కొన్నింటిన్ పోగొట్టుకోడం, మరికొన్నింటిని పొందడం. కొన్ని బంధాలను తెంచుకోడం, కొన్నింటిని అల్లుకోడం. మనిషి జీవితమంటా ట్రాన్సిషన్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుందీ కవిత.

గాయం: మానవత్వాన్ని మార్పిడి చేసి, అమర్చుకున్న అలసత్వానికి విరుగుడు లేదంటారు కవి. వైద్యవృత్తిలోని లోపాలను అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది ఈ కవిత.

భోపాల్: యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ ప్రమాదం ఈ కవితకి నేపధ్యం. తన బిడ్డని రక్షించుకోలేని ఓ తల్లి ఆవేదనని ఈ కవిత చిత్రించింది. ఇది చదివాక మనసు మొద్దుబారిపోతుంది.

శివకాశి: ఇతరుల జీవితాలలో పండగ వెలుగులు నింపేందుంకు, తమ బ్రతుకులని మసి చేసుకునే బాల కార్మికులపై రాసిన కవిత ఇది. ” అతని జీవితంలో/అల్లరిలేదు; ఆటల్లేవు;/తప్పటడుగుల్లేవు;/ తడబడే మాటల్లేవు/” చిన్న చిన్న పదాలలో అక్కడి దృశ్యాన్ని కళ్ళముందుంచారు కవి.

గ్లాస్‌నోస్త్: ఒక్కప్పటి సోవియట్ యూనియన్ సంస్కరణల గురించి రాసిన కవిత ఇది. రష్యా గురించి ప్రజలు ఊహించుకున్న ఘనతంతా నిజం కాదని కవి అంటారు.
“ఇప్పుడు తెర తీసేశారు/ ఇక యే దాపరికమూ లేదు! /ఈ రహస్యం/ ఇంత వికృతంగా ఉంటుందని/ నేననుకోలేదు./ నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు/ అసలు రూపం ఇదని /నేనూహించను కూడా లేదు” అని అంటారు.

మోళీ: ఇళ్ళలో ఆడవాళ్లపై జరిగే గృహహింసని ప్రస్తావిస్తుంది ఈ కవిత. కాపురం మగాడికి మోళీ ఆటలాంటిదని, అది అద్భుతంగా సాగుతోందని జనాలని నమ్మించడానికి కుటుంబ హింసని ఆయుధంగా వాడుకుంటారని అంటారు కవి.

దూరం: ఈ కవిత స్నేహితుల మధ్య దూరాన్ని ప్రస్తావిస్తుంది. కాలక్రమంలో గాఢమైన స్నేహమైనా బీటలు వారుతుందని, స్నేహితులు పునఃపరిచయం చేసుకోవాల్సిరావచ్చని చెబుతుందీ కవిత. అయినా పాత జ్ఞాపకాలు వాడిపోవని అంటుంది.

చలనచిత్రం: అతి వేగంగా సాగిపోయే జీవితాన్ని కాప్చర్ చేయడం సాధ్యమేనా? జీవితపు కనిపించని ప్రవాహపు కదలికలో ఉన్న అందాన్ని, దేనితో కేప్చర్ చెయ్యమంటావని కవి ప్రశ్నిస్తారు.

ఇంకా ఎన్నో చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 30/- మార్మికమైన అనుభూతులను ఆస్వాదించడానికి ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి.

కుండీలో మర్రిచెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మియర్ మేల్

మగవారి కోసం తెలుగు కవితలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ కవితాసంకలనాన్ని రచించినది అరుణ్ సాగర్. ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఈయన గతంలో “మేల్ కొలుపు” అనే కవితాసంకలనాన్ని వెలువరించారు.

అరుణ్ సాగర్ కవిత్వంలో వస్తురూపాలు కలగలసి పోతాయని, నిజానికి సాగర్ కవిత్వంలో కనిపించేది వస్తు వైవిధ్యమో లేక, రూప వైవిధ్యమో కాదని అది అనుభవ సందర్భ వైవిధ్యమని అంటారు ఈ పుస్తకానికి ముందు మాట రాసిన సీతారాం.

దాపరికాలు….దాగుడుమూతలు..నక్క వినయాలు…..బేవార్స్ మాటలు మచ్చుకైనా కనవడవీ సంకలనంలో అని అంటారు ప్రసాదమూర్తి.

ఈ పుస్తకంలోని కొన్ని కవితలను చూద్దాం.

భ్రమరమోహం: ఏదో సౌందర్యం కోసం వెదుకుతున్నాడు కవి ఈ కవితలో:
“ఏమరుపాటున రాలిపడి/ ఏ సౌందర్యం కోసమో/కళ్లు అరచేతుల్లో అద్దుకుని/శిశిరాకాశం కింద/అనుమానాస్పదంగా సంచరిద్దాం”

హోమ్‍కమింగ్: చాలా రోజులకు ఇంటికి తిరిగొచ్చే వారి భావానుభూతులను కవి చక్కగా వర్ణించారు. తమ కోసం ప్రకృతి ఎలా ఎదురుచూస్తుంటుందో వివరించారు:
“చిన్నప్పటి ఫోటోని /గుండెకు తగిలించుకున్న మట్టి గోడ/నా కోసం వానలో తడిసి/పరిమళాలు పోయింది/వంగిన చూరు నుంచి” -ఎంత ఆహ్లాదకరమైన భావన. తాను అక్కడందరికి పరిచయమేనని చెపుతూ
“అందుకే కదా/ నేను వచ్చానో లేనో/టేకు చెట్టు/పూల గుచ్ఛంతో నవ్వింది/ ఓ పాట పింఛం విప్పింది” అని అంటారు.

ది డోర్స్: తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో తనలోకి తాను రావాలనుకుంటాడో వ్యక్తి. గుండె కవాటాలను తెరచుకోవాలనుకుంటాడు.
“కుటుంబం నుంచి/కార్యాలయం నుంచి/రక్తపాశాల నుంచి/ఆడవాళ్ళ నుంచి / అడుక్కుతినేవాళ్ళ నుంచి / మొబైల్ ఫోన్ నుంచి /గడియారం లోంచి/ ఏటిఎం మిషన్ లోంచి/గోడలు దూకి దూసుకువస్తున్నాను”

నీలె గగన్ కె తలె: పాటల్ని ప్రేమించే ఓ భావుకుడి కవిత ఇది. నా గడచిన రోజుల్ని ఎవరైనా వెనక్కి తెస్తే బాగుండు అనుకుంటాడు.

షాన్: తన జీవితానికి ఘనసమయం గురించి చెబుతున్నాడు ఇందులో.
“నా ఖజానా తెరిస్తే /స్నేహితులు/తన్హా సఫర్ /ఆకాశం కింద ఎన్నో రుతువులు/పలురుచులు /విసవిసా దాటిన దశలు…..
“జీవితపు ఘనసమయం/నేనకసాన్నంటిన!”

సాలభంజిక: ఇది ఇలియానా గురించి రాసిన కవిత
“మగధ నుంచి /నేరుగా దిగుమతి చేసుకున్న/గాంధార శిల్పం/కళింగ తీరపు/ లావణ్య రేఖావిలాసం”

టి. ఆర్. పి: డెడ్‌లైన్లే లైఫ్‌లైన్లని చెబుతారు ఈ కవితలో.
“ప్రతీరోజూ ఒక పరీక్ష/ప్రతీరోజూ ఒక ఫలితం / ప్రతివిజయం ఇంధనం/ ప్రతి స్వప్నం రేపటి కోసం/”
“టుమారో నెవర్ డైస్/మనకు కావాలి/అంతులేనన్ని టుమారోస్”

24 సెవెన్: ఈ కవితలో ఫ్రేముల గురించి చెబుతారు.
“నీ చుట్టూ నా చుట్టూ ఫ్రేముల్/సెకనుకు ఇరవైఅయిదు వేగంతో”
“ఫ్రేములు ప్రేమలు/అద్దం పట్టిన అన్నం మెతుకులు”

లాగాఫ్: ఈ కవితని సాటి పాత్రికేయులకి అంకితమిచ్చారు.
“మోడీగార్డ్ అద్దాల గోడ/కలం వీరుడా/సృజనశీలుడా/ఆట మొదలైంది/ష్ నిశ్శబ్దం/…….” ఇదో పత్రికాఫీసుని స్ఫురింపజేస్తుంది.

మరణవాంగ్మూలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపధ్యంలో క్షణక్షణం చెదిరిపోతున్న మునిగిపోతున్న మానవుని జాడలు వెతుకున్నారు కవి ఈ కవితలో. ప్రతీదీ తొలగించబడుతుంది రెవెన్యూ రికార్డులలోంచి అని బాధపడతారు.
“పాయం బొజ్జిగాడు/లాస్ట్ ఆఫ్ ది కోయాస్/పెరిగి పెద్దయి/అలెక్స్ హేలీ అవుతాడా/ఆనకట్ట వెనుక అశ్రుజలథిలో/సీతమ్మ ముక్కుపుడక వెతుకుతాడా/లేక /అంతర్ధానపు అంచుల వేలాడి/రామాపితికస్ వలె/ఆంత్రోపాలజీ పాఠమవుతాడా”

జేగురు రంగు జ్ఞాపకం: ఈ కవితలో తన పాత స్నేహితులను, సామ్యవాద భావజాలపు అనుచరులను తలచుకుంటారు.
“ఒక రెట్రోవేదన మదిలో కదిలినప్పుడు/నా కార్పోరేట్ చింతల కొలిమిలోంచి/ఒక నిప్పు రవ్వ వేరుబడి -/ నిద్రించిన చైతన్యపు అంచులు ముట్టించినప్పుడూ/కామ్రేడ్స్!/మిమ్మల్నే తలచుకుంటాను”

కులగ్యులా: ఈ కవితలో కులపిచ్చి ఉన్న వాళ్ళని ఆక్షేపిస్తారు కవి.

సెంట్ ఆఫ్ ఎ ఉమన్: అరుణ్ సాగర్ కవితలు మగవాద కవితలని, స్త్రీవాద వ్యతిరేక కవితలని శంకించేవారు తప్పక చదవాల్సిన కవిత ఇది.

నెత్తుటి రుణం: పెట్రోలియం వనరుల కోసం ఇతర దేశాలపై అగ్రరాజ్యం చేస్తున్న దాష్టీకాన్ని వివరిస్తుంది ఈ కవిత.
“రాలిపడ్డ కుత్తుకలలో/కుతకుత ఉడుకుతున్న ప్రశ్నలు/నూనెకి నెత్తుటికి మధ్య రగులుతున్న రసాయన/ చర్యలు”
“ఎన్ని గాలన్ల నెత్తురు పోస్తే మీ కార్లు పరిగెడతాయి?/ఎన్నెన్ని మాంసఖండాలని పిండితే మీ ఆయిల్ దాహం తీరుతుంది?”

కవి పట్ల ప్రీ-ఫిక్స్‌డ్ నోషన్స్ లేకపోతే ఈ కవితలను హాయిగా ఆస్వాదించవచ్చు.

ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ.30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige

Related Posts:

పరికిణీ!!

నాటక రచయితగా, సినీ రచయితగా, నటుడిగా పరిచయం అవసరం లేని పేరు తనికెళ్ళ భరణి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భరణి రచించిన పలు కవితల సంకలనమే “పరికిణీ!!”.
ఇందులోని కవితలన్నీ చాలా వరకు మధ్యతరగతికి చెందినవే. మిడిల్ క్లాస్ జీవితాన్ని అద్భుతంగా చిత్రించారు భరణి.
మధ్యతరగతి వారి పరిమితమైన ఆదాయాలు, అపరిమితమైన అవసరాల మధ్య పొసగని పొంతనని సహజంగా చిత్రించారు భరణి.
“విరబోసుకున్న జటాజూటం లాంటి బెంగ
అందులో నెలవొంక లాగ
లీలగ మెరిసే ఫస్టు తారీఖు!” అంటారు ‘మధ్యతరగతి మహారాజు’ కవితలో.

” నువ్వుల నూనె కన్నా, ‘ O ‘ నెగటివ్ చౌక!
ఊహల్ని తుంచుకోడమో
ఉల్లిపాయల్ని నంజుకోడమో…. మంచిది” అని ఆవకాయ పెట్టుకోడం గురించి ప్రస్తావిస్తూ  అంటారు  ‘ఖారం… ఖారంగా’ కవితలో.

మధ్యతరగతి జీవితాలకి మొత్తంగా ఓ నమూనా ‘ 30 – ఫస్ట్ నైట్ ‘  కవిత.
వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు మౌనంగా అనుభవించే వ్యధని ‘ కన్య – కుమారి’ కవితలో చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి.
తనకి ఉద్యోగం రాకపోవడానికి అసలు కారణం తనలోని లోపమేనని ఓ పట్టభద్రుడు తెలుసుకోడాన్ని – ‘ గ్రాడ్యుయేట్ ‘ అనే కవిత ఆర్ధ్రంగా వర్ణిస్తుంది.
కుటుంబంలో స్త్రీ పోషించే బహుపాత్రలను క్లుప్తంగా….పదునుగా చెబుతుంది – ‘ మా ఆవిడకి మంత్రాలొచ్చు!! ‘ కవిత.
ఇక పుస్తకానికి మకుటం అయిన “పరికిణీ!!” కవిత గురించి చెప్పడం కన్నా, చదివి ఆనందిస్తేనే ఎంతో బాగుంటుంది.

అందమైన అనుభూతుల్ని మిగులుస్తూనే, ఆలోచింపజేస్తుందీ “పరికిణీ!!” కవితా సంకలనం.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభ్యమవుతుంది.

పరికిణీ!! On Kinige

– కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మంచి పుస్తకం వారి – ‘కోటయ్య కట్టిన ఇల్లు’ పుస్తక పరిచయం

కోటయ్య కట్టిన ఇల్లు On Kinige

ఈ రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం 0 – 6 సంవత్సరాల వయసు పిల్లలకోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించినది. దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. చిన్నారి పొన్నారి పాపాయిలు తెలుగు ఆనందించటానికి ఈ పుస్తకం బహుదా దోహదం చేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం కినిగే పై డిజిటల్ రూపంలో కేవలం ౩౦ రూపాయలకే అందుబాటులో వుంది.

ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.

ఆంగ్ల భాష పై మోజుతో తెలుగు మరిచిపోతున్న ఈరోజుల్లో మీ పిల్లలకు మన మాత్రు భాష ఐన తెలుగు ను నేర్పించాలనుకుంటే వెంటనే ప్రవేశించండి.

తెలుగు పిల్లలు టపటపలాడించే ప్రతి కంప్యూటర్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం!

Related Posts:

తనికెళ్ళ భరణి – ‘నక్షత్ర దర్శనం’ పుస్తక పరిచయం

నక్షత్ర దర్శనమ్ On Kinige

తనివితీరా
తారాతీరాన చేరిన
తన్మయత్వాన…
‘తెర’ మరుగైనా, తరతరాలకాదర్శమైన
తపనగా… ఇలా ‘నక్షత్రదర్శనమైన’
తళుకు చెణుకులివి!
తెరలు తెలరలుగా
తరలి వచ్చిన స్మృతి పరిమళాలివి!!

ఉచిత ప్రివ్యు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

తనికెళ్ళ భరణి రాసిన పుస్తకాలలో ఈ నక్షత్రదర్శనం ఎంతో ఆదరణ పొందింది, ఈ పుస్తకం లో ఎన్నో మధురమైన కవితలు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి

Related Posts:

“మో”- నిషాదం పుస్తక పరిచయం

నిషాదం (మో) On Kinige

“… ఈ నిషాదంలో ఇంచుమించు 71 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదం గా సంపుటీకరించాడు. ఇది విషాదంలా కూడా వినపడుతుంది. అయితే “పురందర దాసు ముందు / పొగులుతున్న భీమ్‌సేన్ జోషి” అని కొంచెం కీ లాంటి క్లూ ఇచ్చినప్పుడు మాత్రం సంగీతంలోని నిషాదం అంటున్నాడని అనుకోవాలి. గానకళకు పునాది సప్త స్వరాలు. అందులో నిషాదం సప్తమ స్వరం. ఏనుగు ఘీంకారమే నిషాదంగా జనించిందని గాన కళాబోధిని వివరిస్తోంది. కవిత్వ కళాబోధిని మనకెటూ లేదు కనుక సంగీత శాస్త్ర పరిభాషా పదాన్ని కవిత్వానికి అనవయించుకోవటం కొత్తే. సప్త స్వరాలలో రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదాలకు రెండేసి బేదాలుంటాయి. వీటిని వికృతి స్వరాలంటారని కా.క.బో అంటోంది. షడ్జమ, పంచమ స్వరాలకు వికృతి భేదం లేదు కనుక అవి ప్రకృతి స్వరాలు. కవి ఈ పుస్తకం లో! నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దష్మృత్యాన్ని, దురాగతాన్ని, దుర్మార్గాన్ని అని అన్నాడు. …..”

ఉచిత ప్రివ్యు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

“మో” వ్రాసిన భయద నిషాద, విషా, నిషా? గీతాలు మీ కోసం కినిగే పై

Related Posts:

రవిశంకర్ కవితలు – అనంత భావలోకాలకు తెరిచిన ద్వారాలు – చేరా

వేసవి వాన On Kinige

అనంత భావలోకాలకు తెరిచిన ద్వారాలు – చేరా

……శబ్ధార్ధనిబద్ధమై చిత్త ద్రవీకారకమైన భాషా సంయోజన కవిత్వమని ఒక దృక్పథం చెబితే, మరో ధృక్పథం్రకారం కవిత్వానికి భాష వాహకమైనా కవిత్వం భాషాతీతంగా ఉంటుందని చెప్పుతుంది ఈనాటిెలుగు కవులలో ఇస్మాయిల్‌గారు రెండోవాదాన్ని ప్రచలితం చేస్తున్నారు. ఆయనకు భాష ముఖ్యం కాదు. భాషా సౌందర్యం కవిత్వంలో భాగం కాదు. కవిత్వం విశ్వసత్యాలను ఆవిష్కరించాలి. భాషతో నిర్మించిన పద్యం సత్య దర్శనానికి ఒక గవాక్షంలాంటిది. దీనికి ఆయన జెన్‌బుద్ధిజం నుంచి, జాపనీస్ హైకూలనుంచి సాక్ష్యం తెచ్చుకుంటారు. తెలుగులో రెండో మార్గంలో కవిత్వం రాస్తున్నవారు కొందరున్నారు. రకం కవులు జీవితంలో సంభవించే సాధరణ సంఘటనల నుంచి, కన్పించే దృశ్యాలనుంచి, ఎదురయ్యే అనుభవాలనుంచి తాత్త్విక సత్యాలను ఆవిష్కరిస్తారు. భాషాడంబరం ఉండదు. అతి పేలవమైన అలంకారాలు ఉండవు. శబ్దమాధుర్యం వగైరా అసలు పట్టించుకోరు. సాధారణ దృశ్యాలను సంఘటనలను మామూలు మాటలను ఉపయోగించి మన అనుభవాలను కెరలించే కవిత్వం రాస్తారు. ఆలోచించకుండా చదివితే ఇది కవిత్వమేనా అని అనుమానం కూడా వేస్తుంది. భావనా నేత్రాలు విప్పిన కొద్దీ కొత్త లోకాలకు తెరలు విచ్చుకుంటాయి

—–చేరాతలు 1993 మే 2, 9,. కవిత్వానుభవం, 2001, పే. 144-145

పదేళ్ళ కిందట విన్నకోట రవిశంకర్ కవితాసంకలనం “కుండీలో మర్రిచెట్టు” ను గురించి రాస్తూ అతన్ని అరుదైన కవిగా గుర్తిస్తూ ఈ పై మాటలు చెప్పాను.

రవిశంకర్ కవితా రచన ప్రారంభించి సుమారుగా రెండు దశాబ్దాలై ఉండవచ్చు. పదేళ్ళకొక సంపుటిని వెలువరిస్తున్నాడు. తెలుగులో ఏడాదికో రెండేళ్ళకో ఒక కవితా సంపుటిని వెలువరించక పోతే చాలా మంది కవులకు నిదురపట్టదు. ఇప్పటి కవితా సంపుటి నా ముందు మాట కోసం పంపి అప్పుడే రెండేళ్ళు అయింది. కాల గమనంలో తోచిన మార్పులు చేస్తూ మరొక ప్రతిని ఇటీవలే పంపాడు. ప్రచురణ కోసం ఆదుర్దాపడని ఈ కవిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి.

ఈ పదేళ్ళలో రవిశంకర్ కవితా దృక్పథం మారలేదు. కవితా దృక్పథం మారని రవిశంకర్ రచనల్లో ఏమైనా గుర్తించదగిన మార్పులున్నాయా అని సహజంగానే ఎదురుచూస్తాము.

ఈ వ్యవధిలో అతని అనుభవాలు పెరిగాయి. ఆలోచనలు పెరిగాయి. కవితామార్గం విస్తరించింది. దానికొక కొండ గుర్తు ఇప్పటి కవితా ఖండికల పరిణామం పెరిగింది. “కుండీలో మర్రిచెట్టు” లో కవితా ఖండికలు తులనాత్మకంగా చెపితే మినీ కవితలకు కొంచెం సన్నిహితంగా ఉంటాయి. ఇప్పటి కవితా ఖండికలు తన అనుభవాలకు తగినట్లుగా పరిమాణం పెంచుకున్నట్లు కనిపిస్తాయి. అప్పటి కవితలను ఒక్కొక్కటే చదివిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందే అనిపించేది.

స్పష్టత కోసం ఇక్కడే ఒక విషయం చెప్పాలి. కవిత్వంలో క్లుప్తత సాధించదగిన గుణమే. అయితే నియత సంఖ్యాక పాదాలలోనే కవిత్వాన్ని కుదించాలనే నియమం పెట్టుకోనక్కర లేదు. తీసుకున్న వస్తువును బట్టి అది మినీ కవిత్వమో, మిడీకవిత్వమో, మాక్సీకవిత్వమో, దీర్ఘకావ్యమో అవుతుంది. కానీ ఫ్యాషన్ కోసం మినీ కవిత్వం, దీర్ఘకావ్యం రాయనక్కరలేదు. వస్తుగౌరవాన్ని బట్టి కవితారూప పరిమాణం ఉంటుంది. “వేసవి వాన” లో రవిశంకర్ కవిత్వం పరిమాణం పంచుకోవడం అవసరమైన పరిణామం.

ఇదిట్లా ఉంచి అనుభవ విస్తృతి గురించి కాసేపు మాట్లాడుకుందాము. రవిశంకర్‌కు “కుండీలో మర్రిచెట్టు” ప్రచురణానంతరం కొంత కాలానికి పెళ్ళి అయింది. తర్వాత కూతురు పుట్టింది. పిల్లలు తమ ఆటల పాటలతో తల్లిదండ్రులకు మురిపాన్ని కలిగించడం సహజం. అంతేగాక పిల్లలు అనేక విధాలుగా తమ పూర్వుల ఆకారాలను, చేష్టలను తలపింపచేస్తారు. ఇది ఒక జెనిటిక్ కంటిన్యుటీ. ఇందులో అనేక జన్యువుల సంక్లిష్ట సమాహారం మూలంగా పూర్వుల పోలికలు రకరకాలుగా కలిసిపోయి కనిపిస్తాయి. దీన్ని కవి గ్రహించి వ్యక్తీకరించిన తీరు ‘పోలికలు’ అనే కవితలో పలురకాల పరిణామాల్లో రకరకాల ఉత్ప్రేక్షలతో కనిపిస్తుంది. అంతంలో తాత్వికంగా ఇలా అంటాడు:

“వివరణ కందని దీని పెదవుల మీది చిరునవ్వు,

తమకు లభించిన ఈ కొనసాగింపుకి

వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు.

మూసిన గుప్పట్లో దాచి ఉంచింది

విప్పి చెప్పలేని వాళ్ళ సందేశం కావచ్చు”.

శాస్త్ర సత్యాన్ని తాత్త్విక కవిత్వంగా మలచ గలిగిన నేర్పు ఈ కవికున్నట్లు ఈ రకపు కవితల ద్వారా మనం తెలుసుకోగలం.

జడపధార్థాలకు మానవత్వారోపణ మనోహరంగా చేయగల శక్తి ఈ కవికుంది. ‘వేసవి వానలో’-

“అగ్ని పర్వతం ఒకటి

హఠాత్తుగా మనసు మార్చుకొని,

మంచు కొండగా మారిపోయినట్టుగా ఉంది”

అని వేసవిలో కురిసిన వాన ఎండ తాపాన్ని మాయంచేసి చల్లదనాన్ని తెచ్చిన వైనాన్ని ఉత్ప్రేక్షించిన తీరు మనోహరంగా ఉంది. ప్రతి చిన్న సంఘటనను ఫిలాసఫైజ్ చేసే టెక్నిక్ ఒకటి ఈ కవికి బాగా పట్టుబడింది. ఇతని కళ్ళు చర్మ చక్షువులు కాదు. తాత్త్విక కిరణాల ఎక్సరే కళ్ళు. వస్తువుల సంఘటనల అంతస్తత్వాన్ని వెలికి తీసి చూపించే శక్తి ఇతని కళ్ళకు ఉంది అంటే ఇతని కవిత్వానికుంది. విమానాన్ని మొదటిసారి ఎక్కినప్పుడు ప్రతివారికి కొన్ని విచిత్రానుభవాలు కలుగుతాయి

భావుకుడైన కవికి అవి అలౌకికమే. ఆ అనుభవాన్ని ‘ఉడాన్’ అనే కవితలో ఆద్యంతం మనం గమనించవచ్చు. గాలిలో ఎగురుతున్నట్టు బాల్యంలో అందరూ కలలు కంటారు. ఆ బాల్యపు కలలన్నీ నిజమైనట్టుగా ఈ కవితలో అనుభూతి చెందుతాడు.

“అద్వైతం” అనే కవితలో భిన్నధృవాల ఏకత్వాన్ని స్వభావోక్తులతో చెబుతూ గడుసుగా అద్వైత భావాన్ని ప్రతిపాదిస్తాడు. ఈ కవితలో కూడా వాళ్ళ అమ్మాయి వస్తుంది. ఈ కవితంతా Oxymoron ను నిర్వహించిన తీరుకు మంచి ఉదాహరణ. కవితంతా ఉదాహరణీయమైనా మచ్చుకు ఒక భాగం:

“ఇది నేర్వటానికి, నేర్పటానికి మధ్య

తెలివికి, జ్ఞానానికి ఉన్నంత దూరం.

అన్నింటా మమ్మల్ని అనుకరిస్తూ,

తెలియకుండానే సర్వం నేరుస్తుంది.

మా అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానమిచ్చి

అర్థం చేసుకోవటం మాకు నేర్పుతుంది.”

ఈ సంపుటిలో ప్రతి కవితలోనూ కవి తాత్త్వికపరిణతిని గుర్తించ గలుగుతాం. ‘గతచిత్రం’ అనే కవితలో గతాన్ని ఆగతాన్ని పోలుస్తూ రెంటిలోనూ మార్మికతను ప్రతిపాదిస్తాడు.

ఇతని కవిత్వమంతా చదివితే కవిత్వంలో చిక్కదనం తగ్గకుండానే వైశద్యం వైపు విస్తరించుతున్నట్లుగా గ్రహించ గలుగుతాము. అందుకే ఖండికల పరిమాణం తగినంతగా పెరిగింది. ఇతని కవిత్వాన్ని ఎన్నో విధాల వ్యాఖ్యానించవచ్చుగాని ఇతని కవిత్వం చదివే పాఠకునికి కావలసింది వ్యాఖ్యానం కాదు సాలోచన, సావధానం. ఏకాంతంగానూ మరొక తోడుతోనూ మనస్సును ప్రకృతికి సన్నిహితం చేసి చదివితే ఇతని కవిత్వం మనస్సుకు బాగాపడుతుంది. ఇందులో నేను ప్రయత్నించినది అందుకు దిశానిర్దేశం చెయ్యడమే. అక్కడక్కడ ప్రలోభపడి వ్యాఖ్యానించినా పాఠకుడికి దారి చూపించే ప్రయత్నంలో భాగంగానే.

“ఆఖరి క్షణం” అనే ఖండికలో ఈ క్రింది భాగం చదవండి

“రెండు ప్రపంచాల మధ్య

ఒకే బిందువుగా కుంచించుకుపోయిన సరిహద్దు రేఖ

రెండు కాల యవనికల్ని

గుండీలా కలిపి కుట్టిన ఏకైక సందర్భం.”

ఇది చదివితే నాయని సుబ్బారావు గారి మాతృగీతాల్లో ఈ క్రింది పద్యం గుర్తు వచ్చింది.

రెండు పొలిమేరలొకటైన రేఖ మీద

నేను నీ యొడియందున మేను మరచి

నిదుర పోదును. జోల పాడుదువు నీవు

చిచ్చుగొట్టుచు చీకటుల్ విచ్చు దనుక

ఈ రెంటి మధ్యన పోలిక ఉందని చెప్పటానికి వీటిని కోట్ చేయలేదు. కవితా నిర్వహణలో ఏ పోలికా లేదు. పోలికల్లా రెండు ప్రపంచాల మధ్య కనిపించని సరిహద్దును ఊహించడం వరకే. ఊహించిన తీరులు వేరు. సందర్బం భిన్నం. ఉన్నతంగా ఊహించగలిగిన ఇద్దరు కవుల సామర్థ్యం వీటిల్లో కనిపిస్తుంది. దీన్నే చాలాచోట్ల స్పూర్తి అనే భావన ద్వారా పూర్వం వివరించాను. కవికి పాఠకునికి మధ్యన ఇంత సేపుండటం న్యాయం కాదు. ఇంకా సమయం తీసుకోవడం నేరమవుతుంది.

ఈ రవిశంకర్ కవితలు అనంత భావలోకాలకు తెరచినద్వారాలు. ఆలస్యం చేయకుండా ప్రవేశించండి.

చేరా

జూన్ 2, 2002

వేసవి వాన On Kinige

Related Posts:

తనికెళ్ళ భరణి — పరికిణీ పుస్తక పరిచయం

పరికిణీ!! On Kinige

ఓణీ… పరికిణీ…
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న
కుర్రాడికి…
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్థం !!

ఉచిత ప్రివ్యు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

పరిచయం అక్కర్లేని తనికెళ్ళ భరణి రచించిన అద్బుతమైన కవితల సమాహారం ఈ పరికిణీ. ఈ పుస్తకంలో ఎన్నో మధురమైన కవితలు మీకు కంప్యూటర్ దూరం లో  కినిగే పై

Related Posts: