డౌన్ స్ట్రీట్ మిస్టరీ

సుప్రసిద్ధ రచయిత మధుబాబు రాసిన సాంఘిక నవల “డౌన్ స్ట్రీట్ మిస్టరీ“.

పగ ప్రతీకారాలతో రగిలిపోయిన యువకుడి కథ ఇది.

డాక్టర్ రమేష్, సురేష్ అన్నదమ్ములు. రమేష్ అమెరికాలో వైద్యుడిగా స్థిరపడితే, సురేష్ వైజాగ్‍లో వ్యాపారవేత్తగా సెటిలవుతాడు. రెండు కుటుంబాలు భౌతికంగా దూరంగా ఉన్నా, మానసికంగా ఎంతో సన్నిహితంగా ఉంటాయి.

సురేష్ కూతురికి పెళ్ళి కుదిరితే, డాక్టర్ రమేష్, ఆయన భార్య, కూతురు సాహితి ఇండియా వస్తారు. కొత్త పెళ్ళికూతురు, ఆమె స్నేహితురాళ్లు, సాహితి కలసి షాపింగ్‍కి వెడతారు. అక్కడో అల్లరిమూక వారిని అటాకాయిస్తుంది. కాబోయే పెళ్ళికూతురిపై దౌర్జన్యం చేయబోతారో నలుగురు పోకిరి వెధవలు. మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న సాహితి వారిని ఎదుర్కుని, చావగొట్టి తరుముతుంది. అవమానాన్ని భరించలేని ఆ దుష్టచతుష్టయం సాహితిని, మిగిలిన ముగ్గురు అమ్మాయిలని అపహరించి, సామూహిక మానభంగం చేసి, హత్య చేసి బీచ్‍లో పడేస్తారు.

డాక్టర్ రమేష్ న్యాయస్థానంలో పోరాడినా, అర్ధబలం, అంగబలం, రాజకీయ మద్దతు ఉన్న శత్రువుని జయించలేకపోతాడు. శత్రువు అవహేళన చేస్తుంటే అతనిని హెచ్చరించి అమెరికా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేరస్తుల పీచమణచడానికి తన కొడుకు కనిష్కని ఇండియాకి పంపుతాడు. కనిష్క ఇక్కడికి వచ్చి ఆ హత్యాకాండలో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని నిర్మూలిస్తాడు. అతనికి డాక్టర్ భువన సాయం చేస్తూంటుంది. భువన ఎవరు? ఆమెకి కనిష్కకి ఉన్న సంబంధం ఏంటి? చట్టంలోని లొసుగులని నేరస్తులు వాడుకున్నట్టే కనిష్క కూడా అంతే తెలివిగా వాడుకుని వారిని ఎలా తుదముట్టించాడు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు ఆసక్తిగా సాగిపోయే ఈ నవలలో లభిస్తాయి.

ఈ పుస్తకం ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.

డౌన్ స్ట్రీట్ మిస్టరీ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ది ఎండ్

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ది ఎండ్. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యంపై రాసిన నవల ఇది.

ప్రభుత్వ విభాగమైన ‘జలమండలి’లో పని చేసే దేవముని అనే అవినీతి అధికారి కథ ఇది. చిన్నతనంలో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, అటువంటి కష్టాలు తన సంతానానికి లేకుండా చేయాలనే లక్ష్యంతో పై సంపాదనకి అలవాటు పడి, ఉద్యోగం ఊడగొట్టుకోడమే కాకుండా చివరికి జైలు శిక్ష కూడ అనుభవిస్తాడు దేవముని. చివరికి పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో జీవితం గడపడానికే నిశ్చయించుకుంటాడు.

లంచగొండితనం మనిషంత పాతది అని స్పష్టం చేస్తూ, లంచం అంటే ఏమిటో నిర్వచించారు రచయిత. లంచంలోని రకాలను వివరిస్తారు. లంచగొండితనాన్ని నిరోధించడానికి రూపొందించిన వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. లంచగొండితనాన్ని కొలిచే బరోమీటరు గురించి, ఏయే దేశాలు ఆ స్కేలులో ముందు వెనుక వరుసలలో ఉన్నాయో చెబుతారు. లంచగొండితనానికి మూలం “నీడ్ అండ్ గ్రీడ్” అని అంటారు మల్లాది. లంచగొండితనం అనే దుష్ట సంస్కృతి మన దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జీవనదిలా అవిశ్రామంగా సాగిపోవడానికి గల కారణాలను వివరిస్తారు రచయిత ఈ నవలలో.

ప్రజలలో అధిక శాతం మంది పేదలవడం – లంచగొండితనం మరింత పెచ్చుమీరడానికి ఎలా దోహదం చేస్తుందో తేటతెల్లం చేసారు రచయిత. లంచగొండితనం ఉన్న దేశాలలో ఆర్ధికాభివృద్ధి రేటు ఎందుకు తక్కువగా ఉంటుందో, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురారో తెలిపారు. చాలా మంది తమ కులాన్ని అడ్డం పెట్టుకుని పోరాడడానికి కారణం కూడా లంచగొండితనమేనని అంటారు రచయిత. కార్పోరేట్ ఆసుపత్రులలో జరిగే దోపిడి గురించి ఈ నవలలో వివరించారు మల్లాది. అదీ కూడా ఓ రకంగా లంచగొండితనమే!

అవినీతి నిరోధక శాఖాధికారులు లంచగొండులను ప్రత్యక్షంగా పట్టుకునే రెడ్ హ్యాండెడ్ పద్దతి గురించి చక్కగా వివరించారు రచయిత. అవినీతి కేసుల్లో విచారణ ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది.

“బోనులో ఎలకపడే చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. కానీ, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే బోను ఖాళీగా కనబడుతుంది”.

జైలుకి తరలించబడిన ఖైదీల గురించి, ఖైదీలలోని రకాల గురించి రచయిత ఇచ్చిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నమన్న భావన కలుగుతుంది.
అన్ని రకాలుగా నష్టపోయినా, కొత్త జీవితం గడిపేందుకు దేవముని కుటుంబం చేసిన ప్రయత్నాలు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. కేరళలోని గురువాయూర్‌లోని కృష్ణుడి గుడి గురించి, అక్కడికి దగ్గర్లోని పున్నత్తూరు కోట గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే దేశంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విడివిడిగా ఆలయాలున్నది కేరళలోనే అని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే చాకెట్ల గురించిన వివరాలు, చాక్లెట్ల గురించి ఎంతో ఆసక్తికరమైన కొటేషన్లను అందించారు రచయిత ఈ పుస్తకంలో.

పాఠకులకి ఉల్లాసాన్ని కలిస్తుందీ నవల.

ది ఎండ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

ది ఎండ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

పునరాగమనం

ఇది శ్రీపాద స్వాతి రాసిన మొదటి నవల.
ఈ నవలలో ప్రధాన పాత్ర వసంతలక్ష్మి. ఆమె భర్త పేరు డాక్టర్ శ్రీ. కూతురు సుమ ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదివి లండన్‌‍లో ఉద్యోగం చేస్తోంది. కొడుకు సుమంత్ ముంబైలో సినిమా నటుడిగా స్థిరపడ్డాడు.
భర్త పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళింట్లో ఓ పార్టీ జరుగుతుంది. ఫంక్షన్ ముగిసాక, అలసిపోయానంటూ శ్రీ కాసేపు పడుకుంటాడు. అయితే అతను నిద్రలోనే కన్నుమూస్తాడు. ఈ హఠాత్పరిణామం వసంతలక్ష్మి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ఈ షాక్‌నుంచి తేరుకోలేకపోతుంది.
ఆమెకి దూరంగా ఉండే కొడుకు, కూతురు ఆమె మనోవేదనను పట్టించుకోరు, తేలికగా తీసుకుంటారు. వసంత స్నేహితులు ఆమెని ఓదార్చి ఇదివరకటిలా ఉత్సాహంగా జీవించేలా చెయ్యాలనుకొంటారు. కానీ వసంత తన స్నేహితులని కలుసుకోడానికి ఇష్టపడదు. కొన్నాళ్ళ తర్వాత, “ఎంతటి విపత్తునైనా చిరునవ్వుతో అనుభవించాలి” అనే తన భర్త మాటలని గుర్తు చేసుకుంటుంది. భర్త భౌతికంగా లేకపోయినా, అనుక్షణం తనలోనే ఉన్నాడని, తను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుని, ఏదన్నా ఉద్యోగం చేద్దామనుకుంటుంది. ఒక పత్రికాఫీసులో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది.
ఆ పత్రికలో చేరాక తనలో ఓ సృజనాత్మక రచయిత్రి ఉన్నదని ఆమె గ్రహిస్తుంది. తనలోని సృజనాత్మకతను వెలికితెచ్చి నవలలు రాయడం మొదలుపెట్టి, మంచి పేరు తెచ్చుకుంటుంది. సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెకు దగ్గరవ్వాలని కొందరు మగవాళ్ళు ప్రయత్నిస్తారు, లొంగదని గ్రహించాక, ఆమె మీద పుకార్లు పుట్టిస్తారు. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆమె తన రచనావ్యాసాంగాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు చాలా అవార్డులొస్తాయి. మీడియా వాళ్ళు ఆమె వెంటపడతారు. ఇంటర్వ్యూలలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ప్రశ్నిస్తారు.
“నవలల్లో రాసినదంతా మీ వ్యక్తిగత జీవితమే అంటారు. నిజమేనా?”అని ఆమెని అడుగుతారు. ఆమె పిల్లల గురించి చెప్పమంటారు. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతారు. ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ వసంత తాను డాక్టర్ చైతన్యని పెళ్ళి చేసుకున్నానని, ఆ విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నిర్భయంగా సమాధానం చెబుతుంది.
ఈ రకంగా ఆమె, ముగిసిపోయిందనుకొన్న తన జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది. ఇదే ఆమె పునరాగమనం.
చదివించే గుణం కలిగిన శైలి, సన్నివేశాల కల్పన, సంభాషణల ద్వారా పాత్రలని పాఠకుల ముందుంచడం వలన నవలని ఆసక్తిగా నడిపారు రచయిత్ర్రి.
కౌముది వెబ్ పత్రికలో సీరియల్గా ప్రచురితమైన ఈ నవల ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

పునరాగమనం On Kinige

Related Posts:

పరంజ్యోతి

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఆధ్యాత్మిక నవల ఇది.

నెమలికొండ రాజకుటుంబంలో కడపటి సంతానంగా పుట్టిన విజయరామరాజు అతి గారాబంగా పెరుగుతాడు. పెద్దన్నయ్యకి కష్టపడే తత్వం, చిన్నన్నయ్యకి తెలివితేటలు ఉన్నాయి, కానీ రామరాజుకి మాత్రం ఈ రెండు గుణాలు అబ్బలేదు. విద్య నేర్చుకోడు, ఎంత సేపు ఆటలు, అల్లరి చేష్టలతో బాల్యం గడచి పోతుంది. యవ్వనంలోకి ప్రవేశించాక స్త్రీలోలత్వానికి గురై శారీరకంగా, నైతికంగా పతనమవుతాడు.

వివాహం చేస్తే బాధ్యత తెలిసొస్తుందేమోనని పెద్దలు భావిస్తారు. శ్రీకాకుళం ప్రాంతంలోని ఓ సంస్థానాధీశుడి కుమార్తెతో రామరాజు వివాహం జరుగుతుంది. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు కుదురుగానే ఉంటాడు రామరాజు. కానీ కొత్త పెళ్ళాం పాతబడిపోయాక, పాత వాసనలు తలెత్తుతాయి. ఇంట్లోని ఒక్కో విలువైన వస్తువును వేశ్యల పరం చేస్తూ, సుఖరోగం పాలవుతాడు రామరాజు. అతని ప్రవర్తనని అందరూ అసహ్యించుకోడం మొదలు పెడతారు. ఈ లోగా అతనికి ఓ కొడుకు జన్మిస్తాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా, మళ్ళీ అతని ఆగడాలు మితిమీరిపోతాయి. అతని అఘాయిత్యాలు భరించలేక అతని బావమరిది రామరాజుపై విషప్రయోగం చేస్తాడు. రామరాజు మరణిస్తాడు.

శవాన్ని దహనం చేస్తుండగా కుంభవృష్ఠి కురిసి, గోదావరికి వరదొస్తుంది. సగం కాలిన శవం వరదలో కొట్టుకుపోతుంది. నదిలో కొట్టుకొచ్చిన శవాన్ని సహజానంద అనే ఋషి వెలికి తీయించి, కాయకల్ప చికిత్స చేసి ఆ కాయానికి ప్రాణం పోస్తాడు. కొత్తగా ప్రాణం పోసుకున్న ఆ కాయానికి ‘పరంజ్యోతి’ అనే పేరు పెడతారు. పరంజ్యోతి శరీరం యువకునిలా ఉన్నా, శిశువులా, బాలుడిలా ప్రవర్తించి, కౌమారాన్ని అనుభవించి యవ్వనానికి చేరుకుంటాడు. ఉన్నట్లుండి అతనికి తన తల్లిదండ్రులెవరో, బంధువర్గం ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని చెప్పి అతనికి ధ్యానం చేసుకోమని చెబుతారు సహజానంద. కొన్నాళ్ళయ్యాక ఆధ్యాత్మికంగా కాస్త పురోగతి సాధిస్తాడు. ఉన్నట్టుండి ఒకరోజు అతనికి తన గతం గుర్తొస్తుంది. తనని చంపిన బావమరిదిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ప్రస్తుతం ఉన్న సాధు రూపం అతన్నికట్టిపడేస్తుంది. తనలో చెలరేగుతున్న ద్వైధీభావాన్ని అణచుకునేందుకు గురువుగారిని శరణుకోరుతాడు పరంజ్యోతి. మరింత సాధన చేయమని సెలవిస్తారు సహజానంద. ఆధ్యాత్మికంగా క్రమంగా పురోగతి సాధిస్తాడు పరంజ్యోతి. అతనిలోని దుష్ట సంస్కారాలు మెల్లిగా క్షీణించసాగాయి. ఇంతలో నెమలికొండ సంస్థానానికి చెందిన కొందరు ప్రజలు పరంజ్యోతిని చూసి, రామరాజుగా గుర్తిస్తారు. ఇక ఇక్కడి నుంచి రెండు సంస్థానాలలోను, ఆంగ్ల పాలకులలోను అలజడి కలుగుతుంది. గూఢచారులు పరంజ్యోతిని అనుక్షణం గమనిస్తుంటారు. రామరాజు అక్క, అమ్మమ్మ మాత్రం అతన్ని నీడలా వెంటాడి వచ్చి సంస్థానం బాధ్యతలు స్వీకరించమని వేధిస్తుంటారు. అతన్ని ఎలాయినా పాత రామరాజుని చేయాలని పాత పరిచయాలున్న స్త్రీలను నియోగిస్తారు, అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరికి విషయం న్యాయస్థానానికి చేరుతుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పాడు? తాను రామరాజునని పరంజ్యోతి అంగీకరించాడా? అసలు చనిపోయిన మనిషిని అదే శరీరంతో తిరిగి బ్రతికించగలరా? పరంజ్యోతి తన పగ తీర్చుకున్నాడా? ఇవన్నీ ఆసక్తిదాయకంగా ఉంటాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. నవల ప్రొలోగ్‌లో దశమహా విద్యల అధిదేవతల గురించి చెప్పారు రచయిత. చిన్న మస్తాదేవి గురించి చెబుతూ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆ దేవి ఆలయం గురించి చక్కగా వివరించారు. స్థలపురాణంలోని కథని చెప్పి అందులోని అంతరార్థాన్ని వివరించారు.

ఓ సందర్భంలో మజ్జిగలోని రకాల గురించి, వాటిని సంస్కృతంలో ఏమంటారో, ఆధ్యాత్మిక సాథకులు ఎటువంటి మజ్జిగ తీసుకోవాలో తెలియజేసారు.

‘ ఇల్లు ఇరకటం’ , ‘ఆలి మరకటం’ అనే సామెత జనాలో నోళ్ళలో అపభ్రంశమైందని, అసలు సామెత ‘ ఇల్లు ఇరు కవాటం…… ఆలి మరు కవాటం’ అని స్పష్టం చేస్తారు.

ఈశవాస్యోపనిషత్‌లోని “ఓం పూర్ణమద, పూర్ణమిదం పూర్ణాతీ పూర్ణముదుచ్యతే” అనే శాంతిమంత్రానికి రచయిత వివరించిన అర్థం ఎంతో హృద్యంగా ఉంది.

నర్మదా నదీ పరిక్రమ గురించి చెబుతూ, ప్రదక్షిణలో ఒక రోజు ఒక జన్మకి ప్రతీక అని, నదీపరిక్రమని ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించాలని; అలాగే మనం అనేక జన్మలెత్తాక, ఎక్కడ నుంచి అయితే ప్రారంభించామో అక్కడికే తిరిగి చేరుకుంటామని, అదే ఆత్మసాక్షాత్కారమని చెబుతారు.

పంచపాండవులు పాత్రలను సాధకుడికి ఉండాల్సిన లక్షణాలకి ప్రతీకగా మలిచారని, పాండవుల పేర్ల వెనుక ఉన్న నిగూఢార్థాన్ని విడమరచి చెప్పారు మల్లాది.
మనిషిని కట్టిపడేసే బంధం గురించి రచయిత ఆసక్తికరమైన ఉదాహరణలతో వివరించారు.

దురలవాట్లకు మనుషులు ఎలా బానిసలవుతారో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల ఆథ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/-. నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

పరంజ్యోతి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

అందమైన జీవితం

జీవితం సుఖదుఃఖాల మేళవింపు.  దుఃఖాన్ని తట్టుకుంటూ ఆనందాలను ఆస్వాదించడం ఒక కళ. అదే జీవన కళ.

జీవితం సంతోషంగా గడపాలని అందరం కోరుకుంటాం, సంతోషకరమైన సంఘటనలు, సందర్భాల కోసం ఎదురు చూస్తాం.  మన చేతులలోనే ఉన్న, మన చేతల ద్వారా పొందగలిగే చిన్న చిన్న ఆనందాలను తరచూ విస్మరిస్తాం.

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో, కొద్దిపాటి సర్దుబాట్లతో జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవచ్చో ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి తన నవల “అందమైన జీవితం”లో చెబుతారు.

రోజూవారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాలను ఆహ్లాదకరమైన అనుభూతులుగా ఎలా మార్చుకోవచ్చో మల్లాది చెబుతారు.

స్త్రీపురుషుల మధ్య స్వచ్చమైన స్నేహం ఉండడం ఎలా సాధ్యమో ఈ నవల తెలియజేస్తుంది.

కుటుంబ సభ్యులు …ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి నుంచి మరొకరు ఏమి ఆశిస్తారు, వాటిని ఎలా నిలబెట్టుకోవచ్చో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో ఈ నవల తెలుపుతుంది.

తోటి వారికి మనకు వీలైనంత సాయం చేయడంలో ఎంత తృప్తి లభిస్తుందో ఈ పుస్తకం  ద్వారా తెలుస్తుంది.

ఎలా ప్రవర్తిస్తే మనమంతా ఒకరితో ఒకరం మానసికంగా కలిసి ఉండగలుగుతామో, ఎలా ఆనందంగా జీవించగలుగుతామో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

అయితే కాలంతో పాటుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో, వైద్య రంగంలో వచ్చిన పురోగతి వలన ఈ నవలలోని కొన్ని ఘట్టాలు విచిత్రంగా అనిపిస్తాయి…ఉదాహరణ: తన భార్య గర్భంలో ఉన్నది ఒక బిడ్డ లేక ముగ్గురా అనేది భర్తకి తెలియకపోవడం.  ఇప్పుడు చదువుతుంటే ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా, దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం స్కానింగులు అందుబాటులో లేని కాలంలో ఇలా జరగడానికి అవకాశం ఉండేదని మరవకూడదు.

ఎలా ప్రవర్తిస్తే మనమంతా ఒకరితో ఒకరం మానసికంగా కలిసి ఉండగలుగుతామో, ఎలా ఆనందంగా జీవించగలుగుతామో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

ఏదేమైనా, హాయిగా చదివించే పుస్తకం ఇది. దీనిలో చెప్పిన అంశాలను పాటించగలిగితే, మన జీవితాలను కూడా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఈ నవల డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మీరు కొనుగోలు చేసి లేదా, అద్దెకు తీసుకుని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

అందమైన జీవితం On Kinige

– కొల్లూరి సొమ శంకర్

Related Posts:

చతుర్నేత్రుడు – మధుబాబు – జానపద నవల

చతుర్నేత్రుడు

ప్రతిష్టానపురంలో అది ముఖ్యమైన గురుకులం. సాంప్రదాయక అంశాలను గురించి బోధించే అయ్యవారు యాజ్ఞవల్క్యులు తదేక దీక్షగా విద్యార్థులకు పాఠ్యబోధన కావిస్తున్న సమయం.

అమంత్రమక్షరం నాస్తి

నాస్తి మూలమనౌషధం

అయోగ్య పురుషో నాస్తి

యోజక సత్య దుర్లభః

మంత్రము కాని అక్షరము లేదు. ఔషధము కాని చెట్టు వేరు లేదు. అలాగే యోగ్యుడు కాని పురుషుడు లేడు.

కాని మహాకార్యములను సాధింపగల ప్రయోజకుడు సామాన్యముగా దొరకడు. కంచుగంట వంటి కంఠంతో తను ముందు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని వివరిస్తూ అందరివంకా సూక్ష్మంగా చూశాడు ఆయన.

విద్యావ్యాసంగం తప్ప వేరే వ్యాపకాలు ఏవీ లేనివాళ్ళు ముందువరసలో కూర్చుని వున్నారు… శ్రద్ధగా వింటున్నారు వారిలో కొందరు… వెంట తెచ్చుకున్న తాటియాకు పుస్తకాల మీద చకచకా లిఖించుకుంటున్నారు మరికొందరు.
చతుర్నేత్రుడు On Kinige

అందరికంటె వెనుక వరుసలో వున్నాడు మాధవుడు. తన సహాధ్యాయి సాంబశివుడితో ఏదో అంశాన్ని గురించి చాలా గట్టిగా చర్చిస్తున్నాడు.

యాజ్ఞవల్క్యుల వారికి సాధారణంగా కోపం రాదు. కాని ఇప్పుడు వచ్చేసింది. రెండో ఆలోచనలేకుండా పక్కనే వున్న చింతబరికెను అందుకున్నాడాయన. వేగంగా వేదిక మీదినించి దిగి, వెనుక వరుస దగ్గిరికి పోయాడు.

‘తా చెడ్డ కోతి వనాన్నంతా చెరిచిందిట… నువ్వు చెడటమే కాకుండా, సాంబశివుడిని కూడా చెడగొడుతున్నావ్‌… మూర్ఖుడివి నువ్వు’ ఖంగు ఖంగుమంటున్న కంఠంతో తీవ్రాతి తీవ్రంగా నిందిస్తూ ఛటేల్మని కొట్టాడు మాధవుడి వీపు మీద.

అదే దెబ్బ ముందు వరుసలో వున్న విద్యార్థి ఎవరికైనా తగిలితే గురుకులం అంతా ప్రతిధ్వనించేటట్లు గావుకేక పెట్టి వుండేవాళ్ళు. అంతటితో ఆగకుండా కిందపడి గిలగిలా కొట్టుకోవడం కూడా జరిగి వుండేది.

కనురెప్ప కూడా కదిలించలేదు మాధవుడు. అయ్యవారు ఆప్యాయంగా వెన్ను నిమిరినట్టు ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు.

“వీపు వాచిపోయేటట్టు కొట్టాను. నీకు నొప్పి అనిపించటం లేదా?” తాను ఎందుకు కొట్టాడో ఆ విషయాన్ని మరిచిపోయి ఆశ్చర్యంగా అడిగాడు అయ్యవారు.

“ఎందుకు అనిపిస్తుంది అయ్యవారు? నొప్పి, బాధ అనేవి వాడికి ఏనాడూ లేవు.. అవే గనుక వుండివుంటే తను తన తల్లి కడుపులో వుండగా దేశాలు పట్టుకుపోయిన తన తండ్రిని గురించి తప్పకుండా బాధపడి వుండేవాడు. వట్టి మొండి బండవాడు…” వెంటనే అన్నాడు మధ్య వరుసలో వున్న నందనుడు.

“అయ్యవారు కొట్టింది నన్ను. నొప్పిని గురించి అడిగింది కూడా నన్నే… నీ జోక్యం అనవసరం. నోరు మూసుకో! చటుక్కున పళ్ళు బిగిస్తూ అతన్ని హెచ్చరించాడు మాధవుడు.

“నోరు మూసుకోవాలా? మూసుకోకపోతే ఏం చేస్తావ్‌?” మొండిగా అడిగాడు నందనుడు.

తనెక్కడున్నాడో మర్చిపోయినట్టు ఎగిరి ముందుకు దూకాడు మాధవుడు. కుడిచేతిని తలమీదినించి గిర్రున తిప్పి అతని భుజాల మీద బలంగా చరిచాడు.

“చచ్చిపోయాను బాబోయ్‌…. నేను చచ్చిపోయాను” గావుకేక పెట్టాడు నందనుడు.

దెబ్బపడింది భుజాలమీదే అయినా, తాడిచెట్టు మీది నించి కింద పడినట్టు కంపించిపోయింది అతని శరీరం…

చెవుల వెంటా, నాశికా రంధ్రాల వెంటా వెల్లువలా వెలువడింది ఎర్రటి రక్తం.

విపరీతమైన భయంతో వణికిపోతూ కూర్చున్నచోటి నించి లేచి దూరంగా జరిగారు ఆ వరుసలో వున్న విద్యార్థులు అందరూ…..

పాఠ్యబోధనలో అత్యంత సమర్థుడే యాజ్ఞవల్క్యుల వారు… నియమ నిష్టలున్న మహానుభావుడు. అయినా సరే రక్తాన్ని చూస్తే ఆయన కాళ్ళు చేతులు వణికిపోతయ్‌.

“పిలవండి ప్రధాన ఆచార్యులవారిని వెంటనే పిలవండి… వెంట వైద్యుడిని కూడా తీసుకురమ్మని చెప్పండి” చింతబరికెను వదిలేసి, రెండు చేతులతోను కళ్ళను గట్టిగా మూసుకుంటూ బిగ్గిరిగా అరిచాడు.

బాధను భరించడం అసాధ్యమై అచేతనంగా పడిపోయిన నందనుడి మెడను పట్టుకుని మరో దెబ్బ కొట్టటానికి సిద్ధం అవుతున్న మాధవుడి చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆపేశాడు అతని జతగాడు సాంబశివుడు. “ఆగిపో మాధవా… ఆగకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావ్‌….. ఆగిపో?” అంటూ వెనక్కిలాగి కదలకుండా నిలబెట్టాడు.

ఆఘమేఘాల మీద ఒక వైద్యుడిని వెంట బెట్టుకుని ఆ ప్రదేశంలోకి వచ్చాడు గురుకులపు ప్రధాన ఆచార్యుడు.

“నవ్వులాటకి ఏదో ఒక చిన్న తేలిక మాటను ఉచ్ఛరించాను.. ఆ కాస్తదానికే చావుదెబ్బ కొట్టాడు. కాస్తుంటే ప్రాణాలు కూడా పోయి వుండేవి…” వైద్యుడు ఏదో ఆకుపసరును నాశికముందు పెట్టి వాసన చూపించడంతో బాధనించి తేరుకుంటూ చెప్పాడు నందనుడు.

యాజ్ఞవల్క్యులు కిందికి వదిలేసిన చింతబరికెను తను తీసుకున్నాడు ప్రధాన ఆచార్యుడు.

“గురుకులంలో చేరినప్పటినుంచీ దురుసుగానే ప్రవర్తిస్తున్నావ్‌. పేరు ప్రతిష్టలున్న కుటుంబంలోనించి వచ్చావని ఇంతవరకూ ఉపేక్షిస్తూ వచ్చాను.. ఇక ఊరుకోవడం అసంభవం…” అంటూ పూనకం పట్టినవాడిలా మాధవుడి వీపు మీద ఎడాపెడా కొట్టడం మొదలు పెట్టాడు.

చర్మంతో తయారుచేయబడిన కొరడా మాదిరి ఛటేల్‌ ఛటేల్మని మ్రోతలు చేస్తున్న ఆ చింతబరికె వేగాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నారు అందరూ….

జేగురు రంగు రాతితో చెక్కబడిన శిల్పంలా తల వంచుకుని నిలబడ్డాడు మాధవుడు. దెబ్బ పడిన కొద్దీ సలసలమని మరగడం మొదలుపెడుతోంది అతని రక్తం…. కోపం… దారుణమైన కోపం.. ఎదుట వున్న వారందర్నీ వట్టి చేతులతోనే విరిచిపారేయాలన్నంత ఉద్రేకం…

“వద్దు…. మాధవా.. తొందరపడవద్దు.. తల ఎత్తి చూశావంటే విషయం చాలా దూరం పోతుంది.

మీ తాతగారికి తెలిసిందంటే పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది… తలవంచుకో” అందరి మాదిరిగా కళ్ళు మూసుకుని తలను పక్కకు తిప్పుకోకుండా నిలబడివున్న సాంబశివుడు చిన్న కంఠంతో హెచ్చరించాడు అతన్ని.

తాతగారి ప్రసక్తి వచ్చేసరికి చల్లబడిపోయింది ఉడికిపోతున్న మాధవుడి రక్తం… తలను మరింతగా వంచుకుని అలాగే కదలకుండా నిలబడ్డాడు.

కొట్టి కొట్టి ఆయాసం వచ్చేసింది ప్రధానాచార్యుల వారికి. చెమటతో మొఖం తడితడి అయిపోయింది.

బండకేసి బాదినట్టు నుజ్జు నుజ్జు అయిపోయిన చింతబరికెను అవతలికి విసిరేస్తూ…”వెళ్ళిపో.. నా గురుకులంలో నుంచి బయటికి వెళ్ళిపో.

ఇంకెప్పుడూ నీ మొఖం నాకు చూపించకు” అని ఆజ్ఞను వినిపించి వడివడిగా వెళ్ళిపోయాడు అక్కడినించి.

జరిగింది ఏమిటో జరగబోయేది ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ అలాగే నిలబడిపోయిన మాధవుడిని చూసి జీరపడిన కంఠంతో గట్టిగా హెచ్చరించాడు యాజ్ఞవల్క్యులవారు.

“వెళ్ళిపో… వెంటనే అవతలికి పోకపోతే బలవంతంగా బయటికి పంపించాల్సి వుంటుంది”

“పదరా మాధవా…. బయటికి పద..” చిన్న కంఠంతో చెపుతూ మాధవుడి చేయి పట్టుకుని అవతలికి తీసుకుపోయాడు సాంబశివుడు.

ఆకాశాన్నంటుకునేటంత ఎత్తుగా పెరిగివున్న మహావృక్షాల కింద నడపబడుతున్నయ్‌ రకరకాల తరగతులు.

ఐదారు సంవత్సరాల వయస్సున్నవారి దగ్గర్నించి పాతిక సంవత్సరాల యువతీ యువకుల వరకూ అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు….

తలవంచుకుని పోతున్న పదునెనిమిది సంవత్సరాల మాధవుడి వంక వింతగా విడ్డూరంగా చూడ్డం మొదలు పెట్టారు వారందరూ.

పదునైన చురకత్తితో చీరినట్లు చిరిగి పీలికలైపోయింది చింతబరికె దెబ్బలు తిన్న అతని వంటిమీది వస్త్రం.

ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వ వంటికి అంటించినట్లు ప్రత్యక్షం అయివున్నయ్‌ వాతలు…

“ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా పడిపోకుండా ఎలా నడవ గలుగుతున్నాడు?” ఆశ్చర్యంగా అన్నాడు పై తరగతి చదువుతున్న విద్యార్థి ఒకతను.

“ఎలాగా? ఎలాగో నీకు తెలియదా? నువ్వు పుట్టింది ప్రతిష్ఠానపురంలో కాదా?” ఆశ్చర్యంగా అడిగాడు మరో విద్యార్థి.

“కాదు.. మాది అనంతనగరం… పోయిన సంవత్సరమే ఇక్కడికి వచ్చాం” నిజాయితీగా సమాధానం ఇచ్చాడు అతను.

“అలాగా.. అయితే నీకు కార్తికేయులవారిని గురించి తెలియదన్న మాట!” అన్నాడు రెండో విద్యార్థి.

“కార్తికేయులవారా? ఆయన ఎవరు?” మరింత ఆశ్చర్యంగా అడిగాడు మొదటి విద్యార్థి.

“మాధవుడికి కన్నతండ్రి. మహా మహా బలవంతుడు. మగధ పాలకులకు, మాళవ రాజులకు సింహస్వప్నం. కళింగ రాజ్యపు యుద్ధ గజాలయితే కార్తికేయులవారి సింహనాదం వినిపిస్తే ఝంకారాలు చేస్తే దూరంగా పారిపోయేవట….

“అలాగా… ఆయన పోలికలే ఇతనికి వచ్చాయన్నమాట… మరి అంతటి వీరుడి కుమారుడికి ఇటువంటి అవమానం?” ఇంకో సందేహాన్ని బయల్పరిచాడు మొదటి విద్యార్థి.

“మీరిద్దరూ నోళ్ళు మూసుకుంటారా?” ఉన్నట్లుండి తమ ఆచార్యులు కటువుగా హెచ్చరించటంతో మాటల్ని ఆపి మౌనంగా వుండిపోయారు వీళ్ళిద్దరూ….

* * * * * * * * *

“…సద్భ్రాహ్మణ వంశంలో పుట్టినవారని మీకు మేము చాలా మర్యాద ఇస్తున్నాం. కాని మీరు మాత్రం ఆ మర్యాదని నిలపుకోవటం లేదు”

బంగారు పూత పూయబడిన సింహాసనం వంటి ఆసనం మీద కూర్చుని గంభీరంగా చెప్పుతున్న రాజప్రతినిధి కేసి చాలా ఆశ్చర్యంగా చూశారు మాధవుడి తాతగారు కేశవశర్మ.

“మీ ఆగ్రహానికి పాత్రులు కావటానికి మేము చేసిన అపరాధం ఏమిటో!” సూటిగా అడిగారాయన.

“గురుకులంలో మీ మనవడి ప్రవర్తన చాలా అసహ్యంగానూ అసభ్యంగానూ వున్నదని మాకు తెలిసింది” ఇలా అయితే మేము సహించలేము..

ఏదో ఒక శిక్షను విధించాల్సి ఉంటుంది కటువుగా అన్నాడు రాజప్రతినిధి.

మాటకు మాట సమాధానం చెప్పటానికి సిద్ధంగా వున్న కేశవశర్మ తల ఆయనకు తెలియకుండానే కిందకి వాలిపోయింది.

“మీ కులపువాడే అయిన వినుతశర్మ కుమారుడు నందనుడనే కుర్రవాడిని మీ మనవడు తీవ్రంగా గాయపరిచినట్టు ఆరోపణ.. ఇదే మీకు ఆఖరి మాట..

అతన్ని మీరు సరైన మార్గంలో నడిపించుకోండి… ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే మేము ఊరుకోలేము…. ఇక మీరు వెళ్ళిరండి.

మరింత కిందికి వాలిపోయింది కేశవశర్మ శిరస్సు. ఆయనకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కళ్ళు. ఎంతో ప్రయత్నం మీద తనకు తానే నిగ్రహించుకున్నాడాయన. రాజప్రతినిధికి నమస్కారం చేసి గిర్రున వెనక్కి తిరిగాడు.

* * * * * * * * *

“అయ్యయ్యో… ఆ అయ్యోరి చేతులు విరిగిపోనూ… గొడ్డును బాదినట్టు బాదేశాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడినించి వచ్చింది?” వెన్నముద్దలో ఏదో ఆకు పసరు కలిపి మాధవుడి వంటి మీది వాతలకు అంటిస్తూ వాపోయింది చిలకమ్మ.

ప్రతిష్టాన నగరపు పొలిమేరల్లో గుడిసెలు వేసుకుని జీవించే దొమ్మరి కుటుంబానికి చెందిన నడివయసు స్త్రీ ఆమె. మాధవుడి జతగాడు సాంబశివుడికి తల్లి.

“అంతా మాధవుడిదే తప్పు… తను కొట్టే దెబ్బను అవతలివాడు భరించగలడో భరించలేడో చూసుకోడు.. అంతా వట్టి మొండి మాలోకం” కట్టెలపొయ్యి మీద కాల్చిన చిలకడదుంపల్ని తీసుకువచ్చి మాధవుడి ముందుపెడుతూ అన్నాడు సాంబశివుడు.

“వాడు ఆ నందనుడు వట్టి వదరుబోతు… అవకాశం దొరికితే చాలు మా తండ్రిగారిని గురించి వెక్కిరింపుగా మాట్లాడతాడు. అందుకే నాకు కోపం వచ్చింది” చేతిని చాచి ఒక దుంపను తీసుకుంటూ అన్నాడు మాధవుడు.

“అయ్యయ్యో… ఆగు మాధవయ్యా…. ఆగు. ఆందోళనగా అన్నది చిలకమ్మ”

ఆగిపోయి ఆశ్చర్యంగా చూశాడు మాధవుడు.

“దొమ్మరోళ్ళం మేము… నువ్వు బామ్మడివి. మా ఇళ్ళకు రావటమే తప్పు.

మీ తాతగారికి తెలిస్తే ఆ అయ్యోరు కొట్టిన దెబ్బలకి రెండు రెట్లు ఎక్కువే పడతాయ్‌ నీకు” వివరంగా చెప్పింది చిలకమ్మ.

“నాకు అటువంటి నమ్మకాలు లేవు. సాంబశివుడు నా జతగాడు. వాడు ఇచ్చింది ఏదైనా సరే నేను తీసుకుంటా” అన్నాడు మాధవుడు.

“నువ్వు తీసుకోవచ్చు… కాని మేము ఇవ్వకూడదు.. ఎక్కువగా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో” ఖచ్చితమైన కంఠంతో చెప్పింది చిలకమ్మ.

“నాకు ఆకలేస్తోంది” అన్నాడు మాధవుడు.

“ఇంటికాడ మీ అమ్మ ఎదురుచూస్తూ వుంటుంది. వెళ్ళి ఇంటిదగ్గర అన్నం తిను” అంటూ చనువుగా చెయ్యి పట్టుకుని పైకి లేపింది ఆమె.

“ఇంటిదాకా తోడు వెళ్ళిరా…” అని కొడుక్కి చెప్పింది.

నెమ్మదిగా అడుగులు వేయడం మొదలు పెట్టిన మాధవుడిని అనుసరించాడు సాంబశివుడు.

* * * * * * * * *

“వట్టి హెచ్చరికలతో వదిలిపెడతారని అనుకోలేదు… తల తిరిగి పోయేటట్టు శిక్షవేస్తారని అనుకున్నాను….” నిష్టూరంగా రాజప్రతినిధితో అన్నాడు వినుతశర్మ.

మాధవుడి తాతగారు అవతలికి పోయిన అర్ధఘడియకు అక్కడికి వచ్చాడు అతను.

జరిగినదంతా తెలుసుకుని తన అసంతృప్తిని నిర్మొహమాటంగా బయటపెట్టాడు.

“కేశవశర్మకి శిక్ష విధించాలంటే రాజధానిలో వున్న మన చక్రవర్తి అనుమతి కావాలి.. కేశవశర్మ కుమారుడు కార్తికేయుడు చక్రవర్తికి ప్రాణ స్నేహితుడు. ఆ సంగతి మరిచిపోయావా?” సూటిగా అడిగాడు రాజప్రతినిధి.

“ఎక్కడో వున్న చక్రవర్తికి ఈ మారుమూల జరిగింది ఏమిటో ఎలా తెలుస్తుంది? మీరు అన్యాయంగా శక్ష వేయటం లేదు. ఆ పెద్దమనిషి మనవడు నా బిడ్డడిని చావగొట్టి వదిలాడు” అక్కసుగా అన్నాడు వినుతశర్మ.

“ఇప్పుడు నీకు కావాల్సింది ఏమిటి?” మరోసారి సూటిగా ప్రశ్న వేశాడు రాజప్రతినిధి.

“నా బిడ్డడి జోలికి వచ్చినందుకు వాళ్ళకి ఏదో ఒకటి గట్టిగా దెబ్బపడాలి.. అంతే” చెప్పాడు వినుతశర్మ.

“ఎవరికీ తెలీకుండా పని జరిపిస్తే సరిపోతుందా?”

“అంటే?”

“కార్తికేయుడు మహా బలవంతుడు. అతని పోలికలే అతని బిడ్డడికి కూడా వచ్చినయ్యని అందరూ అనుకుంటూ వుంటారు. అటువంటి వాడిని ఊరికే వదిలేస్తే ఎప్పటికయినా నాకు ప్రమాదమే. ఇంకా కొంచెం వయస్సు వచ్చిన తర్వాత చక్రవర్తి అతన్నే ఈ నగరానికి రాజప్రతినిధిగా నియమించవచ్చు. అందుకే ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేద్దాం… సరేనా?”

“ఎట్లా?”

“నగర ద్వారాల దగ్గిర వున్న జామతోట దగ్గరికి పోయి చూస్తే నీకే తెలుస్తుంది. ధైర్యం వుంటే వెళ్ళి చూడు…” నవ్వుతూ అన్నాడు రాజప్రతినిధి.

ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు వినుతశర్మ. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నగర ద్వారాల దగ్గిరికి బయలుదేరాడు.

“ఆకలి అదిరిపోతోంది. ఆగడం నా వల్ల కాదు” నగర ద్వారాల దగ్గరికి రాగానే సాంబశివుడితో అన్నాడు మాధవుడు.

“ఆ మాట నాకు ముందే చెప్పి వుండాల్సింది. అమ్మకి కనిపించకుండా నాలుగు దుంపల్ని దాచిపెట్టి తీసుకువచ్చేవాడిని…” అంటూ పక్కకి చూశాడు సాంబశివుడు.

మసక చీకట్లు అప్పుడప్పుడే అడుగుపెడుతున్నాయి. నగర ద్వారాల దగ్గిర వుండాల్సిన రాజభటులు ఎవరూ కనిపించడం లేదు.

“రాజప్రతినిధి అంటే ఆఖరికి వాళ్ళకి కూడా భయం లేకుండాపోయింది.

కాపలా పని వదిలేసి కులాసాగా తిరిగి రావటానికి పోయారు…” అంటూ ఒక పక్కకి అడుగులు వేశాడు అతను.

“ఎక్కడికి?” అశ్చర్యంగా అడిగాడు మాధవుడు.

“జామ తోట దగ్గరికి. నాలుగు కాయలు కోసుకువస్తా… నువ్వు ఇక్కడే వుండు” అన్నాడు సాంబశివుడు.

“దొంగతనం చేస్తావా?” మరింత ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు.

“నీతిగా వున్నా నియమంగా నడుచుకున్నా ఈ నగరంలోని వాళ్ళందరూ మమ్మల్ని తక్కువగానే చూస్తారు. మీ కుటుంబం ఒక్కటే మమ్మల్ని మనుష్యులుగా మన్నిస్తుంది. మీ కోసం మేము దొంగతనమే కాదు ఏమయినా చేసేస్తాం. నువ్వు చూస్తూ వుండు” అంటూ మరింత వేగంగా అడుగులు వేశాడు సాంబశివుడు.

వద్దని ఇంకా కాస్త గట్టిగా చెప్పినా అతను వినిపించుకోడని అర్థం అయింది మాధవుడికి. అతన్ని వారించే ఆలోచనని ఆపుకుని రహదారి పక్కనే వున్న బండరాయి మీద కూర్చున్నాడు.

క్షణక్షణానికి దట్టం అవుతున్న చీకట్లలో కలిసిపోయి జామతోటలోకి అడుగు పెట్టాడు సాంబశివుడు. ఏపుగా ఎదిగివున్న ఒక చెట్టు దగ్గిర నిలబడి ఒక కొమ్మని కిందకి వంచాడు. వంచుతూ వుండగానే అతనికి కనిపించారు నల్లటి దుస్తులు ధరించి వున్న పదిమంది దృఢకాయులు. వంద ధనువుల దూరంలో వున్న ఒక దిగుడు బావి దగ్గిర నిలబడి రహదారి కేసి చూస్తున్నారు వాళ్లు.

జామతోటకి కాపలాదారులు కాదు వాళ్ళు. కాపలా దారులకి అటువంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. చేతుల్లో బరిశెలు, బలమైన కర్రలు ఉండాల్సిన పనిలేదు.

తను వచ్చిన పనిని మరిచిపోయి “హేయ్‌… ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని అరిచాడు సాంబశివుడు. అదిరిపడినట్లు వాళ్ళందరూ ఒకేసారి అతనికేసి చూశారు.

“వీడెవరో మనల్ని చూశాడు…. నగరంలోకి పోయి అందరికీ చెప్పేస్తాడు. ముందు వీడిని వేసేయండి” ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు వారిలో ఒకతను.

చేతుల్లో వున్న కర్రల్ని, బరిశెల్ని గాలిలో ఊపుతూ వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చేశారు అందరూ.

పిరికివాడు కాదు సాంబశివుడు. ఎటువంటి బరువులనైనా ఎత్తి అవతలికి విసిరివేయగల కులంలో పుట్టాడు. ఎంతటి దెబ్బతగిలినా ఓర్చుకోగలశక్తి అతనికి వుంది.

దగ్గిరికి వచ్చి తన మీదికి కర్రను విసిరిన ఒక ఆగంతకుడిని ఎగిరి గుండెల మీద తన్నాడు అతను. బరిశెతో పొడవబోయిన ఇంకో మనిషి గుండెల మీద బలంగా కొట్టాడు. గావురుమని అరిచి వెనక్కి పడిపోయిన ఆ ఇద్దర్ని చూసేసరికి తారాపధానికి చేరుకుంది మిగిలిన వారి కోపం.

“పొడి చేయండి. తల పగలకొట్టి చంపేయండి” అని ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకేసారి అతన్ని కమ్ముకోబోయారు.

దట్టమైపోయిన చీకట్లు సాంబశివుడికి సాయం చేసినయ్‌. అడ్డం వచ్చిన ఇంకో మనిషి ముఖం పగిలిపోయేటట్టు కొట్టి, వింటి నించి వెలువడిన బాణంలా రహదారివైపు పరుగు తీశాడు.

“ఆపండి. వాడిని ఆపండి. వాడు వెళ్ళి ఆ కుర్రాడిని హెచ్చరిస్తాడు…” అని అరుచుకుంటూ అతన్ని అనుసరించారు ఆ దృఢకాయులు.

“మాధవా… మాధవా… పారిపో…” అని కేకలు పెట్టాడు సాంబశివుడు. తనను వెంబడిస్తున్న వాళ్ళు మాధవుడిని కూడా దెబ్బకొడతారని అతని భయం.

బండరాయి మీద నించి లేచి మాధవుడు నగరంలోకి పరిగెత్తుతాడని, తను పక్కకు తిరిగి తమ గుడిశెల దగ్గిరికి పారిపోవచ్చని అతని ఉద్దేశ్యం. నగరంలోకి పరిగెత్తాల్సిన మాధవుడు అటువంటి పనిచేయలేదు సరికదా, బండ మీదినించి లేచి బలంగా నేలను తన్నాడు.

యాభై ధనువుల దూరంలోకి వచ్చిన సాంబశివుడికి భూకంపం వచ్చిందని అనిపించింది.

నేలను తన్నటంతో ఆగలేదు మాధవుడు. తనకు తెలీకుండానే తలను పైకెత్తాడు. కుడిచేతిని నోటి దగ్గిరకు చేర్చి దారుణమైన పొలికేక పెట్టాడు.

చెవుల్ని గట్టిగా మూసుకోవాలి అనిపించింది సాంబశివుడికి. కర్ణరంధ్రాలకు చిల్లులుపడి రక్తస్రావమయ్యే స్థాయిలో వుంది ఆ కేక.

సాంబశివుడిని తరుముకొస్తున్న ఆగంతకులకు గుండెలవిసిపోయాయి కాబోలు….. ఎక్కడివాళ్ళక్కడ ఆగిపోయి, ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

“పారిపో మాధవా.. నగరంలోకి పారిపో” తడబాటునించి తేరుకుంటూ ఇంకోసారి అతన్ని హెచ్చరించాడు సాంబశివుడు.

మాధవుడు పారిపోలేదు. నిలబడిన చోటినించి పిసరంత కూడా అవతలికి జరగలేదు.

ఆగిపోయిన ఆగంతకులకు అమితమైన ధైర్యం వచ్చేసినట్టుంది. ఇంకోసారి కలిసికట్టుగా కదిలారు వాళ్ళు.

యాజ్ఞవల్క్యులవారు చింతబరికెతో బాదుతున్నప్పుడు ఎలాంటి అనుభూతులు కలిగాయో, అంతకు రెట్టింపు కలగడం మొదలుపెట్టాయి మాధవుడికి ఇప్పుడు.

పిడికిళ్ళు బిగించి అడుగు ముందుకు వేశాడు. వెంటనే అతన్ని అడ్డుకున్నాడు సాంబశివుడు.

“ఆకాశం అదిరిపోయేటట్టు నువ్వు సింహనాదం చేశావ్‌…. నగరంలో నివశిస్తున్నవారందరికీ తప్పకుండా వినిపించి వుంటుంది. ఈ నగర ద్వారాల్ని సరరక్షించాల్సిన భటులకు కూడా తెలిసే వుంటుంది. అయినా సరే వాళ్ళు రావడం లేదు.

సంగతేమిటో తెలుసుకోవాలని అనుకోవడంలేదు. అసలేం జరుగుతోంది.

“ఏదో తేడా కనిపిస్తోంది మాధవా… ఈ పరిస్థితి ఏమిటో చాలా అనుమానస్పదంగా వుంది. పారిపోవడం చాలా మంచిది” తను గమనించిన అంశాన్ని ఆలస్యం చేయకుండా బయటపెట్టేశాడు.

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=194

Related Posts:

వెండి మేఘం Telugu Novel by Saleem

 

తెలుగు నవలా సాహిత్యంలో ముస్లింల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని – కటిక దారిద్ర్యంతో పాటు అవమానాలకూ పరాయీకరణకూ బలౌతున్న దూదేకులవారి దయనీయ స్థితిని సమగ్రంగా చర్చించిన మొట్టమొదటి నవల – వెండి మేఘం

పెళ్లంటే ఏమిటో తెలీని పదేళ్ళ వయసులో – తనకంటే పాతికేళ్ళు పెద్దయిన వ్యక్తికి రెండో భార్యగా – అతని కొడుక్కి తల్లిగా వచ్చిన ‘అన్వర్’ . . . స్త్రీలు ఆత్మగౌరవం, స్వంత వ్యక్తిత్వం కలిగి ఉండాలంటే జీవితమంతా పోరాడటం మినహా మరో దారిలేదన్న నిర్ణయానికి రావటానికి దారితీసిన పరిస్థితులు . . .

పవిత్రత ఉన్నచోట నిర్భయత, నిర్భయత ఉన్నచోట స్వంత్రత తప్పకుండా ఉంటాయని నమ్మిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న అనూహ్యమైన సంఘటనలు . . .

పల్లెటూళ్లో పుట్టి, నిరక్షరాస్యతలో పెరిగీ, జీవితానుభవాలతో రాటుదేలిన ఒక ముస్లిం స్త్రీ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృత సమస్యలు . . . వాటిని అధిగమించడానికి ఆమె చేసిన జీవన సమరానికి సజీవ చిత్రణే వెండి మేఘం

వెండి మేఘం On Kinige

 

To buy or rent eBook visit now @ http://kinige.com/kbook.php?id=186

Related Posts:

కస్తూరి మురళీకృష్ణ – ‘సౌశీల్య ద్రౌపది’ పుస్తక పరిచయం

సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది. పురాణ  కథలలొ జీవిత సత్యాలు పొందు పరిచి వున్నాయి. తరచి చూస్తే అనేక అద్భుతమైన మనుల్లాంటి విషయాలు అర్థమవుతాయి, సౌశీల్య ద్రౌపది నవల లొ ఇలాంటి విషయాలు యెత్తిచూపే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ, పురాణాలు ఏ రకంగా  సమకాలీన సమాజానికి ఉపయెగపడతాయొ చూపంచే ప్రయత్నం చేసారు కవి. ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ సౌశీల్య ద్రౌపది లొ  ‘ద్రౌపది’  పాత్రను ఆదునిక సమాజంలొ మహిళకు ప్రతీకగా చేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు, తద్వారా మన పురాణ పాత్రలను ఈనాటి సమాజానికి చేరువ చేసే ప్రయత్ణం చేసారు.

సౌశీల్య ద్రౌపది On Kinige

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మన సంస్కృతి సంప్రధాయాల సమాహారం మీకు కంప్యుటర్ దూరంలో  కినిగే ఫై

Related Posts:

అందమైన జీవితం–మల్లాది వెంకట కృష్ణమూర్తి

స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కి దారితీయని సుగంధ స్నేహ సుధ సాధ్యమని నిరూపించే నవల ఇది. చిన్న చిన్న సరదాలతో నిండిన జీవితమే అతి పెద్ద ఆనందం అన్న మెసేజ్ నిచ్చే దీంట్లో, జీవితాలను ప్రభావితం చేసే ఆర్ద్రత చూడవచ్చు. నల్లేరు మీద నడకలా సాగే మధ్య తరగతి జీవితాల్లో గోప్యంగా ఉండే మృదువైన సెంట్ మెట్స్ ని శాంతి, ప్రియతమ్ పాత్రల ద్వారా మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇందులో సూటిగా చెప్పారు. స్పందన, భావావేశం గల పాఠకులందరికి ప్రియమైన నవల "అందమైన జీవితం."

అందమైన జీవితం On Kinige

 

పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో రమణి గారి రివ్యూ, మరియు విశేషమైన కామెంట్స్ చదవండి. ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం – శైలి పరంగా అయినా, కథా పరంగా అయినా అద్భుతమైన పుస్తకం. ( http://pustakam.net/?p=2249 )

యండమూరికి నచ్చిన మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకం ఈ అందమైన జీవితం.

నేడే చదవండి కినిగె పై, మీకు కంప్యూటర్ దూరంలో లభించును.

http://kinige.com/kbook.php?id=52

Related Posts: