తెలంగాణ మాండలికంలో దళిత నవల – “సూర”నవల పై సమీక్ష

దళితులపై కొనసాగే ఆర్థిక, లైంగిక దోపిడీలను వివరించడంతోపాటు దళితులలో వున్న మూఢ విశ్వాసాలను, వెనుకబాటుతనాన్ని ‘సూర’ నవల చిత్రీకరించింది.ఊళ్లో బతకలేక మాల చెన్నడు, చంద్రి పట్నం వచ్చి కూలీనాలీ పనులు చేసుకుని బతుకుతుంటారు. తమ కొడుకు సూరడు చదువుకొని బాగుపడాలని వారి కోరిక. గారాబం, చెడు సావాసాలు మరిగిన సూరడ్ని దండించి బంధువు, కాలేజీ విద్యార్థి అయిన కేశవులు ఓ దారికి తెస్తాడు. పటేల్ కాశిరెడ్డి తమ ఇంట్లో పని చేయడానికని సూరడ్ని, చదివిస్తానని చెప్పి సర్కారు బళ్లో వేస్తాడు. కాశిరెడ్డి ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో సూరడు హాస్టల్లో చేరిపోతాడు. హాస్టల్స్‌లో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. పదివేలు తెచ్చుకుంటే అందులో కుదురుస్తానన్న కాశిరెడ్డి మాటలు నమ్మి చెన్నయ్య, చంద్రి ఊళ్లో తమ వంతుకు వచ్చిన పొలాన్ని అయినకాడికి అమ్మి పదివేలు తెచ్చి కాశిరెడ్డి చేతుల్లో పోసి, తర్వాత తాము మోసపోయామని తెల్సుకుంటారు. చేసేది లేక తిరిగి ఊరికి వచ్చి గుడిసె వేసుకుంటారు. తాగుడు మరిగి అనారోగ్యం పాలయిన చెన్నడు మంత్రాలు, భూతవైద్యుడు చుట్టూ తిరుగుతుంటాడు. తల్లిదంఅడుల కీచులాటలు, దాయాదులతో పోట్లాటలు చూసి విసిగిపోయిన సూరడు ఊరికి రావడం మానేస్తాడు. కాలేజీలో చేరిన సూరడికి నాగిరెడ్డి పటేల్ కూతురు పరిచయం కాస్తా ప్రేమలోకి దిగుతుంది. నాగిరెడ్డి తన కూతురు సూరడితో తిరగడం పరువు తక్కువని భావిచి సూరడ్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ప్రేమికులిద్దరూ లేచిపోయి పట్నంలో కాపురం పెడతారు. అక్కడి నుండి సూరడు ఊరికి వచ్చి ఊళ్లో చేతబడి, మూఢ నమ్మకాలను పోగొట్టటానికి కృషి చేస్తాడు. ఊళ్లో మాల, మాదిగ పిల్లలను చేరదీసి వాళ్లకు చదువు చెప్పి రెండు గూడేలను ఏకం చేద్దామనుకుంటాడు. నాగిరెడ్డి ఊళ్లోని దళితుల పాస్‌బుక్కులు తీసుకునిపోయి బ్యాంకులో పెట్టి, అప్పులిప్పిస్తానని సంతకాలు చేయిస్తాడు. వచ్చిన డబ్బంతా తానే కాజేస్తాడు. అప్పు కట్టమని దళితులకు నోటీసులు వస్తాయి. నిలవేసిన దళితులను బెదిరించి పోలీసులతో కొట్టిస్తాడు. మరల సూరని మీద హత్యా ప్రయత్నం చేయిస్తాడు. దీంతో విసిగిపోయిన దళిత గారీబు పటేల్‌ను పొడిచి చంపి పోలీసులకు లొంగిపోతాడు.
ఇందలో మంచిగా బతుకుదామని చెన్నయ్య, చంద్రి ఊరు విడిచి పట్నం వస్తారు. ఊళ్లో వున్న పొలం అమ్ముకుని, ఆ డబ్బు పటేల్‌కిచ్చి మోసపోతారు. దాంతో తిరిగి ఊరికి వచ్చి కీచులాటలు, పోట్లాటలతో తమ జీవితాన్ని గడిపేస్తారు. అలా కాకుండా పటేల్ మోసం చేసినా, ఇక ఊళ్లో ఏం లేదని తెలుసుకుని పట్నంలోనే స్థిరపడి బతకడానికి ప్రయత్నం చేస్తే బాగుండేది. పట్టుదల, ముందుచూపు, స్వంత నిర్ణయాలతో, నీతివంతురాలిగా కనిపించే చంద్రి, సూరడు పెద్దవాడు కావడంతో గయ్యాళిగా, అప్రధాన పాత్రగా మారిపోవడం ఏం బాగాలేదు. అలాగే జయలక్ష్మి ప్రేమ వ్యవహారం కూడా పచ్చిగా, ఫాస్ట్‌గా, ఏకపక్షంగా సాగిపోతుంది. సహజత్వం లోపించింది. బాగా చదువుకుని ప్రయోజకుడై సూరడు దళితోద్ధరణకు పూనుకుంటే బాగుండేది. అలా కాక ఒక లక్ష్యం అంటూ లేకుండా తెగిన గాలిపటంలా ప్రవర్తించే సూరడు తన సుఖం తాను చూసుకునే వాడిలా చిత్రీకరించడం వల్ల ఆ పాత్ర ప్రయోజనమే దెబ్బతింది. ఆదర్శవాదం జోలికి పోకుండా యధాతథ వాదంతో నవల నింపేసినట్లు అనుకోవాలి. దళితులలో వున్న అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్లను పూజలు, మంత్రాల పేరిట ఎలా దోపిడీ చేస్తున్నారో ఇందులో చక్కగా తెలియజేశారు. గిరిజనులు హరిజనులే అన్ని ఉద్యోగాలను తన్నుకుపోతున్నారని అగ్రవర్ణాల వారు రెండు సందర్భాలలో తమ అక్కసును వెలిబుచ్చితే వారికిచ్చిన సమాధానాలు చెంపపెట్టులా ఉన్నాయి.
ఈ నవలను పూర్తిగా తెలంగాణ మాండలికం అందునా నల్లగొండ మాండలికంలో రాయడం విశేషం. ఇది ప్రాంతీయ మాండలికమే కాదు, కుల మాండలికం కూడా. ఉచ్ఛారణ పరమైన మాండలికాన్ని యథాతథంగా అక్షరీకరించడం వల్ల ఇది ఇతర ప్రాంతీయులకు ఒక పట్టాన అర్థం కావడం కష్టం. వస్తువును పక్కనబెడితే మాండలికాన్ని అభిమానించేవారు, రకరకాల మాండలికాల పట్ల ఆసక్తి గలవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. పదేళ్ల కింద వచ్చిన ఈ పుస్తకం మళ్లీ రెండవ ముద్రణగా మన ముందుకు వచ్చింది.

-కె.పి.అశోక్‌కుమార్, ఆంధ్రభూమి-అక్షర,08/02/2014.

 సూరడిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సూర on kinige

 

Sura600

Related Posts:

కర్ణుడి కోణంలో… “కర్ణ మహాభారతం” పుస్తకం పై సమీక్ష

ప్రతినాయకుల పక్షాన నిలిచినా…కథానాయకుడికి ఉండితీరాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కర్ణుడికి. ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ దానగుణం… మహాభారతంలోని ఏ పాత్రలోనూ కనిపించవు. అంతిమంగా పాండవుల విజయాన్ని ఆకాంక్షించే సామాన్య పాఠకుడు కూడా… మనసులో ఏ మూలనో కర్ణుడి పట్ల అభిమానాన్ని కనబరుస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యోధుడు ప్రాణాలు కోల్పోకుండా ఉంటే బావుండని ఆశిస్తాడు. కర్ణుడి జీవితం నిండా అవమానాలూ మోసాలే. నీటిపాలు చేసిన కన్నతల్లి కుంతి నుంచి… బాధ్యత మరచిన సారథి శల్యుడి దాకా… ఎన్నో అనుభవాల గాయాలు. కురుపాండవుల అస్త్ర ప్రదర్శన సమయంలో నేనున్నానంటూ రంగప్రవేశం చేయడం మొదలు… అర్జునుడి చేతిలో నేలకొరిగే దాకా… ప్రతి మలుపునూ కళ్లకు కట్టినట్టు వివరించారు. కర్ణుడు కేంద్ర బిందువుగా శ్రీశార్వరి చేసిన విశిష్ట రచన ఇది..

- వైష్ణవి, ఈనాడు ఆదివారం అనుబంధం, 14 సెప్టెంబర్ 2014

KarnaMahaBaratam_14Sep14

“కర్ణ మహాభారతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కర్ణ మహాభారతం on kinige

 

KarnaMahabharatam600

Related Posts:

మానవతా స్పర్శ – ‘నిర్ణీతి’ , ‘ఆరునెలలు ఆగాలి’ పుస్తకాలపై సమీక్ష

మానవీయ విలువలూ, ఆత్మీయతా స్పర్శా, అపారమైన ఆర్ద్రతా కలిగిన కథలే కలకాలం నిలబడతాయి. పి.ఎస్.నారాయణనిర్ణీతి’ సంపుటిలోని కథలు ఆ కోవకే చెందుతాయి. ‘పెళ్ళివారిల్లు పెద్దముత్తయిదువులా ఉంది’ లాంటి పోలికలు కథలకి కొత్త అందాన్నిస్తాయి. ‘పంచాగ్ని’ కథలో భారతి ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకడైన సుధాకర్‌కి తెలిసిన ఓ నిజం, అతను ప్రవర్తించిన తీరూ పాఠకుల మదిలో చెరగని ముద్రవేస్తుంది. ‘నిర్ణీతి’ కథలో స్నేహానికి కల్యాణి ఇచ్చిన విలువా, దానివల్ల ఆమెకు ఎదురైన అనుభవం, ఫలితంగా ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేపుతాయి. అత్యాచారానికి గురైన యువతి ధైర్యంగా నిలదొక్కుకుని, ఆత్మవిశ్వాసంతో పోరాడి ప్రతీకారం తీర్చుకోవడం ‘ఆరునెలలు ఆగాలి‘ నవల ఇతివృత్తం. అందుకు ఆమె పన్నిన వ్యూహాలూ, ఎదుర్కొన్న పరిస్థితులూ పాఠకులను ఉద్వేగానికి గురిచేస్తాయి.

- అయ్యగారి శ్రీనివాసరావు, ఆదివారం అనుబంధం, 3rd Aug 2014

 

 

 

 

 

 

 

 

ఆరు నెలలు ఆగాలి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

ఆరు నెలలు ఆగాలి on kinige

 

Related Posts:

అతివ అంతరంగ మథనం – “అన్వేషణ” నవలపై సమీక్ష

మనిషి జీవిస్తున్నాడా? లేక జీవిస్తున్నానని భ్రమలో ఉన్నాడా? అనే ఒక సందిగ్ధం ఈరోజుది కాదు. పురాణాల నుండి వస్తున్నదే! ఐతే- ఆ మాట నిర్భయంగా నేడు అంటున్నారు. అనుకుంటూనే ఆలోచిస్తున్నారు. గంటి భానుమతి రచించిన ‘‘అన్వేషణ’’ నవలలో నిజంగా మానవ జీవితంలోని అనేక కోణాలను అన్వేషించారు. అందరికీ తెలిసిన సమాధానాలపై ఎదురు తిరిగారు. తెలియని ప్రశ్నలను సంధించారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా అత్తింట్లో ఆవేదనలు, భర్త మూలంగా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొంటున్న నేటి సమాజపు దుస్థితిని అభివర్ణించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. అసలు స్త్రీ సంఘానికి భయపడాలా? లేక తన మనస్సాక్షికి భయపడాలా? అంటే నా ధోరణిలో మనస్సాక్షికే ఎక్కువ మార్కులు వేస్తాను. సంఘం అనేది గాలివాటుకు ఎగిరిపడుతున్న ఎండుటాకు లాంటిది. అదిగో అని చూపితే కనిపించకున్నా, అవును నాకూ కనిపించింది అంటూ ఎదుటిమనిషిని మరింత నిర్వీర్యం చేస్తుంది. కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది మనమేంటి? మనం జీవిస్తున్న విధానం ఏమిటి? అని. ఒక స్ర్తి అయినా, పురుషుడైనా మనస్సాక్షి ముందు తలెత్తుకుంటే చాలు గెలిచినట్లే..
అసలు  స్త్రీ అంటేనే ఒక కుటుంబం. స్త్రీ లేనిదే కుటుంబాలు ఎంతగా వెలవెలపోతుంటాయో మనం గమనిస్తూనే ఉంటాం. ఈ నవలలో విజయ అనే పాత్ర ఎన్నో సందిగ్ధాల మధ్య సతమతమవుతూ తన జీవితం అలా ఎందుకు ఒంటరి అయిపోయిందనే విషయంపై అన్వేషణ కొనసాగిస్తుంది. అలాంటి సమయంలో తనను ప్రేమించిన వ్యక్తి కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియకుంటే పెళ్ళిచేసుకోవడం కష్టమని అనడం విజయను మరింత బాధిస్తుంది. పెళ్ళికి యువతి కావాలా? యువతికి యువకుడు ఉంటే చాలదా? అంటే చాలదు. ప్రేమకు ఇద్దరు చాలు పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే మాట విన్నాం. అయితే కుటుంబం ఎందుకు? అంటే మాత్రం రాబోయే తరాలకు ఒక చరిత్ర కావాలి. నాన్న అమ్మ ఎలాగో, అమ్మమ్మ, తాత, పెదనాన్న, చిన్నాన్న పిన్ని అత్త లాంటి వరసలన్నీ ఎంతో కావాలి. వారందరూ మనకంటూ ఏమీ చేయకపోవచ్చు. కానీ ఉన్నారనే ఆశ ముందుకు నడిపిస్తుంది. తల్లిదండ్రులు పునాదులైతే నా అన్నవాళ్ళు మూలస్తంభాలు. ఆ విషయమే ఈ నవలలో కనిపిస్తుంది.
గంటి భానుమతి ఎంతో సున్నిత హృదయులు. వీరిలోని నొప్పించేతత్వం లేని తనమే ఈ నవలకు పునాది అయింది. కారణం ఈ నవలలో మరీ బాధించే పాత్రలు చూపలేదు. కాలానుగుణంగా మనిషి తత్వం మారుతుందే తప్ప ఎవరూ చెడ్డవారు కారనే తత్వాన్ని తెలియజేసిన తీరు కడు రమణీయం. కాకుంటే మనుషుల్లో ఏదో ఒకటి కావాలని బాధ, ఉంటే ఎవరికి చెందుతుందో అనే బాధ, ఆస్తుల పంపకాలు, అక్కచెల్లెళ్ళ పోరాటాలు, రక్తసంబంధీకుల సమస్యలు చదువుతుంటే ఒకటుంటేఒకటిలేదనే తత్వంతో మనుషులు ఎదగలేకపోతున్నారా అనిపించక మానదు. అదే విషయం విజయ జీవితంలో కనిపిస్తుంది. తండ్రి వచ్చినా, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నా ఆస్తుల పంపకాలలో అనేక చేదుకోణాలను చూస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్న విజయ తల్లిని అన్వేషించడం మాత్రం ఆపలేదు. చివరకు తన తల్లి అత్యాచారానికి గురై చేయూతనిచ్చేవారు ఉన్నా అందుకోలేక, సమాజానికి ముఖం చూపించలేక మరింతగా కుంగిపోయి తన జీవితాన్ని పోగొట్టుకుందనే నిజాన్ని తెలుసుకుని కుమిలిపోతుంది. మరో వివాహం చేసుకుని వారి ద్వారా కూడా బిడ్డలున్నా వారి నుండి ఆదరణ లభించకపోవడంతో మొదటి భార్య కన్నబిడ్డ విజయ తండ్రిని తానే కొడుకై ఆదరిస్తుంది. తల్లిదండ్రులు ఎలాంటివారైనా అనుబంధం ముందు ఓడిపోక తప్పదని నిరూపిస్తుంది.
మనిషి జీవితంలోని మార్పుచేర్పులకు సమాజమే కారణం అయితే, వ్యక్తిగా తనను తాను గమనించుకునే స్థితికి మనిషి ఎపుడు చేరుకుంటాడు? అదే స్త్రీ అయితే తన పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలను సంధించి సరికొత్త సమాధానాన్ని అందించిన తీరులో సాగిన వైనం మనల్ని ఆద్యంతం అలరిస్తుంది. వ్యక్తిత్వం అనేది ఒక స్ర్తికి సంబంధించింది అనడం కంటే వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి సంబంధించింది అని ముగించి ఉంటే మరింత బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్నగా స్త్రీ నిలబడినంతకాలం సమాజం తనకిష్టమైన సమాధానాలు చెబుతూనే ఉంటుంది. తానే ఒక సమాధానమైన రోజు ప్రశ్నలన్నీ ఏమవుతాయి? ఆలోచించాలి…!

-ఎస్.ఎం. అక్షర, ఆంధ్రభూమి, 21/06/2014

***

అన్వేషణ”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

అన్వేషణ on kinige

Related Posts:

వెంటాడే విషాద స్వరం – “మూలింటామె” పుస్తకంపై సమీక్ష

పల్లెబతుకుల్ని ఓ తోలుబొమ్మలాట మాదిరిగా పాఠకుల కళ్లకు కడతారు నామిని. మనుషుల ప్రవర్తనలు, భిన్న ప్రవృత్తులు, అవసరాలు, ఆలోచనలు, రాగద్వేషాలు… అక్షరబద్ధం చేసి పికాసో ‘గోర్నికా’ చిత్రాన్ని గుర్తు చేస్తారు. ‘పచ్చనాకు సాక్షిగా’, ‘మునికన్నడి సేద్యం’ చదివినవారికి నామినిని కానీ నామిని శైలిని కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ‘మూలింటామె‘ నవల కూడా అంతే వైవిధ్యమైన రచన. ఒకానొక గ్రామంలో … ఒకానొక సంఘటన నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితుల క్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు నామిని. మార్కెట్ సూత్రాల్ని ఒక గ్రామం ఒంటబట్టించుకున్న తీరుకు వసంత (పందొసంత), కడదేరుతున్న పాతతరం విలువలకు కుంచమమ్మ (మూలింటామె) ప్రతినిధులుగా పాఠకుల కళ్లముందు కదలాడతారు. పుస్తకాన్ని మూసేసిన తర్వాత కూడా, ఓ విషాద స్వరమై ‘మూలింటామె‘ మన ఆలోచనల్లో తారట్లాడుతూనే ఉంటుంది. ‘నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగానీ, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టకలాడే పిల్లిని చంపలేదే’ అన్న మూలింటామె మాటతో నవల ముగుస్తుంది. ఆ ముగింపు పాఠకుడి మదిలో అనేక ఆలోచనలకు ఆలంబన అవుతుంది.

–వెంకట్, ఈనాడు ఆదివారం అనుబంధం, 22 జూన్ 2014

 

 

 

 

 

 

 

 

మూలింటామె” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

మూలింటామె on kinige

 

 

Related Posts:

‘కర్ణ మహాభారతం’ పుస్తకంపై సమీక్ష

మహాభారతంలోని వందలాది పాత్రల్లో ఉత్తమోత్తమమైన పాత్ర కర్ణపాత్ర. సామాన్యంగా జీవించిన మహాయోగి. తుదివరకు మృత్యు ఛత్రచ్ఛాయలో నడిచి మృత్యువునే భయపెట్టినవాడు. భారతంలో సిసలైన సజీవ పాత్రలు కర్ణ, కుంతి. కర్ణుడు ఆత్మయోగి. తన వెనుక మృత్యువు కాపలాగా ఉందని గుర్తెరిగి కూడా గెలుపు ఓటమిలను ఆశించకుండా యుద్ధమే కర్తవ్యంగా భావించినవాడు. ప్రతి మనిషికీ కర్ణుడే గొప్ప ఆదర్శం. మిత్రులుగా నటించే శత్రువులు, శత్రువుల్లా కోపించే మిత్రులూ ఉంటారు. అందుకే ఈ కర్ణుని కథ చిరస్మరణీయం. ప్రతివారు తప్పక చదవాలి.

- నవ్య, 4th June 2014

 

 

 

 

 

 

 

 

 

 

కర్ణ మహాభారతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

కర్ణ మహాభారతం on Kinige

Related Posts:

రైతు జీవితం

దేవేంద్రాచారి నవల ‘నీరు, నేల, మనిషి‘ ప్రపంచీకరణ ప్రభావంతో రైతు జీవితం దుర్భరమవటాన్ని కళ్లకు కట్టింది. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలోకి ‘కార్పొరేట్’తనం ప్రవేశించిందో అప్పటినుంచి సేద్యం జూదంగా మారిపోయింది. విత్తనాల దగ్గరి నుంచి పంట చేతికి వచ్చేదాకా దినదినగండమై పోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రకృతి కాలుష్యం మరికొంత రైతును విలవిలలాడిస్తున్నాయి. నవల శీర్షికలోనే మానవ సంబంధాల్ని గుర్తుచేయటం కనిపిస్తుంది. రైతు జీవితం కేంద్రంగా సాగే ఈ నవల అనేక కోణాల్ని స్పృశించి మనకి కనువిప్పు కలిగిస్తుంది. మధ్యమధ్య జానపద గేయాలు కథనానికి ఉపకరించాయి.

డా.ద్వాదశి, ఈనాడు ఆదివారం అనుబంధం 30 జూన్ 2013

* * *

“నీరు, నేల, మనిషి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నీరు నేల మనిషి On Kinige

Related Posts:

ప్రొఫెసర్ షాడో–మునుజూపు (మధుబాబు రచన)

ప్రొఫెసర్ షాడో

(షాడో స్పై థ్రిల్లర్)

రచన:

మధుబాబు


© Author

© Madhu Baabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ రక్షించబడ్డాయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.


ప్రొఫెసర్ షాడో On Kinige

ప్రొఫెసర్ షాడో

అదొక విశాలమైన హాలు. నేలమీద ఎర్రటి కార్పెట్ పరిచివుంది. తెల్లటి బాలీసులు అమర్చి వున్నాయి దాని మీద. ఆబాలీసులను ఆనుకొని పాతికమంది స్త్రీపురుషులు కూర్చునివున్నారు.

వారందరి చూపులూ ఎదురుగా చిన్న వేదికమీద నిలబడిన వ్యక్తిమీద వున్నాయి. ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తున ఆ వ్యక్తి, తెల్లటి దుస్తులు ధరించి వున్నాడు. కళ్ళకు నీలంరంగు మెర్క్యురీ గ్లాసులు గల కళ్ళజోడు పెట్టుకున్నాడు. అతని కళ్ళు వారికి కనిపించవ్. అతని భావాలను వారు గమనించలేరు.

ఖంగుమంటున్న గొంతుకతో వారిని వుద్దేశించి ప్రసంగిస్తున్నాడతను "మిత్రులారా మన కూటమిసభ్యులారా ఈ రోజు మనకు ఒక పర్వదినం. కిల్లర్స్ గ్యాంగ్ లాంటి

అంతర్జాతీయ కూటమితో కలసి పనిచేసి మన ప్రతిభను వెల్లడించుకోవాలనీ – ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాం. ఆకోరిక యీనాడు నెరవేరింది. కిల్లర్స్ గ్యాంగ్ మన కూటమిని తనలో కలుపుకోవటానికి అంగీకరించింది.”

పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు స్త్రీ పురుషులందరూ. రెండు క్షణాలు ఆగి తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు వేదికమీది వ్యక్తి.

కిల్లర్స్ గ్యాంగ్ ఆశయాలు మీకు అందరకూ తెలుసు. ప్రపంచాన్నంతా జయించి అన్ని దేశాలను ఒకే పతాకం కిందికి తీసుకురావాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు వారు. అందుకు ఒక ప్రయత్నంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని నిశ్చయించారు. "మైడియర్ మెంబర్స్! మనదేశ పరిస్థితులు యీనాడు అగమ్య గోచరంగా వున్నాయి. మన ఆర్ధిక వ్యవస్థ నానాటికీ హీన స్థితికి దిగజారిపోతున్నది. ఎక్కడ చూసినా కరువు – కాటకాలు. ఎటు తల తిప్పినా ఆకలి చావులు. నిరుద్యోగసమస్యలు అంతా గందరగోళంగా తయారైపోయింది.

“లేడీస్ అండ్ జంటిల్‌మన్! ఈ ప్రమాద పరిస్ధితులను ఎదుర్కోవటానికి ప్రభుత్వం అనేక రకాల పధకాలను చేపట్టింది. ముందుగా, ఆకలి మంటలను అణిచేటందుకు విదేశాల నుంచి ఆహార పదార్ధాలను దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. “మైడియర్ ఫ్రండ్స్! మనదేశంలో వున్న విదేశ మారకద్రవ్య విలువలు ఎన్నడో కరిగిపోయాయి. వున్న బంగారాన్ని వెచ్చించి ఆయుధాలను సమీకరించుకోవటం జరిగింది. ఇక ఏం పెట్టి ఆహార పదార్ధాలను కొనుగోలు చేయగలరు!” అంటూ సభ్యులవంక సూటిగా చూశాడతను. అందరూ తదేకంగా వింటున్నారు. సూది కిందపడినా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది. ఆప్రదేశాన్ని, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తిరిగి మాటలు మొదలు పెట్టాడతను.

“ప్రభుత్వం దివాళా తీయటానికి సిద్దంగా వుంది. దేశనాయకులందరికీ ఏం చెయ్యాలో తోచటంలేదు. ఈవిషమపరిస్ధితిని ఆధారంగా చేసుకొని కిల్లర్స్ గ్యాంగ్ తన ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆశపడింది.

“కాని మిత్రులారా! ఆఖరి క్షణంలో సోవియట్ రష్యా కిల్లర్స్ గ్యాంగ్ ఆశలమీద చన్నీళ్ళు కుమ్మరించింది. రష్యా ప్రభుత్వపు సహకారంతో అరేబియా సముద్రంలో పెట్రోలు నిల్వలను కనిపెట్టే పధకాన్ని చేపట్టివుంది మన ప్రభుత్వం. నెలరోజుల క్రితం బాంబే నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో బ్రహ్మండమైన పెట్రోలు నిల్వలను కనిపెట్టారు మన సైంటిస్టులు. ఆపెట్రోలును బయటికి తీయగలిగితే భారతదేశం ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం అవుతుంది. ఒకరిని యాచించి బ్రతుకుతున్న మన దేశం ఇంకో రెండు సంవత్సరాలలో అగ్ర రాజ్యంగా మారిపోతుంది.

లేడీస్అండ్ అండ్ జంటిల్మన్! యిది జరుగకూడదు. భారతదేశం కిల్లర్స్ గ్యాంగ్ గుప్పిటిలోకి రావాలంటే. యిప్పుడు వున్న సంక్షోభ పరిస్థితులే వుండాలి. ఆకలి మంటలకు తట్టుకోలేని పేద ప్రజానీకం – అధిక ధరల ముందు నిలువలేని మధ్యతరగతి కుటుంబీకులు. అందరూ ప్రభుత్వం మీద కినుక చెందాలి. నూతనంగా కనిపెట్టిన పెట్రోలు విలువలను ఆ తరువాత వెలికితీసి, ప్రపంచాన్నే ఒక ఆట అడించవచ్చు.

“అరేబియా సముద్రంలో పరిశోధనలు జరుగుతునేవున్నాయి. ఆపెట్రోలును వెంటనే బయటికి తీయించాలని భారతప్రభుత్వం, సోవియట్ రష్యా పూర్తి సహకారాన్ని అర్థించింది. అందుకు సమ్మతించిన రష్యా , తన ఇంజనీర్లలో అపూర్వ ప్రతిభావంతులైన వారిని యిక్కడికి పంపిస్తోంది. వాళ్ళు అమిత మేధాశక్తి సంపన్నులు. రష్యా లో వున్న అలాస్కా మంచు పర్వతాలనే పగులకొట్టి, ఆ మంచు ఎడారులను సస్యశ్యామలం చేసినటువంటి ప్రజ్ఞావంతులు.

“ వారు అరుగుదెంచిన మరుక్షణం భారత యింజనీర్ల శక్తి యుక్తులకు లొంగకుండా అరేబియా సముద్రంలో దాగుకొని వున్న పెట్రోలు నెలరోజుల్లో నీటిని వదిలి బయటకు వస్తుంది. భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ కన్నుమూసి కన్నుతెరిచేటంతలో మెరుగు

పడుతుంది. కిల్లర్స్ గ్యాంగ్ ఆశలు ఆడియాసలు అవుతాయి.

“సో మైడియర్ యంగ్ మెన్ అండ్ యంగ్ వుమెన్! ఈ పనికి విఘ్నాలు కల్పించాలని కిల్లర్స్ గ్యాంగ్ సుప్రీమ్ కమాండ్ నిర్ణయించింది. మనమీది అభిమానంతో ఈ మహాకార్యాన్ని మన భుజస్కంధాలమీద వుంచింది.

“ఫ్రండ్స్….ఎల్లుండి ఎనిమిదిగంటలకు మాస్కో నుంచి ఒక ప్రత్యేక విమానం బయలుదేరుతుంది. రష్యన్ యింజనీర్లు అందులోనే వస్తున్నారు.

‘అడ్డిస్ ఆబాబా’ అనే పట్టణంలో ఒక గంట సేపు విశ్రాంతి కోసం ఆగుతారు. అక్కడినుంచి సరాసరి బాంబే నగరానికి విచ్చేస్తారు.

“జంటిల్మన్….అడ్డిస్ ఆబాబాలోనే ఆ విమానాన్నిహైజాక్ చెయ్యాలి. మన మెంబర్లు కొంతమంది వెంటనే అక్కడికి వెళ్ళి అందుకు కావల్సిన ఏర్పాటు చెయ్యాలి. అవసరం అనుకుంటే ఆ స్పెషలిస్టులను చంపేయాలి. వాళ్ళు ఎట్టి పరిస్ధితులలోనూ భారతదేశం చేరుకోగూడదు" అని ఆగాడు ఆ వ్యక్తి.

హలులో వున్న వారందరూ తమలో తాము గుసగుసలాడుకోవటం ఫ్రారంభించారు. పదినిముషాల తర్వాత ఒక సభ్యుడు లేచి నిలబడ్డాడు.

“సర్! మనం అనుకున్నంత తేలికగా యి కార్యాన్ని సాధించలేమని అనిపిస్తోంది. కిల్లర్స్ గ్యాంగ్ సంగతి భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయని……తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?”

“ఆ విషయంలో మీరు కలతపడవలసిన అవసరంలేదు మైడియర్ ఫ్రండ్! మీశక్తి సామర్ధ్యాలమీద నాకు అపార మైన విశ్వాసం వుంది. మనం కలసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం ఏమీ చేయలేదు.”

ఆపొగడ్తకు అందరి ముఖాలు వికసించాయి. లేచినిలబడిన సభ్యుడు మాత్రం అసంతృప్తిగా తల విదిలించాడు.

“మీరు ఒక విషయం మర్చిపోయారని చెప్పడానికి సాహసిస్తున్నాను సార్! ఇండియన్ సి.ఐ.బి. కిల్లర్స్ గ్యాంగ్ తో నిరంతరం పోరాటం జరుపుతున్నది. దాని ఏజెంట్ల దెబ్బకు కిల్లర్స్ గ్యాంగ్ వస్తాదులు హడలిపోతున్నారు. మరి ఈ విషయంలో సి.ఐ.బి. చేయివుంటే మనం చిక్కుల్లో పడతాం. సి.ఐ.బి. ఏజెంట్లను మనం ఎదిరించలేం " అన్నాడు.

వెదికమీది వ్యక్తి చిరునవ్వులు చిందించాడు. “అనవసరంగా భయపడకు మిస్టర్! అవసరం అనుకుంటే ముందుగా ఆ సి.ఐ.బి. ని, దాని ఏజెంట్లను మట్టిలో కలిపి మనపని పూర్తి చేసుకుందాం" అన్నాడు.

ఆ మాటలకు అదిరిపోయాడు సభ్యుడు. తెల్లముఖంవేసి నిలువుగుడ్లతో నిలబడి పోయాడు.

“వాట్ మిస్టర్? ఎందుకలా విచిత్రంగా చూస్తావ్?” కోపంగా ప్రశ్నించాడు వేదికమీది వ్యక్తి.

గుటకలు మింగాడు ఆ సభ్యుడు. గొంతు సవరించుకున్నాడు.

“సార్? మీకు సి.ఐ.బి. ని గురించి తెలుసా? దాని ఏజెంట్ల శక్తి ఎప్పుడైనా చవి చూశారా?” అని ప్రశ్నించాడు.

కోపంతో కందిపోయింది వేదికమీది వ్యక్తి ముఖం. “వాట్ నాన్సెన్స్ యువార్ టాకింగ్? మరొక్క మాట నీనోటినుంచి వెలువడితే ప్రాణాలు పోగొట్టుకుంటావ్ జాగ్రత్త?” అని హుంకరించాడు.

ఆ సభ్యుడు తల వంచుకున్నాడు. మిగిలిన వారిలో కలకలం చెలరేగింది. కండలు తిరిగిన శరీరంతో వస్తాదులా కనిపిస్తున్న మరొక సభ్యుడులేచి నిలబడ్డాడు.

" సర్! మనవాడుచెప్పినమాటలు నూటికి నూరుపాళ్ళుయదార్థాలు సార్! మన సభ్యులు అందరూ ఘటికులే. ఆందులో సందేహం లేదు. కాని , సి.ఐ.బి. ప్రసక్తి వచ్చిందికాబట్టి చెపుతున్నాను. ఈ పథకంలో దాని చెయ్యి వుంటే మనం తప్పుకోవటంమంచిదిసార్! సి.ఐ.బి. ని ఎదిరించటమంటే పులి తోక పట్టుకొని పరిహాసాలాడటం లాంటిది. వారి ముందు మనం నిలువలేం అన్నాడు.

మిగిలిన వారందరూ అతనితో ఏకీభవిస్తున్నట్టు తలలు వూపారు. ఎర్రబడిన ముఖంతో వారందరివంకా పదిక్షణాల పాటు చూశాడు వేదికమీది వ్యక్తి.

"ఆల్ రైట్! మీ మాటలే నిజమని వప్పుకుంటాను. నాకు సి.ఐ.బి.ని గురించి సరిగ్గా తెలియదు. తేలిసేటట్టు వివరంగా చెప్పండి” అన్నాడు వ్యంగ్యంగా.

“క్షమించాలి సర్! మీరు నా ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థంచేసుకొని మాట్లాడుతున్నారు. సి.ఐ.బి.ని గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. దానిదెబ్బరుచి చూస్తున్న కిల్లర్స్ గ్యాంగ్ సుప్రీమ్ కమాండ్ కూడా ఈ విషయంలో నిస్సహాయంగా ఉండిపోయింది. మాకు తెలిసింది ఒకే ఒక విషయం సార్ ! సి.ఐ.బి. లోని ఏజెంట్లు కందిరీగల లాంటివాళ్ళు. తరిమి తరిమి కొట్టటంలో వారిని మించిన వారు ఎవరూలేరు. సి.ఐ.బి. ఏజెంట్లు అందరూ ఒక ఎత్తూ……సీక్రెట్ ఏజెంట్ షాడో మరొకఎత్తు. మృత్యువునైన ఏమార్చవచ్చుగాని , ఈ షాడో బారినుంచి తప్పించుకోవటం కష్టం. కిల్లింగ్ లైసెన్స్ పొందిన భారతీయ ఏజెంట్ యితను ఒక్కడే! ఈ షాడో నీడ మన మీదికి ప్రసరించిందంటే…..మనరోజులు దగ్గిర పడినట్లే అనుకోవచ్చు”అని ఆగి పోయాడా సభ్యుడు.

గంభీరంగా ఆలోచిస్తూ నిలబడి పోయాడు వేదిక మీది వ్యక్తి. రెండు నిముషాల తర్వాత సభ్యులందరినీ కలియచూశాడు.

“ఆల్ రైట్ మైడియర్ ఫ్రండ్స్! మీ మాటల్లోని యదార్థాన్ని అంగీకరిస్తున్నాను. ముందు సి.ఐ.బి. సంగతి తేల్చుకుందాం. మీరు భయపడుతున్నట్టు అదికూడా రంగంలోకి దిగిందని నికరంగా తెలిస్తే మన ప్లానులను కొద్దిగా మార్చుకొని ముందుకు అడుగు వేద్దాం. ఈసీక్రెట్ ఏజెంట్ షాడో గురించి తెలిసిన వాళ్ళు యీ రాత్రి పదిగంటలకు నన్ను కలుసుకోండి. అతనే గనుక రంగంలోకి వస్తే ఏం చేయ్యాలో ఆలోచించుకుందాం" అన్నాడు.

ఆమోద సూచకంగా తలలు పూసి లేచి నిలబడ్డారు వారందరూ.

2

“……అదీ రాజూ, అసలు విషయం" అంటూ సిగార్‌ని వెలిగించుకోవటానికి ఆగారు కులకర్ణి.

పనామా సిగరెట్ కాలుస్తూ శ్రద్ధగా ఆయన మాటలను వింటున్నాడు షాడో. మధ్య మధ్యలో ముందున్న ఫైలులోని వివరాలను చదువుకుంటున్నాడు. సిగార్‌ని వెలిగించుకొని గుప్పు గుప్పున పొగవదులుతూ అతనివంక చూశారు. “ఆ స్పెషలిస్టులను అనుసరించి వస్తారు కొందరు రష్యన్ ఏజెంట్లు. కొన్ని రాజకీయ కారణాల వలన వారు అక్కడినుంచి వెనుతిరుగుతారు. మనం వారి స్థానంలో నిలబడాలి. మన దేశభవిష్యత్తు ఆ స్పెషలిస్టుల మీద ఆధారపడి వుంది. వారికేదైనా ప్రమాదం సంభవిస్తే, మరో నాలుగు సంవత్సరాలదాకా అటువంటి మేధావంతులు దొరకరు. ఈలోపల మనం అనేక విషమ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.”

“నువ్వు వెంటనే బయలుదేరి అడ్డిస్ ఆబాబా వెళ్ళాలి. అక్కడినుంచి స్పెషలిస్టులతో కలసి బాంబే దాకా ప్రయాణించాలి. బాంబేలో స్పెషల్ బ్రాంచి ఇనస్పెక్టర్లు సిద్ధంగా వున్నారు. విమానం నేలకు దిగగానే వారు నిన్ను రిలీవ్ చేస్తారు.!”

పనామాను యాష్ ట్రేలో కుక్కుతూ తల ఎత్తాడు షాడో.

“ఎవరైనా యీ ప్రయత్నాలకు అడ్డు తగలవచ్చని డెఫినిట్ గా తెలిసిందా?” అని ప్రశ్నించాడు. గంభీరంగా తలవూపారు కులకర్ణి. "అవును రాజూ ! కలకత్తాలో వున్న ఒక లోకల్ క్రిమినల్ గ్యాంగ్. కిల్లర్స్ గ్యాంగ్ తో చేయి కలిపిందని మన శ్రీకర్ వార్త పంపాడు. వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయవచ్చు.”

“అది కాదు సార్! మనం అడ్డిస్ ఆబాబా దగ్గిర్నించి అలోచిస్తున్నాం గాని, దానిముందుకు చూడటం లేదు! మాస్కోనుంచి బయలుదేరిన దగ్గిరినుంచే వీరు తమప్రయత్నాలు ప్రారంబించరని గ్యారెంటీ ఏముంది? స్పెషలిస్టుల వెంట వస్తున్న సెక్యురిటీ సిబ్బంది సమర్థవంతులేనా?”

"నన్నెం చేయమంటావ్ రాజు” అంటూ నుదురు రుద్దుకున్నారు కులకర్ణి. "ఈ ప్రభుత్వ విషయాలు మనకు అర్థం కావు. అడ్డిస్ ఆబాబా నుంచి మనల్ని హేండోవర్ చేసుకోమన్నారు. ఆదేశాల ప్రకారం నడుచుకోవటం మన విధి. పూర్తిగా మన సహాయం కోరితే పరువు తక్కువ అనుకుంటున్నారని నా అనుమానం " అన్నారు.

షాడో పెదిమల మీద చిన్న చిరునవ్వు ప్రత్యక్షం అయింది. "సార్! చైనా పంపినప్పుడూ నన్ను ఫ్లవర్స్‌బేలో ముంచినప్పుడూ యీ పరువు తక్కువ తనం అడ్డురాలేదు కాబోలు….."అన్నాడు.

మౌనంగా తల వూపారు కులకర్ణి. టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు షాడో. "ఆల్ రైట్ సార్ !యీ సాయంత్రం ఆరు గంటలకు ఒక విమానం వుంది. దానిలో వెళతాను" అంటూ బయటకి వచ్చాడు.

ద్వారం దాకావచ్చి "విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రాజూ! బికేర్ పుల్ !” అని హెచ్చరించారు కులకర్ణి.

ఆ మాటలకు నవ్వు కుంటూ – మెట్లవైపు అడుగులు వేశారు షాడో.

ఢిల్లీ – పాలం – విమానశ్రయంలో లండన్ బయలు దేరే విమానం ఒకటి కదలటానికి సిద్దంగా వుంది. లౌడ్ స్పీకర్స్ లో ప్రయాణీకులను హెచ్చరిస్తున్నారు కంట్రోల్ రూమ్ అధికారులు.

అదే సమయంలో ఒక ఎరుపు రంగు జాగ్వర్ స్పోర్ట్స్ కారు శరవేగంతోవచ్చి పార్కింగ్ లాట్‌లో ఆగింది. స్టీరింగ్ ముందునుంచి కిందికి దూకి వేగంగా అడుగులు వేస్తూ రన్‌వే వైపు బయలుదేరాడు షాడో.

రిసెప్షన్ హాలును దాటగానే కస్టమ్స్ గేటు వుంటుంది. వచ్చేపోయే ప్రయాణీకులను పూర్తిగా చెక్ చేసిగాని వదలరు అక్కడి సిబ్బంది.

" యువర్ పాస్‌పోర్ట్ ప్లీజ్!”అంటూ షాడో ముందుకు చేయిజాచాడు ఒక అధికారి.

పాంట్ జేబులోనుంచి ఒక కార్డునుతీసి అతనికి అందించాడు షాడో. "ప్రొఫెసర్ రాజు. జియాలజిస్ట్. పాట్నా యూనివర్శిటి" అని వ్రాయబడివుంది దాని మీద. షాడో ఫోటో ఒకటి అంటించి వుంది.

జియాలజీలో ప్రత్యేక పరిశోధనలు చేయడానికి అడ్డిస్ ఆబాబా వెళుతున్నాడు ప్రొఫెసర్ రాజు.

"లండన్ పోయే ఎయిర్ ఇండియా వారి బోయింగ్ విమానం రెండు నిమిషాల్లో కదలబోతున్నది" అంటూ ఒక మృదువైన కంఠం ఎన్సౌన్స్ చేసింది.

షాడో వెంట తీసుకుపోతున్న బ్రీఫ్ కేస్ ని పూర్తిగా పరీక్షించి గానీ అతనిని వదలలేదు కస్టమ్స్ అధికారులు.

రన్‌వే మీది విమానపు తలుపులు మూసుకుంటున్నాయి. మెట్లను యివతలికిలాగే జీపు విమానం పక్కకు వెళ్ళినిలబడింది.

కస్టమ్స్ అధికారులు వదిలిపెట్టగానే షాడో పరుగు పరుగున విమానం దగ్గరికి వెళ్ళాడు. అడుగుకు నాలుగు మెట్టు చొప్పున ఎక్కుతూవెళ్ళి, ఒక్క గంతులో విమానం లోనికి అడుగు పెట్టాడు. ద్వారం దగ్గిర నిలబడిన ఎయిర్ హోస్టెస్ అతన్ని చూసి నవ్వాలో – కోపగించుకోవాలో అర్థంకాక అయోమయంగా నిలబడిపోయింది. తలుపులు మూసుకున్నాయి. మెట్లు అవతలికి లాగబడ్డాయి. మెల్లగా కదిలి రన్‌వేమీద పరుగులు తీయడం ప్రారంభించింది విమానం.

సీటులో కూర్చుని బయటికి చూస్తూ తనలో తాను నవ్వుకున్నాడు షాడో. ఆ రోజు మద్యాహ్నం నుంచీ అతన్ని వెంటాడుతున్న నలుగురు వ్యక్తులు తెల్ల ముఖాలతో విజిటర్స్ గాలరీలో నిలబడి వున్నారు.

షాడో టిక్కెట్టు కొనుక్కోవటానికి వచ్చాడని అనుకున్నారుగాని, అలా అర్థాంతరంగా కదిలీ కదిలే విమానంలో ఎక్కి తమకు టోకరా యిస్తాడని వూహించలేకపోయారు.

3

ప్రొఫెసర్ షాడో On Kinige

ఢిల్లీ నుంచి బాంబేవచ్చి , అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా ఎగురుతూ లండన్ వైపు ప్రయాణం ప్రారంభించింది బోయింగ్ 707. ఆడ్డిస్ ఆబాబా చేరటానికి మరో మూడుగంటల వ్యవధి వుంది.

ఎయిర్ హోస్టెస్ అందించిన కాఫీ తాగుతూ , విమానంలోవున్న సినిమా పత్రిక నొకదాన్ని చూస్తున్నాడు షాడో.

విమానం భారత సముద్ర జలాలనుదాటి అంతర్జాతీయ ప్రదేశంలో ఎగురసాగింది.

కాఫీ కప్పును కింద పెడుతూ అప్రయత్నంగా ఎదుటి సీటు వైపు చూశాడు షాడో. అంతవరకు అతన్నే గమనిస్తున్న వ్యక్తి ఒకరు చటుక్కున తల తిప్పుకున్నాడు. పక్కలకు చూశాడు షాడో. అక్కడకూడా అంతే. అతని సీటుకు వెనుక ముందూ ప్రక్కలా వున్న నలుగురు వ్యక్తులూ అతన్నే పరిశీలిస్తున్నారు.

షాడో మెడ మీది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ప్రమాదం ముంచుకు వస్తున్నదని హెచ్చరించ సాగింది అతని సిక్స్‌త్ సెన్స్.

తన భావాలను బయటికి కనిపించనీయకుండా మాగజైన్ చదువుతున్నట్టు తల వంచుకొని వారిని జాగ్రత్తగా పరీక్షించాడు. వారందరి దగ్గిరా న్యూస్ పేపర్లు వున్నాయి. గుండ్రంగా చుట్టి చేతికర్రల్లా పట్టుకొన్నారు. ఆ పేపర్లలో చుట్టివున్న రివాల్వర్లు షాడో సునిశిత నేత్రాలనుంచి తప్పకోలేకపోయాయి.

తను ప్రాణాలతో విమానం నుంచి దిగటం కష్టమని గ్రహించాడు షాడో. విమానం నేలను ఆనిన మరుక్షణం వాళ్ళు తనను చుట్టుముడతారు. ఆ రివాల్వర్లకు సైలన్సర్లు వున్నట్టు తెలుస్తూనే వుంది. ప్రయాణీకులు అందరూ దిగుతుండగా,తమ పనిని పూర్తి చేసుకొని కామ్‌గా దిగిపోతారు.

తనను మట్టు పెట్ట ప్రయత్నిస్తున్నది ఎవరో కాని, చాలా పకడ్బందీగా పధకంవేశారు. ముందు గొడవ లేకుండా ఢిల్లీ లోనే పైకి పంపించాలని చూశారు. ఆ ప్రయత్నం విఫలమైతే విమానంలో కొంత మందిని సిద్దంగా వుంచారు. అడిస్ ఆబాబాలో యింకెంత మంది కాచుకుని వున్నారో! అనుకొంటూ సీటులోనుంచి లేచాడు షాడో.

 

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=231

Related Posts:

మధు బాబు – ‘చైనీస్ బ్యూటీ’ పుస్తక పరిచయం.

చైనీస్ బ్యూటీ On Kinige

చైనాలోని దుష్ట సైంటిస్టులు భూకంపాలు సృష్టించే యంత్ర సామాగ్రి కనుగొని భారతదేశాన్ని, చైనాను గడగడలాడిస్తుంటే – అదే సమయంలో భారతదేశం షాడోను రంగంలోకి దించితే, కలిసి పనిచేద్దాం అనే మిషతో షాడోను హతమార్చడానికి చైనీస్ బ్యూటీ రంగంలోకి దిగితే ఆ కథ చివరకు ఏ మజిలీ చేరుకుంటుందో ఈ మధుబాబు విరచిత రోమాంఛితమైన స్పై ధ్రిల్లర్ నందు చదివి ఆనందించవలసినదే.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మధుబాబు విరచిత రోమాంఛితమైన స్పై ధ్రిల్లర్ ను చదివి ఆనందించాలనుకుంటున్నారా  ఐతే ఆలస్యం యెందుకు వెంటనే ప్రవేశించండి.

Related Posts:

మల్లాది వెంకట కృష్ణ మూర్తి – ‘అ ఆ ఇ ఈ’ పుస్తక పరిచయం

” మనిషి సాదారనంగా డబ్బు కి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడొ అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లొకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఈ పుస్తకం లొ మనషి జీవితం లొ ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితం లొ ధర్మం గా యెలా బ్రతకాలి అని కవి మనకు కతల రూపంలో మనకు చెప్పారు”. ఈ కథలు పాటకులను యంతగానో ఆకర్షిస్తూ ఆలోచింప చేస్తాయి.

ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

మీకు కంప్యూటర్ దూరం లో  కినిగే ఫై

అ ఆ ఇ ఈ On Kinige

Related Posts: